అధ్యాపకత్వం ఆయనకు జీవితసర్వస్వం
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:52 AM
చాలామందికి అధ్యాపక వృత్తి బతుకుదెరువు అయితే కొంపల్లి వేంకట కోటిలింగం (కె.వి.కె) మాస్టారుకి అధ్యాపకత్వం జీవితసర్వస్వం. బోధన వారి పంచప్రాణాలు. 1936, అక్టోబర్ 27న ప్రకాశం జిల్లా, కొత్తపట్నం సమీపంలోని...
చాలామందికి అధ్యాపక వృత్తి బతుకుదెరువు అయితే కొంపల్లి వేంకట కోటిలింగం (కె.వి.కె) మాస్టారుకి అధ్యాపకత్వం జీవితసర్వస్వం. బోధన వారి పంచప్రాణాలు. 1936, అక్టోబర్ 27న ప్రకాశం జిల్లా, కొత్తపట్నం సమీపంలోని ఆకుల అల్లూరు గ్రామంలో జ్వాలయారాధ్యులు, సీతారామమ్మ దంపతులకు ప్రథమ పుత్రునిగా కోటిలింగం జన్మించారు. వీరి ప్రారంభ విద్యాభ్యాసం ఆకుల అల్లూరు ప్రాథమిక పాఠశాలలోను, ఒంగోలు మున్సిపల్ హైస్కూల్‌లోనూ సాగింది. ఆ తరువాత ఇంటర్మీడియట్ విద్య గుంటూరు హిందూ కళాశాలలోనూ, బి.ఏ కావలి కళాశాలలోనూ, ఎం.ఏ పొలిటికల్ సైన్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణంలోనూ, ఎం.ఫిల్ కోర్సు ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలోనూ సాగింది.
కావలి కాలేజీలో చదివేటప్పుడు... కళాశాల చరిత్రలోనే ప్రప్రథమంగా తెలుగు మాధ్యమంలో ఫస్ట్‌క్లాస్ డిగ్రీ సంపాదించి బంగారు పతకం, రోల్ ఆఫ్ ఆనర్ సాధించటమేగాక, బెస్ట్ స్టూడెంట్ అవార్డునూ అందుకున్నారు. విద్యార్థిగా వీరి ప్రతిభను గుర్తించి యాజమాన్యం జవహర్ భారతి రజతోత్సవ వేడుకలలో తామ్రపత్రాన్ని బహూకరించారు. 1960లో ఎం.ఏ పొలిటికల్ సైన్స్‌లోనూ ఫస్ట్‌క్లాస్ సాధించి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. ఆ సందర్భంగా వంగల వనలతాదేవి మెమోరియల్ ప్రైజ్ కింద బంగారు పతకాన్ని నాటి ఉపకులపతి వి.యస్ కృష్ణ బహూకరించారు. ఎం.ఏ ఫలితాలు విడుదలయిన వెంటనే విశ్వోదయ వ్యవస్థాపకులు డా.॥ దొడ్ల రామచంద్రారెడ్డి (డి.ఆర్.) విన్నపం మేరకు కావలి కళాశాలలో రాజనీతిశాస్త్ర అధ్యాపకులుగా చేరారు.
కె.వి.కె మాస్టారు విద్యార్థుల స్థాయికి దిగివచ్చి బోధించేవారు. వారి బోధన విద్యార్థులకు ఆనందాన్ని కలిగిస్తూ, ఆలోచనలను రేకెత్తించేదిగా ఉండేది. ఆయన క్లాస్ రూంలో కేవలం పాఠాలు మాత్రమే చెప్పలేదు. సమాజం, మనుషుల మధ్య సంబంధాలు, వాళ్ల బలాలు బలహీనతలు, వాళ్ల సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, వాటి వెనుక ఉన్న కారణాల గురించి చెప్పేవారు. సమాజాన్ని ప్రభావితం చేసే వివిధ సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాలు, భిన్న తత్వవేత్తలు, విభిన్న రచయితలు, భిన్న భావాల గురించి... ఇలా ఎన్నో, ఎన్నెన్నో విషయాలు అరటిపండు ఒలిచిపెట్టినట్లు విశదీకరించి చెప్పేవారు. వేలమంది విద్యార్థుల ఆప్యాయతలకు, ఎంతోమంది సహచరుల ప్రేమాభిమానాలకు వీడ్కోలు పలుకుతూ, రాజనీతిశాస్త్ర పాఠ్యపుస్తకాలను ఒక్కసారి గుండెకు హత్తుకొని 1994 అక్టోబర్ 31న ఉద్యోగవిరమణ చేశారు.
