ఫూలే వికసిత భారత్‌కు దారిదీపం
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:43 AM
ఏప్రిల్ 11 నేడు. మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. భారతదేశపు అగ్రశ్రేణి సంఘ సంస్కర్తల్లో ఒకరు, తరతరాలకూ మార్గదర్శిగా నిలిచిన క్రాంతిపథగామి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి నేడు. ఆయన ద్విశతాబ్ది జయంత్యుత్సవాల..
ఏప్రిల్ 11 నేడు. మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. భారతదేశపు అగ్రశ్రేణి సంఘ సంస్కర్తల్లో ఒకరు, తరతరాలకూ మార్గదర్శిగా నిలిచిన క్రాంతిపథగామి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి నేడు. ఆయన ద్విశతాబ్ది జయంత్యుత్సవాల ప్రారంభం నేపథ్యంలో, ఈ ఏడాది మరింత విశిష్టతను సంతరించుకున్నది.
మహాత్మా ఫూలే గొప్ప సంఘసంస్కర్త. అంతేకాదు.. నైతిక స్థైర్యం, నిరంతర సత్యాన్వేషణ, సామాజిక శ్రేయస్సు పట్ల అచంచలమైన అంకితభావం కలబోసిన ఉదాత్త జీవితం ఆయనది. ఎన్నో సంస్థలను నెలకొల్పి, ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించి చిరస్మరణీయులయ్యారు ఫూలే. ఆయన రేకెత్తించిన సరికొత్త ఆశలు, దేశ ప్రజల్లో నింపిన ఆత్మవిశ్వాసం, మన నాగరికతా పరిణామక్రమంలో ఆయన చేసిన అసమానమైన సేవలూ... నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయి.
పుణ్యభూమి మహారాష్ట్రలో 1827లో మహాత్మా ఫూలే జన్మించారు. అతి సామాన్య నేపథ్యం నుంచి ఎదిగారాయన. కానీ తొలినాటి కష్టాలేవీ ఆయన అభ్యాసానికీ, ధైర్యానికీ, సామాజిక నిబద్ధతకూ అడ్డుగోడలు కాలేకపోయాయి. సవాళ్లు ఏవైనా సరే– నిశ్చేష్టులుగా ఉండిపోకుండా.. కష్టపడి జ్ఞానాన్ని ఆర్జించి, ఆ సమస్యలను పరిష్కరించుకోవాలన్న దృఢ సంకల్పమే ఆయనలో ఎన్నడూ తొణికిసలాడేది. విద్యార్థి దశ నుంచే జ్యోతిరావు ఫూలేలో అపారమైన జిజ్ఞాస ఉండేది. నిరంతర అధ్యయనశీలి. తన వయసు పిల్లల స్థాయికి మించిన పుస్తకాలను చదివేవాడు. ‘‘మనం ఎంత ప్రశ్నిస్తే అంత జ్ఞానాన్ని పొందుతాం’’ అని తర్వాతి కాలంలో ఆయనే చెప్పారు. చిన్ననాటి నుంచే ఆయనకు అలవడిన ఆ సత్యాన్వేషణ దృక్పథం ఎక్కడా రాజీపడకుండా జీవితాంతమూ కొనసాగింది.
విద్యనూ, జ్ఞాన సముపార్జననూ జీవిత లక్ష్యాలుగా మలచుకున్నారు మహాత్మా ఫూలే. జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదనీ, ఆ శక్తి అందరికీ అందాలనీ స్పష్టంగా గుర్తించారాయన. సమాజంలో అనేకులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షగా ఉన్న ఆ కాలంలోనే బాలికల కోసం, విద్యావకాశాలు లేని వర్గాల కోసం పాఠశాలలను తెరిచి విద్యా విప్లవానికి నాంది పలికారు. ‘‘తల్లి ద్వారా బిడ్డకు అందే సంస్కారం అమూల్యమైనది. అందుకే, పాఠశాలలు తెరవాలనుకుంటే మొదట బాలికల కోసమే తెరవాలి’’ అనేవారాయన. సామాజిక న్యాయాన్నీ, సమానత్వాన్నీ సాధించే శక్తిమంతమైన సాధనంగా తరగతి గదిని నిలిపి.. ఓ సరికొత్త సామాజిక దృక్పథాన్ని ఆవిష్కరించేందుకు ఆయన ఎంతగానో కృషిచేశారు.
