రామోజీపై బెడిసికొట్టిన బాబు నిర్ణయం!
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:20 AM
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని అంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో....
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని అంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం చేస్తారని, ఇనుమును కూడా నానబెట్టే ప్రయత్నం చేస్తారని ఆయనకు పేరుంది. సమావేశాలు, బహిరంగ సభలలో తనకు కుడి ఎడమల ఎవరు కూర్చోవాలో కూడా ఆయన ఆచితూచి నిర్ణయిస్తారు. అలాంటి చంద్రబాబు అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంటారు. ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలనే నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. నిజానికి రామోజీరావు జయంతిని ‘రాష్ట్ర పండుగ’గా నిర్వహిస్తామని చంద్రబాబు నోరు జారి అన్నారు కానీ, నిజానికి దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం! అంటే, మహాత్మాగాంధీ జయంతి వలె అన్నమాట. మహనీయుల జయంతిని, వర్ధంతిని ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతిదీ వివాదం అవుతోంది. రామోజీరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనుకోవడం కూడా ఈ బాటలోనే వివాదం అవుతోంది. ఈ నిర్ణయం వల్ల రామోజీరావుకు మంచి జరిగిందా? చెడు జరిగిందా? రామోజీరావును గౌరవించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రామోజీరావుకు కీడే ఎక్కువ జరిగింది. కీర్తిశేషుడు అని సంబోధించవలసిన వ్యక్తిని ఇప్పుడు వివాదాస్పదుడిని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా జయంతిని జరుపుకొనే అర్హత రామోజీరావుకు ఉందా? లేదా? అన్నది అప్రస్తుతం. ఆంధ్రప్రదేశ్ సమాజం ఇప్పుడు వర్గాలు, కులాలు, మతాల వారీగా విడిపోయింది. ఈ పరిస్థితులలో రామోజీరావు గొప్పవాడా కాదా అన్న చర్చను పక్కన పెడితే... ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని అనుకోవడం అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
అనవసరపు రాద్ధాంతం!
మీడియా అధిపతులు వివాదాలకు అతీతంగా ఉండటం అసాధ్యం. అందులోనూ ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో ఏ ఒక్కరూ వివాదాలకు మినహాయింపు కాలేరు. రామోజీరావు పరిస్థితి కూడా ఇంతే. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనతో రామోజీరావును కూడా విలన్‌గా చూపించే ప్రయత్నాలను ఒక వర్గం వారు చేయడం మొదలుపెట్టారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం వల్ల ఆయన భువికి దిగి వచ్చి చూసేది ఏమీ ఉండదు. ఆనందించేదీ ఉండదు. ఆయన జయంతికి ఆ అర్హత ఉందా? లేదా? అంటే ఎవరి అభిప్రాయం వారిది. రామోజీరావు మీడియా అధిపతి మాత్రమే కాదు, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇంకేముందీ... చంద్రబాబు నోటి వెంట ఆ ప్రకటన వెలువడగానే ఆ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించే వారంతా నోటికి పని చెప్పారు. సోషల్ మీడియా ఉండనే ఉంది కదా! అందులో చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు రామోజీరావును కూడా తిట్టిపోస్తున్నారు. ఈ పరిస్థితి వాంఛనీయమా? అంటే కాదనే చెప్పాలి. మంచి చేయబోతే చెడు ఎదురైనట్టుగా రామోజీరావును గౌరవించాలనుకున్న చంద్రబాబు నిర్ణయం బెడిసికొట్టింది. రాజకీయంగా కూడా ఇది చంద్రబాబుకు నష్టం చేస్తుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ఈ రెండేళ్లలో పలువురు మహనీయుల జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తామని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేయించారు. వడ్డే ఓబన్న, నందమూరి తారక రామారావు, గౌతు లచ్చన్న, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ప్రగడ కోటయ్య, మండలి వెంకట కృష్ణారావు, గురజాడ అప్పారావు, పి.లక్ష్మణ స్వామి వర్మ ఇలా పలువురి జయంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయించారు. వాటి విషయంలో ఏర్పడని వివాదం ఇప్పుడే ఎందుకంటే... రామోజీరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో పాటు మీడియా అధిపతి కావడం ప్రధాన కారణం. చంద్రబాబు ప్రకటన వల్ల రామోజీరావుకు కొత్తగా వచ్చే భుజకీర్తులు ఏమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగ అని చంద్రబాబు ప్రకటించడం వల్లే తంటా అంతా వచ్చిపడింది.
