Share News

Amaravati Capital Issue:: అమరావతిపై అవే కుట్రలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:36 AM

‘ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయం’... అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అన్న మాట ఇది. ‘ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాష్ట్ర రాజధాని అవుతుంది...

Amaravati Capital Issue:: అమరావతిపై అవే కుట్రలు

‘ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయం’... అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అన్న మాట ఇది. ‘ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాష్ట్ర రాజధాని అవుతుంది’ ముఖ్యమంత్రిగానూ, మాజీ అయ్యాకా జగన్మోహన్‌ రెడ్డి అన్న మాట, అంటున్న మాట ఇదే! కేసీఆర్‌–జగన్‌ల మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. అందుకే కాబోలు ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. అదే సమయంలో ఆలోచనలు కూడా అదే విధంగా సాగుతున్నాయి. ఇరువురికీ మొదటి నుంచి ఉమ్మడి శత్రువు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కనుక వారు ఒకే దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లడం నామోషీగా కేసీఆర్‌ భావించగా, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానే అవసరం లేదని జగన్మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారందరూ విధుల నిర్వహణకు సచివాలయానికి వెళ్లేవారు. మంత్రివర్గ సమావేశాలు కూడా అక్కడే నిర్వహించేవారు. దేశంలోని ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. కేసీఆర్‌ ఒక్కరే సచివాలయం ఉనికిని గుర్తించడానికి ఇష్టపడలేదు. ‘ప్రగతి భవన్‌’ పేరిట ఖరీదైన భవనాన్ని నిర్మించుకొని అక్కడే నివాసం–కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అధికారిక సమావేశాలు, మంత్రివర్గ సమావేశాలు కూడా అక్కడే నిర్వహించేవారు. పాత సచివాలయ భవనాలను కూలగొట్టి ఆర్భాటంగా నూతన సచివాలయ భవనాన్ని నిర్మించినప్పటికీ అక్కడికి కూడా వెళ్లలేదు ఇలాంటి పోకడల వల్లనే రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ అధికారాన్ని కోల్పోయారు. 1989కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ తరచూ గండిపేట వద్ద నిర్మించుకున్న ఆశ్రమానికి వెళ్లేవారు. అప్పుడు దానిపై విమర్శలు వచ్చాయి. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్‌ కూడా ప్రగతి భవన్‌లో ఉండకుండా తన ఫాం హౌస్‌లో ఎక్కువగా గడిపేవారు. ఇలాంటి చర్యల వల్ల ఇరువురూ అధికారం కోల్పోయారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి విషయానికి వద్దాం! ‘ఏ రాష్ర్టానికైనా రాజధాని అవసరమా? రాజధాని అన్న పదం రాజ్యాంగంలో ఎక్కడుంది?’ అని ఆయన తాజాగా ప్రశ్నిస్తున్నారు. అమరావతిని ‘సోకాల్డ్‌’ రాజధాని అని ఎద్దేవా చేశారు. విజయవాడ–గుంటూరు మధ్య కాకుండా నదీ పరీవాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించడమేమిటని ప్రశ్నించారు. రాజ్యాంగంలో రాజధాని అన్న పదం ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో రాజధాని అన్న పదం ఉంది కదా? ప్రపంచంలో రాజధాని లేని దేశం ఏదైనా ఉందా? మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ వంటి కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలకు కూడా రాజధానులు ఉన్నాయి కదా? ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే రాజధాని అవసరం లేదని జగన్‌ రెడ్డి ఎందుకు భావిస్తున్నారో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని ప్రకటించారు. అది కార్యరూపం దాల్చక ముందే అధికారం కోల్పోయారు. తమ పార్టీ విధానం మూడు రాజధానులు అని ప్రకటించడంలో తప్పులేదు. 2019కి ముందు అసెంబ్లీ సాక్షిగా తాను కూడా బలపరిచిన అమరావతిపై ఆయనకు అంత ద్వేషం, పగ, అసూయ ఎందుకో? అన్నదే అంతు చిక్కని ప్రశ్న! రాజధాని అమరావతిపై తన మనసులోని ద్వేషాన్ని ఆయన గురువారం నాడు మరోమారు వెళ్లగక్కారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టబోతోందన్న వార్తలు వస్తున్నాయి. బహుశా ఈ కారణంగా సదరు బిల్లును అడ్డుకోవడానికి... సందర్భం కాకపోయినా జగన్‌ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తూ మాట్లాడి ఉండవచ్చు. రాష్ట్రం విడిపోయి పదకొండున్నర సంవత్సరాలు అయింది. ఇప్పటికీ రాజధాని విషయమై వివాదం కొనసాగడాన్ని మించిన విషాదం ఏముంటుంది?


నదులూ... నాగరికత..

రివర్‌ బేసిన్‌లో, అంటే నదీ పరీవాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించడం ఏమిటి? అని జగన్‌ రెడ్డి తాజాగా ప్రశ్నిస్తున్నారు. నదులకు, నాగరికతకు మధ్య విడదీయరాని బంధం అనాదిగా ఉంది. నదులు ఉన్న చోటే నాగరికత వెల్లివిరిసింది. ప్రపంచంలో అనేక మహా నగరాలు నదీ తీరాలలోనే నిర్మితమయ్యాయి. అనేక నగరాల మధ్య నుంచి నదులు ప్రవహిస్తున్నాయి. అమెరికా ఆర్థిక రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌ నగరం హడ్సన్‌ నదీ తీరం వెంబడి నిర్మితం కాలేదా? సీన్‌ నదీ తీరం వెంట ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌, ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌ నగరం థేమ్స్‌ నదీ తీరం వెంట, ఇటలీ రాజధాని రోమ్‌ నగరం టైబర్‌ నది వెంట, నైలు నదీ తీరంలో ఈజిప్టు రాజధాని కైరో, చైనాలోని షాంఘై నగరం యాంగ్జి నదీ తీరం వెంట నిర్మితమైనవే కదా? ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. నదుల వెంటే నాగరికత పరిఢవిల్లిన విషయం జగన్‌ రెడ్డికి తెలియదా? ప్రజలు ఎడారులను నివాస ప్రాంతాలుగా ఎంచుకోరు కదా? నీరున్న చోటే నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వ్యవసాయం చేస్తుంటారు. ఎడారి దేశాలు కూడా డీ శాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని నీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి కదా! తరచుగా లండన్‌ వెళ్లే జగన్‌ రెడ్డి అక్కడ థేమ్స్‌ నదిని చూసే ఉంటారు కదా? ఇంతెందుకు, గోల్కొండ నవాబులు హైదరాబాద్‌ నగరాన్ని మూసీ నది ఒడ్డునే నిర్మించారు కదా? మూసీ నది ఇప్పుడు మురికి కూపంగా మారి ఉండవచ్చునుగానీ, ఒకప్పుడు ఆ నదికి వరదలు వచ్చేవి కదా? మూసీ ప్రక్షాళనకు ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది కదా?


