Share News

లెబనాన్‌ పశ్చిమాసియా శత్రుత్వాల సమిధ

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:38 AM

కొన్ని దేశాలు నిజంగా దురదృష్టకరమైనవి. భౌగోళిక స్థానం, జాతుల సమ్మేళన సమాజం లేదా వ్యూహాత్మక వనరుల దృష్ట్యా అవి భౌగోళిక రాజకీయ విరోధాలు, పరోక్ష యుద్ధాలకు నెలవులై దుర్విధి పాలవుతున్నాయి. బలహీన...

లెబనాన్‌ పశ్చిమాసియా శత్రుత్వాల సమిధ

కొన్ని దేశాలు నిజంగా దురదృష్టకరమైనవి. భౌగోళిక స్థానం, జాతుల సమ్మేళన సమాజం లేదా వ్యూహాత్మక వనరుల దృష్ట్యా అవి భౌగోళిక రాజకీయ విరోధాలు, పరోక్ష యుద్ధాలకు నెలవులై దుర్విధి పాలవుతున్నాయి. బలహీన రాజ్య వ్యవస్థ, రాజ్యంలో రాజ్యంగా పని చేస్తూ తరచూ విదేశీ ప్రభుత్వాల ఆర్థిక, ఆయుధ అండదండలతో కొనసాగుతున్న శక్తిమంతమైన మిలీషియాలు, పదే పదే విదేశీ సైనిక జోక్యాలతో అతలాకుతలం కావడం ఈ దురదృష్టకర దేశాల నిరంతర చరిత్ర.

అటువంటి దౌర్భాగ్య, విషాదకర చరిత్రకు ఒక ప్రామాణిక ఉదాహరణగా నిలిచే దేశం అప్ఘానిస్థాన్‌. 19వ శతాబ్ది గ్రేట్‌ గేమ్‌, 20వ శతాబ్ది ప్రచ్ఛన్న యుద్ధం, 21వ శతాబ్ది సెప్టెంబర్‌ 11 ఉగ్రవాద దాడుల అనంతరం విదేశీ సైనిక జోక్యాలు అఫ్ఘాన్‌ చరిత్రను రక్తసిక్తం చేశాయి. ద్వితీయ కాంగో యుద్ధం ఆఫ్రికా ప్రపంచ యుద్ధంగా సుప్రసిద్ధమయింది. సిరియన్‌ అంతర్యుద్ధంలో అనేక దేశాల ప్రమేయం ఉన్నది. అమెరికా, రష్యా, ఇరాన్‌, తుర్కియేలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఆ పశ్చిమాసియా దేశ ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయి. ప్రాంతాలు వేరు కావచ్చు, వాటి దురదృష్ట గాథల తీరూ తెన్నూ ఒకటే: స్థానిక సంఘర్షణలను ప్రోత్సహించడం, సొంత ప్రయోజనాలకు వాటిని ఉపయోగించుకోవడం, అగ్రరాజ్యాల లక్ష్యాలకు అనుగుణంగా ఆ ఘర్షణలు సుదీర్ఘంగా కొనసాగేలా చేయడం.

ఇలాంటి దురదృష్టకర చరిత్ర ఉన్న దేశాల జాబితాలో లెబనాన్‌కు ఒక శాశ్వత స్థానం ఉన్నది. చాలా ఇటీవల తన పొరుగు దేశం సైనిక దాడులకు గురైన, ఇంకా వాటిని చవి చూస్తూనే ఉన్న దేశమది. ఆ పొరుగు దేశం ఇజ్రాయెల్‌. గత యాభై సంవత్సరాలలో ఈ దేశం లెబనాన్‌ను ఆక్రమించుకోవడం లేదా తీవ్ర విధ్వంసానికి గురిచేయడం ఇది అక్షరాలా ఏడవసారి. అమెరికా–ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సైనిక దాడులు కొనసాగాయి. వాటిని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశాడు. ఇరాన్ అండదండలు అన్ని విధాలా ఉన్న మిలిటెంట్‌ గ్రూప్‌ హెజ్బొల్లాను లెబనాన్‌ నుంచి పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఈ దాడులకు పూనుకున్నది. ఇజ్రాయెల్‌ దురాగతానికి 2000 మందికి పైగా లెబనీస్‌ ప్రజలు మరణించారు. పది లక్షల మందికి పైగా పూర్తిగా నిరాశ్రయులయ్యారు.

లెబనాన్‌ దురదృష్టం అంతులేనిది. మానవతనే అది పరిహసిస్తోంది. పశ్చిమాసియాలోని కొద్ది ప్రజాస్వామ్య సమాజాలలో అది ప్రముఖమైనది. ఇతర దేశాల యుద్ధాలకు పదే పదే నెలవు అవుతున్న విషాద భూమి. తాను కారణం కాని ఆ ఘర్షణలు ఒక నిర్ణయాత్మక ముగింపునకు రావడం అరుదు; ఘర్షణలు ఆగుతాయి– తాత్కాలికంగా; మిలీషియాలు యథావిధిగా సాయుధ బలోపేతమవుతాయి; రాజ్య వ్యవస్థ బలహీనమవుతుంది. ఘర్షణలను నిలిపివేస్తారు కానీ పరిష్కరించరు. ఈ ఎడతెగని వాస్తవాలు లెబనాన్‌ విషాదాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి.


ఒట్టోమన్‌ సామ్రాజ్య శిథిలాల నుంచి 1920లో లెబనాన్‌ ప్రభవించింది. శతాబ్దానికి పైగా మనుగడలో ఆ గడ్డపై శాంతి వర్ధిల్లిన కాలం చాలా అరుదు. లెబనాన్‌ చరిత్రలో శాంతి సౌభాగ్యాలు ఏమాత్రమన్నా వర్ధిల్లడమనేది 1950లు, 1960ల్లో మాత్రమే జరిగింది. ఆ దశాబ్దాలకు ముందు, తరువాత ఈ దురదృష్టకర దేశం యుద్ధం, అంతర్యుద్ధం, ‘యుద్ధమూ లేని, శాంతీలేని’ అల్లకల్లోల పరిస్థితుల మధ్య అల్లాడిపోతూనే ఉంది. నిరంతర అస్థిరత పెట్టుబడులను నిరోధించింది, విదేశీ సహాయాన్ని ఎంతకూ అరకొరగా ఉంచివేసింది. ఫలితంగా రుణ భారం భరించలేని రీతికి పెరిగిపోయింది.

1982 లెబనాన్‌ యుద్ధం అనంతరం హెజ్బొల్లా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు నిరవధికంగా రగిలిస్తున్న సంక్షోభం ఇజ్రాయెల్ తాజా విధ్వంసక దాడులతో మరింతగా విషమించింది. లెబనాన్‌ దక్షిణ ప్రాంతాల నుంచి పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌ఓ)ను గెంటివేసేందుకు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్నది. 1982కు పూర్వం కూడా ఇజ్రాయెల్‌–పాలస్తీనియన్‌ ఘర్షణల కారణంగానే కాకుండా విస్తృత అరబ్‌–ఇజ్రాయెలీ విరోధాల వల్ల కూడా లెబనాన్‌ పరోక్ష యుద్ధాలకు నెలవుగా నలిగిపోయింది. పాలస్తీనా విమోచన సంస్థకు మద్దతునిచ్చిన సిరియా, లెబనాన్‌లో రాజ్యంలో రాజ్యంగా పీఎల్‌ఓ సువ్యవస్థితమయ్యేందుకు అన్ని విధాలా తోడ్పడింది. అరబ్‌ దేశాల మధ్య శత్రుత్వాల కారణంగా సద్దాం హుస్సేన్‌ నేతృత్వంలోని ఇరాక్‌, హఫేజ్‌ అల్‌– అస్సద్‌ నేతృత్వంలోని సిరియా పరస్పరం పొసగని మిలీషీయాలకు పోటీపడి మద్దతునివ్వడంతో లెబనాన్‌లో పరిస్థితులు రావణకాష్ఠంలా పరిణమించాయి.

లెబనాన్‌లో ఈ ఎడతెగని సంక్షోభానికి ఒక కారణం ఆ దేశంలోని సంక్లిష్ట సామాజిక వ్యవస్థే అని చెప్పవచ్చు. లెబనాన్‌ సమాజంలో కేథలిక్కులు అయిన మారోనైట్లతో పాటు క్రైస్తవ మతంలోని అన్ని శాఖల వారూ ఉన్నారు. వారితో పాటు సున్నీలు, షియాలు, పాలస్తీనియన్లు ఇంకా డ్రూజ్‌లు ఉన్నారు. అధికారానికి, ఇతర ప్రయోజనాలు సాధించుకోవడానికి ఈ మత బృందాల మధ్య పోటీ, పోరాటాలే 1975 నుంచి 1990దాకా సాగిన అంతర్యుద్ధానికి దారితీశాయి. బాహ్య జోక్యాలు ఈ సామాజిక చీలికలను సృష్టించనప్పటికీ వాటిని మరింత తీవ్రతరం చేశాయి. ‘సిరియాలోని లౌకికవాద బాతిస్ట్‌ ప్రభుత్వం హెజ్బొల్లాను ఒక బలమైన శక్తిగా ప్రభవింపజేయడంలో ఇరాన్‌కు తోడ్పడింది... లెబనాన్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న రాజకీయపక్షం మారోనైట్‌ క్రైస్తవుల నాయకత్వంలోనిది. అది 1930ల్లో జర్మన్‌ నాజీలు, ఇటాలియన్‌ ఫాసిస్ట్‌ల స్ఫూర్తితో ఏర్పడిన పార్టీ’ అని లెబనీస్ వ్యవహారాల అధ్యయనవేత్త ఒకరు పేర్కొన్నారు.


1982–2000 సంవత్సరాల మధ్య దక్షిణ లెబనాన్‌లో చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇజ్రాయెల్‌కు ప్రధాన విరోధిగా హెజ్బొల్లా ఆవిర్భవించింది. 2000 సంవత్సరంలో దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ ఉపసంహరణ హెజ్బొల్లా విజయంగా అందరూ భావించారు. 2006 లెబనాన్‌ యుద్ధం తరువాత హెజ్బొల్లా ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌లో మహా శక్తిమంతమైన సాయుధ బృందంగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన సాయుధ ప్రభుత్వేతర శక్తులలో ఒకటిగా పేరు పొందింది. తదాది ఇరాన్‌ ‘ఫార్వర్డ్‌ డిఫెన్స్‌’ (దేశం లోపల నుంచి రక్షించుకోవడానికి బదులుగా, సరిహద్దుల ఆవల నుంచి శత్రుదాడులను ఎదుర్కొనే సైనిక లేదా సైబర్‌ సెక్యూరిటీ వ్యూహం)లో ఒక ప్రధాన భాగంగా ఉంటోంది.

లెబనీస్‌ రాజ్యవ్యవస్థను హెజ్బొల్లా ఒక క్రమ పద్ధతిలో బలహీనపరిచింది. కొనసాగుతున్న ఘర్షణల నుంచి బాగా లబ్ధి పొందింది. ఒక ప్రతిఘటన శక్తిగా పటిష్ఠమయింది. ఒక విదేశీ ప్రభుత్వ మద్దతు ఉన్న, దేశాన్ని అస్థిరపరిచే శక్తిగా హెజ్బొల్లాను చాలా మంది లెబనీస్‌ ప్రజలు భావిస్తున్నట్టు ఇటీవల ఒక సర్వేలో వెల్లడయింది. రాజ్యంలో రాజ్యంగా సువ్యవస్థితమైన హెజ్బొల్లాను లెబనీస్‌ ప్రభుత్వం నిరాయుధీకరించలేకపోతోంది.

ఇజ్రాయెల్‌ ఎదుర్కొంటున్న ప్రభుత్వేతర శత్రువు (నాన్‌–స్టేట్‌ ఎనిమీ)లలో మహాశక్తిమంతమైనది హెజ్బొల్లా. అయితే హెజ్బొల్లాపై యుద్ధం నెపంతో లెబనాన్‌ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘించడం ఎంత మాత్రం సమర్థనీయంకాదు. అందునా లెబనాన్‌లో లిటాని నది వరకు ఉన్న ప్రాంతాలను ఇజ్రాయెల్‌లో కలిపేసుకోవాలని అతి మితవాది అయిన ఇజ్రాయెల్‌ ఆర్థిక మంత్రి బెజాలెల్‌ స్మోట్రిష్‌ ప్రతిపాదిస్తున్న తరుణంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను అంతర్జాతీయ సమాజం ఏ మాత్రం ఉపేక్షించకూడదు. ‘హెజ్బొల్లా నుంచి లెబనాన్‌ను విముక్తం చేసేందుకే ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌ అంటోంది. అయితే విమోచనకారుడూ ఆక్రమణదారు అయినప్పుడు అది విముక్తి ఎలా అవుతుంది?’ అని లెబనీస్‌ జర్నలిస్ట్‌ నిదా బక్రి ప్రశ్నించారు.

ఒక పక్క తమను రక్షిస్తామని చెప్పే హెజ్బొల్లాకు, మరోపక్క కష్టనష్టాలు అన్నిటినీ తామే భరించవలసివస్తోన్న నిరంతర ఘర్షణ మధ్య లెబనీస్‌ ప్రజలు చిక్కుకున్నారు. వారికిది ఎడతెగని విపత్కర పరిస్థితి. 1983 తరువాత ప్రప్రథమంగా లెబనాన్‌– ఇజ్రాయెల్‌ ప్రతినిధుల మధ్య వాషింగ్టన్‌లో అమెరికా మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన శాంతి చర్చల పట్ల చాలామందిలో ఆశాభావం మినుకు మినుకుమంటోంది. అయితే అంతిమంగా అదే విపత్కర పరిస్థితి వారిని వెన్నాడేందుకు అవకాశమున్నది. తమ శత్రువులను, సాపేక్షంగా తక్కువ వ్యయప్రయాసలు, కష్టనష్టాలతో బలహీనపరిచేందుకు పరోక్ష యుద్ధమే సరైన వ్యూహంగా జోక్యం చేసుకునే బాహ్యశక్తులకు కనిపిస్తున్నంతవరకు విపత్కర పరిస్థితులు విషమిస్తాయేగానీ సమసిపోవు. పరోక్ష యుద్ధం కష్టనష్టాలను భరించేది నిరాయుధ స్త్రీ పురుషులు, పాపం పుణ్యం ఎరుగని బాలలు కావడమే అసలు విషాదం.

సప్తర్షి బసాక్‌

(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Updated Date - Apr 18 , 2026 | 03:38 AM