నేను మరిచినా నన్ను మరువని నేస్తం
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:44 AM
ఎనభైల తొలి రోజులనుంచి నేను కవితలు రాస్తూనే ఉన్నా వాటిలో పత్రికలకు పంపించినవి దాదాపు లేవనే చెప్పాలి. రాసినవి మిత్రులతో పంచుకోవటంతోనే సరిపెట్టేవాడిని. ఇస్మాయిల్ గారు పుస్తకం వేసుకోమని...
ఎనభైల తొలి రోజులనుంచి నేను కవితలు రాస్తూనే ఉన్నా వాటిలో పత్రికలకు పంపించినవి దాదాపు లేవనే చెప్పాలి. రాసినవి మిత్రులతో పంచుకోవటంతోనే సరిపెట్టేవాడిని. ఇస్మాయిల్ గారు పుస్తకం వేసుకోమని చెప్పిన కొన్ని సంవత్సరాల తరువాత, 1993లో ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. అప్పటికి నా వయసు 29 కావటంతో, రాసిన ఎన్నో కవితలలోనుంచి 29 మాత్రమే ఎంచి, టైపుసెట్టింగ్ చేయించాను. అధికార భాషా సంఘం సభ్యునిగా ఇస్మాయిల్ ఒక సమావేశానికి వచ్చిన సందర్భంలో దిల్-కుష్ గెస్టుహౌసుకి వెళ్ళి కలిసినప్పుడు, నన్ను చూడగానే, తెల్ల కాగితాల మీద తన అందమైన దస్తూరితో రాసిన ముందుమాటను అందించారు. అది చదివినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఆయన సలహా మేరకు శీలా వీర్రాజు గారిని అడిగితే ఆదరంతో ముఖచిత్రం వేసి ఇచ్చారు. ఇస్మాయిల్ కవిత్వ సంపుటి ‘చిలకలు వాలిన చెట్టు’ మీద అభిమానంతో నేనూ ఈ పుస్తకాన్ని క్రౌన్ సైజులో తెచ్చినా, స్టాండర్డ్ సైజయిన 1/8 డెమ్మీలో తీసుకువస్తేనే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. అర్భకంగా కనిపించే ఆ పుస్తకం అద్భుతాలు చేస్తుందనే ఆశలేవీ లేకపోవటంతో, మొదటి ప్రతి అందుకున్నప్పుడు మదిలో కోటి వీణలు మ్రోగటం లాంటివేమీ జరగలేదు. ముఖచిత్రం తడి వాసన మాత్రం గుర్తుంది. ఒకసారి పుస్తకం వచ్చాక ఆవిష్కరణ సభను ఏర్పాటు చేసే పనిని చిరకాల కవిమిత్రుడు శిఖామణి తన భుజాల మీద వేసుకున్నాడు. నాకెవరూ పెద్దగా పరిచయం లేకపోవడంతో, తనే పూనుకొని నారాయణరెడ్డిగారిని ఆవిష్కర్తగా, చేరాగారిని అధ్యక్షునిగా, శివారెడ్డిగారిని వక్తగా ఒప్పించాడు. నా కోరిక మేరకు అంపశయ్య నవీన్ గారు మరొక వక్తగా పాల్గొన్నారు. ఆవిష్కరణ రోజు ఏర్పాట్లలో సహకరించిన నా సోదరులు వక్తల ముందు ఉంచే గ్లాస్‌లలో కొబ్బరి నీళ్లు నింపారు. శివారెడ్డి తన ప్రసంగంలో, మామూలు నీళ్ళనుకొని తాగితే అవి కొబ్బరి నీళ్ళని, అలాగే మామూలు కవిత్వమనుకొని పుస్తకం తెరిస్తే అద్భుతమైన కవిత్వం కనిపించిందని చమత్కరించారు. అయితే ఆ తరువాత తన మెప్పుదలను కొంతవరకు ట్రిమ్ చేశారనుకోండి. అంతేకాకుండా, ముందుమాటలో ఇస్మాయిల్ గారు సమకాలీన కవిత్వం గురించి చేసిన వ్యాఖ్యల మీద తీవ్రమైన విమర్శ చేసి, నా కవిత్వం తనలో కలిగించని కాకను తన మాటలతో సభలో కలిగించగలిగారు. చేరాగారి అధ్యక్షోపన్యాసమే తరువాత చేరాతల్లో రెండు వారాలపాటు సమీక్షగా వచ్చింది. అరుదైన కవిగా తను పేర్కొన్న నాకు, ఆయనిచ్చిన అరుదైన కానుక అది. సమీక్షలతోపాటు, ఆరుద్ర, ఆర్.ఎస్.సుదర్శనం, మో, ఎన్.గోపి, జయప్రభ వంటి వారు రాసిన ఉత్తరాలు ఉత్సాహం నింపాయి.
హైదరాబాదులో ఎంతోమంది కవి మిత్రుల విలువైన పరిచయం లభించింది. ముకుంద రామారావు, వి.ఆర్. విద్యార్థి వంటి ఆత్మీయులు ఏర్పడ్డారు. అప్పట్లో కె.సదాశివరావుగారు కవుల పోర్ట్రయిట్ ఫోటోలు తీసి, వాటిలో రెండిటిని లామినేట్ చేసి గిఫ్టుగా ఇచ్చే ఒక ప్రాజెక్టులో నా ఫోటో కూడా తీసారంటే దానికి కారణం ఈ పుస్తకమే. ఐదు సంవత్సరాల తరువాత అమెరికా ప్రయాణానికి ఆకాశంలో పైకి లేచేవరకు అప్పటి హైదరాబాద్ మిత్రుల స్నేహపరిమళం నన్ను చుట్టుకునే ఉంది. గత నవంబర్లో ఇండియా వచ్చినప్పుడు శివారెడ్డిగారిని కలవడానికి వెళితే, రవిశంకర్ పేరు విన్న వారి శ్రీమతికుండీలో మర్రిచెట్టు కవేనా అని అడిగి నన్ను ఆశ్చర్యపరిచారు. చివరి పుస్తకం వీలునామా అవదేమోగాని, మొదటి పుస్తకం చిరునామా కావటం సాధ్యమే. ఏ కవికైనా అది గొప్ప అదృష్టం. నేను మరిచిపోయినా నన్ను మరువని తొలినాళ్ళ నేస్తం, కవితా సోపానంలో నేను ఏ మెట్టు మీద ఉన్నా, ఆదరంతో నా వైపు చూస్తూ ప్రోత్సహించే తొలిమెట్టు నా ‘కుండీలో మర్రిచెట్టు’.
విన్నకోట రవిశంకర్
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..
నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి