మన విమర్శకు కావాలి కొత్త చూపు
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:23 AM
తెలుగులో కథలూ, కవితలూ, నవలలూ నిరంతరం వెలువడుతున్నాయి. వాటిని పరిచయం చేసే సమీక్షలూ వస్తున్నాయి. అయితే ఒక రచనలోని సాహిత్య విలువను నిర్ధారించడానికీ, దాని...
విమర్శ విలువ దాని తీర్పులో మాత్రమే ఉండదు.
ఆ తీర్పుకు దారితీసిన ఆలోచనా ప్రక్రియలోనూ ఉంటుంది.
తెలుగులో కథలూ, కవితలూ, నవలలూ నిరంతరం వెలువడుతున్నాయి. వాటిని పరిచయం చేసే సమీక్షలూ వస్తున్నాయి. అయితే ఒక రచనలోని సాహిత్య విలువను నిర్ధారించడానికీ, దాని అంతర్గత వైరుధ్యాలను వెలికితీయడానికీ, రచయిత ప్రతిపాదించిన భావాలకూ రచన సాధించిన కళాత్మక ఫలితానికీ మధ్యనున్న అంతరాన్ని విశ్లేషించడానికీ ఎంత ప్రయత్నం జరుగుతోంది? విమర్శకులు లేరనో, విమర్శ అంతరించిపోయిందనో నిర్ధారించడం తొందరపాటు. కానీ వెలువడుతున్న విమర్శలో ఎంత భాగం పాఠకుల అవగాహనను విస్తరిస్తోంది, ఒక రచనను వాళ్ళు అంతకుముందు చూడని కోణాల్లో చూడటానికి ఎంతవరకు తోడ్పడుతోంది?
ఈ అంశంపై ఇటీవల ఆంధ్రజ్యోతి ‘వివిధ’లోనే కొంత చర్చ జరిగింది. ఈ చర్చలో విమర్శకు ప్రమాణాలు అవసరమా, బహుళ ప్రమాణాల పాత్ర ఏమిటి, పరిశోధనకూ విమర్శకూ మధ్య సంబంధం ఎలాంటిది, గత విమర్శా సంప్రదాయాల నుంచి వర్తమానం ఏం స్వీకరించాలి వంటి ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఈ చర్చలోని భిన్నాభిప్రాయాలను ఒకే తీర్పుతో పరిష్కరించలేం. ఒకే ప్రమాణాన్ని అన్ని రచనలకూ వర్తింపజేయడమూ సరికాదు; అలా అని ప్రతి రచన తనకంటూ ఒక ప్రమాణాన్ని సృష్టించు కుంటుందని చెప్పి మూల్యాంకన బాధ్యత నుంచీ తప్పించుకోలేం. ప్రమాణాలు బహుళంగా ఉండవచ్చు. కానీ వాటి అన్వయం తార్కికంగా ఉండాలి. విమర్శకులు తాము ఎంచుకున్న ప్రమాణం ఏమిటో, దాన్ని రచనకు ఎందుకు వర్తింపజేస్తున్నారో, తమ నిర్ణయానికి పాఠ్యంలో ఎట్లాంటి ఆధారాలున్నాయో వివరించాలి. ప్రమాణాల బహుళత్వం విమర్శకు స్వేచ్ఛనివ్వాలి; ఏకపక్షతకు ముసుగు కాకూడదు.
రచనలో వస్తువూ, భాషా, శిల్పం బాగున్నాయని చెప్పడం విమర్శ కాదు. అవి ఎట్లా పనిచేస్తున్నాయో నిరూపించాలి. ఉదాహరణకు, ఒక కథ కులవివక్షను వ్యతిరేకిస్తోందనుకుందాం. అందులో అణచివేతకు గురైన పాత్ర బాధను రచయిత హృదయవిదారకంగా చిత్రించవచ్చు. కానీ ఆ పాత్ర కథలో తన జీవితాన్ని తానే నడిపించే వ్యక్తిగా నిలుస్తోందా? తన నిర్ణయాలతో, కోరికలతో, ఆలోచనలతో కథా గమనాన్నే ప్రభావితం చేస్తోందా? లేక ఆధిపత్య వర్గానికి చెందిన మరో పాత్రలో పరివర్తన తీసుకురావడానికి మాత్రమే ఉపయోగపడుతోందా? రెండో పరిస్థితిలో రచయిత ప్రకటించిన సామాజిక నిబద్ధతకూ, కథా నిర్మాణం సాధించిన ఫలితానికీ మధ్య వైరుధ్యం ఉండవచ్చు. అణచివేతను ఖండించే రచన సైతం అణచివేతకు గురైన పాత్రకు స్వతంత్రతను నిరాకరించవచ్చు. ఈ వైరుధ్యాన్ని గుర్తించడం రచయిత ఉద్దేశాన్ని అనుమానించడం కాదు; ఆ ఉద్దేశం కళాత్మకంగా ఎంతవరకు సాకారమైందో పరిశీలించడం.
