యుద్ధాల్లో ఓడిపోతున్న గ్రంథాలయాలు!
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:45 AM
యుద్ధాలకు, గ్రంథాలయాలకు మధ్య చరిత్రలో ఒక విషాదకరమైన సంబంధం ఉంది. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అక్కడి సాంస్కృతిక వారసత్వ సంపదతోపాటు జ్ఞాన సంపదపైనా గురి పెడతారు. అందులో భాగంగా...
యుద్ధాలకు, గ్రంథాలయాలకు మధ్య చరిత్రలో ఒక విషాదకరమైన సంబంధం ఉంది. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అక్కడి సాంస్కృతిక వారసత్వ సంపదతోపాటు జ్ఞాన సంపదపైనా గురి పెడతారు. అందులో భాగంగా జ్ఞాన నిలయాలైన గ్రంథాలయాలు దాడికి గురవుతాయి. ఒక సమాజపు సామూహిక జ్ఞాపకాలను, గుర్తింపును, జ్ఞానాన్ని తుడిచిపెట్టేందుకు గ్రంథాలయాలపై దాడి చేయటమన్నది చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది.
గ్రంథాలయాలు ఒక జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర, సాహిత్యం, మేధో సంపత్తి మొదలైనవాటిని పుస్తక రూపంలో భద్రపరుస్తాయి, తరాల మధ్య వారధిగా పనిచేస్తాయి. కాబట్టి వాటిని నాశనం చేయడం ద్వారా ప్రస్తుత పాలనను, భవిష్యత్తు పునర్నిర్మాణాన్ని కూడా బలహీనపరచవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ దాడులు వ్యూహాత్మకంగా జరుగుతాయి. ఉదాహరణకు, సైనిక కమాండ్ లేదా పరిశోధనా కేంద్రాలుగా ఉపయోగపడే విశ్వవిద్యాలయ గ్రంథాలయాలపై దాడులు చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో సాంస్కృతిక వారసత్వాన్ని, సామూహిక గుర్తింపును విచ్ఛిన్నం చేయడానికి దాడులు చేస్తారు.
ప్రాచీన అలెగ్జాండ్రియా గ్రంథాలయం నుండి ఆధునిక కాలం వరకు గ్రంథాలయాల విధ్వంసం అనేది ఒక ఉద్దేశపూర్వక చర్య అని చరిత్ర పదేపదే నిరూపించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు 800లకు పైచిలుకు గ్రంథాలయాలు మట్టిలో కలిసిపోయాయి. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఈ గ్రంథాలయాల్లో దాచిన దాదాపు 200 మిలియన్ల పుస్తక సంపద ఈ దాడుల్లో ధ్వంసమైంది. అలాగే, అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28, 2026న దాడులు ప్రారంభమైనప్పటి నుండి కొన్ని వందల సంఖ్యల్లో గ్రంథాలయాలు కుప్పకూలాయి. ఆ గ్రంథాలయాల్లో కాపాడుతూ వచ్చిన వేల సంవత్సరాల పుస్తక జ్ఞాన సంపద అంతా నాశనమైంది. గ్రంథాలయాల నష్టంపై సమగ్ర నివేదికలు ఇంకా వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఉన్న నివేదికల ప్రకారం విస్తృతమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఎక్కువగా నష్టపోయాయి.
మన దేశ చరిత్రలో జరిగిన యుద్ధాలలోనూ వెలకట్టలేని విజ్ఞా సంపదకు నిలయాలైన గ్రంథాలయాలు ఎన్నో ధ్వంసమయ్యాయి. ఉదాహరణకు 1193 సీఈలో బఖ్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయంపై దాడి చేసినప్పుడు దాదాపు 90లక్షల తాళపత్ర గ్రంథాలు ఉన్న ఈ గ్రంథాలయం నెలల తరబడి కాలిందని చరిత్ర చెబుతున్నది. మధ్యయుగ దండయాత్రల సమయంలో భారతదేశం అంతటా అనేక గ్రంథాలయాలు, తాళపత్రాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల వల్ల హిందూ, బౌద్ధ, ప్రాచీన భారతీయ జ్ఞాన వ్యవస్థల అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగింది.
గ్రంథాలయం అంతరించడం అంటే కేవలం ఒక భవనం కూలిపోవడం కాదు; అది ఒక నాగరికత తాలూకు సామూహిక జ్ఞాపకశక్తి సగంలో తెగిపోవడం. ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలీకరణ ద్వారా ఎప్పటికప్పుడు మనకున్న జ్ఞాన సంపదను డిజిటల్ డేటాగా మార్చి సురక్షితంగా నిక్షిప్తం చేయడం ద్వారా విలువైన జ్ఞాన సంపదను యుద్ధకాలపు విపత్కర పరిస్థితుల నుండి కాపాడవచ్చు. రేపు పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై జరగాల్సిన చర్చను ప్రభుత్వాలు మరోమారు గుర్తు చేసుకోవాలి.
డా. ఎన్.పి. రవికుమార్
లైబ్రేరియన్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఇవి కూడా చదవండి..
అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం
విజిల్ రెవల్యూషన్‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