Share News

చట్టబద్ధత లేని తెలంగాణ వాదన

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:53 AM

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాల పరిష్కారానికి కేంద్రం జల వివాదాల కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ సమావేశానికి తెలంగాణ విశ్వాసంతో, చిత్తశుద్ధితో హాజరుకాలేదు. ఏదో ఒక...

చట్టబద్ధత లేని తెలంగాణ వాదన

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాల పరిష్కారానికి కేంద్రం జల వివాదాల కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ సమావేశానికి తెలంగాణ విశ్వాసంతో, చిత్తశుద్ధితో హాజరుకాలేదు. ఏదో ఒక లాంఛనం నెరవేర్చడానికన్నట్లుగా వచ్చింది. సమావేశంలో చర్చించవలసిన అంశాలపై కూడా దానికి స్పష్టత లేదు. కృష్ణా జలాలపై ఎప్పటిలాగే పాత పాటే పాడింది. ట్రిబ్యునల్ నివేదిక వచ్చే వరకు చెరో యాభై శాతం వాటా పంపిణీ జరపాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన 512 (ఆంధ్ర), 299 (తెలంగాణ) టీఎంసీలకు ఒక చట్ట పాతిపదిక ఉంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులే ఆధారం. విభజన తరువాత ఇరు రాష్ట్రాలలో అమలులో ఉన్న ప్రాజెక్టుల చట్టబద్ధ కేటాయింపులు అలాగే ఉన్నాయి. మరి, తెలంగాణ చెప్తున్న చెరో యాభై శాతానికి ప్రాతిపదిక ఏమిటి? ఒక క్యాబినెట్ నిర్ణయం. ఈ వివాదంలో తెలంగాణ ఒక కక్షిదారు. వారి ఏకపక్ష నిర్ణయాల ఆధారంగా ఎలా నీటి పంపకాలు చేస్తారు? పైగా దీనికి చట్టబద్ధత కూడా లేదు. ఇంతకుముందు కృష్ణా బోర్డులో ఇదే వాదన చేశారు. అక్కడ, చట్టబద్ధత లేదని తిరస్కరించారు. ట్రిబ్యునల్‌లో వాదనలు తుది దశకు చేరుకున్న సమయంలో ఒక కక్షిదారు ప్రతిపాదనను ఎలా ఆమోదిస్తారు?

ఈ సమావేశంలో ఒక ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది– అది పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానికి ప్రతిపాదించిన జలాల వినియోగం. ఆంధ్రప్రదేశ్ వరద నీరు... అని వర్ణిస్తే వరదనీరు అనే భావం ఉండదని జలాల విశ్వసనీయత, లభ్యత ఆధారంగా చిత్రించటం సబబు అని కేంద్ర జల సంఘం చైర్మన్ అన్నట్లు వార్తలు వచ్చాయి. రెండు కృష్ణా ట్రిబ్యునల్స్ కూడా వరద నీరు అనే పదం వాడలేదు. మిగులు జలాలు లేక కేటాయించని జలాలు అనే పేర్కొన్నాయి. ఈ మిగులు జలాల వినియోగానికి సంబంధించి అప్పటి మైసూరు (ఇప్పుడు కర్ణాటక) రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు అనుమతించిన మిగులు జలాల వినియోగాన్ని క్యారీ ఓవర్ స్టోరేజ్‌లోనే, అలాగే బేసిన్ లోపల మాత్రమే వాడేటట్లుగా నియంత్రించాలని అర్థించింది. కానీ, ఇలా చేస్తే ఉపయోగపడగల నీరు అనవసరంగా సముద్రం పాలవుతుందని కర్ణాటక అభ్యర్థనను ట్రిబ్యునల్–1 తిరస్కరించింది. ఇదే అంశంపై ట్రిబ్యునల్–2లో ఈ మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంచాలని కర్ణాటక ప్రతిపాదించింది. అలా చేస్తే సందిగ్ధత, అస్పష్టత ఏర్పడతాయని చెప్తూ ఆంధ్రప్రదేశ్‌కు 2,578 టీఎంసీల పైబడి లభ్యమయ్యే పంచబడని జలాలు... హక్కు లేకుండా వాడుకోవచ్చని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. వరద జలాలు అనే పద ప్రయోగం సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యే పరిభాష. మిగులు జలాల పదం సాంకేతిక సందర్భంగా ఉపయోగించబడింది.


