Share News

ప్రశ్నించే ధైర్యమే కవిరాజు

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:55 AM

కవిరాజు త్రిపురనేని రామస్వామి తెనాలి మునిసిపల్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భమిది. ఒక శతాబ్దం తర్వాత కూడా ఆయనను...

ప్రశ్నించే ధైర్యమే కవిరాజు

కవిరాజు త్రిపురనేని రామస్వామి తెనాలి మునిసిపల్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భమిది. ఒక శతాబ్దం తర్వాత కూడా ఆయనను ఎందుకు గుర్తుచేసుకోవాలి? ఆయన ఆలోచనలు నేటి తరానికి ఏమి చెబుతాయి? అంటే... ఈ కాలానికి కూడా ‘ఎందుకు?’ అన్న ప్రశ్నను ఆయన వదిలి వెళ్లారు. మన కాలంలో సమాధానాల కొరత లేదు. ప్రశ్నల కొరత ఉంది. ఒక క్లిక్‌తో సమాచారం వచ్చేస్తుంది. ఒక అభిప్రాయం క్షణాల్లో వేల మందికి చేరుతుంది. ఒక సంఘటనకు పది వివరణలు ఎదురవుతాయి. వాటిలో ఏది సత్యం? ఏది అసత్యం? ఏది ప్రచారం? అనే ప్రశ్నలు మాత్రం మనమే వేసుకోవాలి. సమాచారం పెరిగిన కొద్దీ వివేచన కూడా పెరగాలి. ఈ సందర్భంలో కవిరాజు ఆలోచన మనకు ఇప్పటికీ ఉపయుక్తంగా ఉంటుంది.

కవిరాజును కేవలం హేతువాది, నాస్తికుడు, సంఘసంస్కర్త అనే ముద్రలతో గుర్తుచేసుకోవడం అంటే... ఆయనను గతంలోనే వదిలేయడం. అవి ఆయన ఆలోచనలోని కొన్ని పార్శ్వాలను గురించి మాత్రమే చెబుతాయి. ఆయన అసలు ప్రాధాన్యత ప్రశ్నించే ధైర్యంలో ఉంది. సంప్రదాయం ఏదైనా, పురాణం ఏదైనా, అధికారం ఎవరిదైనా ఆయన మౌలికంగా అడిగిన ప్రశ్న... ఇది ఇలాగే ఎందుకు ఉండాలి?

‘శూద్రుల మీద రవ్వంతైనా కనికరం లేకుండా నీ స్మృతిలో శూద్రుడు దాస్యమే చేయాలని ఎలా రాయగలిగావు?’ అని ఆయన మనుస్మృతిపై చేసిన విమర్శలో అన్నారు. ఇది ఒక పురాతన గ్రంథంపై అభ్యంతరం మాత్రమే కాదు. ఒక నియమం పాతది కాబట్టి అది న్యాయమైనదేనా? ఎవరో రాశారు కాబట్టి దాన్ని ప్రశ్నించకూడదా? పుట్టుక ఆధారంగా ఒక మనిషికి మరొక మనిషిపై అధికారం ఎలా వస్తుంది? అనే మౌలిక ప్రశ్న. శంబుక వధలోనూ ఇదే ప్రశ్నించే ధోరణి కనిపిస్తుంది. ఆ రచనను కేవలం రాముడిపై విమర్శగా చదవడం దాని విస్తృత ఉద్దేశాన్ని కుదించడం. రామాయణంలోని ఒక ఘట్టం ఆధారంగా వర్ణధర్మంలో దాగి ఉన్న అన్యాయాన్ని కవిరాజు ప్రశ్నించారు. జ్ఞానం, తపస్సు, ఆలోచనకు పుట్టుక ఆధారంగా హద్దులు ఎందుకు ఉండాలనే ప్రశ్నను ముందుకు తెచ్చారు.


కవిరాజు ప్రశ్నించినది మత విశ్వాసాన్ని మాత్రమే కాదు, మనిషి కళ్ల ముందు ఉన్న బాధను వదిలి, కనిపించని శక్తుల కోసం ఎందుకు ఆరాటపడాలి? అనే ప్రశ్న కూడా ఆయన రచనల్లో కనిపిస్తుంది. ‘‘మలమల మాడు పొట్ట, తెగ మాసిన బట్ట’’తో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదను చూసి జాలి చూపకుండా, ‘‘జీవరహితంబగు బొమ్మకు’’ ఇళ్లు, వాకిళ్లు, పొలాలు సమర్పించే భక్తిని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ హేతువాదం మానవత్వంతో కలుస్తుంది. ఆకలితో ఉన్న మనిషి కళ్లముందు ఉన్నప్పుడు, కనిపించని శక్తిపై భక్తి కంటే... మనిషి పట్ల బాధ్యతను గుర్తుచేసే దృష్టి ఇది.

