మంచి కథకు మర్మమేది?
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:18 AM
నేటి యువ కథకులు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కథా శిల్పం. అద్భుతమైన సామాజిక ఇతివృత్తం తీసుకున్నప్పటికీ, దానిని కళాఖండంగా మలచడంలో...
నేటి యువ కథకులు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కథా శిల్పం. అద్భుతమైన సామాజిక ఇతివృత్తం తీసుకున్నప్పటికీ, దానిని కళాఖండంగా మలచడంలో తరచుగా తడబడుతున్నారు. దీనికి మూల కారణం కథకు, కథనానికి మధ్య ఉన్న తాత్విక వ్యత్యాసాన్ని సరిగ్గా పట్టుకోలేకపోవడమే.
చాలామంది వర్ధమాన రచయితలు కథ, కథనం రెండూ ఒకటే అనుకుంటారు. కానీ సాహిత్య సిద్ధాంతాల ప్రకారం ఈ రెండింటికి మధ్య చాలా సూక్ష్మమైన, స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఆంగ్ల నవలా రచయిత, విమర్శకుడు ఇ.ఎమ్. ఫోర్‌స్టర్ తన గ్రంథం ‘Aspects of the Novel’లో ఈ రెంటి గురించి ఒక మంచి నిర్వచనం ఇస్తాడు: ‘రాజు చనిపోయాడు, ఆ తర్వాత రాణి చనిపోయింది’ అనడంలో కేవలం కాలక్రమం మాత్రమే ఉంది. ఇది ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సంఘటనల సమాహారం. దీనిని ఫోర్‌స్టర్ ‘కథ’ అంటాడు. ‘రాజు చనిపోయాడు, ఆ వియోగాన్ని తట్టుకోలేక గుండె పగిలి రాణి చనిపోయింది’ అన్నప్పుడు అక్కడ కార్య–కారణ సంబంధం ఉంది. ఫోర్‌స్టర్ దీనిని ‘కథనం’ అన్నాడు.
అనగా, కథ అనేది భౌతికంగా జరిగే సంఘటనల సమూహం అయితే, కథనం అనేది ఆ సంఘటనల వల్ల పాత్రల అంతరంగంలో వచ్చే భావోద్వేగ, మానసిక పరిణామాల క్రమం. కథలో పాఠకుడు ‘తర్వాత ఏమవుతుంది?’ అని ఆత్రపడితే, కథనంలో ‘ఎందుకిలా జరిగింది? ఆ పాత్ర మానసిక స్థితి ఏమవుతుంది?’ అని ఆలోచిస్తాడు. తెలుగు కథా సాహిత్యంలో ఈ శిల్పాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించిన ఒక కథ పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’. ఒక రైలు ప్రయాణం, గాలివాన, ఒక పెద్దమనిషి ఒక బిచ్చగత్తెతో రాత్రి గడపడం, ఉదయానికి ఆమె చనిపోవడం అనేది కేవలం పైకి కనిపించే కథ. కానీ ఆ పెద్దమనిషి అహంకారమూ, హోదా పట్ల అతనికి ఉన్న గర్వమూ ప్రకృతి సృష్టించిన భీభత్సం ముందు ఎలా తుడిచిపెట్టుకు పోయాయీ, ఒక అనామక బిచ్చగత్తె చావు అతనిలో ఎలాంటి తాత్విక శూన్యాన్ని సృష్టించిందీ అన్నది అసలు కథనం. ఆ పాత్రలోని మానసిక పతనమే ఈ కథను విశ్వస్థాయికి తీసుకు వెళ్లింది. రచయితలు కేవలం సంఘటనల మీద కాకుండా, ఆ సంఘటనలు పాత్రల మీద చూపే మానసిక ప్రభావం మీద కూడా దృష్టి పెట్టాలి.
కథ ప్రారంభం పాఠకుడిని కథలోకి లాగే అయస్కాంతం లాంటిది. పాత తరంలో వలె వాతావరణ వర్ణనలతో, పాత్రల పరిచయాలతో కథ మొదలుపెడితే చదివే ఓపిక ఆధునిక యంత్ర యుగంలో క్షణక్షణానికీ మారుతున్న సమాజంలోని పాఠకుడికి లేదు. అతడిని మొదటి వాక్యంలోనే ఉలిక్కిపడేలా చేయాలి. ఈ టెక్నిక్‌ను ప్రపంచ సాహిత్యంలో ‘ఇన్ మీడియా రేస్’ (In Media Res) అంటారు. లాటిన్ భాషలో దీని అర్థం ‘సంఘటనల మధ్యలో,’ అని. పాత్రల గతాన్ని, వాతావరణాన్ని పేజీల కొద్దీ వర్ణించకుండా, నేరుగా సంఘర్షణ జరుగుతున్న ఒక ఉత్కంఠభరితమైన సన్నివేశంతో కథను మొదలుపెట్టి, నేపథ్యాన్ని నెమ్మదిగా ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా కథనంలో ఇచ్చుకుంటూ పోవాలి. తెలుగులో ఈ శిల్పాన్ని సమర్థవంతంగా ప్రయోగించిన దిట్ట రాచకొండ విశ్వనాథశాస్త్రి. చట్టం, న్యాయస్థానాలు సామాన్యుడిని ఎలా వేధిస్తాయో చెప్పే ఆయన కథలు ఒక పెద్ద ఏక్షన్ దృశ్యంతోనో, తీవ్రమైన వాగ్వాదంతోనో పిడుగుపాటులా మొదలవుతాయి. కొడవటిగంటి కుటుంబరావు కథల ప్రారంభాలు కూడా పదునుగా ఉంటాయి. ఒక వస్తువు తాకట్టు పెట్టడం లాంటి మధ్యతరగతి జీవితాల్లోని ఆర్థిక ఇబ్బందులతోనో, లేక పోస్ట్‌మెన్ తెచ్చిన ఉత్తరం తేవడం తోనో మొదలవుతాయి. పాత్రల మామూలు దినచర్యను తలకిందులు చేసే ఈ ఉత్ప్రేరకం ఎంత బలంగా ఉంటే కథనం అంత వేగంగా పరిగెడుతుంది.
కథనంలో మానసిక సంఘర్షణను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన రచయితలలో చలం అగ్రగణ్యుడు. సామాజిక తిరుగుబాటుదారుడిగానే గాక, ఆధునిక తెలుగు కథకు మానసిక విశ్లేషణ అనే ఆయుధాన్ని అందించిన అద్భుతమైన కథా శిల్పి ఆయన. చలం కథల్లోని ప్లాట్ భౌతిక సంఘటనల చుట్టూ తిరగదు, ఆయన కథల్లో యుద్ధమంతా మనిషి మెదడులో, ముఖ్యంగా స్త్రీ అంతరంగంలో జరుగుతుంది. పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన నకిలీ నైతికతకు, స్త్రీ సహజమైన శరీర, మానసిక అవసరాలకు మధ్య జరిగే ఘర్షణే ఆయన చాలా రచనల్లోని ప్లాట్. ‘ఓ పువ్వు పూసింది’ లాంటి కథల్లో ఉత్ప్రేరకం ఏమిటి? ఒక పల్లెటూరి వాతావరణంలో, తనలో మొగ్గతొడుగుతున్న యవ్వనాన్ని ఆ పాత్ర అర్థం చేసుకోవడం. ఇక్కడ పోరాటం అంతా సమాజం గీసిన గీతకు, ఆమెలో రగులుతున్న స్వేచ్ఛాకాంక్షకు మధ్యనే. కథనంలో మలుపులు భౌతికం కావు, మానసికం. వివాహ వ్యవస్థ వెనుక బానిసత్వాన్ని చలం అత్యంత పదునైన సంభాషణల ద్వారా ఆవిష్కరించారు. చలం రాసిన ‘భార్య’ కథలో కూడా పాత్రలు మాట్లాడుకునే మాటల్లో కన్నా, వాళ్ల మౌనంలో, వాళ్ల ప్రవర్తనలో దాగి ఉన్న సబ్‌టెక్స్‌ట్ బలంగా ఉంటుంది. భర్తకు భార్య మీద ఉన్నది ప్రేమా లేక యాజమాన్య హక్కా అన్న ప్రశ్నను పాఠకుడి ముందు విసురుతాడు చలం. కథనంలో విలన్ బయట ఎక్కడో కత్తులు పట్టుకుని ఉండడు, వ్యవస్థ రూపంలో, సాంప్రదాయం పేరుతో పాత్రల మనసుల్లోనే తిష్ట వేసుకుని ఉంటాడు. పాత్ర తనలోని భయాన్ని జయించి, ఆ అదృశ్య విలన్‌పై తిరుగుబాటు చేయడమే చలం కథాశిల్పపు పరాకాష్ఠ.
కథ ముందుకు సాగాలంటే సంభాషణలు కేవలం సమాచారాన్ని ఇచ్చేవిగా గాక, పాత్ర సామాజిక నేపథ్యాన్ని వెల్లడి చేసేవై ఉండాలి. సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారాంల రాయలసీమ కథల్లోని పాత్రల భాష వాళ్ల మట్టి వాసనను మోసుకొస్తుంది. రాయలసీమ కరువు, రైతుల బతుకుపోరాటం వాళ్ల సంభాషణల్లోని వెటకారంలో కనిపిస్తుంది. వాళ్లు ఎదుటివాళ్లతో మాట్లాడుతున్నట్లే ఉంటూనే తమ ఖర్మను తాము తిట్టుకుంటారు. అలాగే కాళీపట్నం రామారావు కథ ‘యజ్ఞం’లో అప్పలరాముడు మాట్లాడే మాటల్లో ఒక జీతగాడి నిస్సహాయత ఎంత ఉందో, గోపన్న మాటల్లో దొరల వ్యవస్థ మీద ఒక అగ్నిపర్వతం బద్దలయ్యే సూచన అంత బలంగా ఉంటుంది. సంభాషణల్లో ఎప్పుడూ ఒక వాగ్వాదం లేదా వైరుధ్యం ఉండాలి. ఇద్దరు పాత్రలు ఒకరితో ఒకరు ఎప్పుడూ ఏకీభవిస్తూనే ఉంటే అక్కడ నాటకీయత చనిపోతుంది.
అద్భుతమైన కథకుడు పాఠకుడి మెదడును శాసించగలడు. రచయిత సృష్టించే ప్రతి మలుపు, ప్రతి ఉత్కంఠ పాఠకుడి శరీరంలో కొన్ని రసాయన మార్పులను తీసుకురాగలదు. కథ ప్రారంభంలో సమస్య ఎదురవగానే పాఠకుడిలో పుట్టే ఆందోళన, పాత్ర కష్టాలు పడుతున్నప్పుడు పుట్టే సహానుభూతి, కథ చివర్లో సమస్య పరిష్కారమైనప్పుడు కలిగే తాత్విక ప్రశాంతత – ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమే గొప్ప రచయిత లక్షణం.
పాఠకుడు ఎక్కడ బోర్ ఫీల్ అవుతాడో రచయితకు తెలియాలి. ఉదాహరణకు, రచయిత కథలో పాత్రల బాధను చెప్పడానికి సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తే పాఠకుడు విసుక్కుంటాడు. అదే ఆ పాత్ర నిశ్శబ్దంగా రాత్రి పూట ఎవరికీ కనపడకుండా కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాన్ని ఒక వాక్యంలో చూపిస్తే, పాఠకుడు కదిలిపోతాడు. దీన్నే సిద్ధాంతపరంగా ‘చూపించు, చెప్పొద్దు’ అంటారు.
పాత్రకు ఒక బాహ్య లక్ష్యం ఉండొచ్చు. ఉదాహరణకు, ఒక అప్పు తీర్చడమో లేదా ఒక ఉద్యోగం సాధించడమో. కానీ కథనం ముగిసేసరికి, ఆ భౌతికమైన లక్ష్యం కంటే ముఖ్యమైన ఒక అంతర్గత అవసరాన్ని (ప్రేమ, ఆత్మగౌరవం లాంటివి) పాత్ర సాధించుకుంటుంది. ఇదే కథకు ఆత్మ.
ఔత్సాహిక సృజనకారులు, యువ రచయితలు ఈ నైపుణ్యాలను ఔపోసన పట్టాలి. కథ అనేది ఒక నిర్మాణ కళ. దానికి పునాదులు, గోడలు, అలంకరణ అన్నీ సరైన పాళ్లలో ఉండాలి. ‘ఇన్ మీడియా రేస్’ టెక్నిక్‌తో కథను వేగంగా ప్రారంభించి, బలమైన ప్రేరేపిత సంఘటనతో కథనాన్ని ఉరుకులు పెట్టించి, పాత్రల అంతర్గత, బాహ్య సంఘర్షణలతో ఉత్కంఠ రేపి, ఒక దార్శనికమైన ముగింపును ఇవ్వగలిగితే... ఆ కథ కాల పరీక్షను నిలిచి గెలుస్తుంది.
జీవితాన్ని ఎంత లోతుగా పరిశీలిస్తామో, కథా శిల్పం అంత పదును దేలుతుంది. సంఘటనల వెనుక ఉన్న కార్య కారణ సంబంధాలను విశ్లేషించే దృక్పథం, పాత్రల అంతరంగాన్ని ఆవిష్కరించే మనస్తత్వ విశ్లేషణ, పాఠకుడిని కట్టిపడేసే కథా వక్రరేఖ – ఈ మూడూ సమపాళ్లలో కలిసినప్పుడు తెలుగు కథ ఖండాంతరాలు దాటి విశ్వసాహిత్య వేదిక మీద సగర్వంగా నిలబడుతుంది. రచయితలు కేవలం అక్షరాలను పేర్చే కార్మికులు కాదు, వారు సమాజపు అంతరంగాన్ని శోధించే దార్శనికులు!
భూక్యా గోపినాయక్
99891 59196
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి