కడెం ఆయకట్టును ఎండబెట్టొద్దు
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:50 AM
మిషన్ భగీరథ త్రాగునీరు సాకుతో కడెం ఆయకట్టులోని 68 వేల ఎకరాలలో రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు, నవంబర్ 9 నుంచి ప్రాజెక్టు నీళ్లు ఆపివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గం...
మిషన్ భగీరథ త్రాగునీరు సాకుతో కడెం ఆయకట్టులోని 68 వేల ఎకరాలలో రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు, నవంబర్ 9 నుంచి ప్రాజెక్టు నీళ్లు ఆపివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గం. ఈ ఉత్తర్వులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. కడెం ఆయకట్టు పంటలు 20 నుంచి 25 రోజులలో కోతకు రానున్నాయి. వందలాది గ్రామాల రైతులు, వ్యవసాయ కూలీల జీవితాలు ఈ ప్రాజెక్టు నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సమయంలో పంటలకు నీరు నిలిపివేయడం అంటే రైతుల పొట్ట కొట్టడమే. రైతులను, వ్యవసాయ అధికారులను సమావేశపరిచి పంటలకు నీరు ఆపాలా? వద్దా? అనేది నిర్ణయించాలి. కానీ అలా జరగలేదు. దానికి భిన్నంగా భగీరథ అధికారులతో సమావేశమై పంటలకు నీరు నిలిపివేయాలని నిర్ణయించడం సరికాదు.
కడెం ప్రాజెక్టులో ఉన్న నీటిని 675 అడుగుల వరకు కడెం ఆయకట్టు కాలువకు ఇవ్వవచ్చు. ప్రస్తుతం 693.250 అడుగుల నీరు ఉంది. అంటే కాలువ కంటే 18.250 అడుగుల ఎత్తున నీరు నిలువ ఉంది. ఇంత నీరు నిల్వ ఉంచుకొని, పంటలకు నీరు ఇవ్వకపోవడం దుర్మార్గం. కడెం ప్రాజెక్టును ఆనుకునే ఉన్న అతి కీలకమైన చెరువు దశాబ్దాల క్రితం కొన్నిసార్లు తెగిపోయింది. అప్పుడు శరవేగంగా పనులు పూర్తిచేసి, రైతుల పొలాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి.
హైదరాబాదులోని కార్పొరేట్ కంపెనీలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం నీరు తరలించే ప్రయత్నం చేస్తున్నదనే అనుమానం రైతులలో ఉంది. కడెం–మిషన్ భగీరథ నీళ్లు ఏ ఒక్కరూ తాగునీటికి ఉపయోగించరు. అవి నీళ్లు మురికినీరు. కానీ భగీరథ పేరు చెప్పి సాగుకు నీరు ఇవ్వరాదని నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు దశాబ్దాలుగా తీరని అన్యాయం జరిగింది. భారీ వరదల విపత్తుల నుంచి కడెంను కాపాడడానికి, కుంటాల జలపాతానికి ఎగువన కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తామని రాజశేఖరరెడ్డి, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులూ చెప్పారు. కానీ అన్ని ప్రభుత్వాలూ ఉల్లంఘించాయి. ఉమ్మడి రాష్ట్రంలో 24 టీఎంసీల కడెం ప్రాజెక్టును మూడున్నర టీఎంసీలకు, 2.30 లక్షల ఎకరాల ఆయకట్టును 68 వేల ఎకరాలకు కుదించి అన్యాయం చేశారు. ఇది చరిత్రలో జరిగిన ద్రోహం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు 550 కోట్లతో భగీరథ త్రాగు నీటి పథకం కడం ప్రాజెక్టుకు ముడి పెట్టింది. ఇదొక ఒక భారీ కుంభకోణం.
కడెం ఆయకట్టు ఖరీఫ్ పంటకు నీరు ఇవ్వరాదన్న ఉత్తర్వులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. చివరి ఎకరం పండే వరకు నీరు అందించాలి. లేకపోతే రైతుల అగ్రహాన్ని చవిచూడక తప్పదు.
నైనాల గోవర్ధన్ (తెలంగాణ జలసాధన సమితి)
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా
వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్