విద్య పట్ల ఆయన దార్శనికత మనందరికీ స్ఫూర్తిదాయకం. దేశ యువతలో పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా గత పదేళ్లుగా మేమెంతో కృషి చేశాం. ప్రశ్నించేలా, అన్వేషించేలా, నూతన ఆవిష్కరణలు చేసేలా యువతరాన్ని ప్రోత్సహించే పటిష్ఠమైన వ్యవస్థను నిర్మిస్తున్నాం. విజ్ఞానం, నైపుణ్యాలు, అవకాశాల్లో పెట్టుబడుల ద్వారా.. సమస్యల పరి ష్కర్తలుగా, దేశ ప్రగతికి సారథులుగా భారత్ తన యువతను సశక్తులుగా తీర్చిదిద్దుతోంది.
మహాత్మా ఫూలే తన విజ్ఞానంతో, వివేకంతో... వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలపై విస్తృత అవగాహనను పెంపొందించుకున్నారు. రైతులు, కార్మికులకు అన్యాయం జరిగితే మన సమాజం బలహీనపడుతుందని ఆయనెప్పుడూ చెప్పేవారు. పొలాల నుంచి పల్్లెల దాకా.. రోజువారీ జీవితంలో సామాజిక అసమానతల తీవ్రతను ఆయన నిశితంగా గమనించారు. అందుకే పేదలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. అలాగే సామాజిక సామరస్యం కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేశారు.
‘‘జోపర్యంత సమాజాతీల సర్వానా సమాన అధికార మిళత్ నహీత్, తోపర్యంత ఖరే స్వతంత్ర్య మిళత్ నహీ (సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించేంత వరకు నిజమైన స్వేచ్ఛను సాధించలేము)’’ అన్నది మహాత్మా ఫూలే అభిప్రాయం. సమ సమాజం లక్ష్యంగా.. ఈ ఆశయాన్ని కార్యాచరణగా మలిచే దిశగా ఎన్నో సంస్థలను ఆయన నెలకొల్పారు. ఆయన స్థాపించిన సత్యశోధక సమాజం ఆధునిక భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో ఒకటి. సామాజిక సంస్కరణ, సమాజ సేవ, మానవ గౌరవాన్ని పెంపొందించడంలో ఇది అగ్రగామిగా నిలిచింది. మహిళలు, యువత, గ్రామీణ ప్రజలకు గొంతుకైంది. న్యాయం, ప్రతి వ్యక్తికీ గౌరవం, సమష్టి పురోగతి స్ఫూర్తిని కేంద్రంగా నిలపడం ద్వారా.. సమాజాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దవచ్చన్న మహాత్మా ఫూలే విశ్వాసానికి ఈ ఉద్యమం నిదర్శనం.
ఆయన వ్యక్తిగత జీవితమూ ధైర్యసాహసాలను బోధించే పాఠమే. నిరంతరం జనబాహుళ్యంలో ఉంటూ ప్రజల కోసం పరితపించడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపింది. అత్యంత క్లిష్టమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేకపోయాయి. పక్షవాతం బారిన పడి శరీరం సహకరించని స్థితిలోనూ తన కృషిని కొనసాగించారు. అవును, ఆయన శరీరం కఠిన పరీక్షను ఎదుర్కొని ఉండవచ్చు.. కానీ సమాజం పట్ల ఆయన నిబద్ధత మాత్రం సడలలేదు. ఆయన జీవితంలోని ఈ అకుంఠిత దీక్షే.. నేడు ఎన్నో కష్టాలకోర్చి, పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది.
