ఏడుపదుల ఎల్‌ఐసీ.. ఎదురులేని ప్రస్థానం!
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:47 AM
దేశీయ పొదుపును ప్రోత్సహించడం, ప్రజల పొదుపునకు భద్రత కల్పించడం, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని సామాజిక బాధ్యతగా అందించడం వంటి లక్ష్యాలతో స్వాతంత్య్రానంతరం ఎల్‌ఐసీ ఏర్పాటైంది. ప్రభుత్వ తరఫున...
దేశీయ పొదుపును ప్రోత్సహించడం, ప్రజల పొదుపునకు భద్రత కల్పించడం, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని సామాజిక బాధ్యతగా అందించడం వంటి లక్ష్యాలతో స్వాతంత్య్రానంతరం ఎల్‌ఐసీ ఏర్పాటైంది. ప్రభుత్వ తరఫున సార్వభౌమ హామీ కల్పిస్తూ, ప్రీమియం రూపంలో ప్రజల పొదుపును సమీకరించడం, ప్రైవేటు వ్యక్తుల మోసాల బారి నుంచి ప్రజల సొమ్మును పరిరక్షించడం ద్వారా ఆర్థిక రంగంలో ఎల్‌ఐసీ ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.
సెప్టెంబర్ 1వ తేదీన 70వ సంస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఇన్సూరెన్స్ దిగ్గజం.. ప్రభుత్వరంగ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ దేశానికే గర్వకారణం. ఎల్‌ఐసీ సంస్థాపక దినోత్సవం సందర్భంగా, దేశ ఆర్థిక రంగంలో ఈ సంస్థ నిర్వహించిన కీలకపాత్రను మననం చేసుకోవడం ముదావహం.
ప్రజల వద్ద నుంచి 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం రూపంలో వసూలు చేసిన మొత్తాలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ పాలసీదారులను మోసం చేస్తున్న నేపథ్యంలో అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను కలిపి భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని నాడు జాతీయం చేశారు. ఏ లక్ష్యాలతో అయితే భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’గా ఏర్పాటు చేశారో... ఆ జాతీయీకరణ లక్ష్యాలను సాధించటంలో ఎల్‌ఐసీ కృతకృత్యమైంది.
సెప్టెంబర్ 1, 1956న పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన ఎల్‌ఐసీ.. గత డెబ్బై ఏళ్లుగా దేశీయ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలుస్తోంది. ఆర్థికరంగ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా ఉంచింది. ఎల్‌ఐసీ మొత్తం పెట్టుబడులలో 82శాతం గవర్నమెంట్ సెక్యూరిటీలుగా, దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్దేశించినవే.
1956లో కేవలం 5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై.. 2011లో ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ’ నియమాల ప్రకారం 100 కోట్లు పెట్టుబడిగా మార్పుచేసుకుంది. ‘ప్రజల సొమ్ము ప్రజల శ్రేయస్సుకే’ అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14.57 లక్షల మంది ఏజెంట్స్‌తో పటిష్ఠమైన మార్కెటింగ్ నెట్‌వర్క్‌తో వివిధ స్థాయిలలో 3,836 ప్రాంతాలకు తన కార్యాలయాలను విస్తరింపజేసింది. 25 కోట్లకు పైగా వ్యక్తిగత పాలసీదారులను, 10 కోట్లకు పైగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీదారులను కలిగి ఉంది.
సెబీ నిబంధనల ప్రకారం, 10 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ కలిగి ఉండాలనే సాకు చూపి, ‘ఆఫర్ ఫర్ సేల్’ (ఓఎఫ్‌ఎస్) పేరుతో, ఎల్‌ఐసీ 1:1 బోనస్ షేర్లను జారీ చేసిన అనంతరం మరొక 6.5శాతం ప్రభుత్వ వాటాను ఉపసంహరించారు. ఈ ఓఎఫ్‌ఎస్ 3.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యి.. 31,552 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. ఎల్‌ఐసీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ప్రభుత్వం అమ్ముకోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది.
ప్రతికూల స్టాక్ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేర్లు, విలువ తగ్గి డిస్కౌంట్‌తో ట్రేడై మదుపరులను నిరుత్సాహపరిచిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇది మొత్తం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌లో భాగంగా జరిగిన పరిణామమైనప్పటికీ ఈ ప్రక్రియ ఎల్‌ఐసీ ప్రతిష్ఠకు భంగం కలిగించింది. ఎల్‌ఐసీ షేరుకు స్టాక్ మార్కెట్‌లో ఉన్న విలువ కన్నా, ఆ సంస్థ అంతర్గత విలువ అనేక రెట్లు అధికమనేది అంగీకరించాల్సిన అంశం. ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 63.7 బిలియన్ డాలర్లుగా నమోదుచేసి, దేశంలోని అత్యధిక క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల జాబితాలో పదో స్థానంలో నిలిచింది.
స్టాక్ మార్కెట్‌లో ఎల్‌ఐసీ షేరు విలువ తీరుకు, వాస్తవ ఎల్‌ఐసీ వ్యాపార పనితీరుకు అంతరం ఉంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోల్చినపుడు ఈ సంస్థ పనితీరు మెరుగ్గా ఉంది. ఎల్‌ఐసీ నిర్మాణశైలి షేర్ విలువ లాభాలకన్నా, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంటుంది.
కేవలం నష్టాలలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ, వాటాల ఉపసంహరణ చేస్తామని పేర్కొనే ప్రభుత్వం, దీనికి భిన్నంగా ప్రతిష్ఠాత్మకమైన ఫార్చూన్–500 కంపెనీల జాబితాలో నిలిచి దేశానికే వన్నెతెచ్చిన ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థ ఎల్‌ఐసీ వాటాలను అమ్ముకుని బడ్జెట్ లోటును పూడ్చుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని పౌర సమాజం హర్షించదు.
2047 నాటికి ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్‌ను అందించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ప్రస్తుత తరుణంలో, ఆదాయ అంతరాలను తగ్గిస్తూ, ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తూ, రాజ్యాంగ పీఠిక ప్రబోధించిన సమానత్వం, సార్వభౌమత్వం అనే కీలక అంశాలే ప్రాతిపదికగా, అద్భుత పనితీరుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన, దేశ ఆర్థిక వ్యవస్థకు అమృత తుల్యమైన ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థను డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రభుత్వ వాటాలను అమ్ముకోవడం ప్రజామోదయోగ్యం కాదు.
జి. కిశోర్‌కుమార్
జాయింట్ సెక్రటరీ, SCZIEF
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి