ముదురుతున్న ఫెవికాల్ బంధం!
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:36 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా మొదలవలేదేమిటా అని అనుకుంటున్నామో లేదో మొదలెట్టేశారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందనీ, సీమ ఎడారి అవుతోందనీ కొన్ని గొంతులు ఆనవాయితీ ప్రకారం...
ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా మొదలవలేదేమిటా అని అనుకుంటున్నామో లేదో మొదలెట్టేశారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందనీ, సీమ ఎడారి అవుతోందనీ కొన్ని గొంతులు ఆనవాయితీ ప్రకారం నిందించడం మొదలెట్టాయి. ఆ కుటుంబం అధికారంలో ఉంటే సీమ పచ్చగా మారిపోతుంది. అధికారం పోగానే సీమ ఎడారి అయిపోతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. ఇది కూడా ఆ కుటుంబం అధికారంలో లేనప్పుడే. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించకపోతే సీమ ఏమైపోవాలి అంటూ వైసీపీ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కర్నూలులో ఒక సభ నిర్వహించారు. ఎన్జీటీ ఆదేశాల వల్ల ఈ పథకం 2020లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఆగిపోయింది. ఆ తర్వాత నాలుగేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ జగన్‌రెడ్డి దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారం కోల్పోగానే ఆ పథకం గుర్తుకు వచ్చింది. ఇంకేముందీ, ఆ కుటుంబం కోసం పనిచేసే కొంత మంది రాయలసీమ మోతుబరులు స్వరాలు సవరించుకుంటున్నారు. సీమకు అన్యాయం చేస్తారా? అంటూ గొంతు విప్పే పనిలో ఉన్నారు. ఇక్కడ కీలకమైన మరో అంశం కూడా ఉంది. జగన్‌రెడ్డి కోసం రాయలసీమకు చెందిన మోతుబరులే కాకుండా తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ కూడా పనిచేస్తుంటుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతున్నారని భారత రాష్ట్ర సమితి గతంలో విమర్శించింది. ఇప్పుడు రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కూడబలుక్కొని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన పోరుబాట గురించి భారత రాష్ట్రసమితి పట్టించుకోలేదు. తెలంగాణకు ద్రోహం చేయాలనుకోవడం ఏమిటి? అని జగన్‌రెడ్డిని నిలదీయలేదు. తెలుగుదేశం పార్టీ లేదా మరో పార్టీ ఈ పని చేసి ఉంటే బీఆర్‌ఎస్ నాయకులు నోటికి పనిచెప్పేవారు. కేసీఆర్ పత్రికలో గుండెలు బాదుకొనేవారు. వైసీపీ నిర్వహించిన సభ గురించి కేసీఆర్ పత్రికలో ఒక్క వార్త కూడా రాయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తెలంగాణ ఎడిషన్‌లో కూడా ప్రముఖంగా ప్రచురించే జగన్‌రెడ్డి రోత మీడియాలో కూడా ఈ వార్త కనిపించలేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో తాము చేసే రాజకీయాల వల్ల తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలగకూడదు అని జగన్ అండ్ కో భావిస్తున్నారన్నమాట! అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం చేపట్టే కార్యక్రమాలను కేసీఆర్ సొంత మీడియా కప్పిపెడుతోంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కన్నా జగన్‌రెడ్డి ప్రయోజనాలే కేసీఆర్ అండ్ కోకు ముఖ్యమని అర్థమవుతోంది. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు జగన్‌రెడ్డికి గానీ, ఇటు కేసీఆర్‌కు గానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తుకొస్తాయి.
