Share News

నిస్వార్థ జీవనం, నిరంతర ప్రజాగళం

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:31 AM

‘ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’ అని అక్షరాన్ని ఒక సామాజిక ఆయుధంగా మలిచిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తెలంగాణ పల్లెసీమల ఆత్మగౌరవానికి,...

నిస్వార్థ జీవనం, నిరంతర ప్రజాగళం

‘ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’ అని అక్షరాన్ని ఒక సామాజిక ఆయుధంగా మలిచిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తెలంగాణ పల్లెసీమల ఆత్మగౌరవానికి, పీడిత జనం గుండెచప్పుడుకు తన ‘నా గొడవ’ ద్వారా అక్షర రూపమిచ్చిన మహాకవి. భౌతికంగా కాళోజీ మన మధ్య లేకపోయినా, ఆయన కవితా పంక్తులు నేటికీ పాలకుల గుండెల్లో గుబులు రేపుతూనే ఉన్నాయి.

భాష అనేది కేవలం భావప్రసార సాధనం కాదని, అది శ్రామికుల స్వేదబిందువుల నుంచి ఉద్భవించిన జీవనస్రవంతి అని గట్టిగా నమ్మినవారు కాళోజీ. మాతృభాషను చిన్నచూపు చూసే పాలకుల ధోరణిని ఆయన తీవ్రంగా నిరసించారు. ‘‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు–సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా’ అంటూ మాతృభాష పట్ల ఆత్మన్యూనతా భావంతో సకిలించే ఆంధ్రులను తీవ్రంగా నిలదీశారు. తెలంగాణ బతుకమ్మ సంస్కృతిని కేవలం ఆచారంగా కాక, ప్రజల ఐక్యతా లక్ష్యసిద్ధికి ప్రతీకగా నిలిపారు. ‘చెలిమి చెలమలు ఊరేదాకా/ చెలిమి కలుములు నిలిచేదాకా/ చెలిమి వెన్నెలలు కాసేదాకా/ చెలిమి రాగములు ఒలికేదాకా’ అంటూ సాంస్కృతిక వైభవాన్ని, శ్రామిక ఐక్యతను అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజంలో అసమానతలు, వర్గ దోపిడీలు ఉన్నంతకాలం కవి మౌనంగా ఉండలేడనేది కాళోజీ నమ్మకం. ‘వ్యత్యాసాలు’ కవితలో ఆయన చూపిన సామాజిక వైరుధ్యాలు నేటికీ మన కళ్లముందు కదలాడుతుంటాయి. ‘అన్నపురాసులు ఒకచోట, ఆకలిమంటలు ఒకచోట/ హంసతూలికలొకచోట, అలసిన దేహాలొకచోట/ సంపదలన్నీ యొకచోట, గంపెడు బలగంబొకచోట’ అంటూ అంతరాలను ఎత్తిచూపుతూనే, సమాజానికి అసలు ఆధారమైన శ్రామికుడిని, సైనికుడిని వేనోళ్లా కీర్తించారు. ‘గురువుల గోప్యాలు గుడుగుడు గుంచాలు/ దేవుళ్ల తిరునాళ్లు దివ్యనది తీర్థాలు/ కర్షకా! నీ కర్రు కదలినన్నాళ్లే’ అంటూ గురువుకైనా, గోవిందునికైనా తిండి పెట్టేది కర్షకుడేనని బలంగా చాటారు. అలాగే బాధ్యత లేని ప్రభుత్వాలు, దొరతనం పేరిట జరిగే దోపిడీలను ‘బాధ్యత లేని ప్రభుత్వ భటులు/ పెట్టే బాధలు చాలింక/ బాధ్యత గల పరిపాలన లేక/ బ్రతికిన బ్రతుకులు చాలింక/ దొంగలంత దొరతనం పేరిట/ చేసిన దోపిడీ చాలింక’ అంటూ తీవ్రంగా గద్దించారు. చరిత్రలో ఏలడానికి వచ్చిన ఏ పాలకుడైనా ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే కాళోజీ కలం నిప్పులు చెరిగింది. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పుడు ‘ఇంతకన్నా చావు నయం’ అని నిర్భయంగా ప్రకటించారు.


స్త్రీలపై జరిగే అఘాయిత్యాల పట్ల కాళోజీ కవితాగ్ని రగిలింది. అన్యాయం జరిగేచోట దయాదాక్షిణ్యాలకు తావులేదని, కఠిన శిక్షలు తప్పవని ‘కొంగులాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె... కాలంబు రాగానే కాటేసి తీరాలె’ అంటూ హెచ్చరించారు. అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో రాజీపడే తత్త్వాన్ని ఆయన ఏనాడూ సహించలేదు. మహాత్మాగాంధీ నుంచి జయప్రకాశ్‌ నారాయణ్ త్యాగం వరకు అన్నింటినీ ప్రజల కోణంలోనే పరిశీలించారు. జేపీ త్యాగాన్ని కొనియాడుతూ ‘పుట్టుక నీది/ చావు నీది/ బ్రతుకంతా దేశానిది’ అని ఆయన రాసిన పంక్తులు నిస్వార్థ రాజకీయ జీవనానికి నిలువెత్తు రూపం. అలాగే ‘నా గొడవ’ ద్వారా అందరి గొడవను తన గొడవగా మలచుకున్నారు. కవి దర్భశయనం శ్రీనివాసాచార్య చెప్పినట్లుగా– ‘అన్యాయాలూ, అక్రమాలూ, అసమానతలూ, దోపిడీలు సాగినంత కాలం కాళోజీ కవిత్వానికి ప్రాసంగికత ఉంటుంది. మానవ సహజ గుణాల అవసరమున్నంత కాలమూ ఆయన చెమ్మగిల్లిన కంటిచూపు కాంతి ప్రసరిస్తూనే ఉంటుంది.’ నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, తుదిశ్వాస వరకు పీడితుల పక్షాన నిలబడిన ఆ నిస్వార్థజీవి జీవితం భావితరాలకు నిత్య చైతన్య దీపిక.

పిల్లా తిరుపతిరావు

(నేడు కాళోజీ నారాయణరావు వర్ధంతి)

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 03:31 AM