తూతూమంత్రపు తంతులు!
నిజానికి.. ఈ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఒక తంతుగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 27 మంది జయంతులను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? వీరిలో పలువురి గురించి జనాలకు ఏమీ తెలియదు. వారి జయంతి ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని అధికార యంత్రాంగానికి కూడా తెలియదు. పొరపాటున గుర్తుకొస్తే నాలుగు గోడల మధ్య ఒక ఫొటో పెట్టి, దండ వేసి మమ అనిపిస్తారు. అధికారిక కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ప్రొసీజరే ఉంది. రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఆచరణలో అలా జరగడం లేదు. ముఖ్యమంత్రులకు ఎవరైనా గుర్తుచేస్తే అప్పటికప్పుడు ఒక ఫొటోను తెచ్చి దండవేస్తుంటారు. రాజకీయాలు కలుషితం అవుతున్నకొద్దీ మహనీయులను గౌరవించే సంస్కృతికి మనం దూరమవుతున్నాం. మహాత్మాగాంధీ జయంతి, వర్ధంతిని ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జరుపుకొనేవారు. ఇప్పుడు అదొక తంతుగా మారిపోయింది. మూడు నాలుగు దశాబ్దాల క్రితం మహాత్మాగాంధీ వర్ధంతి అయిన జనవరి 30న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో సైరన్ మోగించేవారు. జాతిపితకు శ్రద్ధాంజలి ఘటించేందుకుగాను ఆ సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ కొద్దిసేపు ట్రాఫిక్‌ను నిలిపివేసేవారు. జనం కూడా విసుక్కోకుండా శ్రద్ధాంజలి ఘటించేవారు. ఇప్పుడు అదంతా గతం. ఈ తరానికి గాంధీ వర్ధంతి తేదీ కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ పరిస్థితులు, అవసరాలను బట్టి కొంతమంది మహనీయులు మరుగున పడుతుండగా.... అప్పటి వరకూ మరచిపోయిన మహనీయులను కొత్తగా తెర మీదకు తెస్తున్నారు. జ్యోతీరావ్ ఫూలే ఇందుకు నిదర్శనం. కొంతకాలం క్రితం వరకు జ్యోతీరావ్ ఫూలే ఎవరో తెలుగు వాళ్లకు తెలియదు. కాచిగూడ చౌరస్తాలో బస్ట్ సైజ్‌లో చిన్న విగ్రహం మాత్రమే ఉండేది. ఆయన జయంతిని ఎవరూ పట్టించుకొనే వారు కారు. ఈ లెక్కన రాజకీయాలలో జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు అవసరాలను బట్టి ప్రాధాన్యం పెరగడం, తగ్గడం జరుగుతుందన్నమాట. జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబరు 14న బాలల పండుగగా జరుపుకొంటాం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... దేశానికి నెహ్రూ అపకారం చేశారనే భావనను వ్యాప్తి చేస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించి గౌరవించాం. ఇప్పుడు ఆయనను వైశ్య కులానికి చెందినవాడిగా చెప్పుకొంటున్నాం. ఇంతకంటే పతనం ఉంటుందా? జాతిపితకు కులం అంటగట్టే స్థాయికి దిగజారడాన్ని మించిన పతనం ఏమి ఉంటుంది? ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములును కూడా వైశ్య కులానికే పరిమితం చేస్తున్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పరిస్థితి కూడా అంతే. రాజకీయాలలోకి వచ్చి సర్వం త్యాగం చేసిన ప్రకాశం పంతులును ఎంతమంది స్మరిస్తున్నారు? ఆయనను గుర్తు చేసుకోవడం వల్ల ఓట్ల పరంగా ప్రయోజనం ఉండదు కనుక రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. దళితులు, బీసీల ఓట్లు కావాలి కనుక అంబేడ్కర్, జ్యోతీరావ్ ఫూలేకు ప్రాధాన్యం పెరిగింది.
నిజమైన గౌరవం ఎక్కడ?