3-ed-b.jpg

జగన్‌ రెడ్డి.. నాడూ నేడూ

అమరావతి గురించి ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్న జగన్‌ రెడ్డి 2019కి ముందు ఏం చెప్పారో ఒకసారి గుర్తుచేసుకుందాం. తాగునీటి అవసరాలు తీరడానికి రాజధాని నదీ తీరంలో నిర్మించాలని చెప్పలేదా? రాష్ర్టానికి మధ్యలో రాజధాని ఉండాలని, కనీసం 30 వేల ఎకరాల భూమి ఉండాలని, అమరావతిని రాజధానిగా ప్రకటించినందున తాను కూడా తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకున్నానని చెప్పలేదా? అదే పెద్దమనిషి 2019లో అధికారంలోకి రాగానే రాజధానిని ఒక కులం వారి కోసమే కడుతున్నారని నిందలు వేయడమే కాకుండా మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అమరావతిని శ్మశానంతో, ఎడారితో పోల్చారు. భూములు ఇచ్చిన రైతులను అనేక విధాలుగా వేధించి అవమానాలకు గురిచేశారు. ఇప్పుడు రివర్‌ బేసిన్‌ అనే కొత్త రాగం అందుకున్నారు. అమరావతి విషయంలో ఆయన బాధ ఏమిటో తెలియదు. అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఒక్క కులానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని అనుకుందాం. అక్కడ రాజధాని ఏర్పడితే ఇప్పుడు హైదరాబాద్‌లో వలె దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు, వ్యాపారాలకోసం వచ్చి స్థిరపడిపోతారు. అప్పుడు భూమి పుత్రులు మైనారిటీలు అయిపోతారు. భూమి కూడా చేతులు మారుతుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో అధిక శాతం భూమి ముస్లింల ఆధీనంలో ఉండేది. హైదరాబాద్‌ విస్తరణతోపాటు భూమి కూడా చేతులు మారింది. ఇంకా చెప్పాలంటే, హైదరాబాద్‌లోని భూమి పుత్రులు అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ధనికులయ్యారు. ముస్లింలు సంఖ్యాపరంగా గణనీయంగా ఉన్నప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఇప్పుడు హైదరాబాద్‌ అసలు సిసలైన కాస్మోపాలిటన్‌ నగరం. ఈ కారణంగానే హైదరాబాద్‌లో మత కలహాలు కూడా మటుమాయమయ్యాయి. హైదరాబాద్‌కు ఇప్పుడు ఉన్న విశిష్టత దక్షిణాదిన మరే నగరానికీ లేదు. అంతా సవ్యంగా సాగితే అమరావతి కూడా హైదరాబాద్‌ అంత కాకపోయినా ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు కులాల కుంపట్లు కూడా ఆరిపోతాయి. సంకుచిత భావజాలం కూడా నశిస్తుంది. బయటి ప్రాంతాల వారి సంఖ్య పెరిగే కొద్దీ స్థానికుల ఆధిపత్యం పోతుంది. జగన్‌ రెడ్డి ద్వేషించే ఆ కులం వారి ఆధిపత్యం కూడా పోతుంది. అభివృద్ధితో పాటు సామాజికంగా వచ్చే మార్పులు ఏమిటో జగన్‌ రెడ్డికి తెలియవా? అయినా ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత సంకుచితంగా ఎలా వ్యవహరించగలరన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంటోంది. స్థానిక విలేకరులతో మాట్లాడిన తర్వాత జగన్‌ రెడ్డి జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ఆంగ్లంలో మాట్లాడారు. అంటే, తాను అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నానని ఢిల్లీ స్థాయిలో చెప్పాలన్నది ఆయన ఉద్దేశం. రివర్‌ బేసిన్‌లో రాజధాని నిర్మించకుండా అవసరమైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కూడా ఆయన అన్నారు. దీన్నిబట్టి అమరావతి నిర్మాణాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో ఆయన ఉన్నట్టు అర్థమవుతోంది. అసూయా ద్వేషాలు ఎంతటి వారినైనా దహించి వేస్తాయి.


