Share News

తెలుగునాట రాజకీయాలకు ఏదో శాపం!

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:28 AM

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న శత్రుత్వాన్ని మించి రేవంత్‌ రెడ్డి- కేసీఆర్‌ మధ్య శత్రుత్వం నెలకొంది. ‘ప్రజలు అవకాశం ఇచ్చినంత కాలం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ఇతరులకు అవకాశం ఇచ్చారు. మళ్లీ మనకు ప్రజలు అవకాశం ఇచ్చే వరకు వేచి చూద్దాం’ అనే ధోరణి కేసీఆర్‌ కుటుంబంలో కనిపించడం లేదు.

తెలుగునాట రాజకీయాలకు ఏదో శాపం!

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న శత్రుత్వాన్ని మించి రేవంత్‌ రెడ్డి- కేసీఆర్‌ మధ్య శత్రుత్వం నెలకొంది. ‘ప్రజలు అవకాశం ఇచ్చినంత కాలం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ఇతరులకు అవకాశం ఇచ్చారు. మళ్లీ మనకు ప్రజలు అవకాశం ఇచ్చే వరకు వేచి చూద్దాం’ అనే ధోరణి కేసీఆర్‌ కుటుంబంలో కనిపించడం లేదు. ‘ప్రజలు ఇంత కాలానికి అవకాశం ఇచ్చారు. అధికారంలో ఉన్నంత కాలం హుందాగా ఉందాం’ అన్న వైఖరి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిలో కనిపించడం లేదు.

తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు పోలీసులతో జరిగిన ఘర్షణ సందర్భంగా అసంకల్పితంగా చోటు చేసుకున్న పరిణామాలతో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం కేసులు పెట్టుకొనే పరిస్థితి ఏమిటి? హరీశ్‌ రావు, కేటీఆర్‌లపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం ఏమిటి? అధికార పక్షానికి సహనం ఎక్కువ ఉండాలి. ఎన్నికల కురుక్షేత్రంలో ఓడిన వారికి ఉక్రోషం ఉండటం సహజం. అందుకే గెలిచిన వాళ్లు సహనం అలవర్చుకోవాలి.

సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్‌... ఆయనను ఉద్దేశించి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విచారం వ్యక్తం చేసి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. హుందాగా రాజకీయాలు చేయలేని స్థితికి ఎందుకు చేరుకున్నామని నేతలు ఆత్మపరిశీలన చేసుకోలేరా?

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన వారిని పరుష పదజాలంతో దూషించిన కేసీఆర్‌, ప్రతిపక్షంలోకి చేరిన తర్వాత మాత్రం హుందాగానే వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయనకు బదులుగా కేటీఆర్‌ రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విరుచుకుపడుతున్నారు. సమాజం ఆమోదించలేని భాషను వాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అయినా హుందాగా వ్యవహరిస్తున్నారా? అంటే అదీ లేదు!

ఒకప్పుడు ఉద్దండులైన నాయకులు శాసనసభలో చర్చల సందర్భంగా తమ వాక్‌ చాతుర్యంతో సభలో నవ్వులు పూయించేవారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే చమత్కార బాణాలను అధికార పక్షం వారు కూడా ఆస్వాదించేవారు. ముఖ్యమంత్రి సైతం ముసిముసి నవ్వులు నవ్వుకొనే వారు. సభలో వాడిగా వేడిగా చర్చలు జరిగేవి. ఆ తర్వాత సభ వెలుపల అధికార, ప్రతిపక్ష సభ్యులు కలివిడిగా కాఫీలు తాగేవారు.

ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయగల స్తోమత ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నందున శాసనసభ్యులను ప్రశ్నించే నైతికతను ముఖ్యమంత్రులు సైతం కోల్పోతున్నారు. తప్పు చేశారని తెలిసి కూడా వారి వెనుక ఉన్న కులాన్ని, డబ్బును చూసి జంకాల్సిన పరిస్థితి. ఇదొక విష వలయంలా మారిపోయింది. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన వారు కూడా నిస్సిగ్గుగా కులం కార్డు అడ్డుపెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజా సేవకు మాత్రమే రాజకీయాలలోకి వస్తున్నామని చెప్పుకొనే వారు చంపుతాం లేదా చస్తాం అని సవాళ్లు విసురుకోవడం ఏమిటి? నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించడం ఏమిటి? రాజకీయాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయాల పట్ల సామాన్య ప్రజల్లో జుగుప్సను కలిగిస్తున్నాయి.