కె.వి.కె మాస్టారు జీవితాన్ని, మనుషుల్ని గొప్పగా ప్రేమించారు. కలం బలం తెలియనివారే కత్తుల కోసం వెతుకుతారు అని హితబోధ చేసేవారు. మానవీయగుణాలతో స్పందించే మనుషులంటే ఆయనకు ఎనలేని మక్కువ. అందుకేనేమో నిజమైన చదువులకు మానవతే కొలబద్ద అని చెబుతుండేవారు. ఎంత చదువు చదివినా, ఎన్ని డిగ్రీలు తీసుకున్నా మానవత్వం లేని చదువులు, డిగ్రీలు నిష్ప్రయోజనం అని వక్కాణించేవారు.
కావలి కళాశాలలో బి.ఏ పూర్తి అయిన పిదప ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అయిన తరువాత 1960లో అధ్యాపకులుగా చేరినప్పటి నుంచి తుదిశ్వాస (ఆగస్టు 3) వరకు విశ్వోదయని, జవహర్ భారతిని ఏ రోజూ వీడలేదు. అధ్యాపకులుగా, శాఖాధ్యక్షులుగా, వైస్ ప్రిన్సిపాల్‌గా, డిప్యూటీ చీఫ్ వార్డెన్‌గా బాధ్యతలు చేపట్టి ప్రతి పనిలో, ప్రతి బాధ్యతలో, ప్రతి పదవిలో తనదైన ముద్ర వేశారు.
మాస్టారు తెలుగు అకాడమీకి ఇంటర్మీడియట్ స్థాయిలో రాసిన పౌరశాస్త్రం పాఠ్యపుస్తకం, బి.ఏ స్థాయిలో రాసిన రాజకీయ భావనలు–సంస్థలు పాఠ్యపుస్తకం, ఎం.ఏ స్థాయిలో రాసిన స్వాతంత్య్రోద్యమం–రాజ్యాంగ వికాసం అనే పాఠ్య పుస్తకం... వంటివి ఎంతో పరిశోధనాత్మకంగా కళ్లకు కట్టినట్లు ఉండేవి. ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్‌కు చదువుకొనే విద్యార్థుల ప్రతి ఒక్కరి స్టడీ టేబుల్ మీద ఈ పుస్తకం ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇహం పరం శతకం అనే పుస్తకాన్ని 2019లోను, అలాగే ఆటవెలది పద్యాలతో కూడిన వ్యక్తిత్వ వికాస శతకం గ్రంథం 2022లోను వెలువరించారు.
‘తనని తాను చక్కగా తెలుసుకున్న అధ్యాపకుడు విద్యార్థిని కూడా సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు’ అనేది మాస్టారి భావన. అధ్యాపక వృత్తిని చేపట్టిన వారికి సహనగుణం ఎంతో అవసరమని చెబుతుండేవారు. భావోద్వేగ వివేకిగా రూపొందిన అధ్యాపకుడి బోధనా ప్రయాణానికి ఆరంభం తప్ప అంతం ఉండదు.
దేవబత్తిని వెంకటరావు
లైబ్రేరియన్, జవహర్ భారతి డిగ్రీ కళాశాల, కావలి
ఇవి కూడా చదవండి..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..