మహామానవ విషాదానికి కవిత్వ సాక్ష్యం
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:33 AM
‘Man is condemned to be free’ అని కదా అంటాడు సార్త్ర్. మనిషి స్వేచ్ఛ నుండి తప్పించుకోలేడు. స్వేచ్ఛ కోసం జరిగే పెనుగులాటలో స్వేచ్ఛా పిపాస గల బుద్ధిజీవులే ఈ ప్రపంచాన్ని తమ భుజస్కంధాలపై...
‘Man is condemned to be free’ అని కదా అంటాడు సార్త్ర్. మనిషి స్వేచ్ఛ నుండి తప్పించుకోలేడు. స్వేచ్ఛ కోసం జరిగే పెనుగులాటలో స్వేచ్ఛా పిపాస గల బుద్ధిజీవులే ఈ ప్రపంచాన్ని తమ భుజస్కంధాలపై మోస్తారు. ఈ ప్రపంచం నిత్య ఉనికిలో ఉన్నదంటే అది సృజనాత్మకత, స్వేచ్ఛకై పరితపించే కొంతమంది మనుషుల వల్లనే. మానవ జీవితాన్ని అణచివేసే అనేక మూస సాంప్రదాయ, మూస నియమాల సంకెళ్లను బద్దలుకొడుతూపోవడమే సృజనశీలుడైన, స్వేచ్ఛా పిపాసుడైన మనిషి చేసే నిత్య పరిశ్రమ. అలాంటి మానవ శుద్ధి కర్మాగార కార్మికుడిగా నందిని సిధారెడ్డి గారు ప్రవేశం చేసి చాలా కాలమే అవుతున్నది. దానికోసం ఆయన ఎన్నుకున్న పనిముట్టు కవిత్వం.
కవి అయినా, రచయిత అయినా, ఉద్యమకారుడైనా, బుద్ధిజీవులైనా ఎప్పటికప్పుడు అసత్య ప్రపంచాల పెచ్చులను పెకిలించందే వాస్తవ ప్రపంచం ఆవిష్కరణ కాదు. ఉద్యమకారుడు కవి అయితే, కవి ఉద్యమకారుడు అయితే ఈ ప్రక్రియ మరింత మెరుగ్గా సమాజం ముందు స్పష్టం అవుతుంది. ఉద్యమ కార్యకర్త అయిన కవి మానవ భావోద్వేగాల్లోకి, సమాజ మూలాల్లోకి మరింత లోతుగా వెళ్ళగలరు. ఎందుకంటే సమాజ పరిశీలన కోసం కవి, కార్యకర్త కలిసి చేసే అన్వేషణ సంపూర్ణ సత్యాన్వేషణగా ఉంటుంది. కవిత్వం ప్రపంచంలో మరింత లోతుగా వెళ్లడానికి, మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి క్షేత్రస్థాయి కార్యకర్త పాత్ర దోహదపడుతుంది. నందిని సిధారెడ్డి లోని కవి, కార్యకర్త కలగలిసి ఆయన కవిత్వాన్ని మానవ వికాస సాధనంగా బహిర్గతం చేశాయి. ‘భూమి స్వప్నం’తో సిధారెడ్డి మొదలుపెట్టిన ఈ మానవ సమాజ సంస్కరణ పని ‘అనిమేష’ వరకు కొనసాగుతూనే ఉన్నది. ‘సంభాషణ’ (1991)లో చౌరస్తాలో సిగ్నల్ పడ్డప్పుడు కార్ల అద్దాలు తుడిచే పిల్లలను, కార్ఖానాల్లో మగ్గిపోతున్న బాల కార్మికుల జీవితాలను ఎంత లోతుగా చూడగలిగాడో, ‘అనిమేష’ (2020)లో కరోనా వైరస్ దాడికి చెల్లాచెదురైన మనుషుల జీవితాలను అంతే లోతుగా ప్రేమగా చూడగలిగాడు.
