ఇన్ని గొంతులు మాట్లాడుతున్నాయి, మరి ఒకదాన్నొకటి వింటున్నాయా?
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:44 AM
సాహిత్య రంగంలో విభిన్న ధోరణులతో ఒకే కాలంలో ఎన్నో రచనలు వస్తుంటాయి. ఐతే రచనల్లో ఎంత వైవిధ్యం ఉన్నా వాటి మధ్య పరస్పర సంభాషణ జరిగినప్పుడే...
సాహిత్య రంగంలో విభిన్న ధోరణులతో ఒకే కాలంలో ఎన్నో రచనలు వస్తుంటాయి. ఐతే రచనల్లో ఎంత వైవిధ్యం ఉన్నా వాటి మధ్య పరస్పర సంభాషణ జరిగినప్పుడే ఆ వైవిధ్యం అర్థవంతమవుతుంది. ఏ రచయితకు ఆ రచయిత తమ శైలిలో మాత్రమే మునిగిపోతే, వినిపించేది సమిష్టి సాహిత్య స్వరం కాదు, కేవలం గందరగోళ శబ్దం.
ఎన్నో తరాలుగా అణచివేయబడిన నోర్లు ఇప్పుడు మన సాహిత్యంలో గొంతెత్తి మాట్లాడగలుగుతున్నాయి. ఆ గొంతులన్నీ ఒక స్పష్టమైన భావజాలాన్ని సమాజానికి వినిపించాలని కోరుకుంటున్నాయి. కానీ ఆ గొంతు పక్కవాడి చెవికైనా చేరుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. భిన్నత్వాన్ని ఒక్క గొంతుతో సాహిత్యం వినిపించగలుగుతుందా? అన్న సంశయం ఎప్పుడూ ఉంటూనే ఉంది.
సమాజమయితే మొదటి నుంచీ భిన్నత్వాలతోనే నిండి ఉంది. కులం, మతం, భాష, లింగం, ప్రాంతం... ఇవన్నీ మనుషుల మధ్య ఉన్న గుర్తింపులు (identities). వీటి మధ్యనే మనిషి బతుకుతున్నాడు, తన అనుభవాలను పంచుకుంటున్నాడు. సాహిత్యం ఆ జీవితాల నుంచే పుడుతుంది. కాబట్టి ఆయా గుర్తింపులను పక్కనపెట్టి మాట్లాడటం సాధ్యం కాదు. వేర్వేరు గుర్తింపులను అర్థం చేసుకోగలిగితే, వాటి మధ్య ఉన్న దూరాన్ని గమనించగలిగితే– సాహిత్యం భిన్న మూలాలకు వంతెన కాగలుగుతుంది. ఇలా భిన్న గొంతులు ఏకమై వినిపించడమే కదా చరిత్ర.
ఎన్నో తరాలుగా మాట్లాడలేకపోయినవారు ఇప్పుడు తమ అనుభవాలను చెప్పుకుంటున్నారు. దళిత సామాజిక వర్గం తన అవమానాల కథ చెబుతోంది, తన వర్గం కోల్పోయిన అనేక వెలుగులను అక్షరీకరిస్తున్నది. స్త్రీ తన స్వేచ్ఛా స్వప్నాలను, జీవితం పట్ల తన ఆలోచనలను తానే బలంగా వినిపిస్తోంది. ముస్లిం సోదరుడు తనపై పడుతున్న అనుమానపు చూపును కవిత్వం చేస్తున్నాడు, తన దేశభక్తికి కొలమానాలను తన రాతల ద్వారా నిరూపితం చేస్తున్నాడు. ఆదివాసీ అడవిని కోల్పోయిన బాధను పాట కడుతున్నాడు, చెట్టు ఎండిన చప్పుడును సమాజానికి వినిపిస్తున్నాడు. అగ్రవర్ణ సాహిత్యం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. అది తాను కోరుకోని సంప్రదాయాలను ఎదిరిస్తూ, నిలదీస్తూ సాగడం చూస్తూనే ఉన్నాం. సాహిత్యం అంటే ఇలానే కదా ఉండాలి, లేదంటే అది కొంతమందికే పరిమితమై, సమాజంలో ముప్పావు వంతు మందిని చూడకుండానే సాగిపోయేది.
అయితే ఇక్కడే ఒక సమస్య కనపడుతున్నది. మాట్లాడటం నేర్చుకున్న సాహిత్యం, వినడం మర్చిపోయిందేమో అనిపిస్తోంది. నా మాట అందరికీ చేరాలన్న తపనలో, పక్కవారి మాట వినే ఓపిక కొంత తగ్గుతోంది. ఒకరితో ఒకరు సంభాషించుకోవాల్సిన చోట, ఒక సమస్య మీద భిన్నత్వానికి అతీతంగా చర్చ జరగవలసిన చోట, ఎవరి మాట వారు చెప్పి వెళ్లిపోతున్నట్టుగా నేటి సాహిత్యం సాగిపోతోంది. అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలు ఒకదానికొకటి ఎదురుపడటం లేదు, ఒకవేళ ఎదురుపడ్డా ఒకరి భావాలు ఒకరికి అర్థం కావడం లేదు. సభలో ఉన్నవారంతా వక్తలే అయితే, వినడానికి ఎవరు మిగులుతారు? అన్న చందాన అందరూ ఎవరి అస్తిత్వ మూలం నుంచి వారు రాసుకునేవారయ్యారే కానీ ఎదుటి వారి ఆలోచనలను చదివేందుకు, అర్థం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు అనిపించడం లేదు.