ఇక్కడే సమీక్షకుడికీ విమర్శకుడికీ మధ్య తేడా తెలుస్తుంది. కథలో కులవివక్ష ఉందని గుర్తించడం ఒక విషయం; ఆ వివక్షను కథ ఏ దృక్కోణం నుంచి చిత్రించిందో, బాధిత పాత్రకు ఎంత స్వరాన్నిచ్చిందో, కథ ముగింపు మొదట ప్రతిపాదించిన విలువలను బలపరుస్తోందో బలహీనపరుస్తోందో విశ్లేషించడం మరో విషయం. విమర్శ రెండో పని చేయాలి. అయితే పాత్రకు స్వతంత్రత లేకపోవడం రచయిత దృక్పథ పరిమితి కావచ్చు; లేదా పాత్ర అనుభవిస్తున్న అణచివేతను ఉద్దేశపూర్వకంగా ప్రతిబింబించే కథన వ్యూహం కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను నిర్ధారించకుండా రచనకు తీర్పు ఇవ్వడం కూడా తొందరపాటే. విమర్శకు కావాల్సింది లోపాలను వెతికే చూపు మాత్రమే కాదు; ఒక అంశం లోపమా, కళాత్మక వ్యూహమా అని తేల్చగల వివేచన.
ఈ దృష్టితోనే వెల్చేరు నారాయణరావు ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ లాంటి గ్రంథాల్ని చదవాలి. కాలానుగుణంగా కవిత్వ సరళిలో వచ్చిన మార్పును కొత్త వస్తువుల్నీ, కొత్త పదాల్నీ ప్రవేశించడానికే పరిమితం చేయకుండా, సాహిత్య సంప్రదాయాలూ, అభిరుచులూ, విలువలూ మారే విస్తృత ప్రక్రియగా పరిశీలించడానికి ఆ గ్రంథం ఉపయోగపడుతుంది. అలాగే రాచమల్లు రామచంద్రారెడ్డి విమర్శలోని నిర్దిష్టమైన అభిప్రాయ ప్రకటనా, వాదనను తార్కికంగా నిర్మించే పద్ధతీ అధ్యయనం చేయదగినవి. అయితే ఈ గత విమర్శకుల పద్ధతుల్ని నేటి రచనలన్నింటికీ యథాతథంగా వర్తింపజేయడం వీలవదు. పాత ప్రమాణాల్ని పూర్తిగా వదిలేయాల్సిన అవసరమూ లేదు. వాటి పరిమితులను గుర్తించి, మారిన సామాజిక అనుభవాల వెలుగులో పునఃపరిశీలించాలి. సంప్రదాయం విమర్శకు పునాది కావచ్చు; అది కొత్త ప్రశ్నలకు అడ్డుకట్ట కాకూడదు.
దళిత, స్త్రీవాద, బహుజన, ముస్లిం, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాలు తెలుగు విమర్శ పరిధిని విస్తరించాయి. గతంలో సాధారణ మానవ అనుభవంగా పరిగణించిన అనేక అంశాల వెనుక కులమూ, లింగమూ, వర్గమూ, మతమూ, ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన అసమానతలను గుర్తించడానికి అవి కొత్త పరికరాలను అందించాయి. అయితే ఒక రచన నిర్దిష్ట అస్తిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నంత మాత్రాన విమర్శకు అతీతం కాదు. సామాజికంగా అవసరమైన రచన కళాత్మకంగానూ బలహీనమై ఉండవచ్చు. కళాత్మకంగా ప్రభావవంతమైన రచనా సామాజికంగానూ ప్రశ్నించదగిన భావాలనే సమర్థించవచ్చు. ఈ రెండు అవకాశాలనూ విమర్శ తెరిచి ఉంచాలి. అస్తిత్వ సాహిత్యాన్ని దాని సామాజిక నేపథ్యం నుంచి వేరు చేసి చూడటం ఎంత పొరపాటో, దాని సామాజిక ప్రాధాన్యమే కళాత్మక మూల్యాంకనానికి సరిపోతుందని భావించడమూ అంతే పొరపాటు.
