Share News

పర్యావరణవేత్త, వన్యప్రాణి ప్రేమికుడు

ABN , Publish Date - May 09 , 2026 | 01:25 AM

ప్రముఖ పర్యావరణవేత్త, వన్యప్రాణుల డాక్యుమెంటరీల అగ్రగామి, సర్ డేవిడ్ అటెన్ బరో నూరవ పుట్టినరోజు పూర్తి చేసుకుని 101లోకి ప్రవేశించారు. తన జీవితమంతా వన్యప్రాణుల సంక్షేమానికి, వాటి...

పర్యావరణవేత్త, వన్యప్రాణి ప్రేమికుడు

ప్రముఖ పర్యావరణవేత్త, వన్యప్రాణుల డాక్యుమెంటరీల అగ్రగామి, సర్ డేవిడ్ అటెన్ బరో నూరవ పుట్టినరోజు పూర్తి చేసుకుని 101లోకి ప్రవేశించారు. తన జీవితమంతా వన్యప్రాణుల సంక్షేమానికి, వాటి మనుగడకు అంకితం చేసిన డేవిడ్ ప్రపంచవ్యాప్త పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణుల సంరక్షకులకు సుపరిచితులు. 1952లో ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌లో జంతువులు, ఖనిజాలు, వృక్షాలకు సంబంధించిన క్విజ్‌ల నిర్వాహకుడిగా చేరారు. ప్రకృతి శాస్త్రంలో పట్టభద్రుడైన డేవిడ్‌కి సహజంగా ప్రకృతి పట్ల, వన్యప్రాణుల జీవితాల పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో ఆయన బీబీసీలో అంచెలంచెలుగా ఎదిగి వన్యప్రాణుల డాక్యుమెంటరీల రూపకర్తగా స్థిరపడ్డారు.

1954లో ఆయన రూపొందించిన మొదటి వన్య జీవన డాక్యుమెంటరీ ‘ది జూ క్వెస్ట్’కి ఆయనే హోస్ట్, స్క్రిప్ట్ రైటర్‌గా వ్యవహరించారు. వన్యప్రాణుల జీవితాలను లోతుగా అధ్యయనం చేసిన అతి కొద్ది మంది పర్యావరణవేత్తల్లో ఆయన ఒకరు. ఆఫ్రికా ఖండంలోని జీవ వైవిధ్యం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఖండాల్లోని అరుదైన ప్రాణులు, సహారా, గోబీ వంటి నిర్జన ఎడారుల్లోని వన్యప్రాణులు, అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహా సముద్రాలలోని జలచరాలు, వేల కిలోమీటర్ల దూరం వలసలు పోయే పక్షులు మొదలైన జీవుల జీవితాలను డాక్యుమెంటరీలుగా రూపొందించిన ఘనత ఆయనదే. ఆయన డాక్యుమెంటరీలు కేవలం వన్య విజ్ఞానానికి మాత్రమే పరిమితం కాలేదు. భూమి పరిణామ క్రమం, జీవ పరిణాక్రమం, పర్యావరణ అసమతుల్యత, వాటి వల్ల ఏర్పడుతున్న సమస్యలు, జనాభా విస్ఫోటనం, అడవుల క్షీణత, క్షీణిస్తున్న ధృవపు మంచు వంటి సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన ఎన్నో డాక్యుమెంటరీలు రూపొందించారు.

వన్యప్రాణులు, పర్యావరణ సంబంధిత డాక్యుమెంటరీల రూపకల్పన కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయన తన బృందంతో ఎన్నో సాహస యాత్రలు చేసారు. కొన్ని అరుదైన సంఘటనల చిత్రీకరణ కోసం వారు రోజుల తరబడి నిరీక్షించిన సందర్భాలున్నాయి. ఎన్నోసార్లు ప్రమాదం అంచుల దాకా వెళ్ళి వచ్చారు. ఆయన స్ఫూర్తితో చాలా మంది వన్యప్రాణుల డాక్యుమెంటరీల రూపకర్తలుగా మారారు. ఈ డాక్యుమెంటరీలు జంతు విజ్ఞాన చరిత్రలో మైలురాళ్ళుగా మారాయి. జంతు ప్రపంచం గురించి మానవుల ఊహాలను ఈ డాక్యుమెంటరీలు సమూలంగా మార్చేసాయి. భూమి మనుగడకు వన్యప్రాణుల ఉనికి ఎంత ముఖ్యమో అవి వివరించాయి.


జంతువుల ప్రవర్తన, వాటి మనుగడ వెనుక దాగిన ఆసక్తికరమైన అంశాలను వివరించడంలో ఆయనకు సాటి మరెవరూ లేరు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, డిస్కవరీ చానెల్, సోనీ, బీబీసీ ఎర్త్ వంటి ఇన్ఫో ఎంటర్‌టెయిన్‌మెంట్‌ చానెల్స్‌లో ఆయన రూపొందించిన డాక్యుమెంటరీలు తరచుగా ప్రసారమవుతాయి. ఆయన రూపొందించిన ‘‘ది లైఫ్ కలెక్షన్’’, ‘‘నేచురల్ వరల్డ్’’, ‘‘వైల్డ్ లైఫ్ ఆన్ వన్’’, ‘‘ప్లానెట్ ఎర్త్’’, ‘‘ది బ్లూ ప్లానెట్’’, ‘‘నేచర్స్ గ్రేట్ ఈవెంట్స్’’, ‘‘ఫ్రోజెన్ ప్లానెట్’’ వంటి డాక్యుమెంటరీలు ప్రపంచవ్యాప్త టెలివిజన్లలో ప్రసారమై కోట్లాది ప్రేక్షకులు, శాస్త్రవేత్తల ప్రశంసలందుకున్నాయి. పర్యావరణవేత్తగా, వన్యప్రాణుల పరిరక్షణ ప్రవక్తకుడిగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆయన సుపరిచితులు. ఆయన చేసిన కృషికి గాను ఎన్నో అవార్డులనందుకున్నారు.

మానవుల మనుగడ కోసం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పర్యావరణ విధ్వంసం, వనరుల దోపిడి, వన్యజీవుల అంతర్థానం వంటి పలు అంశాలపై ఎన్నో వేదికలపై తన గళం వినిపించారు. తన డాక్యుమెంటరీల ద్వారా ప్రజలను, ప్రభుత్వాలను చైతన్యపరిచే పనిని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. నూరేళ్ళ వయసు వచ్చినా ఈనాటికి చురుకుగా పనిచేస్తూ సమాజ శ్రేయస్సు కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న అటెన్‌బరో కృషిని ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పర్యావరణం పట్ల, వన్యప్రాణుల పట్ల ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది.

వేలూర్ శ్రీనివాస వేంకటేశన్

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 01:25 AM