వారు అధికారంలో ఉంటే మాత్రం తమ ప్రాంత ప్రయోజనాలు పట్టవన్నమాట! రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలెట్టిన జగన్‌రెడ్డిని కేసీఆర్ అండ్ కో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్‌రెడ్డిని తెలంగాణ ద్రోహి అని ఒక్క రోజైనా విమర్శించారా? నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జలాల్లో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న నల్లమలసాగర్ వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఏమీ ఉండదంటున్నారు. పోలవరం నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను వినియోగించుకోవడానికే నల్లమలసాగర్‌ను చంద్రబాబు ప్రతిపాదించారు. అయినా గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోతారా అని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. సముద్రంలో కలిసే జలాలను వాడుకుంటే తప్పేమిటి? అని కేంద్ర జల సంఘం చైర్మన్ కూడా ప్రశ్నించడం గమనార్హం. నీళ్ల రాజకీయాలు తెలుగునాట ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం తెలుగు గంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా, మిగులు జలాల ఆధారంగా కాకుండా నికర జలాల ఆధారంగానే ఆ పథకాన్ని చేపట్టాలని వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో నానా యాగీ చేశారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి అధికారం దూరం కాగానే రాయలసీమతో పాటు కులాల కుంపట్లు గుర్తుకు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబు గానీ, జగన్‌రెడ్డి గానీ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే, దుమ్ముగూడెం తర్వాత దిగువకు ప్రవహించే గోదావరి జలాల ఆధారంగానే పోలవరం నిర్మితమవుతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వచ్చే ఈ వరద జలాలను తెలంగాణ వినియోగించుకోలేదు. వినియోగించుకున్నా పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి ఏటా కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి దిగువన సముద్రంలో కలుస్తుంది. అయినా ఇటు కేసీఆర్, అటు జగన్‌రెడ్డి అధికారం కోల్పోయినందున నీటి రాజకీయాలకు తెరలేపారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దోషిగా చిత్రీకరించాలని కేసీఆర్, రాయలసీమ ప్రజల దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని జగన్‌రెడ్డి ఎత్తుగడలు సిద్ధం చేసుకొని పరస్పర సహకారంతో అమలు చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య వైరం ముదురుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్‌రెడ్డి మధ్య మొదటి నుంచీ వైరం ఉంది. ఈ క్రమంలో తమ ప్రత్యర్థులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని కేసీఆర్, జగన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ రెండు పార్టీలకూ చెందిన సోషల్ మీడియా విభాగాలు కూడా కలసికట్టుగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డికి మద్దతుగా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షణగా నిలబడుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై ఉమ్మడిగా దాడి చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలతో చంద్రబాబుకు ఏమి పని అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ అండ్ కో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎందుకు వేలుపెడుతున్నారో వారికే తెలియాలి. తెలంగాణలో జల రాజకీయాలను బీఆర్‌ఎస్ ముమ్మరం చేయగా, రాయలసీమ హక్కుల పేరిట జల రాజకీయాలకు వైసీపీ తెరలేపింది. రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణను రక్షణ కవచంగా కేసీఆర్ అండ్ కో ఎలా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం పోగానే వైఎస్ కుటుంబం కూడా రాయలసీమను అలా రక్షణ కవచంగా వాడుకుంటూ వస్తోంది. ఇద్దరిదీ ఒకే దారి.