బహిరంగంగా చెప్పుకోలేని కారణాలతో జగన్‌ రెడ్డి అంతర్గతంగా దహించుకుపోతున్నారు. అందుకే రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించకుండా అడ్డుకొనే ప్రయత్నాలకు తెర లేపారు. అందులో భాగంగానే రివర్‌ బేసిన్‌ అనే వాదాన్ని తెరమీదకు తెచ్చారు. తమాషా ఏమిటంటే, రాజధాని అమరావతిపై జగన్‌ రెడ్డి నోటి వెంట వెలువడిన విష గుళికలు ఆయన సొంత మీడియాలో ఎక్కడా కనిపించలేదు. వింతల్లోకెల్లా వింత ఇది. జగన్‌ ఏమి మాట్లాడినా ఆయన షిక్కటి షిరునవ్వులు చిందించే ఫొటో పెట్టి తాటికాయంత అక్షరాలతో ప్రచురించే, ప్రసారం చేసే నీలి మీడియా, కూలి మీడియా కూడా మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉంది. అంటే, అమరావతిపై జగన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారికే రోతగా అనిపించాయా? జగన్‌ రెడ్డి తొందరపడి నోరు జారారని భావించారా? లేక ఆయన వ్యాఖ్యల వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించారా? ఇంతకు మించిన నిగూఢ రహస్యం ఏమైనా ఉందా? మొత్తం మీద జగన్‌ రెడ్డి అమరావతి మీద కక్కిన విషాన్ని కప్పి పెట్టాలని చూశారు. అయితే, రెండు మూడు మీడియా సంస్థలు అనుకున్నంత మాత్రాన వాస్తవాలను దాచిపెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజధానిపై జగన్‌ రెడ్డి కడుపులో ఎంత విద్వేషం ఉందో ప్రజలందరికీ తెలిసిపోయింది. అందుకే కాబోలు అమరావతిపై జగన్‌ అన్న మాటలను వక్రీకరించారని పేర్ని నానితో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది కూడా వికటించింది. జగన్‌ నోటి వెంట వెలువడిన మాటలను కళ్లారా చూసి చెవులారా విన్న ప్రజలు పేర్ని నాని వంటి వారి వక్రభాష్యాలను నమ్మే పరిస్థితిలో లేరు.


మారని బుద్ధి...

పదకొండున్నర సంవత్సరాల తర్వాత రాజధానిని చర్చనీయాంశం చేయాలనుకోవడమే విషాదం. కపట నాటక సూత్రధారి అయిన జగన్‌ రెడ్డి తొందరపడ్డారని ఆయన పార్టీ నాయకులు తలలు పట్టుకుంటూ ఉండవచ్చునుగానీ ఆయన బుద్ధి మారలేదని మరోమారు రుజువైంది. అమరావతి విషయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు ఎన్ని కవరింగ్‌ కబుర్లు చెప్పినా జగన్‌ రెడ్డి మనసులో ఏముందో తేలిపోయింది. కూటమి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసి 2029లో జగన్‌ రెడ్డికి మళ్లీ అధికారం దక్కే పరిస్థితి కల్పిస్తే అమరావతికి ఆయువు మూడుతుందని స్పష్టమవుతోంది. రాష్ర్టానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ పార్లమెంటులో చట్టం చేసినా జగన్‌ రెడ్డి అంటూ అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేస్తారు. అమరావతి ఉసురు తీయడానికి ఆయన మళ్లీ సిద్ధపడతారు. ఇందులో సందేహం లేదు. గత ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ రాజధాని విషయంలో ఆయన వైఖరి మారలేదని ఇప్పుడు స్పష్టమైంది. రాజకీయంగా నష్టం జరుగుతుందని పార్టీ నాయకులు ఆయన మాటలకు ప్రచారం కల్పించకుండా నీలి, కూలి మీడియాను కట్డడి చేసి ఉంటే చేసివుండొచ్చు. అధికారం అంటూ వస్తే జగన్‌ రెడ్డి మనసు మార్చగలరా? ‘బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’ అన్న సినిమా డైలాగు మాదిరిగా జగన్‌ రెడ్డి ఒకసారి అనుకుంటే దానికి తిరుగుండదని ఆ పార్టీ వారే చెబుతారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని చెప్పడంలోనే ఆయన ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వివిధ దేశాలను పాలించిన అధ్యక్షులు, ప్రధానులకు బుద్ధి, జ్ఞానం లేనందునే వారు రాజధానులను నిర్మించారనుకోవాలా? ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి కూడా ఇంగితం లేనందునే రాజధానులను నిర్మించారా? అభివృద్ధి చేశారా? రాచరిక వ్యవస్థలో కూడా రాజధానులు ఉన్నాయి కదా? రాజులు ఎవరూ అంతఃపురాలకే పరిమితమై పాలించలేదు కదా? పాలనా వ్యవహారాల పర్యవేక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి దర్బారు హాళ్లకు వచ్చేవారు కదా? రాజధాని అవసరమే లేదని చెబుతున్న జగన్‌ రెడ్డి... ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధీ జ్ఞానం లేవని అనడమంటే, అంతకు మించిన తెంపరితనం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంటే జగన్‌కు ఎంత చులకన భావం ఉందో రాజధానిపై ఆయన అన్న మాటలతో స్పష్టమవుతోంది.


పనులు పరుగులు తీయించాలి...

అమరావతిని అద్భుతమైన నగరంగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్నారు. మయసభను నిర్మించిన విశ్వకర్మగా పేరొందాలని ఆయన భావిస్తూ ఉండవచ్చు. అదే సమయంలో అమరావతి ఆయువు తీసే అవకాశం కోసం జగన్‌ రెడ్డి ఎదురుచూస్తున్నారు. ఈ ఇరువురిలో ఎవరు విజయం సాధిస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆయన అధికారానికి ఇంకో మూడున్నరేళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడు జగన్‌ రెడ్డి ఆంతర్యం బయటపడింది కనుక అమరావతి ఆయువు అర్ధంతరంగా ముగియకూడదంటే... కూటమి ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉంది. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్‌ అన్న గురజాడ మాటలను గుర్తుకు తెచ్చుకొని కూటమి ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల వేగాన్ని పెంచాలి. వీలైనంత త్వరగా రాజధానిలో పౌర సౌకర్యాలు కల్పించడంతో పాటు నిర్మాణాలను పూర్తి చేయాలి. అమరావతిని ఆవాసయోగ్యంగా మార్చగలిగితే ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధి దానంతటదే జరుగుతుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఇళ్ల నిర్మాణం జరగడం కూడా అంతే ముఖ్యం. రాజధాని అంటే కార్యాలయాలు మాత్రమే కాదు, ప్రజలతో కళకళలాడాలి. ఇందుకోసం ఇళ్ల నిర్మాణాలను ప్రోత్సహించాలి. ఆవాస ప్రాంతాలలో పౌర సౌకర్యాల కల్పనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. అప్పుడే జనసాంద్రత పెరుగుతుంది. జగన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి అంటూ వస్తే, అమరావతి మళ్లీ కళ తప్పడం ఖాయం కనుక అటువంటి పరిస్థితి ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్‌ రెడ్డి వంటి వారు అధికారంలోకి వచ్చినా అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిన అనివార్యతను కల్పించాలి. కేవలం చట్టం చేసినంత మాత్రాన ముప్పు తొలగిపోదు. మారీచులు, సుబాహులు ఏ కాలంలోనైనా ఉంటారు. ఇది ప్రజాస్వామ్య యుగం కనుక ప్రజలను అర్ధసత్యాలు, అసత్యాలతో మభ్యపెట్టవచ్చు. దుష్ర్పచారాలతో తప్పుదారి పట్టించవచ్చు.


