Share News

లోకేశ్‌ చేతలే జవాబు

ABN , Publish Date - May 03 , 2026 | 02:51 AM

తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మూడో తరం సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ మూడు తరాల నాయకత్వంలో సజీవంగా, పరిపుష్టంగా ఉండటం ఆషామాషీ కాదు. ‘నాతో మొదలైన పార్టీ నాతోనే పోతుంది’ అని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్వేదంలో ఉన్నప్పుడు అన్నప్పటికీ నాలుగు దశాబ్దాలుగా పార్టీ సగర్వంగా నిలబడింది.

లోకేశ్‌ చేతలే జవాబు

..ఒక ప్రాంతీయ పార్టీ మూడు తరాల నాయకత్వంలో సజీవంగా, పరిపుష్ఠంగా ఉండటం ఆషామాషీ కాదు.

..ద్రవిడ పార్టీల తర్వాత అంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలబడింది. రాష్ట్రం విడిపోయినా, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనా తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. తెలంగాణలో పార్టీ పటిష్ఠంగా లేకపోయినా ఓటర్లు మాత్రం ఉన్నారు.

..పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన లోకేశ్‌ చేతికి భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అందుతాయి. ఎన్టీఆర్‌ హయాంతో పోల్చితే ఇప్పుడు రాజకీయాలకు నిర్వచనమే మారిపోయింది. పెద్ద మనిషి తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. జగన్మోహన్‌ రెడ్డి వంటి వారి ప్రవేశంతో రాజకీయాల స్వరూపమే మారిపోయింది.

..చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ఈ తరం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. నాయకుడి నిర్ణయాలు, చర్యలు వేగంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఓర్పు అవసరం అని మరచిపోతున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని వారు ఆశిస్తున్నారు.

..ఎన్టీఆర్‌ తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటి? అన్న సందేహాలను చంద్రబాబు పటాపంచలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత? అని ఎదురయ్యే ఈ తరహా సందేహాలకు చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నప్పుడే లోకేశ్‌ తన చేతల ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి తనలో పరిణతి వచ్చిందని నమ్మకం కలిగించడంలో మాత్రం లోకేశ్‌ సక్సెస్‌ అయ్యారు. పాత తరాన్ని, నవ తరాన్ని కలుపుకొని పోవాల్సిన బాధ్యత లోకేశ్‌పై ఉంది.

..తెలుగునాట వారసులుగా రంగ ప్రవేశం చేసి రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిలో లోకేశ్‌ మూడవ వ్యక్తి. అధినాయకుల వారసులైనప్పటికీ కార్యకర్తలు, ప్రజలతో మమేకం అయ్యే వారికే ఆదరణ ఉంటుంది.


తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మూడో తరం సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ మూడు తరాల నాయకత్వంలో సజీవంగా, పరిపుష్టంగా ఉండటం ఆషామాషీ కాదు. ‘నాతో మొదలైన పార్టీ నాతోనే పోతుంది’ అని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్వేదంలో ఉన్నప్పుడు అన్నప్పటికీ నాలుగు దశాబ్దాలుగా పార్టీ సగర్వంగా నిలబడింది. మన దేశంలో తమిళనాడులో మాత్రమే ప్రాంతీయ పార్టీల సంస్కృతి ఉండేది. పెరియార్‌ రామస్వామి నాయకత్వంలో ప్రారంభమైన ద్రవిడ ఉద్యమం నుంచి అన్నాదురై అధ్యక్షతన డీఎంకే పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత డీఎంకే నాయకులైన కరుణానిధి, ఎంజీఆర్‌ మధ్య విభేదాలు వచ్చి అన్నాడీఎంకే ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ రెండు పార్టీలూ తమిళనాడును ఏలుతూనే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలలో డీఎంకే, అన్నాడీఎంకేకు ఉన్న చరిత్ర మరే ఇతర ప్రాంతీయ పార్టీకీ లేదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు, మధ్యలో వచ్చి పోయిన జనతా పార్టీ తమిళనాడులోని ఆ రెండు పార్టీలనూ ఏ మాత్రం కదిలించలేకపోయాయి. సినీ నటుడిగా మద్రాసులో ఉంటూ తమిళనాడు రాజకీయాలను దగ్గర నుంచి గమనించిన ఎన్టీఆర్‌, 1982లో తెలుగునాట తెలుగుదేశం పార్టీకి పురుడు పోశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. జయాపజయాలను చవిచూసింది. 1984లో, 1995లో పార్టీలో సంక్షోభాలు తలెత్తాయి. ఎన్టీఆర్‌ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించడంతో 1995లో పార్టీ నాయకత్వ మార్పిడి అనివార్యమైంది. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు నాయుడి చేతికి పార్టీ పగ్గాలు వచ్చాయి.


చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంది. ద్రవిడ పార్టీల తర్వాత అంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలబడింది. రాష్ట్రం విడిపోయినా, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనా తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. తెలంగాణలో పార్టీ పటిష్ఠంగా లేకపోయినా ఓటర్లు మాత్రం ఉన్నారు. దేశంలో మరే ఇతర ప్రాంతీయ పార్టీకీ లేని ప్రత్యేకతలు తెలుగుదేశం పార్టీ సొంతం. ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ... లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక్‌సభలో రెండే స్థానాలు ఉండగా, తెలుగుదేశం పార్టీకి 30 స్థానాలు ఉండేవి. ఇలాంటి సంచలనాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పదమూడు సంవత్సరాలే ఉండగా, 1995 నుంచి నేటి వరకు చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ అప్రతిహతంగా కొనసాగుతోంది.


కొత్త తరం.. కొత్త పథం!

తెలుగునాట సరికొత్త రాజకీయాలకు ఒరవడి సృష్టించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1982లో పార్టీ ఏర్పాటును ప్రకటించిన ఎన్టీఆర్‌ 1983 ఎన్నికల్లో దాదాపు 90 శాతం సీట్లను యువతకు, రాజకీయ నేపథ్యం లేని వారికి కేటాయించారు. ఆ విధంగా రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చింది. యనమల రామకృష్ణుడు, అశోక గజపతిరాజు, ప్రతిభా భారతి, తెలంగాణలో ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌ రెడ్డి వంటి వారు ఆ తరానికి చెందినవారే. చనిపోయిన వారు, రాజకీయాల నుంచి నిష్క్రమించిన వారు పోగా తొలి తరానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో అరుదుగా కనిపిస్తారు. తెలుగుదేశం పార్టీతో ఆ తరానికి ఎన్నో భావోద్వేగాలు ఉండేవి. పార్టీ మహానాడులను పండుగలా జరుపుకొనే వారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం వంటిది. ఆ పార్టీ బీట్‌ చూసిన నా వంటి జర్నలిస్టులు కూడా నాటి రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తూ ఎంతో నేర్చుకున్నాం. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను కవర్‌ చేయడానికి ‘ఔట్‌లుక్‌’ మ్యాగజైన్‌ ప్రతినిధి ఢిల్లీ నుంచి వచ్చారు. అప్పటికి కొద్ది నెలల ముందే నేను ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో విలేఖరిగా చేరాను. అప్పుడు బ్యూరో చీఫ్‌గా ఉన్న ఐ.వెంకట్రావ్‌ ఔట్‌లుక్‌ ప్రతినిధితో పాటు నన్ను కూడా వెళ్లి ఎన్నికల కవరేజీ చేయవలసిందిగా కోరారు. అలా ఎన్నికలను ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించింది. మేం తిరిగి వచ్చిన తర్వాత ‘పరిస్థితి ఏమిటి?’ అని వెంకట్రావ్‌ ప్రశ్నించగా, కర్నూలులో కోట్ల విజయభాస్కర రెడ్డి, నంద్యాలలో పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఒంగోలులో పులి వెంకటరెడ్డి, నరసరావుపేటలో కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోతున్నారని చెప్పాను.


ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, ఆ స్థాయి నాయకులను సంచలనాత్మక రీతిలో ఓడించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇలాంటి సంచలనాలకు చిరునామాగా ఉండిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించడానికి మూడవ తరానికి చెందిన నారా లోకేశ్‌ ఇప్పుడు సిద్ధమవుతున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన లోకేశ్‌ మూడు రోజుల క్రితమే నూతన కమిటీతో పాటు బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబుకు నాయకత్వ మార్పిడి ఇలా సాఫీగా జరగలేదు. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు కుడి భుజంగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ పెద్దల్లుడు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు నెంబర్‌ టూగా చలామణి అయ్యారు. ఎన్టీఆర్‌ను కలుసుకోలేకపోయిన నాయకులు, కార్యకర్తలను, స్థానికంగా, పార్టీపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారందరినీ అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా చంద్రబాబు కలుసుకొనేవారు. వారికి సాంత్వన కలిగించేవారు. అదే సమయంలో పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న ఆయనను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేసేది. దీంతో ఆయన అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఈ కారణంగానే చంద్రబాబు ఇప్పటికీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. లోకేశ్‌ వలె చంద్రబాబుకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చంద్రబాబు రాజకీయాల్లో ఎదిగారు. భూదేవికి ఉన్నంత ఓర్పును సొంతం చేసుకున్నారు. ఫలితంగానే ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తి కారణంగా 1995లో తిరుగుబాటు చోటుచేసుకున్నప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు, నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారు. ఆ వ్యక్తి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించి అరాచకంగా వ్యవహరించి ఉండకపోతే చంద్రబాబు పరిస్థితి ఏమిటో తెలియదు.