రాజకీయ విభేదాలు మాత్రమే ఉండాల్సిన చోట పగలు సెగలు కక్కుతున్నాయి. సిద్ధాంత వైరుధ్యాలతో చమత్కార బాణాలు రువ్వుకోవలసిన చోట అలవోకగా బూతులు ప్రవహిస్తున్నాయి. విధానాలపైన మాత్రమే విభేదించాల్సిన వాళ్లు ముష్టిఘాతాలకు సైతం వెనుకాడటం లేదు. నిర్దిష్టమైన వేదికలపైన మాత్రమే అభిప్రాయాలతో విభేదించాల్సినవాళ్లు... చొక్కా చేతులు మడిచి కొట్టుకొనే వరకూ వెళుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు అంతవరకే పరిమితం కాకుండా ఆగర్భ శత్రువులుగా మారిపోతున్నారు. పండుగలు, శుభకార్యాలలో కలసినప్పుడు ఆలింగనాలు చేసుకోవలసినవాళ్లు ఎదుటి వారి చావులను కోరుకుంటున్నారు. తెలుగు రాష్ర్టాల రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయాల పట్ల సామాన్య ప్రజల్లో జుగుప్సను కలిగిస్తున్నాయి. విడిపోయిన తర్వాత ఉభయ తెలుగు రాష్ర్టాలు అభివృద్ధిలో పోటీపడవలసిందిపోయి రాజకీయ వైషమ్యాలలో కూరుకుపోతున్నాయి. ప్రజాసేవకు మాత్రమే రాజకీయాలలోకి వస్తున్నామని చెప్పుకొనేవారు చంపుతాం లేదా చస్తాం అని సవాళ్లు విసురుకోవడం ఏమిటి? నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించడం ఏమిటి? తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి రెండు మూడు రోజుల పాటు చోటుచేసుకున్న పరిణామాలు, సంఘటనలను గమనిస్తే తెలుగునాట రాజకీయాలకు ఏదో శాపం చుట్టుకున్నట్టు అనిపిస్తోంది. ప్రజాసేవ చేయడానికి రాజకీయ నాయకులు ఇంతలా పతనం కావాల్సిన అవసరం ఉందా? రాజకీయ పార్టీలపై ప్రజలకు ఇప్పటికే నమ్మకం పోయింది. నాయకులు చెబుతున్న ప్రజాసేవను ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. ‘‘మీరు సేవ చేయాల్సిన పనిలేదు. మాకు షేవ్‌ చేయకుండా ఉంటే చాలు’’... అన్న స్థితికి జనం వచ్చారు. ఈ కారణంగానే అధికారంలోకి వచ్చిన వారు ఏం చేస్తారో తెలుసు కనుక ప్రజలు కూడా డబ్బు తీసుకొని ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధపడిపోయారు.


తెలుగునాట తీసికట్టుగా...

దేశవ్యాప్తంగా రాజకీయాలు దిగజారిపోయినప్పటికీ తెలుగు రాష్ర్టాల్లో మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. అలయ్‌ బలయ్‌ చెప్పుకొనే తెలంగాణలో రాజకీయ కక్షలు ఇంతలా రగిలిపోవడానికి కారణం ఏమిటి? చట్టసభల ఔన్నత్యం దిగజారడం ఏమిటి? తెలంగాణ ఉద్యమ సమయంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉండేవి కనుక నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది. హాయిగా రాజకీయాలు చేసుకోవచ్చు కదా! ప్రజలు ఇచ్చిన అధికారంతో వీలైతే నాలుగు మంచి పనులు చేసి, మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా? అధికారం శాశ్వతం కాదనేది అందరూ అంగీకరించే విషయమే. అయినా ప్రతిపక్షంలో కూర్చోవడానికి ససేమిరా అనడం ఏమిటి? ప్రభుత్వాన్ని తాము మాత్రమే నడపగలమని, అన్యులకు చేతకాదని భావించడం ఏమిటి? రాజకీయాలలో తమ ముందు తరం వాళ్లు నెలకొల్పిన ఉన్నత సంప్రదాయాలను తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయకపోవడం ఏమిటి? ఒకప్పుడు ఉద్దండులైన నాయకులు శాసనసభలో చర్చల సందర్భంగా తమ వాక్‌ చాతుర్యంతో సభలో నవ్వులు పూయించేవారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే చమత్కార బాణాలను అధికారపక్షం వారు కూడా ఆస్వాదించేవారు. ముఖ్యమంత్రి సైతం ముసిముసి నవ్వులు నవ్వుకొనేవారు. సభలో వాడిగా వేడిగా చర్చలు జరిగేవి. ఆ తర్వాత సభ వెలుపల అధికార, ప్రతిపక్ష సభ్యులు కలివిడిగా కాఫీలు తాగేవారు. నాలుగు దశాబ్దాల క్రితం జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు, గౌతు లచ్చన్న, ఓంకార్‌, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి వంటి హేమాహేమీలు శాసనసభలో చర్చలను రక్తికట్టించేవారు. జైపాల్‌రెడ్డి ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో, వెంకయ్యనాయుడు తెలుగు భాషపై ఉన్న పట్టుతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండేవారు. శాసనసభకు కొత్తగా ఎన్నికైన వారికి అదొక విద్యాలయంగా ఉండేది. జర్నలిజంలో కొత్తగా ప్రవేశించిన మాబోటి వాళ్లం కూడా ఎంతో నేర్చుకొనే వీలు కలిగింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజల అభిరుచి కూడా మారిపోయింది. నాయకులు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే చూడాలనుకుంటున్నారు. అర్థవంతమైన చర్చలకు తావు లేదు. సభ చప్పగా సాగుతోందని జనం టీవీలు కట్టేస్తున్నారు. ఒకప్పుడు తెలుగునాట రాజకీయాల్లో కులం–డబ్బుకు స్థానం ఉండేది కాదు. రానురానూ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ర్టాలలో గుణంతో సంబంధం లేకుండా కులం, డబ్బు మాత్రమే రాజకీయాలను శాసిస్తున్నాయి. కుల జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాష్ర్టానికి కూడా విస్తరించింది.


