రైతన్నలకేనా, రైతక్కలకేవీ హక్కులు?
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:52 AM
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో దాదాపు 80శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి బతుకుతున్నారు. కానీ, వారి పేరు మీద భూమి లేకపోవడం వల్ల వారికి రైతులుగా...
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో దాదాపు 80శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి బతుకుతున్నారు. కానీ, వారి పేరు మీద భూమి లేకపోవడం వల్ల వారికి రైతులుగా గుర్తింపు లేదు, హక్కులు లేవు. పంటల ఉత్పత్తి నుంచి ఆహార పదార్థాల శుద్ధి, తయారీ, పంపిణీ వరకు మహిళల శ్రమ వారి కుటుంబాలకు, సమాజాలకు, మొత్తం ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోంది. అయినప్పటికీ వారికి పురుషులతో సమానమైన గుర్తింపు, అధికారం లేదు. ఫలితంగా, వారు తక్కువ ఆదాయాన్ని పొందుతూ, తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు.
మొదటి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని 1995 అక్టోబర్ 15న ‘ఉమెన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్’ రూపకల్పన చేసి నిర్వహించింది. ఆ తర్వాత 2007 డిసెంబర్ 18న ఐక్యరాజ్యసమితి ఈ తేదీని గ్రామీణ మహిళా దినోత్సవంగా గుర్తించింది. మన దేశంలో మహిళా రైతుల హక్కుల వేదిక (మకాం) చేసిన కృషి ఫలితంగా 2017లో అక్టోబర్ 15వ తేదీని ‘మహిళా రైతుల దినోత్సవం’గా ప్రకటించి, దీనిని దేశవ్యాప్తంగా జరుపుకోవాలని మన కేంద్ర వ్యవసాయ మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. తాజా వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం జాతీయ స్థాయిలో మహిళలు మొత్తం సాగు విస్తీర్ణంలో 12శాతం భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది 20 నుంచి 22శాతం వరకు ఉండవచ్చునని క్షేత్రస్థాయి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
తెలంగాణ స్టాటిస్టికల్ ఇయర్ బుక్ 2020 ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం 57,81,888 మంది రైతులలో 40,46,969 మంది రైతులు (అంటే 71శాతం) 2.47 ఎకరాల (ఒక హెక్టారు) కంటే తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే. వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాలలో 30శాతం మంది దగ్గర ఎటువంటి భూమి లేదు. ఎస్సీ సామాజిక వర్గం చేతిలో 9శాతం, ఎస్టీలు 13శాతం, బీసీలకు 47శాతం భూమి ఉంది. అంటే రాష్ట్ర జనాభాలో 15శాతం కంటే తక్కువగా ఉన్న ఓసీలకు 31శాతం భూమి ఉంది! ఓసీలలో అధిక శాతం వ్యవసాయం చేయరు. వారు వాణిజ్య, రాజకీయ రంగాలలో ప్రబలంగా ఉన్నారు. ఇలా వ్యవసాయం చేయని వారి దగ్గర వందల ఎకరాల భూమి పోగుపడి ఉండగా, అసలు సాగుదారులు, కౌలుదారులు, వ్యవసాయంపై ఆధారపడిన మహిళలు, వ్యవసాయ కూలీలకు భూమి చాలా తక్కువగా ఉంది. ఆ ఆదాయం వారి బతుకుదెరువుకు సరిపోక వేతన కూలీలుగా మారి, యాంత్రీకరణ, మోనో క్రాపింగ్ తదితర కారణాల వల్ల పని అందుబాటు తగ్గిపోవటం వల్ల నిత్యం ఉపాధి వెతుక్కోవలసిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
పంటలు సాగు చేయని భూమి యజమానులను మాత్రమే అధికారికంగా రైతులుగా గుర్తించటమూ, వ్యవసాయం కోసం శ్రమనంతా ధారపోస్తున్న వారిని మాత్రం రైతులుగా గుర్తించకపోవటమూ అన్యాయం. ఈ విధానం మారాలి. సాగుదారులు, మహిళా రైతులు, కౌలు రైతులు వ్యవస్థాగత రుణాలు అందక, అధిక వడ్డీలకు ప్రయివేటు అప్పులు తెచ్చి, పెట్టుబడి పెట్టి, పంట నష్టాలను భరించి సాగు చేస్తుంటే, ఈ కష్టమేమీ పడకుండా విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, పంట నష్టపరిహారం మొదలైనవన్నీ రికార్డులలో భూమి ఉన్న రైతులు మాత్రమే పొందుతున్నారు. ఇదెక్కడి న్యాయం?
వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తూ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 80శాతం దోహదం చేస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ఆహార/ వస్తు ఉత్పత్తిలోనూ సామాజిక ఉత్పత్తిలోనూ ప్రధాన భాగస్వామిగా ఉన్న మహిళలకు భూమి వంటి సహజ వనరులపై అధికారం/హక్కులు లేవు. వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ వ్యవసాయంలోనూ నిర్ణయాధికారం లేదు.
ఈ పరిస్థితిని సరిదిద్దటానికి ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. వ్యవసాయ రంగంలో మహిళలకు మద్దతుగా విధానాలలో సంస్కరణలను తేవడానికి, ఈ అంశంపై అందరిలో అవగాహనను పెంచడానికి ఇది ఒక కీలక అవకాశాన్ని కల్పిస్తుంది.
మహిళా రైతుల హక్కుల వేదిక, ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్ కలిసి చేసిన నిరంతర కృషి ఫలితంగా 2026 జూలై మొదటి వారంలో ‘మహారాష్ట్ర మహిళా రైతుల సాధికారత చట్టం 2026’ను మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం ప్రాథమిక ఉద్దేశం మహిళా రైతులకు చట్టపరమైన గుర్తింపును కల్పించటం. ఈ గుర్తింపు వారికి వివిధ ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దిశగా అడుగు వేస్తే వ్యవసాయంలో నిమగ్నమైన గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించగలం. ఈ అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంలో, గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం, మొత్తం సమాజం ఈ దిశగా ఆలోచన మొదలుపెట్టాలి.
ఎస్. ఆశాలత
మహిళా రైతుల హక్కుల వేదిక
(నేడు అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం)
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో