సాగును ‘ఉపాధి హామీ’తో అనుసంధానించాలి
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:45 AM
గ్రామీణ భారతదేశానికి రైతు వెన్నెముక అయితే, కూలీ ఆ రైతు శ్రమకు జీవం. ఈ ఇద్దరూ బలంగా ఉంటేనే పల్లె బలంగా ఉంటుంది. దేశంలో ఎక్కువ మంది చిన్న రైతులే. వారికి వ్యవసాయం లాభం ఇవ్వాలంటే...
గ్రామీణ భారతదేశానికి రైతు వెన్నెముక అయితే, కూలీ ఆ రైతు శ్రమకు జీవం. ఈ ఇద్దరూ బలంగా ఉంటేనే పల్లె బలంగా ఉంటుంది. దేశంలో ఎక్కువ మంది చిన్న రైతులే. వారికి వ్యవసాయం లాభం ఇవ్వాలంటే కేవలం విత్తనాలు, ఎరువులు సరిపోవు. కూలీలు కూడా అందుబాటులో ఉండాలి. అయితే పెరుగుతున్న కూలీల ఖర్చుతో, వారి కొరతతో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు, పప్పులు, ఉద్యాన పంటలు.. వంటి ఎక్కువ శ్రమ అవసరమైన రంగాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. మరోవైపు ఉపాధి హామీ పనులు చాలా వరకూ చెరువుల పూడికతీత, మట్టి పనులు, గ్రామీణ నిర్మాణాలు.. వంటి వాటికే ఎక్కువగా పరిమితమవుతున్నాయి. కానీ రైతు పొలానికి ప్రత్యక్షంగా బలం చేకూర్చే విధంగా ఈ వ్యవస్థ పనిచేయడం లేదు. ఫలితంగా రైతు తన పొలంలో పని చేయించుకోవడానికి అధిక వ్యయం భరించాల్సి వస్తోంది.
ఇది కేవలం రైతు సమస్య మాత్రమే కాదు. భవిష్యత్తు ఆహార భద్రతకు సంబంధించిన అంశం కూడా. చిన్న రైతుల పెరటి తోటలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగు, పశుగ్రాసం, భూమి సమతలీకరణ, సేంద్రియ ఎరువుల తయారీ, నీటి సంరక్షణ వంటి పనులకు ఉపాధి హామీని అనుసంధానం చేస్తే రైతుకు కూలీల కొరత సమస్య తగ్గుతుంది. రైతు వైవిధ్య పంటల వైపు తిరిగి అడుగులు వేయగలడు. అదే సమయంలో కూలీలకు కూడా తమ గ్రామంలోనే స్థిరమైన ఉపాధి లభిస్తుంది. పట్టణాలకు వలస తగ్గుతుంది. మహిళలకు, వెనుకబడిన వర్గాలకు మరింత జీవన భద్రత లభిస్తుంది.
ప్రభుత్వాలు తరచూ గ్రామాభివృద్ధి గురించి వల్లెవేస్తుంటాయి. కానీ నిజమైన గ్రామాభివృద్ధి అంటే... రైతు పొలం లాభదాయకం కావడం, కూలీలకు పని దొరకడం, రైతుకు ఖర్చు తగ్గడం, పంట వైవిధ్యం పెరగడం, గ్రామం స్వయం సమృద్ధి సాధించడం. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయడం ద్వారా ఈ అయిదు లక్ష్యాలు ఒకేసారి సాధ్యమవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి.
శ్రీశైలం దూడం
ఈ వార్తలనూ చదవండి:
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్‌లు.. దేశంలో తొలిసారిగా..
విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్