Share News

లోయపల్లి: ‘ఉపాధి’ సంక్షోభానికి సూచిక

ABN , Publish Date - May 15 , 2026 | 01:23 AM

బస్టాండ్ దగ్గర పనికోసం ఎదురుచూస్తున్న మహిళలు, గుట్టలపై జరిగే పనికోసం కిలోమీటర్ల కొద్దీ నడిచే కూలీలు... పనికోసం తండ్లాట... దొరకకపోతే నిరాశ...! లోయపల్లిలోని ఈ జీవన దృశ్యాలు గ్రామీణ భారతంలో..

లోయపల్లి: ‘ఉపాధి’ సంక్షోభానికి సూచిక

బస్టాండ్ దగ్గర పనికోసం ఎదురుచూస్తున్న మహిళలు, గుట్టలపై జరిగే పనికోసం కిలోమీటర్ల కొద్దీ నడిచే కూలీలు... పనికోసం తండ్లాట... దొరకకపోతే నిరాశ...! లోయపల్లిలోని ఈ జీవన దృశ్యాలు గ్రామీణ భారతంలో విస్తరిస్తున్న ఉపాధి సంక్షోభానికి సూచికలు. పని దినాలు తగ్గిపోవడం, హాజరు–వేతన వ్యవస్థల్లో గందరగోళం, చెల్లింపుల ఆలస్యం కలిసి గ్రామీణ ‘ఉపాధి’ని అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని లోయపల్లి ఆ మండలంలో అత్యధిక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) జాబ్ కార్డులు ఉన్న రెండో పెద్ద గ్రామం. 2021–22లో ఇక్కడ ప్రతి కుటుంబానికి సగటున 50.3 పనిదినాలు లభించాయి. ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ 2025–26లో 20.52కి పడిపోయింది. వందరోజులు పని పూర్తిచేసిన కుటుంబాలు కేవలం మూడు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రామీణ ఉపాధి సంక్షోభానికి లోయపల్లి ఒక చిన్న సూచిక మాత్రమే.

లోయపల్లిలో 2000 పైచిలుకు కార్డులున్నాయి గానీ 200 మందే పనులు చేస్తున్నారు. మండలాధికారులు కుంటలు తవ్వించమన్నారు అని చెప్పారు సర్పంచ్ రఘురామ్. కానీ సేద్యపు కుంటలు తవ్వడమూ గుట్ట లెక్కడమూ చాలా కష్టమని ఇక్కడి మహిళా కార్మికులు చెబుతున్నారు. మాజీ వార్డు మెంబరు ఈరమల్లు వెంకటయ్య మాటల్లో చెప్పాలంటే, ‘‘గుట్టలు దూరం. గట్టిగుంటయి. తవ్వితే మట్టి ఎల్లదు. అందుకే ఎవ్వరూ సరిగా పోతలేరు’’. దీనిపై ఎంపీడీవో బాలశంకర్ స్పందిస్తూ, లోయపల్లిలో చదునైన భూమి తక్కువగా ఉందని, గుట్టల ప్రాంతాల్లో చదునైన భూమిని గుర్తించి పనులు చేపట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గుట్టలపై పనిచేయడం కోసం రానూ పోనూ రోజుకు ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందేనని బొట్టు నీరజ తెలిపింది. ‘‘కింద పని లేదంటే గుట్ట లెక్కినం. ఇప్పుడు నాలుగు గుంపులు పోతున్నయి’’ అని తెలిపాడు మోరా సాయిలు.


గత ఆరేళ్ళలో సగటున ఏడాదికి 67 పనిదినాలు వాడుకున్న సాయిలు కుటుంబం, 2025లో వారం రోజులే పనిచేసింది. ఈ నేపథ్యంలో నేను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న నరేగా మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్)లో పని డిమాండ్ సరళిని పరిశీలించాను. 60 జాబ్ కార్డుదారుల దరఖాస్తులు, వారికి కేటాయించిన పని, సంబంధిత మస్టర్లు, పనిరోజులు, చెల్లింపుల వివరాలను గమనించాను. 2025 ఏప్రిల్‌లో 87 డిమాండ్లు నమోదయ్యాయి. పనికోసం ఎవరూ దరఖాస్తు చేసినట్టు ఆధారాలు కనిపించలేదు. మే నెలలో 334 డిమాండ్లు నమోదయ్యాయి. తొలి వారంలో ఒక్క దరఖాస్తు కూడా లేదు. 13వ తేదీ తర్వాతే పనులు మొదలయ్యాయి. డిమాండును ఆలస్యంగా నమోదు చేసి, తర్వాత పని కల్పించినట్టు చూపించారా వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక మహిళకు మే 26 నుంచి వారం రోజుల పని లభించింది. నాలుగు రోజులు పని చేశాక, ఆమెతో పాటు గుంపులోని వారందరికీ రెండు రోజులు ఆబ్సెంట్ పడింది. కొన్ని మస్టర్లలో ఒకే రోజు గుంపులోని కూలీలందరికీ గైర్హాజరు నమోదైంది. ఇది యాప్ ఆధారిత హాజరు వ్యవస్థ ప్రభావమా? అసలేమైంది? దీనిపై ఫీల్డ్ అసిస్టెంట్‌ వివరణ కోసం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన లేదు.