అటు జగన్‌... ఇటు కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ సమాజంలో విద్వేషాలు రగిలించడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రస్తుతం నడుస్తున్న జల వివాదమే తీసుకుందాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమైనది జగన్‌ రెడ్డి హయాంలోనే అన్నది ఎంత నిజమో, ఆగిపోయింది కూడా ఆయన హయాంలోనే అన్నది అంతే నిజం. అయినా ఈ పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని ఏమాత్రం వెరపు లేకుండా జగన్‌ రెడ్డి ఆరోపించారు. జగన్‌ రోత మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ ద్రోహిగా చంద్రబాబును చిత్రీకరిస్తుండగా, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత మీడియాలో చంద్రబాబును నీటి దొంగగా, తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా నీటిని తరలించుకుపోవడం ద్వారా చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తున్నారు. ఈ ఇరువురు నాయకుల సొంత మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఏది నిజం? ప్రజలు ఎవరు చెప్పేదాన్ని నమ్మాలి? కేసీఆర్‌ మీడియా ప్రకారం స్వరాష్ట్రం కోసం చంద్రబాబు జల చౌర్యానికి పాల్పడుతున్నారు. జగన్‌ మీడియా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తూ తెలంగాణకు చంద్రబాబు మేలు చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అలాంటి కథనాలను వండి వారుస్తున్నారన్నది ప్రజలు అర్థం చేసుకోలేకపోతే పరిస్థితి ఏమిటి? నీళ్ల పంచాయితీ అన్నది సున్నితమైన అంశం. చంద్రబాబు అయినా, రేవంత్‌ రెడ్డి అయినా– ఆ మాటకొస్తే కేసీఆర్‌, జగన్‌ రెడ్డి కూడా తమ స్వరాష్ర్టాల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించలేరు. ఎంతటి జటిలమైన సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. జల వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చేసిన ప్రకటనలు హుందాగా ఉన్నాయి. వివాదం పరిష్కారం కాకూడదన్న కోరిక కేసీఆర్‌, జగన్‌ రెడ్డిలకు ఉండవచ్చునుగానీ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా సంయమనంతో వ్యవహరించవలసిన బాధ్యత చంద్రబాబు–రేవంత్‌పై ఉంది. లేని వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇలాంటివి మరికొన్నింటిని తెరమీదకు తెస్తారు. ఎవరి రాజకీయం వారిది. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టగలిగినప్పుడే కదా రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోగలిగేది.


తెలంగాణ ప్రజలు నీళ్లతో త్వరగా కనెక్టవుతారు. అందుకే కేసీఆర్‌ అండ్‌ కో జల వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కులాల వారీగా విభజించడం తేలిక కనుక జగన్‌ రెడ్డి మళ్లీ అమరావతిపై నోరు పారేసుకున్నారు. పనిలో పనిగా రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడానికి తన హయాంలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపారని ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో నిలిచిపోయిన ఈ పథకం గురించి కేసీఆర్‌ అండ్‌ కో ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్‌ అండ్‌ కో విమర్శించడం మొదలుపెట్టగానే, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని జగన్‌ అండ్‌ కో అందుకుంటారు. ఏకకాలంలో రెండు రాష్ర్టాలకు అన్యాయం ఎలా జరుగుతుంది? అలా అయితే లాభ పడుతోంది ఎవరు? ఇదంతా గమనిస్తే, వారెవ్వా ఏమి రాజకీయం! అనిపిస్తుండవచ్చునుగానీ తెలుగునాట రాజకీయాలు మునుముందు మరింత వికృతంగా మారవచ్చు. తస్మాత్‌ జాగ్రత్త! పెట్టుబడులు పెట్టే వారిని చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఆదరించి గౌరవిస్తారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా విమర్శించలేరు. కానీ జగన్‌ రెడ్డి మాత్రం చంద్రబాబు పారిశ్రామికవేత్తలను పారిపోయేలా భయపెడుతున్నారని అభాండాలు వేశారు. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వంపై మునుముందు ఏ స్థాయిలో దుష్ర్పచారం చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అమరావతిపై జగన్‌ అన్న మాటలు శాంపిల్‌ మాత్రమే! అయితే, ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేయకూడదని ఉభయ తెలుగు రాష్ర్టాలలో గత శాసనసభ ఎన్నికలు రుజువు చేశాయి. ప్రస్తుతానికి ఇదే ఉపశమనం. సంఘం శరణం గచ్చామి అని బుద్ధుని బోధనలను గుర్తుచేసుకుందాం!

ఆర్కే

ఇవీ చదవండి:

నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు

రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్

Updated Date - Jan 11 , 2026 | 12:36 AM