Share News

మన కాలపు స్ఫూర్తి ప్రదాత

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:02 AM

లాల్‌కృష్ణ ఆడ్వాణీ... భారత రాజకీయ చరిత్రలో పరిచయం అవసరం లేని పేరు. ఈ నవంబరు 8న ఆయన శతాయుష్కుల జాబితాలో చేరనున్నారు. ఈ ఏడాది ఆయన నూరవ పుట్టిన రోజు, దీపావళి పండుగతో...

మన కాలపు స్ఫూర్తి ప్రదాత

శతవసంతంలోకి ఆడ్వాణీ

లాల్‌కృష్ణ ఆడ్వాణీ... భారత రాజకీయ చరిత్రలో పరిచయం అవసరం లేని పేరు. ఈ నవంబరు 8న ఆయన శతాయుష్కుల జాబితాలో చేరనున్నారు. ఈ ఏడాది ఆయన నూరవ పుట్టిన రోజు, దీపావళి పండుగతో జమిలిగా రావడం విశేషం. శ్రీరామ ప్రభువు విజయానికి, వెలుగు దివ్వెకు ప్రతీక అయిన ఈ పండుగ సమయం, జనసంఘ్ ఆవిర్భావానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భం, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి, ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్‌ శతవసంతోత్సవం నిర్వహించుకోవడం తదితరాలన్నీ ఈ సంవత్సరం ఆయన జన్మదినంతో ముడిపడటం ముదావహం.

ఆధునిక భారత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలతో పెనవేసుకున్న సుదీర్ఘ జీవితం ఆయనది. ఆడ్వాణీ 1927 నవంబరు 8న ‘దేవ్ దీపావళి’ పర్వదినాన జన్మించారు. 1947లో సింధు ప్రాంతంలోని తన చిరపరిచిత ప్రపంచాన్ని వీడి రావాల్సిన దుస్థితిని, వేదనను అనుభవించారు. అయినా, చేదు అనుభవాలకు తావులేకుండా శూన్యం నుంచి తన జీవిత పునరుద్దీపన చేసుకున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ ఆద్యంతం పునర్నిర్మించగల ఈ లక్షణం, సామర్థ్యం ఆయనలో సహజాతాలు. జనసంఘ్‌ను బలోపేతం చేసే వేళ, భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రూపురేఖలు దిద్దే సమయాన ఆయనలోని ఈ లక్షణాలే కీలకపాత్ర పోషించాయి. ఆయన 1989లో పార్టీ అధ్యక్షుడిగా ‘బీజేపీ’కి సారథ్యం వహించినపుడు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ బలం 400 స్థానాల నుంచి 200కన్నా దిగువకు పతనమైంది. ఆ తర్వాత 1996లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. పార్టీలో తరతరాల కార్యకర్తలను తీర్చిదిద్దడంతో పాటు ‘దేశమే ప్రధానం’ సూత్రం ప్రాతిపదికగా పార్టీకి బలమైన పునాది వేశారు ఆడ్వాణీ.

ఒక నాయకుడిగా ఆడ్వాణీ విశిష్టతను తెలిపే రెండు ప్రత్యేక లక్షణాలను మనమిప్పుడు గుర్తుచేసుకోవాలి. మొదటిది– ఆయనకు గల సైద్ధాంతిక స్పష్టత–మేధపరమైన పదును. ఇది ఆయన రచనల్లో, ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తూంటుంది. ఆయన రూపొందించిన జనసంఘ్, బీజేపీ తీర్మానాలు నేటికీ అధ్యయనార్హమే. రెండోది– భారత రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగిన ‘మిథ్యా లౌకికవాదాన్ని’ ఎండగట్టడంలో ఆయన చాతుర్యం.


తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను ఎంతో శ్రద్ధతో, కర్తవ్య నిష్ఠతో నిర్వర్తించారు ఆడ్వాణీ. ఆరెస్సెస్ ప్రచారక్‌గా, ఆయన తొలుత రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. అక్కడి నుంచి దేశ రాజధానికి వచ్చి, అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి పనిచేశారు. ఇద్దరూ రాజకీయ దిగ్గజాలే అయినా, దశాబ్దాల పాటు పరస్పర పోటీదారులుగా మారకపోవడం స్ఫూర్తిదాయకం. అదే సమయంలో పరస్పర సహకారంతో పార్టీ ఉత్థానానికి కృషి చేయడం భారత రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన అంశం. ఆడ్వాణీ, అటల్ భారత రాజకీయాల దశ–దిశలను మార్చివేశారు.

ఆడ్వాణీ తన జన్మస్థలం వీడి ఢిల్లీ చేరేనాటికి దేశ విభజన పర్యవసాన ఘోరాల నుంచి నగరం అప్పుడప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసంఘ్‌ బలోపేతం లక్ష్యంగా తన వంతు కృషిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయన 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. ఆడ్వాణీ పార్లమెంటరీ ప్రస్థానం 1970లో ప్రారంభమైంది. ఎంపీగా, ఆ తర్వాత ఉభయ సభలలో ప్రతిపక్ష నేతగానే కాకుండా అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా తనదైన ముద్ర వేశారు.