స్త్రీల అణచివేతను చిత్రించే కథలో స్త్రీ పాత్రకు నిర్ణయాధికారం లేకపోవడం రచయిత ఉద్దేశపూర్వకంగా చిత్రించిన సామాజిక వాస్తవమా, లేక రచయిత దృక్పథంలోని పరిమితా? ఈ ప్రశ్నకు సమాధానం కథలోని ఒక సంఘటనను విడిగా పరిశీలించడం ద్వారా మాత్రమే దొరకదు. పాత్రల మధ్య అధికార సంబంధాలూ, కథకుడి వ్యాఖ్యానమూ, పాత్రల నిర్ణయాలూ, కథా గమనమూ, ముగింపూ.. వీటన్నింటినీ కలిపి చదవాలి. అలాగే రచయిత అభిప్రాయాన్నీ కథకుడి వ్యాఖ్యానాన్నీ పాత్ర దృక్పథాన్నీ ఒకటిగా భావించకూడదు. ఒక పాత్ర పక్షపాతంతో మాట్లాడినంత మాత్రాన రచయితా అదే పక్షపాతాన్ని సమర్థిస్తున్నాడని నిర్ధారించలేం. రచనను సమగ్రంగా చదవడమంటే దానిలో వ్యక్తమైన అభిప్రాయాలతో పాటూ, కథన క్రమంలో మౌనంగా మిగిలిపోయిన అనుభవాలనూ, విస్మరించబడిన అవకాశాలనూ పరిశీలించడం.
సమకాలీన విమర్శ ఎదుర్కొంటున్న మరో సమస్య పుస్తక ప్రచారానికీ స్వతంత్ర సాహిత్య పరిశీలనకూ మధ్యనున్న అంతరం తగ్గిపోవడం. 2025 ఫిబ్రవరి ‘ఈమాట’ వెబ్మేగజైన్ సంపాదకీయం, పుస్తకాల ముందుమాటలూ బ్లర్బ్లే సమీక్షలనూ, విమర్శలనూ వెనక్కి నెట్టేస్తున్న ధోరణిని ప్రస్తావించింది. ప్రచురణకూ, పుస్తక విక్రయానికీ ప్రచారం అవసరమే. సమస్య ప్రచారం కాదు; ప్రచార వ్యాఖ్యను స్వతంత్ర మూల్యాంకనంగా చూపడం. రచయితతో వ్యక్తిగత పరిచయమూ, సాహిత్య సంస్థలతో అనుబంధమూ, భావజాల సాన్నిహిత్యాలూ విమర్శకుల నిర్ణయాల్ని ప్రభావితం చేసినప్పుడు రచనకన్నా రచయితకే ప్రాధాన్యం పెరిగే ప్రమాదముంది. రచయితను ప్రశంసించడం ద్వారా ఏర్పడిన సంబంధం రచనను ప్రశ్నించాల్సిన సందర్భంలో విమర్శకుల్ని వెనక్కి లాగకూడదు.
సోషల్ మీడియా ఈ సమస్యకు మరో కోణాన్ని జోడించింది. గతంలో పత్రికల్లో చోటుదొరకని పాఠకులు సైతం ఇప్పుడు అభిప్రాయాలను నేరుగా ప్రకటించ గలుగుతున్నారు. ఇది సాహిత్య చర్చకు విస్తృతిని ఇచ్చింది. ఐతే ప్రశంసల సంఖ్యను సాహిత్య విలువకు ప్రమాణంగా భావించడమూ, తీవ్రమైన పదజాలాన్ని లోతైన విమర్శగా పొరబడటాల్లాంటి ధోరణులూ కనిపిస్తున్నాయి. ఒక పుస్తకానికి వందలాది ప్రశంసలు రావడం దాని కళాత్మక విలువను నిరూపించదు; దానిపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యా విమర్శాత్మకంగా సరైనదనీ చెప్పలేం. ప్రశంసకైనా, నిరాకరణకైనా రచనలో ఆధారాలు చూపించాల్సిందే. విమర్శకుల విశ్వసనీయత, వారి తీర్పు ఎంత కఠినంగా ఉందన్నదానిపై కాకుండా, ఆ తీర్పును ఎంత సమర్థంగా నిరూపించారన్నదానిపై ఆధారపడాలి.
కృత్రిమ మేధస్సు వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఈ బాధ్యత మరింత కీలకం. కథ సారాంశాన్ని చెప్పడమూ, పాత్రల్ని వర్ణించడమూ, సిద్ధాంత పదాల్ని జోడించడమూ ఇప్పుడు సులభం. కానీ ఒక చిన్న సంఘటన మొత్తం కథ అర్థాన్ని ఎట్లా మార్చిందో గుర్తించడమూ, రచయిత చెప్పదలచుకున్నదానికీ కథ వాస్తవంగా వ్యక్తం చేస్తున్నదానికీ మధ్య తేడాను నిరూపించడమూ– స్వతంత్ర పఠనాన్నీ, సందర్భ పరిజ్ఞానాన్నీ, తార్కిక విశ్లేషణనూ కోరతాయి. టెక్నాలజీని వాడుకోవటం తప్పు కాదు. దాని ద్వారా దొరికిన సమాచారాన్ని పరిశీలించకుండా స్వీయ విశ్లేషణగా ప్రకటించడం మాత్రం సమస్యే. టెక్నాలజీ ఎంత పెరిగినా, విమర్శలో పాఠ్యాధారాల బాధ్యతను అది భర్తీ చేయలేదు.