కవిరాజు ప్రశ్నలు పుస్తకాలకే పరిమితం కాలేదు. తెనాలి మునిసిపల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు నిర్హేతుకమైన సంప్రదాయాలు, మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారు. జంతు బలులు వంటి ఆచారాలను తొలగించేందుకు ప్రయత్నించారు. అంటే రచనలో ప్రశ్నించిన విషయాన్నే ప్రజా జీవితంలోనూ ప్రశ్నించారు. రెండింటి వెనుకా ఒకటే స్వభావం ఉంది... కారణం లేని ఆచారాన్ని అంగీకరించకపోవడం. ఇదే కవిరాజు ప్రత్యేకత. ఆయనకు ‘‘ఇది ఎందుకు?’’ అనేది సాహిత్య ప్రశ్న మాత్రమే కాదు. పరిపాలనా ప్రశ్న కూడా.

ఆయన తన రచనలకు రాసిన విస్తృత పీఠికలు, బెర్నార్డ్‌ షా పీఠికలను ఆంగ్లంలో Shavian prefaces అని పిలిచినట్టుగా, కేవలం ముందుమాటలు కావు. రచన ఎందుకు చేశారు, ఏ సందర్భంలో రాశారు, దాని వెనుక ఉన్న ప్రశ్న ఏమిటి అనే విషయాలను పాఠకుడితో ముందుగానే పంచుకున్నారు. అంటే రచనకు ముందు పాఠకుడితో ఒక సంభాషణ మొదలుపెట్టారు. ఇదే కవిరాజును నేటి యువతకు దగ్గర చేస్తుంది. జెన్‌ జీకీ, జెన్‌ ఆల్ఫాకూ ఆయనను పరిచయం చేయాల్సిన అవసరం ఆయన పాత సమాధానాలు చెప్పినందుకు కాదు, కొత్త ప్రశ్నలు వేయడం నేర్పినందుకు! ఏ సమాచారం వచ్చినా వెంటనే నమ్మకపోవడం, ఏ సంప్రదాయం ఎదురైనా దాని కారణాన్ని పరిశీలించడం, ఏ అధికారాన్నైనా ప్రశ్నించే స్వేచ్ఛను నిలబెట్టుకోవడం ఆయన ఆలోచనలోని ముఖ్యమైన పాఠం.


సమాచారం ఎక్కువగా ఉన్న కాలంలో... ఒక వీడియో ఒక విషయాన్ని నిజమంటుంది. మరో వీడియో అదే విషయాన్ని అబద్ధమంటుంది. ఇలాంటి సమయంలో ఎవరి మాట నమ్మాలి అన్న దానికంటే, ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్న ముఖ్యమవుతుంది. కవిరాజును అనుసరించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరమూ లేదు. ఆయనను నిజంగా చదవడం అంటే, ఆయనతో కూడా వాదించగల స్వేచ్ఛను సంపాదించుకోవడం. ఆయన చెప్పినదాన్ని కూడా ప్రశ్నించగలగడం. అదే ఆయన ఆలోచనా వారసత్వానికి నిజమైన గౌరవం. ఒక కొత్త తరం ఆయనను చదవాల్సిన కారణం కూడా ఇదే. ఆయనను ఒక విగ్రహంగా నిలబెట్టడం కాదు, ఆయనలా ప్రశ్నించే స్వభావాన్ని మన ఆలోచనలోకి తీసుకురావడం. కవిరాజు మనకు ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ఇవ్వలేదు. ప్రశ్నించడం ద్వారా ఆలోచించే పద్ధతిని చూపించారు. ఆయనలాగే ప్రశ్నించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

అట్లూరి అనిల్

(త్రిపురనేని రామస్వామి తెనాలి మునిసిపల్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి వందేళ్లయిన సందర్భంగా... అక్టోబర్‌ 1, 2 తేదీల్లో చైతన్యయాత్ర, 3న తెనాలిలో ‘కవిరాజు’ యువజన సదస్సు)

ఈ వార్తలూ చదవండి

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ఏఐతో మానవాళికి ముప్పే!

Updated Date - Oct 01 , 2026 | 12:55 AM