Share News

Literary Criticism Without Research: పరిశోధనలేని విమర్శ పునాదిలేని మేడ

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:38 AM

ఇటీవల ‘ప్రమాణాల్లేని నేటి విమర్శ’ (వివిధ: 03–11– 2025) అంటూ సుంకర గోపాలయ్య రాసిన వ్యాసానికి స్పందనగా, నేను రాసిన ‘బహుళ స్వరాల నేటి విమర్శ’ (10–11–2025) వ్యాసంపై, శ్రీరామ్ పుప్పాల...

Literary Criticism Without Research: పరిశోధనలేని విమర్శ పునాదిలేని మేడ

ఇటీవల ‘ప్రమాణాల్లేని నేటి విమర్శ’ (వివిధ: 03–11– 2025) అంటూ సుంకర గోపాలయ్య రాసిన వ్యాసానికి స్పందనగా, నేను రాసిన ‘బహుళ స్వరాల నేటి విమర్శ’ (10–11–2025) వ్యాసంపై, శ్రీరామ్ పుప్పాల ‘పరిశో ధనలు విమర్శ కానేరవు’ (24–11–2025) అంటూ ప్రతిస్పందించారు. శ్రీరామ్ వ్యాసం ఏకపక్ష నిర్ధారణలకే పరిమితమైంది. ముఖ్యంగా, పరిశోధనలు విమర్శగా పరిగణింపబడవని వారు చేసిన నిర్ధారణ, సాహిత్య విద్యార్థులను, పరిశోధకులను గందరగోళంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. పరిశోధన వేరు, విమర్శ వేరు అని సిద్ధాంతీకరించడం పైకి సులువుగానే కనిపిస్తుంది. కానీ, లోతైన పరిశోధన లేకుండా సరైన విమర్శ ఎలా పుడుతుంది? అనేది మౌలికమైన ప్రశ్న. పునాది లేకుండా మేడ కట్టాలనుకోవడం ఎంత అవివేకమో, పరిశోధన లేకుండా విమర్శ చేయాలనుకోవడం కూడా అంతే అశాస్త్రీయం.

ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు రెఫర్ చేసే గ్రంథం ‘థియరీ ఆఫ్ లిటరేచర్’. ఇందులో ప్రముఖ విమర్శకులు Rene Wellek, Austin Warren పరిశోధన, విమర్శల మధ్య విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. మరో ప్రఖ్యాత విమర్శకుడు T.S. Eliot పరిశోధనాత్మక దృష్టికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. I.A. Richards ప్రవేశపెట్టిన ‘ప్రాక్టికల్‌ క్రిటిసిజమ్‌’ (1929) పూర్తిగా ప్రయోగశీలమైన పరిశోధన వంటిదే. ప్రముఖ విమర్శకులు, పరిశోధకులు జి.వి. సుబ్రహ్మణ్యం తన ‘తెలుగు సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం’ గ్రంథంలో ఈ సంబంధాన్ని ఎంతో గొప్పగా విశ్లేషించారు. ‘‘విమర్శ వేదం వంటిదైతే, పరిశోధన వేదాంతమైన ఉపనిషత్తు వంటిది. వేద విజ్ఞానం లేనిది ఉపనిషద్ రహస్యం ఉన్మీలించదు. సాహిత్య పరిశోధనం సాహిత్య సిద్ధాంత దర్శన ప్రతిపాదన రూపంగా ఫలిస్తుంది. దానికి సాధనమైన సాహిత్య విమర్శ దాని సమగ్ర ఫలసిద్ధికి తోడ్పడుతుంది’’ అని అంటారు. ఎస్.వి. రామారావుతో పాటు పరిశోధన ఫలితంగా వెలువడే సిద్ధాంత గ్రంథాలను మన పెద్దలు ‘విమర్శ గ్రంథాలు’ గానే గుర్తించారు. పరిశోధన గ్రంథాలు కేవలం డిగ్రీల కొరకే పరిమితం కావు, అందులో కొన్ని అత్యుత్తమ సాహిత్య విమర్శ గ్రంథాలుగా కూడా గుర్తింపు పొందాయి అనడానికి సాహిత్య అకాడమీ అందించిన పురస్కారాలే ప్రత్యక్ష సాక్ష్యం.


‘సిద్ధాంత అన్వయాలు సిద్ధాంతాలు కావు’ అని శ్రీరామ్‌ తీసిపారేయడం ఆధునిక విమర్శనా రీతులను అర్థం చేసుకోలేకపోవడమే. ‘శుద్ధ సిద్ధాంతం’ (Pure Theory) అనేది రోజుకొకటి పుట్టదు. ‘సిద్ధాంత అన్వయం’ అనేది యాంత్రికమైన ప్రక్రియ కాదు, అది ఒక సృజనాత్మకమైన పరిశోధన. ఒక సిద్ధాంతాన్ని ఒక కొత్త సాహిత్యానికి అన్వయించినప్పుడు, ఆ సిద్ధాంత పరిధి విస్తరిస్తుంది లేదా సవరించబడుతుంది. అదే కొత్త సిద్ధాంత నిర్మాణానికి తొలిమెట్టు. ఉదాహరణకు, జి.వి. సుబ్రహ్మణ్యం ‘వీర రసము’ గ్రంథాన్ని పరిశీలిద్దాం. ఇది ‘సిద్ధాంత అన్వయం’ ఎంతటి సృజనాత్మక పరిశోధనో చెప్పడానికి ఒక గొప్ప తార్కాణం. అలాగే వెల్చేరు నారాయణరావు ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అనేది మార్క్సిస్టు దృక్పథంతో, సామాజిక పరిణామాల నేపథ్యంలో తెలుగు కవిత్వాన్ని విశ్లేషించిన ఒక పరిశోధనా గ్రంథం. ఇది పరిశోధన, విమర్శల కలయికకు ఉత్తమ ఉదాహరణ.

శ్రీరామ్ ‘బహుళత్వాన్ని’ (Multiplicity) నిరాకరిస్తున్నారు. కానీ, వడలి మందేశ్వరరావు తమ ‘విమర్శ: నాటి నుండి నేటికి’ గ్రంథంలో చెప్పినట్లు, ‘‘ఏ వాదానికి చెందిన కవిత అయినా, ఆ వాదపు దృక్పథానికి లోబడే రచన సాగించాలి. ఆ వాదం నిర్ణయించే ప్రమాణాలతోనే ఆ రచన విలువ నిర్ణయింపబడుతుంది’’. అంటే అభ్యుదయ కవిత్వానికి మార్క్సిస్ట్ దృక్పథం, విప్లవ కవిత్వానికి నిబద్ధత ఎలాగైతే ప్రమాణాలుగా మారాయో, ఆధునిక బహుళ ధోరణులకు వాటికి సంబంధించిన కొత్త ప్రమాణాలే శాస్త్రంగా మారుతాయి.

గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతున్నప్పుడు, గొంగళి పురుగు రూపం పోయిందని బాధపడటం ఎంత అసమంజసమో, పాత కాలపు విమర్శ పద్ధతులు మారాయని బాధపడటం అంతే అసమంజసం. ఈ మార్పును ఆహ్వానిద్దాం. పరిశోధనను, శాస్త్రీయ విశ్లేషణను విమర్శ క్రమంలో భాగం చేద్దాం. అప్పుడే తెలుగు సాహిత్య విమర్శ మరింత ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతుంది.

వెంకటరామయ్య గంపా

99586 07789

ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 05 , 2026 | 02:38 AM