గౌరవ సావిత్రీబాయి ఫూలేను స్మరించుకోకుండా మహాత్మా జ్యోతిరావు ఫూలే స్మృతి అసంపూర్ణమే అవుతుంది. దేశం గర్వించదగ్గ అగ్రశ్రేణి సంస్కర్తల్లో ఆమె ముందు వరుసలో నిలుస్తారు. దేశపు తొలితరం మహిళా ఉపాధ్యాయినిగా, బాలికా విద్యా వికాసంలో ఆమె నిర్ణయాత్మక పాత్ర పోషించారు. తద్వారా వారు కలలను సాకారం చేసుకునే అవకాశాన్నిచ్చారు. మహాత్మా ఫూలే మరణానంతరమూ.. ఆ ఆశయ దీప్తిని సావిత్రీబాయి ఆరనివ్వలేదు. 1897లో ప్లేగు వ్యాధి విరుచుకుపడిన తరుణంలో.. బాధితుల సేవలో ఆమె పునరంకితమయ్యారు. చివరకు అదే వ్యాధికి గురై ప్రాణాలు విడిచిన త్యాగమూర్తి ఆమె.
మనది పుణ్యభూమి. విశిష్టమైన భావాలు, నిరుపమాన త్యాగాలు, అకుంఠిత దీక్షతో మన సమాజాన్ని శక్తిమంతంగా మలచిన మహనీయులు, వీరనారులకు నిలయమిది. మార్పు ఎక్కడినుంచో మొదలవుతుందని ఎదురుచూడలేదు. వారే మార్పునకు నాంది పలికారు. శతాబ్దాల నుంచి దేశంలో సామాజిక పురోగతి దిశగా.. మన సమాజం నుంచే శంఖారావం వినిపించింది. పీడితుల వ్యధను గుర్తించి.. దానిని ‘తలరాత’ అని సరిపెట్టుకోకుండా ఎదురుతిరిగిన వారి నుంచి ఆ చైతన్యం పుట్టుకొచ్చింది. అలాంటి యోధుల్లో ఒకరు మహాత్మా జ్యోతిరావు ఫూలే.
2022లో పూణే పర్యటన సందర్భంగా.. అక్కడి మహాత్మా ఫూలే భవ్య విగ్రహం వద్ద నివాళి అర్పించడం నాకెప్పటికీ గుర్తుంటుంది. ఆయన ద్విశతాబ్ది జయంత్యుత్సవాల ప్రారంభ వేళ.. ఆయన ఆశయాల దిశగా పునరంకితం కావడమే మనం అర్పించే ఘనమైన నివాళి. ముఖ్యంగా ఆయనకెంతో ఇష్టమైన విద్య వంటి ఆదర్శాలకు మనం పునరంకితం కావాలి. అన్యాయంపై నిరసన తెలిపే సున్నితత్వాన్ని పెంచుకోవాలి. సమాజ స్వయం సంస్కరణ సామర్థ్యంపై మన విశ్వాసాన్ని బలంగా చాటాలి. నైతిక స్పష్టత, ప్రజా ప్రయోజనం రెండూ తోడైతే.. ఈ సమాజ శక్తి దేశంలో అద్భుతాలు సృష్టించగలదని ఆయన జీవితం నిరూపించింది. అందుకే నేటికీ లక్షలాది మందికి ఆయన ఆలోచనలు బలాన్నిస్తున్నాయి. ఆయన మాటలూ, చర్యలూ నేటికీ ఆశను చిగురింపజేస్తున్నాయి. ఆయన జన్మించి దాదాపు రెండు వందల ఏళ్లు గడుస్తున్నా – మహాత్మా జ్యోతిరావు ఫూలే గత కాలపు శక్తిగానే కాకుండా.. నవ భారత భవితకు మార్గదర్శిగా విరాజిల్లుతున్నారు.
నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి
(మహాత్మా జ్యోతిరావు ఫూలే
ద్విశతాబ్ది జయంత్యుత్సవాలు ప్రారంభం)
ఈ వార్తలూ చదవండి:
200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!
ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్