సాహిత్యం నగరాలకు పరిమితం కాకూడదు!
ABN , Publish Date - Aug 24 , 2026 | 02:59 AM
మానవ సంబంధాల వెనుక ఉండే ఆర్ద్రతను, పల్లె వాతావరణంలోని సునిశిత శబ్దాలను కవిత్వంగా మార్చడంలో సుంకర గోపాల్ ముద్ర ఎంతో ప్రత్యేకం. తొలి కవితా సంపుటి ‘మా నాయన పాట’ ద్వారా...
మానవ సంబంధాల వెనుక ఉండే ఆర్ద్రతను, పల్లె వాతావరణంలోని సునిశిత శబ్దాలను కవిత్వంగా మార్చడంలో సుంకర గోపాల్ ముద్ర ఎంతో ప్రత్యేకం. తొలి కవితా సంపుటి ‘మా నాయన పాట’ ద్వారా కవిత్వ ప్రేమికుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారాయన. బోధన, సృజన వరకే కాకుండా పాఠకుల్లో కొత్త నీరును తేవటానికి కూడా గోపాలయ్య ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన రెండవ కవితా సంపుటి ‘నీటి కుండలాంటి మనిషి’ విడుదలైన సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ:
మీ కవిత్వంలో గ్రామీణ, సామాన్య జీవిత వస్తువులే అధికం. దీనికి మీ నేపథ్యమే మూలమా?
కచ్చితంగా. మనిషి వేళ్లు ఎక్కడైతే పాతుకుపోయి ఉంటాయో, అక్కడి నుండే సారాన్ని గ్రహిస్తాడు. నా కవిత్వంలో కనిపించే మట్టివాసన, గ్రామీణ వస్తువులు నేను పుట్టి పెరిగిన నేల నుంచి వచ్చినవే. బాల్యంలో అపురూపమైన గ్రామీణ జీవితం గడిపాను. చెమట చుక్కల విలువ తెలుసు. పల్లెల్లోని సహజమైన అనుబంధాలు ఆలోచనలకు పునాదులు. అవే నా కవిత్వానికి ప్రాణం పోశాయి.
‘మా నాయిన పాట’, ‘నీటి కుండలాంటి మనిషి’ ఈ రెండు కవిత్వ సంపుటాల మధ్య కాలంలో రచయితగా మీలో మీరు గమనించిన మార్పులు?
నా మొదటి కవిత్వ సంపుటి ‘మా నాయిన పాట’లో ఒక రకమైన భావోద్వేగం, నాటి జ్ఞాపకాల పట్ల మమకారం ఎక్కువగా ఉంటే, రెండో సంపుటి ‘నీటి కుండలాంటి మనిషి’ నాటికి నాలో ఒక తాత్విక పరిణతి చోటు చేసుకుంది. మానవ జీవితం నీటి కుండలా ఎంత సున్నితమైనదో, ఎంత అశాశ్వతమైనదో గ్రహించిన అనుభవం అది. రూపంలోనూ, వ్యక్తీకరణలోనూ మరింత స్పష్టత, గాఢత పెరిగాయని భావిస్తున్నాను. చాలా సరళమైన భాషలో లోతైన భావాల ఆవిష్కరణ గమనించవచ్చు. ఈ సంపుటిలో ప్రకృతి, సమాజం, జీవితం ఈ త్రికం పట్ల అన్వేషణ కనిపిస్తుంది.
సాహిత్యవ్యాప్తి కోసం మారుమూల పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుంటారు. దీని వెనక మీ దృక్పథం?
సాహిత్యం కేవలం నగరాలకో, పెద్ద సభలకో పరిమితం కాకూడదు. నిజమైన చైతన్యం క్షేత్రస్థాయి నుంచి రావాలి. గ్రామీణ విద్యార్థుల్లో అద్భుతమైన సృజనాత్మకత ఉంటుంది. కానీ సరైన మార్గదర్శకత్వం అందదు. ముఖ్యంగా నేను డిగ్రీ పాఠ్యప్రణాళిక రూపొందించే క్రమంలో కవిత్వ ప్రచారం కోసం కార్యశాలలు నిర్వహించాలని పాఠ్యపుస్తకంలో పొందుపరిచాను. తరగతి గదుల్లో సాహిత్యాన్ని విద్యార్థులకు చేరువు చేయడంలో మనం విఫలం అయ్యామనే చెప్పాలి. కనీసం తమ జిల్లాల్లో ఉన్న రచయితల పేర్లు కూడా విద్యార్థులకు తెలియజేయడం లేదు. చదువులో మార్కులు బయటకు కనిపిస్తాయి గానీ సాహిత్యం నుంచి వచ్చే సంస్కారం చాలా నిదానంగా కనిపిస్తుంది. సాహిత్యాన్ని ప్రచారం చేయాలి, విద్యార్థుల ఆసక్తిని పెంపొందించాలి అనే ఉద్దేశంతో కళాశాలలు తిరుగుతున్నాను.
సాహిత్యం పట్ల ఒక గ్లామర్ తీసుకొస్తేనే నేటి ‘జెన్ జీ’ యువత ఆకర్షితులు అవుతారంటారా?
నేటి యువతకు భాషను భారంగా కాకుండా, ఒక అనుభూతిగా అందించాలి. డిజిటల్ యుగంలో ఉన్న వారికి ‘రీల్’ జీవితానికి, ‘రియల్’ జీవితానికి మధ్య ఉన్న తేడాను కవిత్వం ద్వారా విడమర్చి చెప్పాలి. తరగతి గదిలో సాహిత్యం గురించి చెప్పేటప్పుడు అది వారి నిత్య జీవితానికి ఎలా అన్వయించుకోవాలో వివరిస్తే, వారు తప్పకుండా ఆకర్షితులవుతారు. ఆధునిక మాధ్యమాలను వాడుకుంటూనే క్లాసిక్ సాహిత్యంలోని గొప్పతనాన్ని రుచి చూపాలి.
ఇతర ప్రక్రియల జోలికి పోకుండా కేవలం కవిత్వం దగ్గరే ఉండటానికి కారణం?
మా నాన్నగారు జానపద గాయకులు కావడం వల్ల చిన్నప్పుడే నా చెవుల్లో ‘లయ’ నిలిచిపోయింది. జానపదం అనేది కవిత్వానికి తల్లి లాంటిది. ఇతర ప్రక్రియల కంటే కవిత్వం మన భావాలను తక్కువ మాటల్లో, ఎక్కువ ప్రభావంతో వ్యక్తపరచడానికి సహకరిస్తుంది. కవిత్వంతోపాటు వ్యాసాలు, సాహిత్య విశ్లేషణలు చేస్తా కానీ ఎప్పుడూ కవిత్వంలోనే సేద తీరుతాను.
నేడు అందరికీ వెసులుబాటు ఉన్న సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో రచయితలు తాము రాసిందే కవిత్వం అనుకొనే అవకాశం ఎక్కువ. దీన్ని ఎలా ఎదుర్కోవాలి?
సోషల్ మీడియా అందరికీ వేదికను ఇచ్చింది, మంచిదే. కానీ అకవిత్వం, ప్రాథమిక లక్షణాలు లేని రచనలు ప్రచారంలోకి రావడం ఆందోళనకరం. దీన్ని ఎదు ర్కోవాలంటే నాణ్యమైన సాహిత్యం వైపు పాఠకులను మళ్లించాలి. నిరంతర పఠనం, అధ్యయనం ఉన్న పాఠకుడిని ఏ సూడో రచయితా మోసం చేయలేడు. ఇప్పుడు చాట్ జిపిటి ఆధారంగా కొంతమంది వ్యాసాలు రాయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఆ భాషను మనం సులభంగా పట్టుకోవచ్చు.
యువ రచయితల సాహిత్యంపై ఆశించినంత విమర్శ రావడంలేదు. దీనివల్ల కూడా వాళ్ళు తాము రాసిందే సాహిత్యం అనుకొనే ప్రమాదం ఉంది కదా?
నిజమే. ప్రస్తుతం విమర్శకుల సంఖ్య తగ్గడం వల్ల లేదా మొహమాటాల వల్ల లోతైన విశ్లేషణలు రావడం లేదు. దీనివల్ల యువ రచయితలు తమ లోపాలను సరిదిద్దుకునే అవకాశం కోల్పోతున్నారు. విమర్శ అంటే తిట్టడం కాదు, ఒక రచనలోని గుణదోషాలను నిర్మొహమాటంగా విశ్లేషించడం. యువ కవులు కూడా విమర్శను ఆహ్వానించే సంస్కారాన్ని అలవరుచుకోవాలి. అయితే ‘కవి సంగమం’ వేదికగాను వివిధ పత్రికల్లోనూ వస్తున్న వ్యాసాలను పూర్తిగా ఎవరూ చదవడం లేదు. విమర్శ లేదు, విమర్శకులు లేరు అనే ఒక్క మాటతో కొట్టి పారేయడం భావ్యం కాదు. నా మేరకు నేను ఒక వ్యాసం రాసినప్పుడు కచ్చితంగా అందులో కొన్ని పరిశీలనలు చేస్తాను. కొన్ని సూచనలు కూడా చేస్తాను. లోపాలను కూడా సంస్కారవంతమైన భాషలోనే చెప్తాను.
ఇంటర్వ్యూ : సారిపల్లి నాగరాజు,
బి. మదనమోహన్ రెడ్డి
80083 70326
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..
అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..