ప్రాంతీయ.. కుటుంబ రాజకీయం

జాతీయ పార్టీల ప్రాభవం ఉన్నంత కాలం కుటుంబ పార్టీలకు స్థానం ఉండేది కాదు. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో రాజకీయం కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయాలు కేంద్రీకృతం కాగా, తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం రాజకీయాలలో చక్రం తిప్పుతూ వచ్చింది. రాజకీయాలలో ఈ ఆధిపత్య ధోరణి అధినేతల కుటుంబాలకే పరిమితం కాలేదు. ఆయా ప్రాంతీయ పార్టీలలో కొనసాగుతున్న నాయకులు కూడా తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. రాజకీయాలలో వారసత్వం హక్కుగా మారింది. వారసత్వమే అర్హతగా మారిపోయింది. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినవారు తమ వారసులను కూడా రాజకీయాలలో దించడానికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనుకొనే వారే రాజకీయాల్లో కనిపించేవారు. ప్రజాప్రతినిధుల అధికారం పరిమితంగా ఉండేది. డబ్బు సంపాదనకు కూడా అవకాశాలు ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలలో ఉన్నవారికి డబ్బు, అధికారం అపరిమితంగా లభిస్తోంది. ఒకప్పుడు శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో ఏదైనా శాఖ విషయమై పనిపడితే సంబంధిత శాఖ మంత్రిని కలిసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శాసనసభ్యులు వారివారి నియోజకవర్గాలలో ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్నారు. అన్ని శాఖల అధికారులు సదరు శాసనసభ్యుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. అధికారులు సైతం నిబంధనలకు అనుగుణంగా కాకుండా శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. ఇంతటి అపరిమిత అధికారం ఉంటున్నందున నాయకుల వారసులు కూడా రాజకీయాల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రాజకీయాన్ని మించిన వ్యాపారం లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నవాళ్లు 30 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ప్రజాసేవ చేయడానికి అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? రాజకీయాలలో కులం, డబ్బు ప్రాధాన్యం పెరిగిపోతున్న కొద్దీ ఆయా పార్టీల అధినేతలు సైతం తమ పార్టీ శాసనసభ్యులపై అదుపు కోల్పోతున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయగల స్తోమత ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నందున శాసనసభ్యులను ప్రశ్నించే నైతికతను ముఖ్యమంత్రులు సైతం కోల్పోతున్నారు. తప్పు చేశారని తెలిసి కూడా వారి వెనుక ఉన్న కులాన్ని, డబ్బును చూసి జంకాల్సిన పరిస్థితి. ఇదొక విషవలయంలా మారిపోయింది. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినవారు కూడా నిస్సిగ్గుగా కులం కార్డు అడ్డుపెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఈ నేపథ్యంలోనే చూడాలి! డబ్బు, అధికారం లేనందున ప్రతిపక్షంలో కొనసాగడం దుర్భరంగా ఉంటుందని ఒక ఎమ్మెల్యే నిర్మొహమాటంగా చెప్పారు. ఈ పరిస్థితికి తోడు నాయకుల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో రాజకీయాలు వికటిస్తున్నాయి.