కాపులను దూరం చేయడమే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఏడాదిన్నర అయినందున జగన్‌రెడ్డి తన వద్ద ఉన్న అస్త్రశస్ర్తాలకు పదునుపెడుతున్నారు. రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం కోసం స్కెచ్ సిద్ధం చేస్తూనే మిగతా జిల్లాలలో కులాల కుంపట్లను రాజేయడం మొదలుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ– కాపు కులాల మధ్య విద్వేష బీజాలు నాటింది కూడా ఆ కుటుంబమే. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ రెండు కులాలవారూ ఒకే రాజకీయ వేదిక పంచుకుంటున్నారు. సహజంగానే ఇది జగన్‌రెడ్డి కడుపు మంటకు కారణం అవుతోంది. కమ్మ–కాపులది డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్‌కు ఇప్పుడు బీసీలు, మాదిగలు, ముస్లింలు జత కలిశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి బలమైన రాజకీయ వేదికగా రూపొందింది. ఈ కారణంగా గత ఎన్నికల్లో కూటమి 164 సీట్లలో గెలుపొందింది. అది కూడా భారీ మెజారిటీలతో. కమ్మ–కాపులు కలవకుండా ఇప్పటిదాకా అడ్డుకుంటూ వచ్చారు. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చోటుచేసుకున్న అరాచకాలను గమనించిన జనసేనాని పవన్ కల్యాణ్ పరిణతి ప్రదర్శించి తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారు. పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో జట్టు కట్టకుండా అడ్డుకోవడం కోసం ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమిలో విభేదాలు రాకపోతాయా అని ఏడాదిన్నరగా ఎదురుచూశారు. అలాంటి సంకేతాలు కనిపించకపోగా కనీసం మరో పదిహేనేళ్లపాటు కూటమి ఐక్యంగా ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్ కోసం అది అవసరమని పవన్ కల్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు. దీంతో కాపులను పవన్ కల్యాణ్ నుంచి దూరం చేయడానికి జగన్ అండ్ కో వ్యూహ రచనకు శ్రీకారం చుట్టారు. కాపులు పవన్ కల్యాణ్‌కు దూరమైతే కూటమి దానంతట అదే బలహీనపడుతుందన్నది వారి అభిప్రాయం. తమ వ్యూహాన్ని అమలుచేయడానికి అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అంబటి రాంబాబు రూపంలో అటువంటి అవకాశం వచ్చిందని భావించి తమ వ్యూహాన్ని అమలుచేయడం మొదలెట్టారు. రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అంబటి రాంబాబు 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తనను తాను కాపు నాయకుడిగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. కాపు జాతి కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, తాను కాపు నాయకుడిని కాదని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. తన ముగ్గురు కుమార్తెలలో ఇద్దరికి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారితో వియ్యం అందుకున్నారు. వాస్తవ నేపథ్యం ఇది కాగా, జగన్ అండ్ కో ఇప్పుడు అకస్మాత్తుగా రాంబాబును కాపు నాయకుడిగా మార్చివేశారు. నాలుగు రోజుల క్రితం అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు. ప్రతిగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. నిజానికి ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు. అయితే జగన్‌రెడ్డి పాలనలో ఇలాంటి దాడులు పరిపాటిగా ఉండేవి. నాటి దాడుల బాధితులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ కారణంగానే గతంలో అడ్డగోలుగా ప్రవర్తించిన వారిపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? మీకు చేతకాదా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుది విచిత్రమైన పరిస్థితి. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న కార్యకర్తలను సంతృప్తిపరచడానికి చట్టవిరుద్ధమైన చర్యలను అనుమతించలేని స్వభావం ఆయనది. దీంతో ఇటు కార్యకర్తలను సంతృప్తిపరచలేక, అటు చట్టవిరుద్ధ పోకడలను అనుమతించలేక చంద్రబాబు నలిగిపోతున్నారు. వైసీపీ నాయకులు ప్రవర్తించినట్టుగానే తెలుగుదేశం నాయకులు కూడా ప్రవర్తిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకోవడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఈ కారణంగానే అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేసిన వారిపై కేసులు కట్టించి అరెస్టు చేయించారు. జగన్‌రెడ్డి హయాంలో అరెస్టుల సంగతి దేవుడెరుగు, కనీసం కేసులు కూడా ఉండేవి కావు. ‘ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తిడితే మా వాళ్లకు బీపీ పెరిగి ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. అందులో ఏముంది?’ అని సీఎంగా ఉన్నప్పుడు జగన్‌రెడ్డి సమర్థించుకొనేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును ‘ల’కారాలతో దూషించినందున తెలుగుదేశం కార్యకర్తలకు కూడా బీపీ పెరిగి ఉంటుందని జగన్‌రెడ్డి సరిపెట్టుకోవడం లేదు. అలా సరిపెట్టుకోవాలనుకోవడం కూడా సరికాదు. దాడుల సంస్కృతిని ఖండించాల్సిందే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కులం కార్డును తెరపైకి తేవడం విశేషం. గతంలో కాంగ్రెస్ నాయకుడిగా, ఇప్పుడు వైసీపీ నాయకుడిగా చలామణి అవుతున్న అంబటి రాంబాబును ఉన్నపళంగా కాపు నాయకుడిగా మార్చిపడేశారు. దాడి జరిగిన వెంటనే కాపు నాయకుడిపై దాడి చేశారు అంటూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. కుట్రలు, కుతంత్రాలు, కపట నాటకాలను జగన్‌రెడ్డి పకడ్బందీగా అమలు చేస్తున్నారు అనడానికి కాపు కులం కార్డును తెరపైకి తేవడం నిదర్శనం. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కాపు సామాజిక వర్గానికి చెందిన వారితో కలసి జనసేనాని పవన్ కల్యాణ్‌తో పాటు కాపులను తిట్టించేవారు. కాపులను మురికి తిట్లతో అవమానించారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి తన రాజకీయ ప్రయోజనాల కోసం కాపు కార్డును ఆశ్రయించారు. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న అంబటి రాంబాబును పరామర్శించడానికి కాపు ప్రతినిధులను పంపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు, పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ప్రకటించిన ముద్రగడ పద్మనాభం అన్నట్టుగానే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఇప్పుడు రెడ్డిగా మారిపోయిన ముద్రగడ కూడా రాంబాబును పరామర్శించిన వారిలో ఉండటం విశేషం. మొత్తంమీద అంబటి రాంబాబును కాపు నాయకుడిగా మార్చివేశారు. ముందు ముందు ఈ ముద్ర ఆయనకు నష్టం చేయవచ్చు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా సమిధలుగా మార్చుకోవడానికి జగన్‌రెడ్డి వెనుకాడరు అనడానికి ఇదొక నిదర్శనం. చిరంజీవి కుటుంబానికి, కాపులకు విడదీయరాని బంధం ఉంది. ఈ కారణంగానే పవన్ కల్యాణ్‌ను కాపులు తమవాడిగా పరిగణిస్తున్నారు. చంద్రబాబు–పవన్ కల్యాణ్ మధ్య గొడవలు జరగడం లేదు కనుక కాపులను పవన్ కల్యాణ్ నుంచి దూరం చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని భావించడం వల్లనే జగన్‌రెడ్డి కులం కార్డును బయటకు తీశారు. కమ్మ–కాపుల మధ్య మరోసారి వైషమ్యాలను సృష్టించే పని మొదలెట్టారు. ఈ ఎత్తుగడలను చంద్రబాబు–పవన్ కల్యాణ్ ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాలి. పరామర్శలను అమితంగా ఇష్టపడే జగన్‌రెడ్డి యథావిధిగా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. శుక్రవారం నాడు జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ పరామర్శల సందర్భంగా జగన్‌రెడ్డి చేస్తున్న రచ్చ పరమ రోతగా ఉంటోంది. ఆయన పర్యటన అంటేనే జనం హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లినప్పుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తన పరామర్శ యాత్రలో పాల్గొని ఇరువురు ప్రాణాలు కోల్పోవడంపై జగన్‌రెడ్డి కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడం ఆయన వికృత మనస్తత్వానికి నిదర్శనం. రెండు నిండు ప్రాణాలు పోయినప్పటికీ జగన్ మీడియా కూడా ఆ విషయం పట్టించుకోలేదు. తనకోసం వచ్చినవాళ్లు చనిపోతే కనీసం విచారం వ్యక్తం చేయని వ్యక్తి జననేత ఎలా అవుతాడు? తనకు అంతులేని జనాదరణ ఉందని చెప్పుకోవడానికి జనసమీకరణ చేసుకోవడంలో తప్పులేదు గానీ వచ్చిన వారి రక్షణ గురించి కూడా ఆలోచించాలి కదా? ఈ జన సమీకరణ నాటకం కొన్ని సందర్భాలలో రోతగానూ ఉంటోంది. జగన్‌రెడ్డికి నిజంగా అంత జనాదరణే ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదో చెప్పాలి. ఎంతటి జనాదరణ ఉన్న నాయకులైనా పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లినప్పుడు జనాలు తండోపతండాలుగా రారు కదా? జగన్‌రెడ్డి పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కూడా ఇదే షో చేస్తున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించినందుకు రాష్ట్ర ప్రజలందరూ పశ్చాత్తాపంతో తిండీ తిప్పలూ మాని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న భ్రమలో తాను బతుకుతూ రాష్ట్ర ప్రజలు కూడా అవే భ్రమల్లో బతకాలని జగన్ కోరుకుంటున్నట్టుగా ఉంది. జగన్‌రెడ్డి వైఖరి మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటున్న తన వాళ్లను ప్రోత్సహించకుండా కట్టడి చేస్తే ఏ గొడవా ఉండదు కదా? ప్రత్యర్థులను తిట్టమని ప్రోత్సహించి ఆ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే గగ్గోలు పెట్టి ఏమి ప్రయోజనం?

గతం గుర్తెరగాలి.. తీరు మారాలి!