1991 నాటి లోక్‌సభ ఎన్నికలు నాకింకా గుర్తున్నాయి. ఆడ్వాణీ అప్పట్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. వాటిలో ఒకటి గాంధీనగర్, గుజరాత్‌తో ఆయనకు అప్పటికే అనుబంధం ఉంది. దేశ విభజన తర్వాత ఆయన తండ్రి కచ్‌లో స్థిరపడ్డారు. ఆడ్వాణీ గుజరాత్ నుంచి రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి, గాంధీనగర్‌లో పోటీ అంటే– ఒకరకంగా సొంత గూటికి తిరిగి రావడం లాంటిది. బీజేపీలో భాగస్వామిని కాబట్టి, ఆయన సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేయడం సహా ప్రచారంలోనూ సహాయపడే గౌరవం నాకు దక్కింది. ఆ తర్వాత కూడా గాంధీనగర్ ప్రజలు ఆయనను పలుమార్లు తమ ప్రతినిధిగా పార్లమెంటుకు పంపారు. అక్కడి ఓటరుగా అనేకసార్లు ఆయనకు ఓటు వేసే అవకాశం నాకు లభించింది. ఆడ్వాణీ తన నియోజకవర్గంపై చూపిన శ్రద్ధ, బాధ్యతల నిర్వహణ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

ఆడ్వాణీ జీవితంలో ఎమర్జెన్సీ ఓ కీలక మలుపు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ పోరాటాన్ని ఆయన ముందుండి నడిపించారు. నాటి అనుభవాలను ‘ఎ ప్రిజనర్స్ స్ర్కాప్–బుక్’ పేరిట రాసిన పుస్తకంలో ఆయన అందరితోనూ పంచుకున్నారు. అందులోని ‘ఎ టేల్ ఆఫ్ టూ ఎమర్జెన్సీస్’ అనే ఒక భాగం 1975 జూన్‌లో భారత్‌లో సంభవించిన పరిణామాలతో, 1933 నాటి నాజీ జర్మనీలో సంఘటనలకు గల అద్భుత సారూప్యాన్ని కళ్లకు కడుతుంది.


4-ed.jpg

ఆడ్వాణీ చిచ్చరపిడుగు వంటి ప్రతిపక్ష నేత. అంతేకాదు.. అద్భుత పరిపాలకుడు కూడా. ఉప ప్రధానమంత్రిగా, దేశంలో హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించిన నేతగా దేశ భద్రత వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాదంపై ఆయన తీసుకున్న నిర్ద్వంద్వ వైఖరి వల్లనే భారత్‌ అత్యంత పటిష్ఠ ఉగ్రవాద నిరోధక చట్టం చేయగలిగింది.

ఆడ్వాణీ జీవితంలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర నిస్సందేహంగా ఒక చారిత్రక ఘట్టం. భారత సమాజ గమనాన్ని ఆ యాత్ర సన్మార్గంలోకి మళ్లించింది. ఈ యాత్రపై సమాలోచన దశ నుంచి పూర్తిస్థాయి అమలు దాకా నాకూ భాగం దక్కడం ఒక అదృష్టం. యాత్ర ప్రారంభమైనప్పుడు నేను కూడా సోమనాథ్‌లో ఉన్నాను. ఏదైనా యాత్ర అత్యంత శ్రమతో కూడుకున్నదే. ఎందుకంటే– నిరంతర పయనం, ఎక్కువ గంటల పని, శారీరక ఓర్పు, అలసటలోనూ ఏకాగ్రత వీడని సామర్థ్యం అవసరం. ఆడ్వాణీ వీటన్నిటికీ ప్రతిరూపం.

బిహార్‌లో ఆడ్వాణీ అరెస్టు నాటి బాధాకర జ్ఞాపకాలు కూడా నా మదిలో ఇంకా మెదులుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్‌లో చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరణతో మన సిద్ధాంతంతో పాటు రామ మందిరం విషయంలో ఎప్పటికీ రాజీ ఉండదనే వైఖరి స్పష్టమైంది. మన సీనియర్ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఏదేమైనప్పటికీ రామ మందిర నిర్మాణం పూర్తిచేస్తామని ప్రమాణం చేశారు. ఎట్టకేలకు అనేక ఏళ్ల తర్వాత దేశ ప్రజల ఆశీస్సులతో అయోధ్యలో శ్రీరామ ప్రభువుకు దివ్య–భవ్య మందిరం రూపుదిద్దుకుంది.

ఆడ్వాణీలో ప్రశంసించదగిన గుణాలెన్నో ఉన్నాయి. అందులో నిరాడంబరత్వం ఒకటి. నవ నిర్మాణ ఉద్యమం తర్వాత ఆడ్వాణీ జునాగఢ్‌కు వచ్చారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూ, సాధారణ కార్యకర్తలా నెల రోజులు మెలిగారు. ‘మై కంట్రీ–మై లైఫ్’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో ఆడ్వాణీలోని చారిత్రక స్పృహ, దాన్ని పరిరక్షించాలనే తపన ప్రస్ఫుటమవుతాయి. లేహ్ సమీపంలోని సింధు దర్శన్‌ పూజను ప్రాచుర్యంలోకి తేవడం ఆయన కృషిలో మరొక భాగం. ఆడ్వాణీ, జార్జి ఫెర్నాండెజ్‌లతో కలసి నేను స్వయంగా ఆ పూజలో పాల్గొన్నాను. ఆడ్వాణీ సతీమణి శ్రీమతి కమలా ఆడ్వాణీ ప్రస్తావన లేకుండా ఆయన అద్భుత జీవన ప్రస్థానంపై వివరణ అసంపూర్ణమే! ఆయన ప్రజా జీవితమంతటా నిరంతర శక్తికి, మద్దతుకు ఆమె మూలస్తంభం.

ఆడ్వాణీ సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా దేశ ప్రజానీకం 2024లో ఆయనను ‘భారతరత్న’ పురస్కారంతో సత్కరించింది. ప్రజాభిమానం చూరగొన్న ఆడ్వాణీ తన జీవితంలో వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఎప్పటిలాగానే మనందరికీ స్ఫూర్తిప్రదాతగా నిలవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.

నరేంద్ర మోదీ

భారత ప్రధానమంత్రి

ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..

అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..

Updated Date - Nov 08 , 2026 | 02:02 AM