Share News

చర్చలతోనే జల సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Jan 29 , 2026 | 02:55 AM

తెలంగాణ ప్రభుత్వానికి ట్రైబ్యునల్–1 ప్రకారం, వారి కృష్ణా జలాల వాటా ఎంతో, ఇప్పుడు ట్రైబ్యునల్–2 ముందు వారి అవసరాలకు ఎన్ని జలాలు అవసరమో ఇంకా స్పష్టత కొరవడినట్టుగా...

చర్చలతోనే జల సమస్యల పరిష్కారం

తెలంగాణ ప్రభుత్వానికి ట్రైబ్యునల్–1 ప్రకారం, వారి కృష్ణా జలాల వాటా ఎంతో, ఇప్పుడు ట్రైబ్యునల్–2 ముందు వారి అవసరాలకు ఎన్ని జలాలు అవసరమో ఇంకా స్పష్టత కొరవడినట్టుగా గోచరిస్తోంది. పైగా గందరగోళం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా వారి వాటా బచావత్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పు ప్రకారం, 299 టీఎంసీ లకు అదనంగా, 490 టీఎంసీలు అంటున్నారు. 555 టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్–2 ముందు విన్నవించుకున్నట్టు చెబుతున్నారు. ఈ సంఖ్య ఏ విధంగా లెక్క కడితే వస్తుందో ఎవరూ చెప్పలేరు. తెలంగాణ ట్రైబ్యునల్–2 ముందు మొదటగా వారి అవసరాలు 599 టీఎంసీలు నికర వినియోగంగా చూపించారు. ప్రభుత్వం మారాక దీనిని 763 టీఎంసీలుగా మార్చారు. ట్రైబ్యునల్ ముందు తెలంగాణ తుదివాదనలు పూర్తయిపోయాయి. తమ తుది వాదనలు పూర్తయ్యాక కూడా వారి వాటాలపై స్పష్టత రాకపోవడం విడ్డూరమనిపించదా? ఇంకా వేర్వేరు వ్యాఖ్యలు వినిపించవలసిన అవసరం ఏముంది?

న్యాయస్థానాలు తమ తీర్పులను అమలులో ఉన్న చట్టాల ఆధారంగా ఇస్తాయి. భావావేశాలు, మనోభావాలు, విశ్వాసాల ఆధారంగా పరిష్కరించవు. బచావత్ ట్రైబ్యునల్ నీటి వాటాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలి అన్న అంశంపై విస్తృత అధ్యయనం చేసి వాటిని సుదీర్ఘంగా వివరించి తీర్పు చెప్పింది. మొట్టమొదటిగా విచారణ సమయానికి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అప్పటికే ఆ ప్రాజెక్టుల వినియోగంలో ఉన్న ఆయకట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకోకపోతే ఆ ప్రాంతాల్లో స్థిరపడిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని అది సమంజసం కాదని చెప్పింది. ఈ కోవలోనే కృష్ణా డెల్టాకు సింహభాగంగా 181.2 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలు లభించాయి. 1970 నాటికి నాగార్జునసాగర్ నిర్మాణం కీలక దశకు చేరుకొని పాక్షికంగా అమలులోకి రావటంతో ఆ ప్రాజెక్టు అవసరాలకు 281 టీఎంసీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ వాటాగా 99 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణ నీటి అవసరాలను అప్పటి ఆంధ్రప్రదేశ్ సమర్థవంతంగా సమర్పించలేదన్న వాదన సమర్థనీయం కాదని ప్రస్తుత ట్రైబ్యునల్ 2016లో చెప్పింది. ఇది రాజకీయ ఆరోపణే కానీ, ఏ చట్టాన్ని అతిక్రమించినది కాదు. తెలంగాణ నాయకుల ఇప్పటి వాదనలలో, ప్రకటనలలో, వివరణలలో ఏ సందర్భంలోనూ ఫలానా చట్టంలోని ఫలానా సెక్షన్ ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు ఉటంకించటం లేదు. అన్నీ రాజకీయ ప్రేరేపణ ఆధారితాలే. అమలులోకి రాని ట్రైబ్యునల్–2, 2013లో చేసిన కేటాయింపులు కూడా మొత్తం వారికి స్వీయ సమర్పణ చేసుకుంటున్నారు. సెక్షన్–3, ప్రాతిపదికన విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వ లేఖను పేర్కొంటూ, దీని ప్రకారం బచావత్ తీర్మానించిన 811 టీఎంసీల కేటాయింపును రద్దుగా భావించాలని వాదిస్తోంది. అంటే బచావత్ తీర్పులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు మాత్రం పాక్షికంగా రద్దు అని వాదన. ఒక కార్యనిర్వాహక ఆదేశం ఒక చట్టాన్ని ఒక రాష్ట్రానికి అనుకూలంగా ఇంకొక రాష్ట్రానికి విరుద్ధంగా, పాక్షికంగా రద్దు చేయటాన్ని ఏ న్యాయస్థానమైనా సమర్థిస్తుందా? ఎటు చూసినా 2002 సవరణ చట్టంలోని నాలుగవ నిబంధన ప్రకారం గానీ, 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గానీ బచావత్ కేటాయింపులు మారే అవకాశాలు లేనే లేవు. మరి తెలంగాణ నాయకులు ఊహిస్తున్నట్లుగా కేటాయింపులలో సమూల మార్పులు జరుగుతాయో లేదో వేచి చూడాలి. ఒకవేళ మార్పులు వాళ్ళు కోరుకుంటున్నట్లు జరగకపోతే తెలంగాణ ప్రజానీకానికి ఏమి వివరణ ఇచ్చుకుంటారు? సుప్రీంకోర్టుకు వెళ్లి, అది నిలిపివేస్తాం అంటారేమో. ఇన్ని సంవత్సరాల తరువాత వెలువడిన తీర్పును సుప్రీంకోర్టు ఏకపక్షంగా నిలిపివేస్తుందా? ఆ తీర్పు చట్టాలను అనుసరించి ఉన్నప్పుడు అడ్డు తగులుతుందా?


