Share News

నలభయ్యేళ్ల ప్రజాసాహిత్య ‘మరసం’

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:46 AM

సాహిత్యం అనేది ప్రజల మనసులను తాకేలా, వారి జీవితాలను ప్రతిబింబించేలా, సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉండాలి. ప్రజల జీవితమే సాహిత్యానికి పునాది, ప్రజల...

నలభయ్యేళ్ల ప్రజాసాహిత్య ‘మరసం’

సాహిత్యం అనేది ప్రజల మనసులను తాకేలా, వారి జీవితాలను ప్రతిబింబించేలా, సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉండాలి. ప్రజల జీవితమే సాహిత్యానికి పునాది, ప్రజల చైతన్యమే సాహిత్యానికి శక్తి అనే భావన రచయితకు ఉండాలి.

ఆ స్పృహతోనే నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లాలో పురుడుబోసుకున్న ప్రజా సాహితీ సంస్థ ‘మంజీరా రచయితల సంఘం’ (మరసం). మానవీయ విలువలు, చైతన్యవంతమైన సమాజ నిర్మాణం కోసం శాస్త్రీయ భావజాలంతో ముందుకెళ్తూ, నాటి నుంచి నేటి వరకు మరసం సాహిత్య పోరును కొనసాగిస్తూనే ఉండడం అభినందనీయం. సాహిత్యం ప్రజాజీవితంతో, వారి అనుభవాలతో, వారి చైతన్యంతో ముడిపడి ఉండాలనే లక్ష్యానికి అనుగుణంగా మరసం కవులు, రచయితలు తమ రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉండడం ప్రశంసనీయం. సాహిత్యం కేవలం కొద్దిమంది చదువుకున్నవారి కోసం మాత్రమే కాకుండా, సమాజంలోని అన్ని వర్గాల అభాగ్యులకూ గొంతుకగా మారాలన్నదే మరసం ప్రధాన ఆకాంక్ష.

ప్రజాకవి లేదా ప్రజా రచయిత అంటేనే ప్రజల జీవితాల నుంచి పుట్టిన అనుభవాలను వారి భాషలోనే పలికించేవాడు. వాస్తవాలను నిజాయితీగా ప్రతిబింబించేవాడు. అన్యాయాన్ని ప్రశ్నించేవాడు. ప్రజల్లో చైతన్యం కలిగించేవాడు. అంతిమంగా సమాజ మార్పునకు తన కలాన్ని ఒక సాధనంగా మలుచుకునేవాడు. ఈ లక్ష్యాన్నే మరసం తన సాహిత్య సిద్ధాంతంగా ముందుకు తీసుకెళ్తోంది. రచయిత సమాజంలోని సమస్యలను కేవలం చూపించి ఆగిపోకూడదని, వర్తమానాన్ని విశ్లేషించడంతో పాటు మెరుగైన భవిష్యత్తును నిర్మించడంలోనూ చురుకైన పాత్ర పోషించాలని మరసం విశ్వసిస్తోంది.

నలభై ఏళ్ల క్రితం మెతుకుసీమలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, కళాకారులు, సామాజిక ఆలోచనాపరులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సాహిత్య సంస్థను నెలకొల్పింది మరసం. సాహిత్యానికి సామాజిక బాధ్యతను జోడించి, వారికి తర్ఫీదునిచ్చి ఎందరో కవులు, రచయితలను సమాజానికి పరిచయం చేసిన ఘనత తెలుగు రాష్ట్రాల్లో మరసంకే దక్కింది. అందుకే, ఈ సాహిత్య సంస్థ మెదక్‌లో ఆవిర్భవించినా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగింది. మద్యపాన వ్యతిరేక ఉద్యమం నుంచి, అనేక హక్కుల పోరాటాల మీదుగా, తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో మరసం వేసిన ప్రతి అడుగూ చరిత్రాత్మకం, అభినందనీయం. మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యం మరింత చైతన్యవంతంగా, ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని మరసం తన ప్రస్థానం ద్వారా గుర్తుచేస్తోంది.


ఇన్ని ప్రత్యేకతల నడుమ మంజీరా రచయితల సంఘం 40వ వార్షికోత్సవ సభను అక్టోబర్‌ 2న హైదరాబాద్‌లో నిర్వహించనుంది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు పలువురు కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు హాజరుకానున్నారు. నలభై ఏళ్ల మరసం సాహిత్య ప్రయాణాన్ని సమీక్షించుకోవడంతో పాటు, సాహిత్యం–మహిళా దృక్పథం, దళిత దృక్పథం, ద్రావిడ దృక్పథం వంటి అంశాలపై ఈ సభలో సాహిత్య విమర్శకులు ప్రసంగిస్తారు. అలాగే సాయంత్రం జరిగే కవి సమ్మేళనంలో పలువురు కవులు పాల్గొననున్నారు.

కె. విరాహత్ అలీ

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు

ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Oct 01 , 2026 | 12:46 AM