భారత్‌–పాక్‌ను మించి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి–మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాల మధ్య ప్రస్తుతం బద్ధ శత్రుత్వం నెలకొంది. కాంగ్రెస్‌ –బీఆర్‌ఎస్‌లు తెరవెనుకకు పోయి... ఈ ఇరువురి మధ్యనే రాజకీయ క్రీడ కేంద్రీకృతం అయింది. భారత్‌–పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న శత్రుత్వాన్ని మించి రేవంత్‌రెడ్డి–కేసీఆర్‌ మధ్య శత్రుత్వం నెలకొంది. ‘ప్రజలు అవకాశం ఇచ్చినంత కాలం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ఇతరులకు అవకాశం ఇచ్చారు. మళ్లీ మనకు ప్రజలు అవకాశం ఇచ్చే వరకు వేచి చూద్దాం’ అనే ధోరణి కేసీఆర్‌ కుటుంబంలో కనిపించడం లేదు. ‘ప్రజలు ఇంత కాలానికి అవకాశం ఇచ్చారు. అధికారంలో ఉన్నంత కాలం హుందాగా ఉందాం’ అన్న వైఖరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలోనూ కనిపించడం లేదు. ఉభయ పక్షాలూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఫలితంగానే తెలంగాణ రాజకీయాలలో తాజా ఉద్రిక్తతలు! ప్రత్యర్థుల చావు కోరుకొనే దాకా పరిస్థితులు వెళ్లడం క్షంతవ్యం కాదు. తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు పోలీసులతో జరిగిన ఘర్షణ సందర్భంగా అసంకల్పితంగా చోటుచేసుకున్న పరిణామాలతో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం కేసులు పెట్టుకొనే పరిస్థితి ఏమిటి? హరీశ్‌రావ్‌, కేటీఆర్‌లపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం ఏమిటి? అధికార పక్షానికి సహనం ఎక్కువ ఉండాలి. ఎన్నికల కురుక్షేత్రంలో ఓడినవారికి ఉక్రోషం ఉండటం సహజం. అందుకే గెలిచినవాళ్లు సహనం అలవర్చుకోవాలి. జరిగిన దాంట్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అంటే ఏం చెప్పగలం? కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్‌... ఆయనను ఉద్దేశించి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేసి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. హుందాగా రాజకీయాలు చేయలేని స్థితికి ఎందుకు చేరుకున్నామని నేతలు ఆత్మపరిశీలన చేసుకోలేరా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి కేసీఆర్‌ మౌనంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన వారిని పరుష పదజాలంతో దూషించిన కేసీఆర్‌, ప్రతిపక్షంలోకి చేరిన తర్వాత మాత్రం హుందాగానే వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయనకు బదులుగా కేటీఆర్‌ రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ విరుచుకుపడుతున్నారు. సమాజం ఆమోదించలేని భాషను వాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయినా హుందాగా వ్యవహరిస్తున్నారా? అంటే అదీ లేదు! దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు కూడా యుద్ధ నీతి అంటూ ఒకటి పాటిస్తారు. రాజకీయాలలో ఆ మాత్రం నీతి పాటించలేమా? అని నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దూషణ భూషణలకు తావు లేకుండా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టలేరా? ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరా? గతంలో సభలో పరిస్థితులు అదుపు తప్పినప్పుడు సరిదిద్దడానికి, ఉభయ పక్షాలకూ నచ్చ చెప్పడానికి పెద్దమనిషి పాత్ర పోషించగలవారు ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో హద్దూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న పార్టీకి ఏ గతి పట్టిందో తెలంగాణలోని రాజకీయ పార్టీలు మరచిపోతే ఎలా? చైతన్యానికి ప్రతీక అని చెప్పుకొనే తెలంగాణలో రాజకీయ పార్టీల పోకడలను సరిదిద్దేవారే లేరా? ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు ఫలానా వారిది తప్పు అని చెప్పగలిగిన మధ్యవర్తులే లేరా? ఇటు ముఖ్యమంత్రి, అటు మాజీ ముఖ్యమంత్రి కుటుంబం కొంత సంయమనం పాటిస్తే తెలంగాణ సమాజం పట్ల ఇతర ప్రాంతాల వారికి ఉన్న గౌరవాన్ని కాపాడినవారవుతారు.


ఏది ముందు..

రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు ముందుగానే చెడిపోయి వస్తారా? లేక రాజకీయాల్లోకి వచ్చాక చెడిపోతారా? అన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నం అవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ ఇప్పటివరకు హుందాగానే వ్యవహరించారు. అయితే ఏమైందో ఏమో తెలియదుగానీ ఉన్నట్టుండి ఆయన సగటు రాజకీయ నాయకుడి బాటలోనే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను బాడీ షేమింగ్‌ చేసి అవమానించారు. ఆయన దవడ ఒక పక్క వంకరగా ఉండటాన్ని ఎగతాళిగా సైగలు చేసి చూపించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు కూడా ఇంత త్వరగా చెడిపోతారా? అన్న అనుమానం ఇప్పుడు కలుగుతోంది. ఈ విషయం అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అప్పుడప్పుడూ బ్రహ్మాండమైన జోక్స్‌ పేలుస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరాచకాల వల్ల తనలాంటి వాళ్లు బొద్దింకలుగా మారుతున్నారని జగన్‌రెడ్డి గురువారం నాడు విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. ప్రజలు ఒక మాదిరిగా కూడా కనబడటం లేదనే ఆయన ఇంత మాట అనగలిగి ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ అండ్‌ కో పందికొక్కుల్లా రాష్ట్రంపై పడి దోచుకున్నారన్న భావన కలిగినందునే గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పదకొండు స్థానాలకే పరిమితం చేశారు. నెత్తిన డజనుకు పైగా అవినీతి కేసులను మోస్తూ తనలాంటి వారు బొద్దింకలుగా మారతారని అనగలగడం వ్యవస్థల పట్ల జగన్‌కు ఉన్న చులకన భావానికి నిదర్శనం కాక మరేమిటి? ఎందుకోగానీ జగన్‌రెడ్డి నోట ఈ మాట విన్నాక అదుర్స్‌ సినిమాలో రమాప్రభను ఉద్దేశించి ‘మీరు సిగ్గుపడకండీ, చచ్చిపోవాలనిపిస్తోంది’ అన్న బ్రహ్మానందం డైలాగు గుర్తుకొస్తోంది. తనపై ఉన్న అవినీతి కేసులు విచారణకు నోచుకోకుండా పైవాళ్ల అండతో న్యాయ వ్యవస్థతో దాగుడుమూతలు ఆడుతూ తప్పించుకు తిరుగుతున్న జగన్‌రెడ్డి తనను తాను బొద్దింకగా అభివర్ణించుకోవడాన్ని దుస్సాహసం అనుకోవాలా? లేక వ్యవస్థలను పరిహసించడం అనుకోవాలా? విచిత్రంగా విజయ్‌ మాల్యా కూడా గురువారం నాడు తనకు కాక్రోచ్‌గా మారాలని ఉందన్నారు. రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన విజయ్‌ మాల్యా, అవినీతి కేసుల భారాన్ని మోస్తూనే ఉన్న జగన్‌రెడ్డి వంటి వాళ్లు బొద్దింకలుగా మారిపోతే కాక్రోచ్‌ జనతా పార్టీకి బాగానే డిమాండ్‌ పెరుగుతున్నట్టు భావించాలి. రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలంటూ ఉద్యమాన్ని ప్రారంభించిన అభిజీత్‌ దీప్కే ఇప్పుడు ఈ ఇరువురినీ కాక్రోచ్‌ జనతా పార్టీలో చేర్చుకుంటారో లేదో చూడాలి. దీప్కే ఏ కారణం వల్లనైనా కాదని అంటే జగన్‌రెడ్డి వంటి వారు కాక్రోచ్‌ జనతా పార్టీని కొనుగోలు చేయడానికి కూడా వెనుకాడరు. జెన్‌–జీ తరం ప్రారంభించిన ఉద్యమాన్ని పలుచన చేయడానికి జగన్‌రెడ్డి వంటి వాళ్లు చాలు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. జగన్‌రెడ్డిలో కనీస వెరపు ఉండదు. గుండె ధైర్యం కూడా ఎక్కువే. అందుకే అంత అలవోకగా తనలాంటి వాళ్లు బొద్దింకలుగా మారాలని అనుకుంటున్నట్టు చెప్పగలిగారు. శభాష్‌ కాక్రోచ్‌ జగన్‌! కీపిటప్‌!

Updated Date - Sep 13 , 2026 | 07:49 AM