కృష్ణ, గోదావరి నదుల ప్రవాహ నిడివిలో చివరిది ఆంధ్రప్రదేశ్. రెండు ట్రిబ్యునల్స్ కూడా చిట్టచివరి రాష్ట్రానికే ఈ మిగులు జలాల వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చాయి. ట్రిబ్యునల్–2 ముందు తెలంగాణ చాలా విచిత్రమైన, వింతైన వాదనలు చేస్తోంది. ఆ పరంపరలోనే వారు కృష్ణానదికి కడపటి రాష్ట్రం తెలంగాణ అనీ, ఆంధ్రప్రదేశ్ కాదనీ వాదించారు. ఈ సందర్భంగా ఒకటి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలను ఎత్తిపోతల పథకాలకు ఉపయోగించటం ఒక అంశం అయితే, ఆ పైన లభించే మిగులు జలాలను బేసిన్‌లో నిల్వ చేసుకోవాలంటే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల జలాశయాలలోనే. తెలంగాణకైనా ఆ రెండే కదా! ఒక విధంగా ఈ రెండు రిజర్వాయర్ల పరంగా రెండు రాష్ట్రాలను అవిభక్త కవలలుగా పరిగణించాలి. మిగులు జలాలైనా, క్యారీ ఓవర్ స్టోరేజ్ అయినా నీటి ఆవిరి నష్టాల్లో మిగులు జలాలైనా ఇద్దరు ఉమ్మడి భాగస్వాములే కావడానికి అవకాశం ఉంది. కనుక తెలంగాణకు ఎంత కాదనుకున్నా ఆంధ్రప్రదేశ్‌తో సఖ్యత, అవగాహన అవసరం. ఇది దృష్టిలో పెట్టుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించటం తెలంగాణకు అవసరమని గ్రహించాలి.


ఇక గోదావరి జలాల విషయానికి వస్తే తెలంగాణ ఒక మొండి వైఖరి అవలంబిస్తోంది. కిందనున్న రాష్ట్రం మిగులు జలాలను వాడుకుంటే మీకు అభ్యంతరం ఏమిటి అని అడిగితే, ఆ జలాలపై వారికి హక్కు ప్రాప్తిస్తుందని సాకు చెప్తోంది. గోదావరి ట్రిబ్యునల్ తన తీర్పులో అప్పటి ఎగువ రాష్ట్రాలయిన పూర్వ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషాలలో కొన్ని ప్రాజెక్టు స్థలాల దగ్గర 75 శాతం విశ్వసనీయతతో లభించే గోదావరి జలాలలో కొంత భాగం నీరు కిందకు ప్రవహించటానికి వీలు కల్పిస్తూ, అక్కడ వినియోగాలపై కొన్ని పరిమితులు విధించింది. దీనికి భిన్నంగా పూర్వ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఎటువంటి షరతులు విధించకుండా... అందుబాటులో ఉన్న అన్ని జలాలను లేదా మిగులు జలాలను ఉపయోగించుకోవచ్చనే హక్కును కల్పించింది. అంతేగాక నిబంధన–iv ప్రకారం ప్రతి రాష్ట్రం తనకు కేటాయించిన వాటాలను ఇతర బేసిన్లకు మళ్ళించవచ్చని కూడా పేర్కొంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలవరం–నల్లమల సాగర్‌కు ఉపయోగించే నీరు (మిగులు జలాలైనా, నికర జలాలైనా, వరద జలాలైనా) వాడుకునే హక్కు కలిగి ఉంది. దీనిపై తెలంగాణకు ఎందుకు ఆక్షేపణలు ఉండాలి? కృష్ణా ట్రిబ్యునల్స్ అనుసరించిన ప్రాతిపదికను బట్టి... తెలంగాణ ఏ ట్రిబ్యునల్ ముందు వాదించినా, మిగులు జలాలు వారికి దక్కవు. ఈ నీటిని అన్ని రాష్ట్రాలకు పంచితే ఎవరిష్టం వారిగా ఉపయోగించడం జరుగుతుందని, అస్పష్టత చోటుచేసుకుంటుందని ట్రిబ్యునల్–2 నివేదిక చెప్పింది. తెలంగాణ ఈ సంగతి గ్రహించి, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలకు అడ్డంకులు కలిగించటం మానుకోవాలి.

కురుమద్దాలి వెంకటసుబ్బారావు

విశ్రాంత చీఫ్ ఇంజనీర్

ఇవి కూడా చదవండి..

వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి

Updated Date - Feb 12 , 2026 | 01:53 AM