లింగ వివక్ష కాదు, చారిత్రక అవశేషం!
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:08 AM
తెలుగు వ్యాకరణంలో ‘లింగ వివక్ష’ నేటి ఆధునిక ప్రజాస్వామ్య విలువలకు పూర్తి భిన్నమైనదనీ, భాషకు అపకీర్తి మిగిల్చేదిగా ఉన్న ఈ వివక్షను ఇప్పటికైనా రూపుమాపాల్సిన బాధ్యత మనపై ఉందనీ టి. కొండబాబు...
తెలుగు వ్యాకరణంలో ‘లింగ వివక్ష’ నేటి ఆధునిక ప్రజాస్వామ్య విలువలకు పూర్తి భిన్నమైనదనీ, భాషకు అపకీర్తి మిగిల్చేదిగా ఉన్న ఈ వివక్షను ఇప్పటికైనా రూపుమాపాల్సిన బాధ్యత మనపై ఉందనీ టి. కొండబాబు తన వ్యాసం ‘భాషలో అసమానతను ఎలా సరిచేద్దాం?’లో ప్రస్తావించారు (వివిధ: ఏప్రిల్ 13, 2026). తెలుగులో ఆడవారినీ, మనుష్యేతర జీవజాలాన్నీ వస్తుజాలాన్నీ, ‘అది’, ‘ఇది’, ‘ఉంది’, ‘వచ్చింది’ అని ఎందుకు సంబోధిస్తారు? అది ఆడవాళ్ళనూ జంతువులనూ ఒకటే చేసి కించపరిచినట్లు కాదా? అన్నది ఆయన ప్రశ్న. దీనికి సమాధానాన్ని తెలుగూ తదితర ద్రావిడ భాషల చారిత్రిక పరిణామాల ఆధారంగా రాబట్టడానికి ప్రయత్నించాలి.
తెలుగులో ఉన్న సర్వనామ వ్యవస్థ మూలద్రావిడ బాష నుంచి వారసత్వంగా సంక్రమించినదే. ప్రాచీన తెలుగులో కూడా ఏకవచనంలో మనుష్య స్త్రీలనూ మానవేతరులనూ సూచించేందుకు అది/ ఇది, మగవారిని సూచించేందుకు వాడు/ వీడు అని వాడటం సాధారణం. వీటినే ప్రాచీన తెలుగులో వాన్ఱు (వాండు, వాఁడు)/ వీన్ఱు (వీండు, వీఁడు) అని వాడేవారు. స్త్రీ పురుషులలో ఎవరికైనా వాడేందుకు ‘తను/తాను’ ఉండనే ఉంది. ఐతే బహువచనంలో, అంటే ఒకరికంటే ఎక్కువమందిని సూచించేందుకు స్త్రీ పురుషులందరికీ ప్రాచీన తెలుగులో ‘వారు/వీరు’, ఆధునిక తెలుగులో ‘వారు/వాళ్ళు, వీరు/వీళ్ళు’ వాడటం పరిపాటి. ఇక మానవేతర నామాలకు ‘అవి/ఇవి’ వాడటం సాధారణం. అంటే ప్రాచీన తెలుగులోనూ ఆధునిక తెలుగులోనూ సర్వనామాల వాడుకలో, వాటి అన్వయంలో ఎలాంటి మార్పూ లేదన్నమాట. ఇది ఎవరో ఏదో కుట్రజేసి వేల ఏళ్ల నాడే భూ స్వామ్య–పురుషాధిక్యతల వల్ల తెలుగు భాషలో జొప్పించారనడానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఇది స్త్రీల పట్ల వివక్షా కాదు, మూల ద్రావిడంలో లేనిదీ కాదు. మానవ భాషలలో గణితశాస్త్రంలో ఉండేటటువంటి వ్యవస్థ ఉన్నట్లు పైకి కనబడుతున్నా గణిత, భౌతికశాస్త్రాల సూత్రాలవలే అపవాదరహితంగా ఉండవు. ఉదాహరణకు: తిన్నాడు–తినడు, కొట్టాడు–కొట్టడు అయితే, వచ్చాడు–వచ్చడు అవదు, రాడు అవుతుంది. అంటే భాషల్లో అపవాదరహితమైన సూత్రరచన ఉండనే ఉండదు.
ప్రపంచంలోని వివిధ భాషల సర్వనామాలలోనూ పదాల చివరనా కనబడుతున్న లింగవచన విభక్తులూ (ఉదాహరణకు, తెలుగులో అది, వాడు; పెద్ద–ది, పెద్ద–వాడు; హిందీలో లడకీ ఆయీ ‘అమ్మాయి వచ్చింది’, బిల్లీ ఆయీ ‘పిల్లి వచ్చింది’, లడకా ఆయా ‘అబ్బాయి వచ్చాడు’, కుత్తా ఆయా ‘కుక్క వచ్చింది’) మొదలైనవాటిలో లింగవచన ప్రత్యాయాలు వ్యాకరణ ప్రాయమైన పద వర్గాన్ని సూచిస్తున్నాయే గానీ ఆయా పదాల సహజ లింగాన్ని తెలియజేయవు. సంస్కృతంలో ద్రావిడభాషల్లో వలే సహజ లింగ వర్గీకరణ లేదు. ‘‘సంస్కృతంలో మూడు లింగాలూ శాస్త్రీయంగా ఉన్నాయ’’నటం నిజం కాదు, అందులో శాస్త్రీయత ఏమీ లేదు! అవేమీ నామపదాల సహజ లింగాన్ని సూచించటం లేదు. ఉదాహరణకు, సః పురుషః – ‘అతను పురుషుడు’, సః దారా – ‘ఆమె భార్య’, సః వృక్షః – ‘అది చెట్టు’; సా స్త్రీ – ‘ఆమె స్త్రీ’, కానీ, సా నదీ – ‘అది నది’; తత్ కలత్రమ్ – ‘ఆమె భార్య’, తత్ మిత్రమ్ – ‘అతను మిత్రుడు’, తత్ ఫలమ్ – ‘అది పండు’, అంటే, వ్యాకరణంలో లింగ వ్యక్తీకరణలో సంస్కృత సర్వనామాలైన ‘సః’, ‘సా’, ‘తత్’ల అర్థం నామపదాల సహజ లింగాన్ని బట్టి కాక పదనిష్పాదన కోసం పదవర్గీకరణ అవసరాన్ని బట్టి ఉంటుంది.
తెలుగులో ఉన్న సర్వనామ వ్యవస్థే ద్రావిడ భాషలకన్నింటికీ మాతృక అయిన మూలద్రావిడంలో కూడా ఉన్నట్లు శాస్త్రీయపద్ధతులలో చేసిన చారిత్రక పునర్నిర్మాణంతో నిరూపణ జరిగింది. కారణం, దక్షిణ మధ్య ద్రావిడ భాషలలోనూ, మధ్య ద్రావిడ భాషలలోనూ ఉత్తర ద్రావిడ భాషలైన కురుఖ్, మాల్తోలలోనూ తెలుగులో ఉన్నట్లే ప్రథమ పురుష సర్వనామాలు ఉండేవన్నమాట. ఉదా: ‘అది/ ఇది’ మనుష్య స్త్రీలనూ మానవేతరులనూ సూచించేవి. ‘అవన్ఱు/ ఇవన్ఱు’ మగవారిని సూచించేవి. తమిళం, మలయాళం, కన్నడం మొదలైన దక్షిణ ద్రావిడ భాషలలో మాత్రమే, ‘అది/ ఇది’ (అమహద్వాచకాలు) మానవేతర నామాలకూ; ‘అవళ్/ ఇవళ్’ (మహతీ వాచకాలకూ) మనుష్య స్త్రీ నామాలకూ; ‘అవన్/ ఇవన్’ (మహద్వాచకాలకు) పురుష నామాలకూ వాడుతారు. ఈ వాడుక సంస్కృత ప్రభావం వలన ఈ భాషలలోకి వచ్చి వుండవచ్చు.
అత్యంత ప్రాచీన కాలంలో స్త్రీలను ఏకవచనంలో ప్రాకృతిక లేక ప్రకృతి సహజమైన వాటితో కలిపి ఒకే వర్గంగా ఒకే విధమైన సర్వనామాలను వాడటానికి ప్రధాన కారణం స్త్రీలు పునరుత్పత్తి శక్తి కలిగి ఉండటమే. చెట్లూ చేమలూ ఇతర సమస్త జంతుజాలం పునరుత్పత్తి సామర్థ్యం కలిగినవే. మానవ పరిణామ క్రమపు తొలి అడుగులలో, ప్రపంచాన్ని చూసే దృక్పథం నేటి కంటే భిన్నంగా ఉండేది. ఈ క్రమంలో మానవ స్త్రీలనూ ప్రకృతిలోని ఇతర అంశాలను ఒకే వర్గంగా (మహదితర/నాన్–మాస్క్యులైన్) చూడటం వెనుక ఒక లోతైన ప్రజాతుల విస్తరణా వ్యాప్తే ప్రధాన ‘తర్కం’గా ఉండి ఉండవచ్చు.
