నక్సలిజాన్ని కాదు సమస్యల్ని నిర్మూలించాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:10 AM
తెలంగాణలో అధికారం చేపడితే భూమిలేని దళితులకు, పేదలకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మారాయి. 2021 నవంబర్, 21న....
తెలంగాణలో అధికారం చేపడితే భూమిలేని దళితులకు, పేదలకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వాల మాటలు నీటి మూటలుగా మారాయి. 2021 నవంబర్, 21న రాష్ట్ర ప్రభుత్వం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో దాదాపు 11.5 లక్షల ఎకరాల పోడు భూముల్ని దున్నుకుంటున్న ఆదివాసులకు పట్టాలివ్వాలని నిర్ణయించినా, కేవలం 1.5 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చింది. ఈ ప్రధాన సమస్య గురించి ఎవరూ పోరాటాలు చేయడం లేదు. కనీసం మాట్లాడడం లేదు. రాష్ట్రంలో పేదలకు పంచడానికి భూముల్లేవని గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం కూడా ప్రకటించాయి. పైగా పట్టాలున్న భూముల్లో కూడా అక్కడక్కడా ఆదివాసులను వ్యవసాయం చేసుకోనివ్వడం లేదు. వ్యవసాయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలైన సాగునీరు, విద్యుత్, నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, పురుగుమందులు లేవు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం, కూలీలు కనీస జీవన ప్రమాణాలకు కూడా నోచుకోవడం లేదు.
ఇప్పటికే దేశంలోని 7,933 పట్టణాల్లో, నాలుగు వేల నగరాల్లో 26 కోట్ల అసంఘటిత కార్మికులు రెక్కలు, ముక్కలు చేసుకుని 9–12 గంటలు పనిచేస్తూ, కడు పేదరికంలో మగ్గుతున్నారు. కనీస వేతనాల మార్గదర్శకాలను సుప్రీంకోర్టు 1991లో ‘‘రాప్టకస్ బ్రేట్టి కంపెనీ మేనేజ్‌మెంట్’’ కేసులో సమర్ధించింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారుల, బహుళజాతి సంస్థల, వ్యాపారస్తుల ప్రయోజనాలకు లోబడి కార్మికుల కనీస వేతనాలను దశాబ్దాల తరబడి పెంచడం లేదు. తెలంగాణలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 9,37,455 సంస్థలలో పనిచేస్తున్న 1,11,56,204 కార్మికులకు గత 14 ఏళ్లుగా కనీస వేతనాలు పెంచడం లేదు. ఇంత ముఖ్య విషయం పట్ల ప్రతిపక్ష, వామపక్ష, ప్రగతిశీల, విప్లవ పార్టీలు, వాటి కార్మిక సంఘాలు కనీసం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర హైకోర్టు 2023లో పెంచిన వేతనాలు అమలు చేయాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు.
ఈ తరుణంలోనే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుగా కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక సంక్షేమ చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో ‘నాలుగు లేబర్ కోడ్‌లు’ తెచ్చింది. ఫలితంగా దేశంలోని కోట్లాది కార్మికుల జీవన ప్రమాణాలు తగ్గుతూ, పనిగంటలు పెరిగిపోతున్నాయి. ఈ నాలుగు లేబర్ కోడ్‌లు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని సంక్షేమ స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీశాయి. నేటికీ దేశంలో 68శాతం పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. గడచిన ఏడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వాలు దేశంలో భూమిలేని 20 కోట్ల రైతులు, రైతుకూలీలకు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో నిర్దేశించిన ప్రకారం భూమిని పంచలేదు.
నేడు రైతుల వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, పరిశ్రమల భూములుగా మార్చి, దేశీయ బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు కారుచౌకగా అప్పచెబుతున్న ప్రభుత్వాల విధానాల వల్ల దేశంలోని రైతాంగం పరిస్థితి దుర్భరంగా మారింది. 1967లో తాము దున్నుకుంటున్న భూమి, తమకే దక్కాలనే నినాదంతో ఆదివాసీ తెగలు పశ్చిమ బెంగాల్‌లో చేసిన ‘వసంత మేఘ గర్జన’ పోరాటం 2005 నాటికే దేశమంతా పాకింది. ఆ పోరాటం దేశంలో వ్యవసాయక విప్లవం ఇరుసుగా, ‘‘దున్నేవానికి భూమి దక్కాలనే’’ దృఢ సంకల్పంతో నిలబడిన నక్సలిజాన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక సమస్యగా పరిగణించి భూమిని పంచాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యతను మరిచాయి. కోట్లాది కార్మికుల శ్రమ విముక్తి చేసేందుకు కాలపరిమితి గల పథకాలను అమలుచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది.
నక్సల్ సమస్య ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యే తప్ప, శాంతిభద్రతల సమస్య ఎంతమాత్రం కాదు. కానీ, భారత ప్రభుత్వం దానిని శాంతిభద్రతల సమస్యగా పరిగణించి, 2023 నుంచి ‘కగార్’ పేరుతో నక్సలిజాన్ని తుదముట్టించే ప్రయత్నం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం, అప్రజాస్వామికం. దేశంలో పేదరికం, నిరుద్యోగం, సామాజిక, లింగ వివక్ష, శ్రమ దోపిడీ వంటివి ఉన్నంత వరకు నక్సల్స్ సమస్య ఉంటుంది. భారత ప్రభుత్వం మార్చి 31, 2026 నాటికి నిర్మూలించాల్సింది నక్సలిజాన్ని కాదు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను. ఆ నిర్మూలనకు పునాదిగా ఉన్న ‘భూమి పంపకం’ జరగాలి. దున్నేవానికే భూమి దక్కాలి. అప్పుడే ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యానికి అర్థముంటుంది.
చిక్కుడు ప్రభాకర్
కన్వీనర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News