సాహిత్యం ఇతర మాధ్యమాలకంటే భిన్నమైనది. అది ఒకరి అంతరంగం లోపలికి మరొకరిని తీసుకు వెళ్లగలదు, ఒకరి బాధలోనికి ఇంకొకరిని పరకాయ ప్రవేశం చేయించగలదు. గణాంకాలు ఎంతమంది నిరాశ్రయులయ్యారో చెప్పవచ్చు. కానీ కథ మాత్రం కూడూ గుడ్డా కోల్పోయిన ఒక కుటుంబ మానసిక స్థితిని ప్రపంచానికి వినిపిస్తుంది. వార్త బయట నుంచి చూపిస్తే, కవిత లోపలి నుంచి చూపిస్తుంది. మన కులం కాని, మన ప్రాంతం కాని, మన అనుభవం కాని ఒక జీవితాన్ని కొన్ని పేజీల పాటు మనదిగా జీవించేలా చేయగలగడం సాహిత్యానికి మాత్రమే సాధ్యమైన పని. అలా చూస్తే భిన్నత్వాన్ని కలపడానికి సాహిత్యానికి మించిన దారి మరొకటి లేదు.
కానీ ఆ దారిలో కూడా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు రచనను చదవకముందే రచయిత గురించి తెలుసుకుంటూ– ఎవరు రాశారు, ఎక్కడ అచ్చయింది, ఏ ఐడెంటిటీ నుంచి వచ్చింది, ఎవరి మద్దతు ఉంది అనే విషయాలు మన చదువును ప్రభావితం చేసేలా చేసుకుంటున్నాం. సోషల్ మీడియా పరిచయాలు, అవార్డులు, వర్గాల మద్దతు కూడా ఇందులో కలుస్తున్నాయి. రచనకు దక్కవలసిన శ్రద్ధ ఆ దారిలో కొరవడుతున్నది. పుస్తకం పేజీల్లో ఉన్న విషయం ఏమి చెబుతోందో వినకముందే, పుస్తకం కవర్ మీద పేరుని బట్టి ఒక తీర్పును ఇచ్చేస్తే, ఇక ఆ రచన ఎంత మంచిదైనా మనల్ని చేరదు.
ఐడెంటిటీ అనివార్యంగా మారినప్పుడే సమస్య మొదలవుతుంది. ఐడెంటిటీ అన్నది నిజానికి ఒక తలుపు కావాలి. ‘‘నేను ఇక్కడి నుంచి వచ్చాను, నా జీవితం ఇలా ఉంది’’ అని చెప్పడానికి అది ఒక మార్గం. అయితే అదే ఐడెంటిటీ ‘‘ఇది మా కథ, మీకు అర్థం కాదు’’ అనే బోర్డు పెట్టుకుని కూర్చున్నప్పుడు, అక్కడ ఎంత మాట్లాడినా ఎవరికీ చేరని ఒంటరితనమే మిగులుతుంది. అలాగే చదివేవాడు కూడా ‘‘ఇది వారి కథ, నాకెందుకు’’ అనుకుంటే, ఆ తలుపు ఎంత తెరిచి ఉన్నా లోపలికి అడుగు పడదు.
ఇక్కడ ఏక చైతన్యం అంటే ఏక గొంతుక కాదు. అందరూ ఒకే పాట పాడాలని ఎవరూ కోరుకోరు. అలా కోరుకుంటే అది మరో రూపంలో ఒత్తిడే అవుతుంది. కావలసింది ఒకరి నొప్పి మరొకరికి అర్థం కావడం. నా కథ చదివి మీరు కొంచెం ఆగి ఆలోచించాలి, మీ కవిత చదివి నేను నా చుట్టూ ఉన్నవారిని కొత్తగా చూడాలి. అప్పుడు కులాల గోడలు ఉన్నా, వాటికి తలుపులు తెరుచుకుంటాయి.
సాహిత్యానికి ఈ శక్తి ఉందా అంటే, చరిత్ర అవుననే చెబుతోంది. గురజాడ ‘‘దేశమంటే మట్టి కాదోయ్’’ అన్నప్పుడు ఎవరూ తమ కులాన్ని గుర్తు చేసుకోలేదు, మనుషులను గుర్తు చేసుకున్నారు. శ్రీశ్రీ రాసినప్పుడు కష్టజీవులు తమను తాము అందులో చూసుకున్నారు. అవి ఒకే గొంతులు కావు, కానీ ఎంతోమంది తమ గొంతును వాటిలో విన్నారు. ఆ శక్తి సాహిత్యంలో ఉంది; దాన్ని ఎలా వాడుకుంటామన్నదే మన బాధ్యత.
కాబట్టి ఎవరి గొంతు వారికి ఉండాలి, కానీ వినే మనసు అందరికీ ఉండాలి. రాసేటప్పుడు ఇతర సామాజిక వర్గాల లేదా ఇతరుల జీవితానుభవాల లోతుల్లోకి ఒకసారి నడిచి వెళ్లాలి. చదివేటప్పుడు రచయిత పేరును కాసేపు పక్కన పెట్టి, పంక్తులను మాత్రమే చూడాలి. ఈ రెండూ జరిగిన రోజున, ఎన్నో విభిన్న ధోరణులు ఒకే సాహిత్య వేదికపై ఒకే లయతో సాగుతాయి. అప్పుడే సాహిత్యం సమాజానికి దారి చూపుతుంది.
సుధా మురళి
83096 22246
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..