సీన్‌ కట్‌ చేస్తే..

మొత్తంమీద మూడు దశాబ్దాలుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సురక్షితంగా ఉంది. ఇప్పుడు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన లోకేశ్‌ చేతికి భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అందుతాయి. ఎన్టీఆర్‌ హయాంతో పోల్చితే ఇప్పుడు రాజకీయాలకు నిర్వచనమే మారిపోయింది. ఆ నాటి రాజకీయాలు వేరు– ఈనాటి రాజకీయాలు వేరు. పెద్ద మనిషి తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. జగన్మోహన్‌ రెడ్డి వంటి వారి ప్రవేశంతో రాజకీయాల స్వరూపమే మారిపోయింది. కార్యకర్తల్లోనే కాదు, ప్రజల ఆలోచనా విధానం, ఆకాంక్షల్లో కూడా మార్పు వచ్చింది. ఈ కారణంగానే చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ఈ తరం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. నాయకుడి నిర్ణయాలు, చర్యలు వేగంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఓర్పు అవసరం అని మరచిపోతున్నారు. కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని వారు ఆశిస్తున్నారు. జగన్‌ రెడ్డి పాలనలో కష్టనష్టాలను చవిచూసిన వారు ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌ ఆకస్మిక, అనూహ్య నిర్ణయాలకు చిరునామా కాగా, చంద్రబాబు సంగతి తెలిసిందే. మూడో తరానికి చెందిన లోకేశ్‌ తాత ఎన్టీఆర్‌ లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడని చెబుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో అతను వేగం ప్రదర్శిస్తున్నాడు. ఎన్టీఆర్‌ తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటి? అన్న సందేహాలను చంద్రబాబు పటాపంచలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత? అని ఎదురయ్యే ఈ తరహా సందేహాలకు చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నప్పుడే లోకేశ్‌ తన చేతల ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 2014 తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్‌లో కొంత అపరిపక్వత కనిపించింది. దానికితోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు జగన్‌ రెడ్డి అండ్‌ కో లోకేశ్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. అతడిని ‘పప్పు’ అని పిలుస్తూ హేళన చేశారు. తద్వారా తాను పప్పు కాదు నిప్పు అని నిరూపించుకొనే పరిస్థితి కల్పించారు. 2019 వరకు మంత్రిగా పనిచేసిన లోకేశ్‌కు పెద్దగా ఎదురు దెబ్బలు తగల్లేదు. అధికారం అండగా ఉన్నందున సాఫీగా సాగిపోయింది.


రాజకీయాల్లో రాటుదేలడానికి అవకాశం లభించలేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు లోకేశ్‌ చుట్టూ ఉన్న అనేక మంది ఆయనను వదిలేశారు. పార్టీ కార్యకర్తలు మాత్రమే అండగా నిలిచారు. మరోవైపు అధికారంలో ఉన్న జగన్‌ అండ్‌ కో నుంచి దాడి ఉధృతమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఆ పరిస్థితిని అధిగమించడానికి ఇబ్బందిపడ్డారు. అయితే లోకేశ్‌ పెద్దగా హడావిడి ప్రదర్శించకుండా పరిస్థితులను ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేశారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకం అవడానికి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు ఆయన మారిన మనిషి అని, ఆయనలో సమర్థత ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. గతంలో లోకేశ్‌ నాయకత్వం పట్ల పెదవి విరిచిన వారు కూడా ఇప్పుడిప్పుడే ఆయన నాయకత్వాన్ని అంగీకరించే స్థితికి వచ్చారు. ఇప్పుడు అధికారం ఉంది కనుక ఇంద్రుడు, చంద్రుడు అని పొగడటం సహజం. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు విభిన్నంగా స్పందిస్తారు. నాయకత్వ నిర్ణయాలు అపసవ్యంగా ఉన్నప్పుడు తప్పు అని చెప్పడానికి వారు వెనుకాడరు. ఎన్టీఆర్‌ హయాం నుంచీ ఇలాగే స్పందిస్తున్నారు. ఇది సోషల్‌ మీడియా యుగం కనుక మరింత వేగంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు లేదా లోకేశ్‌ నిర్ణయాలు నచ్చకపోతే వెంటనే తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా వెలిబుచ్చుతున్నారు. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మాత్రమే కనిపిస్తోంది. జగన్‌ రెడ్డి నందిని చూపించి పంది అని చెప్పమంటే తలూపడానికి వైసీపీ శ్రేణుల వలె తెలుగుదేశం కార్యకర్తలు అంగీకరించరు. మావిగన్‌ వంటి ప్రతిపాదన చంద్రబాబు లేదా లోకేశ్‌ నోటి వెంట వెలువడి ఉంటే తెలుగుదేశం శ్రేణులే ఎగతాళి చేసి ఉండేవి. ఒక రకంగా తెలుగుదేశం నాయకత్వానికి ఆ పార్టీ శ్రేణులే తొలి ప్రతిపక్షం.


వారసుల్లో ఎవరెలా?

రాజకీయాల్లో వారసుల సంస్కృతి కొత్త కాదు. తెలుగునాట వారసులుగా రంగ ప్రవేశం చేసి రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిలో లోకేశ్‌ మూడవ వ్యక్తి. తెలంగాణలో కేసీఆర్‌ వారసుడిగా కేటీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ వారసుడిగా జగన్మోహన్‌ రెడ్డి కొనసాగుతున్నారు. కేవలం వారసులుగా మాత్రమే రాజకీయాలలో రాణించలేరు. అలాగని కృత్రిమంగా ప్రచారం పొందినా అది కొంత మేరకే ఉపయోగపడుతుంది. స్టెరాయిడ్స్‌ ఎంతో కాలం పనిచేయవు కదా! దీర్ఘకాలంలో ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అధినాయకుల వారసులైనప్పటికీ కార్యకర్తలు, ప్రజలతో మమేకం అయ్యే వారికే ఆదరణ ఉంటుంది. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు భజన చేసే వారి మాయలో పడి కార్యకర్తలు, ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడతారు. తెలంగాణలో కేటీఆర్‌ ఇందుకు ఉదాహరణ. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. అప్పట్లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే చుట్టూ ఉన్నవాళ్లు తన నాయకత్వ లక్షణాలను అదే పనిగా పొగుడుతూ ఉండటంతో ఆ మోజులో పడిన కేటీఆర్‌ పార్టీ కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోలేదు. ఈ కారణంగానే వారితో మమేకం కాలేకపోయారు. ఈలోపు పార్టీ అధికారం కోల్పోయింది. ఫలితమే కేటీఆర్‌ నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న వారే నాయకులుగా నిలదొక్కుకోగలరు. అదే సమయంలో వారి నాయకత్వం పట్ల ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడాలి. పొగడ్తలకు మాత్రమే అలవాటు పడిన కేటీఆర్‌ ఈ కోణం విస్మరించి తప్పు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పొగడ్తలు స్టెరాయిడ్స్‌ వలె పనిచేస్తాయి. అధికారం కోల్పోయాక తత్వం బోధపడుతుంది.మూడవ తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి లోకేశ్‌ సిద్ధపడుతున్నారు. నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే సన్నిహితులను బట్టి చెప్పవచ్చు అంటారు. నాయకుడికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.


1995లో ఎన్టీఆర్‌ను ఎదిరించి అధికార పగ్గాలతో పాటు పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన చంద్రబాబు చుట్టూ హేమాహేమీలైన నాయకులు తోడుగా ఉండేవారు. పూసపాటి అశోకగజపతి రాజు, కింజరాపు ఎర్రన్నాయుడు, జీఎంసీ బాలయోగి, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, నాగం జనార్దనరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి వారెందరో చంద్రబాబు చుట్టూ కనిపించేవారు. ఈ కారణంగానే ఎన్టీఆర్‌ను ధిక్కరించి కూడా చంద్రబాబు నిలదొక్కుకోగలిగారు. ప్రజల నమ్మకం చూరగొన్నారు. ఇప్పుడు లోకేశ్‌ చుట్టూ అలాంటి పటిష్ఠమైన, అంతటి విశ్వసనీయత కలిగిన ఎకో సిస్టమ్‌ ఉందో లేదో తెలియదు. ప్రస్తుతానికి తనలో పరిణతి వచ్చిందని నమ్మకం కలిగించడంలో మాత్రం లోకేశ్‌ సక్సెస్‌ అయ్యారు. అయితే ఆయన చుట్టూ ఉన్న వారి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాత తరాన్ని, నవ తరాన్ని కలుపుకొని పోవాల్సిన బాధ్యత లోకేశ్‌పై ఉంది. అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు అతనికి అవసరం. వినదగు నెవ్వరు చెప్పిన.. అన్నట్టుగా పది మంది అభిప్రాయాలు తెలుసుకొని సొంతంగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవడాన్ని అలవర్చుకోవాలి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా లోకేశ్‌ చెప్పిన ఒక మాట ఎవరికైనా నచ్చుతుంది. ‘కుటుంబంలోనైనా, పార్టీలోనైనా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. అయితే నేనైనా మీకు నచ్చజెప్పాలి లేదా మీరైనా నాకు నచ్చజెప్పాలి’ అని లోకేశ్‌ అన్నారు. ఇది సరైన దృక్పథం. విభేదించడానికి కూడా ఏకీభవించాలి అంటారు. 1995–99 మధ్య చంద్రబాబు తనకు నమ్మకమైన, వివిధ రంగాలకు చెందిన ముఖ్యుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకొనేవారు. అందరి అభిప్రాయాలూ తెలుసుకొని నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో అని అంటారు. వారసత్వం వల్ల లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. వారసులుగా తెర మీదకు వచ్చిన వారు తాము ఎవరి నుంచి వారసత్వం పొందారో వాళ్ల కంటే గొప్పవారని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకోవాల్సి ఉంటుంది. రాజశేఖర రెడ్డితో పోల్చుకోవడం వల్లనే జగన్‌ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకతను చవిచూశారు. కేటీఆర్‌ కూడా తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకోలేక తంటాలు పడుతున్నారు.


అధినాయకులు అందనంత ఎత్తుకు ఎదిగినప్పుడు వారసులకు ఈ కష్టాలు తప్పవు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండి అభివృద్ధికి చిరునామాగా ప్రజల్లో గుర్తింపు పొందిన చంద్రబాబును మించిన తనయుడు అనిపించుకోవడం లోకేశ్‌కు కూడా అంత సులువేమీ కాదు. అంతేకాదు, ఎన్టీఆర్‌ మనవడిగా, చంద్రబాబు కుమారుడిగా లోకేశ్‌ను ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉంటారు. అదే సమయంలో వారసుడిగా తెర మీదకు వచ్చిన లోకేశ్‌కు డ్యామేజ్‌ చేయడానికి రాజకీయ ప్రత్యర్థులు కాచుకొని ఉంటారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారని పేరొందిన లోకేశ్‌ ఈ దాడులను ఎదుర్కోవడంలో తండ్రి నుంచి మెళకువలు, జాగ్రత్తలను కచ్చితంగా నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలే కాదు సమాజం కూడా సంక్లిష్టమైనది కనుక అతను ఆచితూచి వ్యవహరించాల్సిందే. లోకేశ్‌ ఈ మధ్య పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోవడం కోసం విందు సమావేశాలు నిర్వహించడం కచ్చితంగా అభినందనీయం. అంతకు ముందు పార్టీకి చెందిన తొలి తరం కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసి విందుకు ఆహ్వానించారు. అసలైన కార్యకర్తలు కోరుకునేది ఇలాంటి ఆత్మీయ అనుబంధాలే. ఎన్టీఆర్‌, చంద్రబాబు వారసుడిగా భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టనున్న లోకేశ్‌ తనపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తించినట్టుగా ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ‘తండ్రిని మించిన తనయుడు, తాతను మించిన మనవడు అని అనిపించుకుంటానో లేదో తెలియదు గానీ ఆ ఇరువురికీ తలవంపులు మాత్రం తీసుకురాను’ అని లోకేశ్‌ తరచుగా చెబుతుంటారు. విలువలు పతనమవుతున్న నేటి రాజకీయాలలో ఇది ఆహ్వానించదగిన వాగ్దానం. సమర్థుడైన నాయకుడిగా ఎదగడం మాత్రమే కాదు– ఒక మంచి వ్యక్తిగా ఆవిష్కృతమవడం కూడా ముఖ్యమే. తాను స్వయంగా చెప్పుకొంటున్నట్టుగా తాను ఎవరి నుంచి వారసత్వం పొందుతున్నారో వారికి అగౌరవం తీసుకురాకుండా మంచి నాయకుడిగా, మంచి మనిషిగా లోకేశ్‌ ఎదగాలని ఆశిద్దాం. మూడవ తరం చేతిలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది!

Updated Date - May 03 , 2026 | 03:23 AM