ఏ పార్టీ వారైనా భాష విషయంలో సంయమనం పాటించాల్సిన తరుణం ఆసన్నమైంది. తెలుగునాట ఇటీవలి కాలంలో బూతులు సర్వసాధారణం అయ్యాయి. ఈ విషయంలో నాయకులను కట్టడి చేయడానికి చట్టం చేసే అవకాశం ఉందేమో ప్రభుత్వాలు పరిశీలించాలి. బూతు భాష అధికారిక భాషగా మారడం ఏమిటి? రేపటి తరానికి ఏమి నేర్పుతున్నాం? జగన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రానికి ముందు రాజకీయాల్లో ఇలాంటి ముతక భాష అంతగా వినిపించేది కాదు. పేర్ని నాని, జోగి రమేశ్, అంబటి రాంబాబు వంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి ముతక భాష వాడిన దాఖలాలు పెద్దగా లేవు. ఇప్పుడు వారు నోరు తెరిస్తే బూతులు ప్రవహిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాత్రమే మాట్లాడిన కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఆనాడు అధికార మదంతో రెచ్చిపోయిన ఆయన ఏం బావుకున్నారు? అలాంటి వారి దుస్థితి గమనిస్తూ కూడా కొంత మంది వైసీపీ నాయకులు ఇప్పటికీ వైఖరి మార్చుకోకపోవడం వింతగా ఉంది. అంతు తెలియని వైరస్ ఏదో సోకినట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. జగన్‌రెడ్డిని సంతృప్తిపరచడానికి తమ స్థాయిని తగ్గించుకొని ప్రవర్తించడం వల్ల సమాజంలో తమ ప్రతిష్ఠ దిగజారుతుందన్న వాస్తవాన్ని వారు గుర్తిస్తే మంచిది. దాడులు–ప్రతిదాడుల సంస్కృతికి కూడా రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పాలి. ఈ విషయంలో కూటమి నాయకులు సంయమనంతో బాధ్యత తీసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు కన్నూ మిన్నూ కానకుండా దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేశారు. చంద్రబాబు ఇంటిపైన కూడా దాడి చేశారు. చివరికి ఏమైంది? ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. నాటి సంస్కృతి పట్ల వెగటు కలగడం వల్లనే కదా ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు అన్న వాస్తవాన్ని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద దాడి చేశారు, ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం కనుక మీ మీద దాడి చేస్తాం అని భావిస్తే ఇద్దరి మధ్యా తేడా ఏముంటుంది? రాష్ట్రంలో నాటి అరాచక పరిస్థితులు ఇకపై ఉండకూడదు అనే కదా జనం మిమ్మల్ని ఎన్నుకుంది? అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలకు పాల్పడిన వారిని చట్టపరంగా మాత్రమే శిక్షించాలి. నోరు పారేసుకుంటున్న వారిని ప్రజల విజ్ఞతకే వదిలేయడం మంచిది.
గతంలో నోరు పారేసుకున్న ఒక్కరైనా గత ఎన్నికల్లో గెలవగలిగారా? లేదే! జగన్‌రెడ్డి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గ్రహించారు కనుకనే ఆయన పార్టీని చిత్తుగా ఓడించారు. బలప్రదర్శన పేరిట మరెంతో మంది ప్రాణాలు తీయడానికి కూడా ఆయన వెనుకాడరు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి మరెన్నో వికృత క్రీడలకు తెరలేపుతారు. కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టడానికి మరిన్ని బూతులతో విరుచుకుపడవచ్చు. అధికారంలో ఉన్నందున సంయమనం పాటించాల్సిన బాధ్యత కూటమిపైనే ఉంటుంది. జగన్‌రెడ్డి నుంచి ఉదాత్తమైన రాజకీయాలను ఆశించలేము. తమది మంచి ప్రభుత్వం అని చెప్పుకొంటున్న కూటమి నాయకులైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం! త్వం శుంఠ అంటే త్వం శుంఠ అన్నట్టుగా పరిస్థితి మారకూడదు. నాటి పాపాలు వెంటాడుతున్నందున జగన్‌రెడ్డి ఇప్పుడు అన్యాయం, అక్రమం అని ఆక్రోశిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అదే దుస్థితి తమకు ఎదురు కాకూడదని కూటమి నాయకులు గ్రహించాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్న తమ వైఖరి మార్చుకోవాలి. పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసే ప్రయత్నాలు మంచివి కావు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండాలని, అభివృద్ధి జరగాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు. నేరం చేసినవాళ్లను చట్ట ప్రకారం శిక్షించే అవకాశం కల్పించాలే గానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని అనుకోవద్దు. అలా చేస్తే దొందూ దొందే అని ప్రజలు భావించే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!
ఆర్కే
ఇవి కూడా చదవండి..
మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్