తెలంగాణ ఒక సంగతి ఉపేక్షిస్తోంది. 2014 విభజన చట్ట ప్రకారం గానీ, లేక సెక్షన్–3 పరంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశంగానీ సమీక్ష అంతా 811 టీఎంసీలకు సంబంధించినదే. ట్రైబ్యునల్–2, కేటాయింపులు కూడా ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ అనుమానాస్పదమే. ఎందుకంటే ఆ కేటాయింపులు ఇంకా చట్టరూపం దాల్చలేదు కాబట్టి. ఈ పరిస్థితులలో సమీక్ష 811 టీఎంసీలను దాటి ఉండబోనందున మిగులు జలాల ఆధారంగా చేపట్టిన షెడ్యూల్–11 ప్రాజెక్టులకు కేటాయింపుల గురించి ట్రైబ్యునల్ తమ తీర్పులో ప్రస్తావించకపోవచ్చు. అప్పుడు భారీ ఎత్తున ఖర్చుపెట్టి నిర్మిస్తున్న లేక నిర్మించిన ఆ ప్రాజెక్టుల పరిస్థితి అనిశ్చితికి దారితీస్తుందని మర్చిపోతున్నారు. బచావత్ తీర్పు అమలులో ఉన్నంత కాలం ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుంది. ట్రైబ్యునల్–2 అమలులోకి వస్తే ఈ ప్రాజెక్టులు మనుగడ సాగించాలంటే గోదావరి జలాల మళ్లింపు తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఈ కేటగిరీలో తెలంగాణ ప్రాజెక్టులకు సుమారు 207 టీఎంసీల నీరు కావాలి. నెట్టంపాడు 22, కల్వకుర్తి 25, ఎస్ఎల్‌బీసీ 40, పాలమూరు–రంగారెడ్డి 90, దిండి 30... మొత్తం కలిపి 207 టీఎంసీలు. ఇవి గాక దేవాదుల మూడవ స్టేజి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ పరంగా ఇటువంటి ప్రాజెక్టులకు 125.5 టీఎంసీలు అవసరం. ఇవి గాలేరు–నగరి 38, హంద్రీ–నీవా 40, వెలుగొండ 43.5, తెలుగుగంగ 4 (29లో ట్రైబ్యునల్–2 కేటాయించిన 25 మినహాయించి)... ఇవి కూడా మనుగడ సాగించాలంటే గోదావరి జలాల మళ్లింపే ఆవశ్యకం. గోదావరి జలాల మళ్ళింపు సఫలీకృతం కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్నట్లు పరస్పర అంగీకారం, సహకారం అవసరం. కనుక రోజువారీ ప్రసంగాలు ఆపి చర్చలకు సిద్ధమవ్వటం అవసరం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అభిలషణీయం.

షెడ్యూల్–11 ప్రాజెక్టులకు ప్రస్తుత ట్రైబ్యునల్ 2,578 టీఎంసీల కంటే అధికంగా లభ్యమయ్యే మిగులు జలాలను ఇరువురికీ ఉపయోగించే వెసులుబాటు కల్పించగలదు అనుకుందాం. అప్పుడు ఆ వెసులుబాటు ఇరు రాష్ట్రాలకు వాటి లభ్యత యాభై శాతం విశ్వసనీయత కంటే (సుమారు 35 నుంచి 40 శాతం) తక్కువ ఉంటుంది. ఆ వెసులుబాటు కూడా మహారాష్ట్ర 663 టీఎంసీలు, కర్ణాటక 900 టీఎంసీలు వినియోగించుకున్నాకే లభిస్తుంది. అటువంటప్పుడు వాటిపై పెట్టిన పెట్టుబడులు లాభసాటి కావు. తెలంగాణకైతే భారీ ప్రాజెక్టులు అయిన ఎస్ఎల్‌బీసీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు షెడ్యూల్ 11లో చేర్చనందున ఇటువంటి వెసులుబాటు అసలే ఉండదు. కనుక రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా గోదావరి జలాల మళ్ళింపు ద్వారా ప్రత్యక్షంగా గాని లేక కృష్ణా జలాల ప్రత్యామ్నాయ వినియోగం ద్వారా గాని వాడుకునే వెసులుబాటు కల్పించమని అభ్యర్థించాలి. ఒకవేళ ఇది తన పరిధిలోకి రాదు అనుకుంటే కనీసం కేంద్రానికి వేరుగా గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులు జరిపే వరకూ తాత్కాలిక వెసులుబాటుకు సమ్మతించవలసిందిగా సిఫార్సు చేయమని అడగాలి. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు కలిసికట్టుగా వ్యవహరించటం ఇరువురికీ శ్రేయస్కరం.

కురుమద్దాలి వెంకట సుబ్బారావు

విశ్రాంత చీఫ్ ఇంజనీర్

ఇవి కూడా చదవండి

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’

రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!

Updated Date - Jan 29 , 2026 | 02:56 AM