Share News

కేజీబీవీ విజయగాథల్లో కన్నీటి వేదనలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:19 AM

భారతదేశంలో బాలికల విద్యపై విధానపరమైన చర్చ జరిగిన ప్రతిసారీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఒక విజయగాథగా ప్రస్తావనకు వస్తాయి. వెనుకబడిన వర్గాలు, గిరిజన ప్రాంతాలు, దూర గ్రామీణ ప్రాంతాల....

కేజీబీవీ విజయగాథల్లో కన్నీటి వేదనలు

భారతదేశంలో బాలికల విద్యపై విధానపరమైన చర్చ జరిగిన ప్రతిసారీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఒక విజయగాథగా ప్రస్తావనకు వస్తాయి. వెనుకబడిన వర్గాలు, గిరిజన ప్రాంతాలు, దూర గ్రామీణ ప్రాంతాల బాలికలకు రెసిడెన్షియల్ విద్యను అందించడంలో ఈ పాఠశాలలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ వ్యవస్థను నడిపిస్తున్న మహిళా టీచర్లను ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిన, తక్కువ వేతనాలతో ఆధునిక బానిసత్వంలోకి నెట్టివేస్తోంది.

కేజీబీవీ పాఠశాలలు 2004లో, సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా ప్రారంభమయ్యాయి. బాలికల డ్రాప్‌ అవుట్‌ను తగ్గించడం, సామాజిక అసమానతలను అధిగమించడం, విద్య ద్వారా సాధికారత కల్పించడం వాటి లక్ష్యాలు. వాటిని చాలా వరకు సాధించాయి. కానీ రెండు దశాబ్దాలు గడిచినా, మహిళా టీచర్ల విషయంలో మాత్రం తాత్కాలికత్వమే శాశ్వత విధానంగా మారిపోయింది.

తెలంగాణలో ప్రస్తుతం 495 కేజీబీవీ పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో సుమారు 1,24,153 మంది బాలికలు చదువుతున్నారు. సుమారు 9,500 మంది ఉపాధ్యాయులు, 4,750 మంది నాన్–టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇవి పూర్తిస్థాయి రెసిడెన్షియల్ సంస్థలు. ఇక్కడ పనిచేసే టీచర్లు కేవలం బోధనకే పరిమితం కాదు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, భావోద్వేగ స్థితి, క్రమశిక్షణ, రాత్రి పర్యవేక్షణ వంటివన్నీ వారి బాధ్యతే. వాస్తవంగా చెప్పాలంటే ఇది 24 గంటల సేవ. కానీ ఈ స్థాయి బాధ్యతకు తగిన వేతనం, హోదా, ఉద్యోగ భద్రత మాత్రం వారికి లేదు.

దేశంలో కేజీబీవీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఎక్కువ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్‌ సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నారు. మణిపూర్ మాత్రమే ఈ సిబ్బందిని పర్మినెంట్ చేసిన రాష్ట్రం. ఇది కేవలం రాష్ట్రాల వైఫల్యం కాదు, జాతీయ విధాన వైఫల్యం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ‘సమగ్ర శిక్షా అభియాన్’ కింద కొనసాగిస్తున్నా, మానవ వనరుల విషయంలో మాత్రం ఖర్చు తగ్గించే దృక్పథాన్నే అనుసరిస్తోంది. సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని ఈ సందర్భంలో రాష్ట్రాలు–కేంద్రం విస్మరిస్తున్నాయి.


తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే, ఈ విధానపరమైన విరుద్ధత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు బాలికల విద్య, సామాజిక న్యాయం, సమాన అవకాశాలపై రాజకీయ ప్రకటనలు వినిపిస్తుంటాయి. మరోవైపు రాష్ట్రంలోని కేజీబీవీ టీచర్లు తక్కువ వేతనాలు, సర్వీస్ కంటిన్యుయిటీ, ప్రమోషన్లు లేకపోవడం, డీఏ–పెన్షన్ వంటి మౌలిక హక్కుల లేమి వంటి సమస్యలతో పోరాడుతున్నారు. ఇది అభివృద్ధి మోడల్‌లో ఒక తిరోగమన విధానం. దీనిని కేవలం ఉద్యోగ సమస్యగా చూడకూడదు. ఇది విద్యా విధాన విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న. ఎందుకంటే తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల అనుభవజ్ఞులైన టీచర్లు వ్యవస్థను విడిచిపెట్టే ప్రమాదం ఉంది. ఆ ప్రభావం బాలికా విద్య నాణ్యతపై పడుతుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు శాశ్వతంగా అవసరమైతే, అక్కడ పనిచేసే టీచర్లు ఎందుకు తాత్కాలికంగా ఉండాలి? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. కేజీబీవీ టీచర్లలో అందరూ మహిళలే. ఒకవైపు మహిళా సాధికారతపై విధానాలు రూపొందిస్తూనే, మరోవైపు మహిళా శ్రామికశక్తిని తక్కువ వేతనాలతో నడిపించడం విధానపరమైన ద్వంద్వ వైఖరిని చూపిస్తుంది.

కేజీబీవీలు కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ కింద ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత బడ్జెట్‌తో ప్రత్యేక పోస్టులను సృష్టించవచ్చు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం ద్వారా కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా మార్చవచ్చు. (మణిపూర్ ఇలాగే చేసింది.) కేంద్ర ప్రభుత్వం కూడా ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ మార్గదర్శకాలను సవరించి, ఈ పాఠశాలల్లో శాశ్వత సిబ్బందిని అనుమతించాలి. ప్రస్తుతం ఉన్న 60:40 నిధుల వాటాను పర్మినెంట్ ఉద్యోగుల జీతాలకు కూడా వర్తింపజేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. ఈ విధంగా కేంద్రం– రాష్ట్రాలు కలిసి కేజీబీవీ టీచర్లకు కనీసం రెగ్యులర్ పే స్కేల్‌, సర్వీస్ కంటిన్యుయిటీ, సామాజిక భద్రత కల్పించవచ్చు. ఇది ఆర్థిక భారంగా కనిపించినా, దీర్ఘకాలంలో విద్యా నాణ్యతలో పెట్టుబడిగా మారుతుంది. బాలికల విద్యపై పెట్టుబడి పెట్టడం అంటే, సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే.

జుర్రు నారాయణ యాదవ్

తెలంగాణ టీచర్స్ యూనియన్

ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్

బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత

Updated Date - Apr 07 , 2026 | 04:19 AM