Share News

మనుషులొస్తారు!

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:17 AM

మనుషులు రావడమంటే శవప్రాయంగా వున్న ప్రతీదీ సజీవం అవడం.. మనుషులకోసమే కదా మనం ఎదురుచూస్తోంది మనుషులంటే మనుషులు కాదు...

మనుషులొస్తారు!

మనుషులు రావడమంటే

శవప్రాయంగా వున్న ప్రతీదీ సజీవం అవడం.. మనుషులకోసమే కదా మనం

ఎదురుచూస్తోంది

మనుషులంటే మనుషులు కాదు–

సంజీవ పర్వతాలు.

ఇన్నాళ్ళ నాగరికత రాళ్ళనీ రప్పల్నీ

చెట్లనీ చేమల్నీ సంజీవ పర్వతాలుగా తయారు చేయడానికే–

మనిషి లేకపోతే ఏముందిక్కడ!

ప్రపంచానికి సకలసౌందర్యం ఈ మనుషులే యిస్తారు.

బంధాలన్నీ అపురూప సౌందర్యాలన్నీ

మనుషులే ఈ భూమికి తెస్తారు.

ఇన్నాళ్ళ నాగరికత మనుషుల్ని మనుషులుగా సంస్కరించడంలో

సమస్త ప్రాణి వలయాలన్నీ జలపాతాలన్నీ

గుండెల్లో దాచుకున్న సమస్త ప్రేమప్రపంచాలన్నీ విడివిడిగా వున్నవాటిని

ఒక దగ్గరికి తేవడం

సమస్త ప్రాణిలోకాన్ని అప్రాణిలోకాన్ని

సప్రాణిగా సంచలన కేంద్రాలుగా మలచడానికే కదా– ఎన్ని మార్పులొచ్చినా

మనిషిని మనిషిగా నిర్మించడానికే కదా–

నిన్నలేని అందాన్ని, చేతనని ఈ భూమండలానికి ప్రసాదించడానికే

మనం కలం పట్టుకుని పొలాన్ని దున్నడానికి సంసిద్ధులమై ప్రయాణిస్తున్నది.

మానవుడు గొప్పవాడు–

అనుకున్నది సాధించే దాకా నిద్రపోని యోగి పుంగవుడు–

ఏదీ నాశనం చేయలేని ఒక పరిపూర్ణ చలన ప్రపంచాన్ని

నిర్మిస్తూ వస్తున్నాడు యుగాలుగా–

మానవుడికి ఎదురేముంది!?

చూపుడువేలుతో ఈ భూమండలం మీద

కొత్తపద్యాలు రాస్తాడు.

కోరినవన్నీ సాధించే తపస్సుదేన్నో చేస్తూ వుంటాడు.

రాళ్ళురప్పల్ని సాలగ్రామాలుగా మార్చే

మంత్రశక్తి పరిపూర్ణంగా నిండివున్న మనుషులొస్తారు, తప్పకుండా వస్తారు.

మనుషులకోసమే మనం, మనుషులుగా మారింది. మనుషుల్ని

తయారుచేస్తూ ఏదీ లొంగదీయలేని మనుషుల్ని

నిర్మించుకుంటూ మానవుడు వెళుతున్నాడు ఎప్పట్లాగే –

సమస్త చరాచర ప్రపంచం

అతని సృజనశక్తికి అతని స్వాప్నిక ప్రపంచానికి జేజేలు పలుకుతుంది

మనుషులు రావడమంటే పరిపూర్ణంగా జీవించడం

సమస్తమూ రాగమయమై పులకించడం

ఇళ్ళు ఇళ్ళుగా మారడం

భూమ్మీద మనుషులు మనుషులుగా మొలకెత్తడం–

కె. శివారెడ్డి

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 02 , 2026 | 02:17 AM