కులాలు, మతాలను ఆకర్షించడం కోసం కొందరి జయంతిని, వర్ధంతిని ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారు. అది కూడా ఒక తంతుగా జరుగుతోంది. గాంధీలను మరచిపోయి గాడ్సేలను ఆరాధిస్తున్న రోజుల్లో ఉన్నాం మనం. ఈ కారణంగా ఎంతోమంది మహనీయుల గురించి ఈ తరానికి తెలియకుండా పోతోంది. దామోదరం సంజీవయ్య గొప్పతనం ఎంతమందికి తెలుసు? దళితులు కూడా అంబేడ్కర్‌ను స్మరిస్తారేగానీ సాటి తెలుగువాడిగా పుట్టి ఆదర్శంగా రాజకీయాలు చేసి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన సంజీవయ్య గురించి మాట్లాడటం లేదే? బళ్లారి రాఘవ గురించి ఈ తరం వారిని ప్రశ్నిస్తే ఆయన ఎవరు? అని అడుగుతారు. కవయిత్రి మొల్ల అంటే ఆమె ఎవరు? అని ఎదురు ప్రశ్న వేస్తారు. దివిసీమ గాంధీగా పేరొందిన మండలి వెంకట కృష్ణారావును కాపులు కూడా గుర్తుపెట్టుకోవడం లేదే! సర్దార్ గౌతు లచ్చన్న గురించి ఎంతమందికి తెలుసు? వీరందరి జయంతులు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లో ఉన్నాయి. అయితే, కొందరి జయంతులను మాత్రమే ఘనంగా నిర్వహిస్తుండగా... మరికొందరి జయంతులను మరచిపోతున్నారు. ఇంతోటి దానికి వాటిని ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రకటించడం అవసరమా? అంటే కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రామోజీరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఒక వర్గం వాళ్లు, ముఖ్యంగా వైసీపీకి చెందిన వాళ్లు నోటికి పని చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి సొంత మీడియా అయితే ఘోర అపచారం జరిగినట్టుగా గుండెలు బాదుకుంటోంది. పచ్చ పురుగు అని రామోజీరావును తిట్టిపోస్తోంది. మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదన్న సంస్కారాన్ని మరచి విషం కక్కుతున్నారు. వ్యక్తులను గుర్తించి గౌరవించే సంస్కారానికి మనం దూరం కావడం వల్ల రామోజీరావు ఉదంతం ఇంత వివాదం అయింది. ఈ వ్యవహారం ఇంత రాద్ధాంతానికి దారితీస్తుందని అనుకుంటే బహుశా చంద్రబాబు ఆ ప్రకటన చేసి ఉండేవారు కారేమో!

ఇదీ చంద్రబాబు మనస్తత్వం...
నిజానికి చంద్రబాబు సంకుచితంగా ఆలోచించే మనిషి కాదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన హైదరాబాద్‌లో పలు ప్రాంతాలకు మాజీ ముఖ్యమంత్రుల పేర్లను పెట్టారు. చిరాన్ ప్యాలెస్ వద్ద ఉన్న అటవీ భూమిని కాసు బ్రహ్మానందరెడ్డి పేరిట పార్కుగా అభివృద్ధి చేశారు. ఇవాళ అది కేబీఆర్ పార్కుగా పేరొందిన విషయం తెలియంది కాదు. నీలం సంజీవరెడ్డి పేరిట అప్పటికే సంజీవరెడ్డి నగర్ ఏర్పడింది. చంద్రబాబు హయాంలో కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియం, జలగం వెంగళరావు పార్కులను అభివృద్ధి చేశారు. జగన్‌రెడ్డి వలె చంద్రబాబు సంకుచిత మనస్తత్వం ఉన్నవాడు కాదు. అందుకే కులాలను చూడకుండా మాజీ ముఖ్యమంత్రులను గుర్తించి గౌరవించారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన జర్నలిస్టులకు లక్షలాది రూపాయల సొమ్మును వైఎస్ఆర్ అవార్డుల పేరిట ఇవ్వలేదా? కడప జిల్లాకు వైఎస్ పేరు పెడితే ఎవరైనా అభ్యంతరం చెప్పారా? రామోజీరావు విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండటం సహజం. ఇప్పుడున్న పరిస్థితులలో అందరికీ ఆమోదయోగ్యులైన వారిని చూపించగలరా? అయినా రామోజీరావు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపడ్డారు. రామోజీరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించడం వల్ల చంద్రబాబుకు రాజకీయంగా కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని చెప్పవచ్చు. కేవలం తంతుగా మారే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు ఇకనైనా ఆచితూచి ఆలోచించాలి. గతించిన వారిని అత్యుత్సాహంతో వివాదాల్లోకి లాగడం వాంఛనీయం కాదు. ఇంతకు ముందే చెప్పుకొన్నట్టుగా మహనీయులను, జాతిపితగా ప్రకటించుకున్న వారిని కూడా కులం కోణంలోనే చూస్తున్న రోజులివి. ఈ నేపథ్యంలో రామోజీరావు లేదా మరొకరి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించడం అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రభుత్వాలు ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమాలుగా ప్రకటించిన జయంతులలో ఎంతమంది జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారో, ఎంతమంది జయంతిని మరచిపోతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమాలకోసం ఇంత వివాదం అనవసరం. రామోజీరావు హీరోనా? విలనా? అన్నది అప్రస్తుతం. ఆయన తనదైన శైలిలో జీవించి వెళ్లిపోయారు. ఆయనను గౌరవించేవాళ్లు గౌరవిస్తారు. తిట్టుకొనేవాళ్లు తిట్టుకుంటారు. మధ్యలో ప్రభుత్వం కల్పించుకోవడం ఎందుకు?

