‘వెలుగుమట్ల’ ప్రజలకు న్యాయం జరగాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:35 AM
ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో నివసిస్తున్న ప్రజలపై ఈ నెల 24న తెల్లవారకముందే 2వేల మంది పోలీసులు, రెవెన్యూ డిపార్టుమెంట్, మున్సిపల్ సిబ్బంది...
ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో నివసిస్తున్న ప్రజలపై ఈ నెల 24న తెల్లవారకముందే 2వేల మంది పోలీసులు, రెవెన్యూ డిపార్టుమెంట్, మున్సిపల్ సిబ్బంది విరుచుకుపడ్డారు. వందలకొద్దీ పోలీసు వాహనాలు, పదులకొద్దీ బుల్డోజర్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇళ్ళల్లో ఉన్న సామాన్లను ధ్వంసం చేస్తూ, అడ్డుకున్నవారిపై దాడి చేశారు. ఇళ్ళను కూల్చివేశారు. అనేకమందిని పోలీసులు తమ నిర్బంధంలోకి తీసుకున్నారు. సంబంధిత మంత్రిని ఇదేమిటని అడిగితే కూల్చివేత గురించి తనకేమీ తెలియదని చెబుతూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. ఏవో కోర్టు ఆర్డర్లున్నాయని కలెక్టరు, ఇతర అధికారులు బుకాయిస్తున్నారు. ప్రజల ఇళ్ళను నేలమట్టం చేసి రాక్షసానందం పొందారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి కోర్టు ఆర్డర్లు పట్టుకుని అనేకసార్లు కలెక్టర్ల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్, విద్యుత్ ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కానీ, దాదాపు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్న కాలనీకి సంబంధించి మాత్రం ప్రజలకు కోర్టు ఆర్డర్లు ముందుగా ఇవ్వకుండానే ఇలా కూల్చివేయడం ఎంతవరకు సమంజసం?
ఎవరెన్ని బుకాయించినా ప్రభుత్వం, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు ప్రజావ్యతిరేకులని మరొకసారి రుజువయింది. పేదలను తరిమివేసి, ఆ భూములను పెద్దలకు కట్టబెట్టాలని నిస్సిగ్గుగా అధికార యంత్రాంగం చేసిన పని ఇది. దీనికి ప్రజలు తలవంచరని, ఇళ్ళ స్థలాలను ప్రజలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. కూల్చిన ప్రతి ఇంటినీ తిరిగి నిర్మించి ప్రజలకు అప్పజెప్పాలి. నిరాశ్రయులైన ప్రజలకు ప్రత్యామ్నాయ నివాస వసతిని తక్షణమే కల్పించాలి. ధ్వంసం చేసిన ప్రజల ఆస్తికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి. అరెస్టు చేసినవారందరినీ తక్షణం విడుదల చేయాలి. వారిపై పెట్టిన అక్రమ కేసులన్నిటినీ రద్దుచేయాలి. అక్రమ కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
గ్రామీణ పేదల సంఘం, తెలంగాణ రాష్ట్రం
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్