ఎవరీ కొంపెల్ల?
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:13 AM
కొంపెల్ల జనార్దనరావు గురించి 550 పుటల బృహత్ గ్రంథం ఇటీవల విడుదలైంది. ఏటుకూరి ప్రసాద్, యామిజాల ఆనంద్‌ల సంపాదకత్వంలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ దీన్ని ప్రచురించింది....
కొంపెల్ల జనార్దనరావు గురించి 550 పుటల బృహత్ గ్రంథం ఇటీవల విడుదలైంది. ఏటుకూరి ప్రసాద్, యామిజాల ఆనంద్‌ల సంపాదకత్వంలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ దీన్ని ప్రచురించింది. కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, గ్రంథ సమీక్షకుడిగా, సంపాదకుడిగా ఒక వెలుగు వెలిగి 31 ఏళ్లకే (1906–1937) తనువు చాలించిన ఒక వ్యక్తిని మళ్ళీ సాహిత్యలోకానికి పరిచయం చేసేందుకు సంపాదకులు చేసిన కృషి గొప్పది.
కొంపెల్ల జనార్దనరావుది పండితవంశం. కలకాలం నిలిచే కవిత్వం రాయాలనీ, సాహిత్యంలో కొత్తపోకడలు పరిచయం చేయాలనీ, పత్రిక పెట్టాలనీ తపన పడేవాడు ఎప్పుడూ. దేశీయ సంప్రదాయాన్నీ, విదేశీయ నూతన పోకడలనూ బాగా అవగాహన చేసుకొన్న నైష్ఠిక బ్రహ్మచారి కొంపెల్ల. శ్రీశ్రీ మహాకవి అవుతాడని ఊహించి మొట్టమొదటిగా ‘భారతి’ పత్రికలో ప్రకటించినవాడు. అందుకే కృతజ్ఞతగా శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానా’న్ని కొంపెల్లకు అంకితం చేశాడు.
‘భారతి’ పత్రికకు ఉపసంపాదకుడిగా ఎందరో ఔత్సాహిక రచయితలను పైకి తెచ్చాడు కొంపెల్ల. ఆయన రచనలు ఒక దశాబ్దకాలానికి పట్టిన దర్పణం. ఆయన రాసిన ఉత్తరాలు ఆయన భావాలలోని ఆర్ద్రతకు సరైన ప్రతిబింబాలు. ‘కిరణాలు’ అనే శీర్షిక కింద సమీక్షలూ, ‘శృంగాటకం’ అనే శీర్షిక కింద విమర్శలూ రాసాడు. ‘తాన్సేను’, ‘వెలుగు’ నాటికలనూ రాశాడు. ఆయన కవితలలో భావకవుల స్వేచ్ఛారాధన, సంప్రదాయకవుల ధోరణులు కలగలసి కనిపిస్తాయి. భావకవులలాగానే ఒక ఊహామూర్తి ‘విజయలక్ష్మి’ని తన ప్రేయసిగా ఆవాహన చేశాడు. ఆయనలో పకృతి సౌందర్యానికి ఆకర్షితమయ్యే తత్త్వం ఎక్కువ. రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం. సంప్రదాయ సాహిత్య వ్యాఖ్యానంలోని సూక్ష్మపరిశీలన, నిర్మొహమాటంగాచెప్పే తత్త్వం ఆయనలో కనిపిస్తుంది. అందుకే ‘చండ ప్రచండ శిలాభినవ కొక్కొండ’ అనే బిరుదును ఆయనకు కృష్ణాపత్రిక ఇచ్చింది. దీర్ఘసమాసాల ప్రయోగం, శబ్దాడంబరం కొంపెల్ల కవిత్వంలో కనబడవు. అందుకే తేటగీతిని రచనకు ఎక్కువగా ఎన్నుకున్నాడు. ‘ఒడ్డుమీద పడవేసిన దోనె’, ‘బొమిక’ కూడా ఆయన కవితావస్తువులయ్యాయి. అయితే కవిత్వంలో కొంత అస్పష్టత ఉన్నది.
కొంపెల్ల విమర్శ ఒక గీటురాయిగా, శిల్పపరామర్శగా ఉండేది. విమర్శ చదువుతూ ఉంటే ‘క్రియేటివ్ డిలైట్’ పొందగలగాలనీ, రసానుభూతి తత్పరత పొందగలగాలనీ కొంపెల్ల అభిప్రాయం. అందుకే ఏమాత్రం మొహమాటపడకుండా దేవులపల్లి ‘ప్రవాసం’ ‘ఊర్వశి’ కావ్యాలను, తల్లావజ్ఝల ‘ఆవేదన’ కావ్యాన్ని నిశితంగా విమర్శించాడు; స్థానంవారి ‘సత్యభామ’ వేషం బాగాలేదన్నాడు; గురజాడ, బసవరాజు మొదలైనవారిని సైతం విమర్శించాడు.
లండన్ నుండి వెలువడిన ‘లండన్ మెర్‌క్యురీ’ వంటి పత్రికను తెలుగులో తేవాలని ఎంతో కష్టపడి ‘ఉదయిని’ని వెలుగులోకి తెచ్చాడు. కానీ ఆర్థికమైన ఇబ్బందులూ, అనారోగ్యంవల్ల అది మూడునాళ్ల ముచ్చటే అయింది. తెలుగులో ‘అభ్యుదయం’ అనే పదాన్ని మొదట వాడింది కొంపెల్ల జనార్దనరావేనంటే ఆశ్చర్యం వేస్తుంది. మల్లంపల్లి శర్మగారన్నట్లు కొంపెల్లకు ‘‘ఆయుర్దాయమే ఉంటే నవ్యాంధ్ర కవితారీతులకు వన్నెలు దిద్ది దారులు చక్కజేసేవాడు’’. శ్రీశ్రీ అన్నట్లు ‘‘పాపం జనార్దనరావ్ జీవితం ప్రారంభించక ముందే మరణించాడు’’.
ఈ పుస్తకంలో ‘ఎవరీ జనార్దనరావు’, ‘పదుగురాడుమాట’, ‘కవన చాతురి’, ‘వచన నైపుణి’, ‘సమీక్షాదక్షత’, ‘కవులలోగిలి’, ‘అనుబంధాలు’, ‘బొమ్మలు చెప్పే కథలు’ అనే ఎనిమిది భాగాలు ఉన్నాయి. పుస్తకం చివర ఆయన సోదరి చావలి బంగారమ్మ గురించి రాయడం, అరుదైన ఫొటోలు వేయడం విశేషం. ఎంతో కష్టపడి ఇంత విలువైన గ్రంథాన్ని వెలువరించిన సంపాదకులు, ప్రచురణకర్తలూ అభినందనీయులు.
శివలెంక ప్రకాశరావు
94415 64836
ఈ వార్తలూ చదవండి
దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి
రాత్రి నూడిల్స్ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!