‘స్థానిక’ చిత్రాలు
ఈ విషయం అలా ఉంచితే... అనైతికంలో కూడా నైతికం ఉంటుందని చాటి చెప్పే సంఘటన ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో ఓట్లు లెక్కిస్తూ ఉండగా ఒక ఓటరు... పోటీచేసిన అభ్యర్థులలో ఎవరో ఒకరు ఇచ్చిన వెయ్యి రూపాయలను ఓటుతో పాటు బ్యాలెట్ పెట్టెలో వేసి తన నైతికతను చాటుకున్నాడు. ఓట్లు వేయడానికి డబ్బు తీసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. అలాంటిది తీసుకున్న డబ్బును మళ్లీ వెనక్కు ఇచ్చేయడం అనైతికతలో నైతికత అవుతుంది కదా! నేను డబ్బు తీసుకుని ఓటు వేసే రకం కాదని సదరు ఓటరు నోటు రాసి మరీ తీసుకున్న వెయ్యి రూపాయలను బ్యాలెట్ బాక్సులో వేశాడు. ఎంపీటీసీ ఎన్నికల్లోనే మరోచోట పోటీచేసిన అభ్యర్థుల నుంచి ఓటర్లు పైసా కూడా తీసుకోకుండా ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుకోసం ఒక్క రూపాయి కూడా పంచలేదు. ప్రజలు కూడా డబ్బు ఆశించకుండా ఓట్లు వేశారు. దీంతో ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసరావు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి డబ్బు తీసుకోకుండా ఓటు వేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ప్రజలందరూ ఇలాగే డబ్బు ఆశించకుండా ఓట్లు వేస్తే రాజకీయాలు బాగుపడతాయి కదా? అయితే, ఇలాంటివి అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. మున్సిపల్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పలమనేరులో 32వ వార్డుకు పోటీచేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి తన వద్ద డబ్బు తీసుకుని ఓటు వేయని వాళ్లను మర్యాదగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని బహిరంగంగా కోరడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. పది లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి మరీ ఓటర్లకు పంచానని, ఓడిపోయినందున తన డబ్బు తిరిగి ఇవ్వాలని వాపోయాడు. ఇలాంటి సంఘటనలు దిగజారుతున్న రాజకీయాలకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
ఎన్నికలు అంటేనే డబ్బు మయం అయ్యాయి. ఒక వార్డు మెంబర్ పది లక్షలు పంచిపెట్టాడంటే ఏం చెప్పాలి? అంత డబ్బు ఖర్చు చేసి ఆయన గెలిస్తే మాత్రం ఏం సాధిస్తాడు? ఎన్నికల్లో పంచిపెట్టిన డబ్బు తిరిగి వడ్డీతో సహా సంపాదించే ప్రయత్నం చేయకుండా ఉంటాడా? ఇక్కడ తప్పు ఎవరిది? డబ్బు తీసుకుని ఓటు వేసిన వారిదా? లేక ఓటర్లకు డబ్బు ఆశ చూపి వారిని ప్రభావితం చేయాలని అనుకున్న వారిదా? లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వజూపడం కూడా నేరమే అవుతుంది. కనుక ఇక్కడ ఉభయ పక్షాలూ నేరం చేసినట్టే! ఎన్నికల్లో డబ్బు ప్రభావం పోనంత వరకు రాజకీయాలు బాగుపడవు. అటు నాయకుల్లో, ఇటు ప్రజల్లో మార్పు రాకుండా రాజకీయాలు మెరుగుపడే అవకాశమే లేదు. అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అన్న ప్రశ్న ప్రశ్నగానే ఉంటుంది. వ్యవస్థ మరింత కుళ్లితేగానీ మార్పు రాదేమో? అంతవరకూ వేచి చూడాల్సిందే మరి!
ఆర్కే
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక