‘కుమ్మెర’ ఘటనతోనైనా బీసీ రక్షణచట్టం రావాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:47 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న జరిగిన ఘటన కేవలం నేరం కాదు, అది భారతీయ సామాజిక ఆత్మకు తగిలిన లోతైన గాయం. అగ్రవర్ణ అహంకారం కారణంగా రెండు నెలల పసికందు...
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న జరిగిన ఘటన కేవలం నేరం కాదు, అది భారతీయ సామాజిక ఆత్మకు తగిలిన లోతైన గాయం. అగ్రవర్ణ అహంకారం కారణంగా రెండు నెలల పసికందు (బేబీ మౌనిక) ప్రాణాలు వదలడం అనే ఘటన– ఆధునిక ప్రజాస్వామ్యంలో కాకుండా మనం ఇంకా మధ్యయుగపు అంధకారంలోనే ఉన్నామని చాటిచెబుతోంది. ఆ ఘటనలో వంద రూపాయల కొబ్బరికాయ రుసుం వివాదం ఒక సాకు మాత్రమే; దాని వెనుక శతాబ్దాల కుల అహంకారం, కులాంతర వివాహాలపై కసి, పెత్తందారీ పోకడలు ఉన్నాయి.
కుమ్మెర మల్లన్న జాతరలో బాధితురాలు కీర్తి తన భర్త గణేశ్, అత్త చంద్రకళతో కలిసి స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు, నిర్వాహకులు రూ.100 రుసుం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుడు వారిని కీర్తి అడిగిన ప్రశ్నలు అత్యంత తార్కికమైనవి: 1) ‘మేము కూడా ఇదే గ్రామస్థులం కదా, మా దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? 2) మేము కుల వృత్తులు చేసుకుని బ్రతికేవాళ్లం, మా దగ్గర డబ్బులు తీసుకోవడం ధర్మమా? 3) ఒకవేళ మేము మీకు డబ్బులు ఇచ్చినందుకు మీరు దానికి రశీదు ఇస్తారా? మరి రశీదు లేకుండా డబ్బులు ఎందుకు కట్టాలి?’ ఈ ప్రశ్నలు అగ్ర కులస్థులకు అవమానంగా అనిపించాయి. వారి దృష్టిలో కీర్తి ఒక ‘తక్కువ కులం’ మహిళ. వెనుకబడిన వర్గానికి చెందిన ఒక స్ర్తీ, ఇలా తల ఎత్తి తమను ప్రశ్నించడం వారి సామాజిక అహంకారాన్ని దెబ్బతీసింది. కీర్తి కుటుంబంపై జరిగిన దాడి, రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు (నిబంధనలు 14, 15)తో పాటు, గౌరవంగా జీవించే హక్కు (నిబంధన 21)కు ప్రత్యక్ష ఉల్లంఘనే.
ఈ దాడి వెనుక లోతైన సామాజిక కారణం ఉంది. కీర్తి మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళ కాగా, ఆమె భర్త గణేశ్ చాకలి సామాజికవర్గానికి చెందినవారు. గణేశ్ సోదరులు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు. ఇలాంటి కులాంతర వివాహాలు కులాల మధ్య అంతరాలను చెరిపేస్తాయి. కుల వ్యవస్థ నిలవాలంటే ‘రక్త స్వచ్ఛత’ ఉండాలని నమ్మే పెత్తందార్లకు ఇది మింగుడు పడలేదు. నేటి ఈ దాడి వెనుక అసలు కారణం అదే.
గ్రామాల్లోని కుల చేతివృత్తులవారు అగ్రవర్ణాల వారికి ఉచితంగా సేవ చేయాలనే ‘వెట్టి’ సంస్కృతి ఇంకా పోలేదు. రాజ్యాంగంలోని 23వ నిబంధన ‘బలవంతపు చాకిరీ నిరోధం’ గురించి తెలుపుతోంది. గ్రామాల్లో జరుగుతున్నది కేవలం సామాజిక వివక్ష కాదు, ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే. శ్రమకు విలువ ఇవ్వనివారు, కొబ్బరికాయకు మాత్రం వంద రూపాయల వెల కట్టడం వారి దోపిడీ మనస్తత్వానికి నిదర్శనం. కీర్తి అడిగిన హక్కుల ప్రశ్న పెత్తందారీ అహంకారానికి తగిలిన దెబ్బ.
లలిత కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, తీవ్రమైన నేరం జరిగినప్పుడు వెంటనే ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేయాలి. కానీ సర్పంచ్ ఒత్తిడితో బాధితుల పైనే పోలీసులు ఎదురు కేసులు నమోదు చేశారు. పసిపాప మరణించినా, దానిని హత్య (సెక్షన్ 302) కింద కాకుండా బలహీనమైన సెక్షన్ల కింద నమోదు చేయడం అన్యాయం. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, వ్యవస్థీకృతమైన హింస.
ఈ అరాచకాలను అరికట్టడానికి బీసీ రక్షణ చట్టం అనివార్యం. ఈ చట్టం కోసం 2009 నుంచి బీసీ మహాజన సమితి, కుల నిర్మూలన వేదిక, సత్యశోధక మహాసభ పోరాడుతున్నాయి. ఈ డిమాండ్ కోసం నేను వ్యక్తిగతంగా అనేక జిల్లాల్లో పర్యటించి బాధితుల గొంతుకను వినిపించాను. ఫలితంగా గతంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ డిమాండ్‌ను స్వీకరించి, ఆ చట్టం కోసం విధివిధానాలు రూపొందించింది. తెలంగాణలో కూడా బీసీలపై దాడులు నిరంతరం కొనసాగుతున్నందున, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తక్షణమే రావాలి.
కులం ఉన్నంత కాలం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. నిందితులపై హత్య కేసు నమోదు చేసి, వేగవంతమైన న్యాయస్థానంలో విచారించి, వారికి ఆరు నెలల్లోగా శిక్ష పడేలా చూడాలి. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అసెంబ్లీలో బీసీ రక్షణ చట్టాన్ని ఆమోదించాలి. పసికందు మౌనిక మరణం వృథా కాకూడదు అంటే అగ్రవర్ణ అహంకారం అంతం కావాలి. క్రమంగా కులం రద్దు కావాలి– మనుషులంతా ఒక్కటవ్వాలి!
పాపని నాగరాజు
సత్యశోధక మహాసభ
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్