సిధారెడ్డి ఉద్యమకారుడిగా ఎంత ముక్కుసూటిగా శాస్త్రీయంగా ఉంటారో కవిగా అంత నిశ్చితాభిప్రాయాలతో ఉంటారు. పదాలను కొద్దిగా కాల్పనికతలోకి ముంచి తీస్తారు. సామాజిక జీవిత సత్యాలను వెల్లడించడానికి సిద్ధపడ్డ కవుల కవిత్వం ఎప్పుడు వాస్తవిక, కాల్పనికతల మేళవింపు తోనే ఉంటుంది.
అతిమార్మికతలకు సిధారెడ్డి అత్యంత దూరం. చెప్పేది ఏదైనా సూటిగా గుండెకు తాకుతున్నట్టు చెప్పాలనేది ఆయన సిద్ధాంతం. కవిత్వాన్ని లోతైన మార్మికతల నుండి వాస్తవిక, సంపూర్ణ, ఖచ్చిత, ప్రతిఫల సాధనంగా మలచి, సరళం, స్పష్టం, సామాన్యం చేసేందుకు గొప్ప గొప్పవారు చాలా కృషి చేశారు. చెహొవ్ మాక్సిం గోర్కీకి అస్పష్టతల నుండి దూరం కమ్మని పదేపదే చెబుతుండేవాడు. సిధారెడ్డి కూడా తన దగ్గరివారికి ఇలాంటి సలహాలే ఇస్తూ ఉంటారు. సిధారెడ్డి లాగా చెప్పడం ఒక కళ, వారికే సాధ్యమైన కళ: ‘‘పిట్ట ముట్టలేదు/ రావడానికైనా/ ముట్టడానికైనా/ పిట్టలుంటే కదా’’. ప్రకృతిని పక్షులను కోల్పోయి ఒంటరిగా మిగులుతున్న మనిషి దీనస్థితిని ఇంతకంటే బాగా చెప్పగల కవిత్వ సాధనం ఇంకేమైనా ఉన్నదా?
ఒక కళాత్మకత నిర్ధారణను సందేశంగాను, ఉపదేశంగానూ చెప్పడం, సందేశాన్ని కళానిర్మాణంతో కూర్చి, సహజ విషయంగా వెల్లడించడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. మనిషి, సమాజమే ఆయన కవిత్వం ముడి సరుకులు. మనిషి లేని, సమాజం లేని, మానవత్వం లేని ఊహాతీత పదాల జోలికి ఆయన వెళ్ళలేదు. పెన్నా శివరామకృష్ణ గారు చెప్పినట్టు నాడైనా నేడైనా సామాజిక, రాజకీయ అంశాలకు దూరమైన కవితలను ఆయన రాయలేదు.
కరోనా వైరస్ ఒక ప్రపంచ కుదుపు. ఆ కుదుపులో సోలిపోయిన జీవితాలను సిధారెడ్డి లోపలి కవి పట్టుకున్నాడు. ‘‘కాళ్ళ కింద నదులే/ కళ్ళ కింద నదులే/ మనిషిని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసే’’ నదులను కవి చూడగలిగాడు. ఆ ఉపద్రవపు తీరొక్క మానవ అంతర్ మదనాలను ఆయన కవిత్వం చేశారు. నూటా పన్నెండు పేజీల ‘అనిమేష’ నిండా ఉన్నది మనిషి వేదనే. ముంగిలికొచ్చిన వింత విపత్తు ఎంతటి ప్రమాదమో తెలియని గడ్డుస్థితిని ఆయన కవిత్వం చేశారు. కాలం క్యాలెండర్‌కు అడ్డం తిరిగి, విషకోర కాటుకు మానవత్వం కాలిన వాసనను కవిత్వంతో చిత్రీకరించారు.
మనిషి చావు బతుకుల అలాంటి దైన్యస్థితిలోనూ పెట్టుబడిదారీ విధానం నిసిగ్గుగా తన వికృత రూపాన్ని ప్రదర్శించింది. శవాల మీద లాభాలను కొల్లగొట్టుకునేందుకు పెట్టుబడి రాబందులు అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను సంధించాయి. ఈ నాటకీయ పరిణామాలు సిధారెడ్డి దృష్టిని దాటిపోలేదు. విజ్ఞుడైన, ప్రజాపక్షపాతి అయిన ఏ కవి దృష్టినీ అవి దాటిపోలేవు. కరోనా శరీరంలో బతుకుతుంది.. సార్వభౌమత్వం పెట్టుబడిలో బతుకుతుంది– అనే నిజాన్ని గ్రహించినవాడు కాబట్టి ముల్లుని ఆర్థికముల్లే అని తేల్చేశాడు. వ్యాపారం భుజం మీద చేయి వేసి కొత్త రూపం ఎత్తనున్న రాజకీయ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. ఎవరికి అర్థం కాని ఈ ఆటలో ‘‘ప్రపంచం ప్రయోగశాల/ జీవితం చిక్కులవల’’ అనే విషయాన్ని విశదీకరించాడు.
‘అనిమేష’ సంపుటి మొత్తం కేవలం కరోనా కవితలే అనుకుంటే పొరపాటే. వ్యాధిగ్రస్త సంక్షోభ సమయంలో మనుషుల మానసిక సంఘర్షణ, వైరస్ పేరుతో దోపిడికి తెగబడ్డ మార్కెట్ పెట్టుబడి శక్తుల యుక్తులు, ఈ విపత్తు ధాటికి చిగురుటాకుల వణికిన సమాజంలోని అట్టడుగు వర్గాలు... ఒకటేమిటి సమస్త మానవాళి భావోద్వేగాలకు, కాదు సమస్త విషయాల సమగ్ర చర్చకు ఇందులో అక్షర రూపం ఇచ్చారు. ‘‘స్నేహం చూపడానికి లేదు/ ప్రేమ ప్రకటించడానికి లేదు/ మంటల్లోంచి లేచే మూకుమ్మడి కమురువాసన/ జాలి జాలిగా గాలిలో కలిసిపోతుంది/ గాలికి మొక్కాలె.. గాలి వైరస్‌ను త్యజించింది’’. పొగిలి వచ్చే దుఃఖాలను నాలుగు గోడల మధ్య అణచివేసుకున్న పరిస్థితులను ‘అనిమేష’ ద్వారా మనకు గుర్తు చేస్తున్నారు సిధారెడ్డి.
భయం, ఒంటరితనం, భవిష్యత్తు పట్ల అనిశ్చితి ఆ కాలంలో మానవ జీవితాలను కుదిపేసింది. సిధారెడ్డి కవిగా ఆ కాలాన్ని రికార్డు చేశారు. కోవిడ్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా సంకలనాలు వచ్చాయి. Poetryandcovid.com లాంటి వెబ్‌సైట్లు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కవిత్వానికి వేదికగా నిలిచాయి. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ లాంటివి కోవిడ్‌పై వచ్చిన విషాద భరిత కవితలను రివ్యూ చేశాయి. జెస్సికా సల్ఫియా లాంటి వారు రాసిన హాస్య భరిత కవిత్వం పెద్ద ఎత్తున వైరల్ అయింది. లాక్‌డౌన్‌లో కష్టాలను, బాధలను పెట్టుబడిదారీ వర్గాలు ఎలా అవకాశంగా తీసుకుంటాయో చెప్పే ఆ కవిత ఆ తర్వాత ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో పబ్లిష్ అయ్యింది. కరోనా గడ్డు పరిస్థితిల మీద ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల నుండి కవిత్వం వచ్చింది, అనేకమంది కవుల కవిత్వాన్ని కూర్చిన అనేక సంకలనాలు వచ్చాయి. కానీ వ్యక్తిగత కవితా సంపుటాలు తక్కువగానే వచ్చాయి. తెలుగులో మరీ తక్కువ. కోవిడ్ కాలాన్ని, బాధని, దుఃఖాన్ని కవిత్వం చేసిన నందిని సిధారెడ్డి గారి ‘అనిమేష’ కవిత్వ సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం తెలంగాణ కవిత్వానికి, తెలుగు కవిత్వానికి దక్కిన గొప్ప గౌరవం.
చెమన్
94403 85563
ఇవి కూడా చదవండి
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ
నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క