ఎక్కువ మంది కార్మికులు జనవరి–మార్చి మధ్యలోనే తమ పనిదినాలు వాడుకున్నారు. ఆకారం యాదమ్మ–భిక్షపతి కుటుంబం గత ఆర్థిక సంవత్సరంలో 16 రోజులు మాత్రమే పనిచేసింది. అది కూడా ఫిబ్రవరిలోనే. అంతకుముందు నాలుగేళ్ళలో ఈ కుటుంబం తొలి త్రైమాసికంలోనే సగటున 45 పనిదినాలు వాడుకుంది. ‘‘డిమాండ్ పెట్టుకుంటే ఒక వారం పని ఉంటది. తర్వాత వారం ఉండదు. డిమాండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే పనిదినాలు తగ్గుతున్నాయి’’ అని మేట్ల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు గంపెల్లి రాజు తెలిపారు.

2022–25 మధ్య సగటున ఏడాదికి 63 రోజుల చొప్పున పనిచేసిన రాజు కుటుంబం, గత ఆర్థిక సంవత్సరంలో 28 పనిదినాలకే పరిమితమయ్యింది. రోజువారీ వేతనం రూ.307కి పెరిగినప్పటికీ, ఆదాయం రూ.8,561ను మించలేదు. ఫోటో క్యాప్చర్ కావడం లేదని, హాజరు నమోదు కావడం లేదని చెప్పడంతో ఫిబ్రవరి మొదటి వారం తర్వాత తన తల్లి లక్ష్మమ్మ పనికి వెళ్లడం మానేసిందని రాజు తెలిపారు. అప్పటికే కేటాయించిన మరో 12 రోజుల పనిని కూడా ఆమె వదులుకోవాల్సి వచ్చింది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) వైఫల్యాల కారణంగా ఆమెకు శిక్ష పడినట్టయింది.


హాజరు నమోదు ప్రక్రియలో పదేపదే సమస్యలు తలెత్తుతున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగానూ ఇలాంటి ఇబ్బందులు కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత కూడా కార్మికుల హాజరు నమోదు ప్రక్రియ సవ్యంగా సాగడం లేదు. హక్కుగా లభించాల్సిన ఉపాధిని సాంకేతిక పర్యవేక్షణ పేరుతో క్రమంగా కుదించే, కూలీలకు అందకుండా చేసే ధోరణి కనిపిస్తోంది.

ఉపాధి కూలీల్లో ఎవరిని అడిగినా ప్రధానంగా వినిపించేది వేతనాల సమస్యనే. ‘‘డబ్బులొస్తలేవు.. కిరాయిలెట్ల ఎల్తయి’’ అని ప్రశ్నించాడు సాయిలు. అతడు మే చివరి వారం చేసిన పనికి అక్టోబరు రెండున వేతనం జమ అయింది. జనవరి చివరి వారంలో చేసిన పనికి ఇంకా కూలి రాలేదు. ఎంఐఎస్ డేటా ప్రకారం ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ల ప్రాసెసింగ్‌లో తెలంగాణలో జాప్యమవుతోంది. ఈ పరిస్థితి వేతన చెల్లింపులు ఆలస్యం కావడానికి దారితీస్తోంది. 15 రోజుల గడువు దాటినా కూలి అందకపోతే, 16వ రోజు నుంచి బకాయిలపై రోజుకు 0.05 శాతం పరిహారం ఇవ్వాలని చట్టం చెబుతోంది. అయితే, కాగ్ నివేదిక ప్రకారం ఈ పరిహారం అమలులో తీవ్ర లోపాలున్నాయి. 2019–24 మధ్య 4,19,479 జాప్య దినాలకు పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేవలం 8 శాతానికి మాత్రమే ఆమోదం లభించింది. 22 శాతం తిరస్కరించబడ్డాయి. 70 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.

కనీసం 20 రోజులు ఉపాధి పనిచేసిన వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింది రెండు విడతలుగా రూ.12,000 ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ పనే ఇవ్వనపుడు పథకం ఎలా వర్తిస్తుందనే ప్రశ్నలు వినవస్తున్నాయి. ‘‘ఉపాధి పనిదినాలతో నిమిత్తం లేకుండా భూమి లేని వ్యవసాయ కార్మికులందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వాలని 2025 మొదటి గ్రామసభలో లొల్లి పెట్టినం. నీరుకోసం, నీడకోసం కూడా పోరాటం చేసినం’’ అని గత రెండేళ్లలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలను వెంకటయ్య వివరించారు.

పని దొరకక, దొరికిన పని నిలవక, కూలి సమయానికి అందక– ఉపాధి హామీ పథకం మీద నమ్మకం దెబ్బతింటున్న సంకేతాలు లోయపల్లిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం అమలు సమస్య కాదు, దాని వెనుక ఉన్న విధాన మార్పులపై వేరుగా పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని లభ్యత తగ్గిపోతూ, హాజరు–వేతన వ్యవస్థలు సమస్యల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో లోయపల్లి అనుభవం వ్యవస్థాత్మక వైఫల్యాన్ని బయటపెడుతోంది. ఈ అనిశ్చితి ఒక ఊరికి పరిమితమైనది కాదు. ఇప్పుడు ఏ ఊరిలోనైనా కనిపిస్తుంది, చూడగలిగే మనసుంటే.

ఉదయలక్ష్మి వడ్లమూడి

జర్నలిస్ట్

ఇవీ చదవండి:

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

Updated Date - May 15 , 2026 | 01:23 AM