మానవ పరిణామ దశలో ఉన్న ప్రాచీన మానవ సమూహాలు తమ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏవి జీవాన్ని సృష్టించగలవో ఏవి కాలక్రమాన తమవంటివాటిని పెంపొందించగలవో గమనించాయి. ఈ ఉత్పాదక వర్గంలో మానవ స్త్రీలూ, జంతువులూ, పూలూ పండ్లను ఇచ్చే చెట్లూచేమలూ – ఇవన్నీ తమలాంటి మరో జీవికి జన్మనిచ్చే లేదా గింజల ద్వారా పునరుత్పత్తి చేసే అద్భుత శక్తిని కలిగి ఉన్నాయి. మనం జీవం లేదనుకొనే, పగటిన కంటికి కనపడే నింగీ, రేయిలో నింగిలో తొంగిచూసే చుక్కలూ, వానకు తడిసి పచ్చబారే నేలా, నేలపై పారే నదీ– నీరూ, పూలూ, పండ్లతో నిండే కొండలూ– అడవులూ, అలానే నిప్పూ, గాలీ... ఇవన్నీ కదిలేవీ కాలానుగుణంగా నిరంతరం మార్పుచెందేవి అయి ఉన్నై. అందుకనే వీటన్నింటినీ ఒకే తరగతి కిందికి చేర్చటం. ప్రాచీన కాలంలో పునరుత్పాదక సామర్థ్యాన్ని కలిగివుండడాన్ని ఒక గొప్ప శక్తిగానూ స్త్రీని ప్రకృతిలో శక్తివంతమైనదిగానూ కొలవటం మొద లైంది. అందుకనే స్త్రీనీ ప్రకృతినీ ఒకే సర్వనామంతో సంబోధించటం మొదలై ఉండొచ్చు. ఈనాడు ఉన్నట్లుగా ఆనాడు ప్రాకృతికమైనవి కాక మానవుడు సృష్టించిన పనిముట్లు లేవు, ఉన్నా అవి అతి తక్కువ అనే చెప్పాలి. వాటి ప్రభావమూ తక్కువే. అవి కూడా ప్రాకృతిక మూలాలనుంచీ తయారైనవే. అందుకే స్త్రీకీ, ప్రాకృతిక వనరులకూ ఒకే సర్వనామాన్ని వాడటం. అనుత్పాదక వర్గంగా పురుషుడు, ప్రత్యక్షంగా తన శరీరం నుండి మరో జీవికి జన్మనివ్వలేనిదని అతి ప్రాచీన మానవ సమూహాలకు అవగతమైన విషయమే.
ఈ కోణంలో చూస్తే, స్త్రీలను ప్రకృతితో కలిపి ఒకే భాషా వర్గంలో ఉంచడం అనేది వారిని తక్కువ చేయడం కాదు, సరికదా ప్రకృతిలోని ‘పునరుత్పా దక శక్తి’తో వారికి ఉన్న విడదీయలేని బంధాన్ని గుర్తించడం. ఈ ‘పునరుత్పత్తి–పోషణ’ అనే సారూప్యత కారణంగానే, భాషలో కూడా స్త్రీలూ ప్రకృతి సిద్ధమైన ఇతరాలూ ఒకే శ్రేణిలోకి వచ్చి ఉండవచ్చు.
ఈ విభజనలో ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. అదే మహదితర (నాన్–మాస్క్యులైన్) వర్గం. ఇందులో సమూహ భావన ఎక్కువగా ఉంటుంది. స్త్రీలూ, పిల్లలూ, జంతువులూ ఇతర ప్రాకృతిక వస్తుజాలం ఒక తెగకు ‘మూలాధారం’గా, ఒక సమూహంగా పరిగణించబడేవారు. ఈ ‘పునరుత్పాదక vs అనుత్పాదక’ వివరణ మరింత ప్రాథమికమైనది. బహుశ, భాషా పరిణామం ప్రారంభంలో ఇది ‘సృష్టికర్తలు vs ఇతరులు’ అనే వర్గీకరణగా ఉండి, కాలక్రమేణా సామాజిక మార్పుల వల్ల ‘ఇతరులు (నాన్–మాస్క్యులైన్)’ vs ‘పురుషులు (మాస్క్యులైన్)’ అనే రూపంలోకి మారి ఉండవచ్చు.