విమర్శకు సిద్ధాంతం అవసరమే. అయితే, సిద్ధాంతాన్ని నిరూపించడానికి రచనను సాధనంగా మార్చకూడదు; రచనను అర్థం చేసుకోవడానికి మాత్రమే సిద్ధాంతాన్ని ఆశ్రయించాలి. ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయానికి అనుకూలమైన అంశాలను మాత్రమే ఎంచుకుంటే, విమర్శ తన పరిశీలనా సామర్థ్యాన్ని కోల్పోతుంది. రచన తమ అంచనాలను తప్పని నిరూపించినప్పుడు, విమర్శకుడు ఆ విషయాన్ని ఒప్పుకోగలగాలి. ఒక సిద్ధాంతం రచనలోని కొన్ని కోణాలను వెలుగులోకి తెచ్చి, మరికొన్నింటిని వివరించలేకపోతే ఆ పరిమితిని గుర్తించాలి. విమర్శకుల మేధో నిజాయితీ అంటే తమ అభిప్రాయాన్ని బలంగా ప్రకటించడం మాత్రమే కాదు; దానికి వ్యతిరేకంగా నిలిచే పాఠ్యాధారాలనూ న్యాయబద్ధంగా పరిగణించడం.
తెలుగు సాహిత్యానికి ఇప్పుడు అవసరమైనది రచయితల సంఖ్యకు తగ్గట్టు సమీక్షకుల సంఖ్య పెరగడం మాత్రమే కాదు. ఒకే రచనపై భిన్న పరిశీలనలు రావాలి, వాటిపై ప్రతివిమర్శలూ ఆధారాలతో కూడిన చర్చలూ కొనసాగాలి. విమర్శకులు రచయితలకు ప్రచారకర్తలుగానో, ప్రత్యర్థులుగానో మారాల్సిన అవసరం లేదు. రచయితలను సమర్థించడమో ఖండించడమో లక్ష్యంగా పెట్టుకోకుండా, రచన ఎట్లా పనిచేస్తోంది, దాని భాషా శిల్పాలు భావజాలంతో ఎట్లా ముడిపడి ఉన్నాయి, అది ఏ అనుభవాలను వెలుగులోకి తెస్తోంది, వేటిని విస్మరిస్తోంది, దాని ప్రకటిత ఉద్దేశం కళాత్మకంగా ఎంతవరకు సాకారమైంది అనే ప్రశ్నలను పరిశీలించాలి. ఆ పరిశీలనకు పాఠ్యాధారాలు చూపాలి; తమ ప్రమాణాలను వివరించాలి; తమ నిర్ణయాలను పునఃపరిశీలించడానికి సిద్ధంగా ఉండాలి.
విమర్శకు కొత్త చూపు అంటే పాతవన్నీ తిరస్కరించడం కాదు; కొత్త సిద్ధాంతాల ప్రకటన మాత్రమే కాదు. రచనను ముందే నిశ్చయమైన అభిప్రాయానికి ఉదాహరణగా గాక, తన అర్థాన్ని తానే విస్తరించగల కళాత్మక నిర్మాణంగా చూడగలగటం; రచయిత ఉద్దేశాన్ని గౌరవిస్తూనే, రచన ఫలితాన్ని స్వతంత్రంగా అంచనా వేయటం; సామాజిక నిబద్ధతను గుర్తిస్తూనే, కళాత్మక పరిమితులను ప్రశ్నించటం; లోపాలు ఎత్తిచూపుతూనే, వాటి వెనుక పనిచేస్తున్న సృజనాత్మక వ్యూహాలనూ అర్థం చేసుకోవటం. ఈ లక్షణాలన్నీ కలిసినప్పుడే విమర్శ తీర్పును మాత్రమే గాక, పాఠకుడు సొంతంగా ఆలోచించడానికి కావాల్సిన పరికరాలనూ ఇస్తుంది. విమర్శ విలువ దాని తీర్పులో మాత్రమే ఉండదు; ఆ తీర్పుకు దారితీసిన ఆలోచనా ప్రక్రియలోనూ ఉంటుంది. అందుకే సమకాలీన తెలుగు విమర్శకు కొత్త సిద్ధాంతాల కంటే కొత్త చూపు అవసరం.
బాలాజీ పోతుల
81792 83830
ఈ వార్తలూ చదవండి
దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి
రాత్రి నూడిల్స్ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!