ఇంగ్లీషులో, మిస్టర్ (క్లుప్తంగా Mr.) మగమనిషిని సూచించేందుకూ, మిస్ట్రెస్ (క్లుప్తంగా Mrs./Ms.) స్త్రీని సూచించేందుకూ వాడతారు. ఇలాంటివే హోస్టెస్, ఏక్ట్రెస్, గాడెస్, ఎంప్రెస్, ప్రిన్సెస్ మొదలైనవి. ఇవన్నీ పురుషాధిక్యతను సూచించేవే. అయితే స్త్రీని సూచించే సర్వనామం ‘She’ని ఓడలకూ, కారూ, రైలుబండి లాంటి ఇతర వాహనాలకూ, అమూర్తవస్తువులకూ వాడటం ఆంగ్ల మాతృభాషా వ్యవహర్తలకు సర్వసాధారణమే.
ప్రపంచ భాషలతో పోలిస్తే చాలా భాషల్లో లింగ వ్యవస్థే లేదు. అయితే సమాజాలు సంక్లిష్టమౌతున్నకొద్దీ స్పష్టతకోసం లింగ వచన విభక్తుల అవసరం ఏర్పడింది. ప్రపంచంలోని అనేక భాషల్లో ‘పురుష/స్త్రీ’ అనే వ్యాకరణ లింగం అసలు ఉండదు. లింగ వర్గీకరణలు సహజం అనిపించవు. కొన్ని భాషల్లో జంతువులు ‘పురుష’ వర్గంలో ఉంటాయి. మానవేతరాలు ‘స్త్రీ’ వర్గంలో ఉంటాయి. ఇదికాదంటే, పూర్తిగా వేరే ప్రమాణాలపై వర్గీకరణ జరుగుతుంది. అంటే, వ్యాకరణ లింగం అనేది సామాజిక విలువల ప్రతిబింబం కాదు, అది భాషా పరిణామంలో ఒక నిర్మాణాత్మక విధానం.
భాషాశాస్త్రపరంగా తెలుగులోని సర్వనామ వ్యవస్థ చారిత్రకంగా ఏర్పడిన వ్యాకరణ వ్యవస్థలో భాగం. దాన్ని నేరుగా ‘వివక్ష’గా అర్థం చేసుకోవడం సరైన విశ్లేషణ కాదు. సామాజికంగా ప్రస్తుత కాలంలో మనం ఈ వాడుకను విమర్శించాలా లేదా అనేది వేరే ప్రశ్న. సంక్షిప్తంగా తెలుగు భాషలో స్త్రీలూ మానవేతరాలు ఒకే వర్గంలో కనిపించడం అనేది ఉద్దేశపూర్వక సామాజిక అసమానతల సూచకం కాకుండా, చారిత్రకంగా ఏర్పడిన వ్యాకరణ వర్గీకరణ లక్షణం అని చెప్పుకోవాలి.
ఇది, ప్రాచీన మానవ సమూహాలు జీవశాస్త్రపరంగా ప్రకృతి వైవిధ్యాన్ని అర్థం చేసుకున్న తీరుకు అద్దం పడుతుంది. పురుషుడు పునరుత్పాదక ప్రక్రియలో ‘బాహ్య వ్యక్తి’ (ఔట్లైఅర్) కావడం వల్ల, భాషలో ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడగా, పునరుత్పాదనకు మూలమైన మిగిలినవారందరూ ఒకే ‘ఉత్పాదక’ వర్గంగా ఏర్పడి ఉండవచ్చు. ద్రవిడ భాషల్లోని నామపదాల వర్గీకరణలను పరిశీలిస్తే, ఈ ‘పునరుత్పాదక’ సిద్ధాంతం భాషలలో లైంగిక విభజన మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తుంది.
గారపాటి ఉమామహేశ్వరరావు
98661 28846
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
For More AP News And Telugu News