నీటి వివాదాల పరిష్కారానికి న్యాయమే ప్రాతిపదిక
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:48 AM
‘నీటి వివాదాలకు సామరస్యమే పరిష్కారం’ అని ఆంధ్రజ్యోతిలో జనవరి 22న నెల్లూరు దుర్గాప్రసాద్ వ్యాసం రాశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని న్యాయ పోరాటాల...
‘నీటి వివాదాలకు సామరస్యమే పరిష్కారం’ అని ఆంధ్రజ్యోతిలో జనవరి 22న నెల్లూరు దుర్గాప్రసాద్ వ్యాసం రాశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే సామరస్యంగా పరిష్కరించుకోవడమే ఉత్తమమని సుప్రీంకోర్టు చేసిన సూచనను ప్రస్తావించారు. మౌలికంగా నల్లమల సాగర్‌కు నీరు తరలించడాన్ని సమర్థించారు. ఈ సమర్థనలో న్యాయం ఎంతమాత్రమూ లేదు. టీడీపీ పాలనలో మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ముఖ్యమంత్రుల ఏలుబడిలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రసాద్ గుర్తించలేదు. న్యాయం ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ముగింపు దొరకదు. దానికి కొంత చరిత్రలోకి పోవాలి.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో అటు గోదావరి బేసిన్‌లో, ఇటు కృష్ణా బేసిన్‌లో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. పెద్ద మనుషుల ఒప్పందాన్ని, గత ఒప్పందాలను చెత్తబుట్టపాలు చేయడంతో కృష్ణా బేసిన్‌లో ఈనాటికీ సాగునీరు లేక మహబూబ్‌నగర్ వలసల జిల్లాగా మిగిలింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల భూములు సాగునీటికి నోచుకోక వివిధ రూపాలలో ఆక్రమణదారులకు, కొనుగోలుదారులకు అందివచ్చాయి. ఈ ఆక్రమణలో రైతుల కూలీల నిర్వాసితత్వం రాజధానికి పనివాళ్లను సమకూర్చింది. ఈ వైరుధ్యం పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం పుట్టింది.
తొలి తెలంగాణ పోరాట కాలంలో జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటయింది. ఆ కోర్టు న్యాయం ప్రాతిపదికన కాకుండా రైపేరియన్ రైట్స్ ప్రాతిపదికన నీరు పంచడంతో అప్పటికి నిర్మాణమైన, నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుల ప్రాతిపదికన, అనుభవం ప్రాతిపదికన నీరు పంచడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఎగువ రాష్ట్రాల కన్నా ఎక్కువ నీరు లభించి, తెలంగాణకు నీరు దక్కలేదు. వంద శాతం బేసిన్‌లో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులు లేనందువల్ల ఈ నష్టం జరిగింది. 1956 నుంచి 2014 దాకా ఉమ్మడి రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నది గుర్తు చేసుకుంటే, ఎందుకు తెలంగాణకు నష్టం జరిగిందో, ఎందుకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు ఒక ఆక్టోపస్ బారిన పడ్డాయో తెలుస్తుంది. ఆ పోరాటాన్ని మురిపించి, లోబరుచుకుని ముగించారు.
1994లో కృష్ణానది నీటి వాటా కోసం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ కేంద్రం నుంచి రెండవ తెలంగాణ పోరాటం మొదలైంది. 1995లో కృష్ణానది నీరు పంచకపోతే, తెలంగాణలో నీటి పథకాలు చేపట్టకపోతే ఈ పోరాటాన్ని రాష్ట్ర సాధన పోరాటంగా మారుస్తామని అప్పటి ముఖ్యమంత్రికి హెచ్చరికలు చేసింది. 2000 సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసి జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడింది. సాగునీటిని రాష్ట్రాల వారీగా పంచుతున్నందున, తెలంగాణ రాష్ట్రం అయితేనే సాగునీరు దక్కుతుందని శ్రీకృష్ణ కమిటీ ముందు పాలమూరు అధ్యయన వేదిక వాదించింది, లేఖలు ఇచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్‌లో ఇచ్చిన తీర్పులో తెలంగాణకు న్యాయం దొరకలేదు, నీటి పంపిణీకి కోర్టులు ఎంచుకున్న ‘అనుభవదారు’ హక్కు అనే ప్రాతిపదికలోనే అన్యాయం ఉంది. 2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. విభజన చట్టంలో 89–95 సెక్షన్లు నీటి పంపిణీని నిరోధించే విధంగా ఉన్నాయి. తదుపరి బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ప్రమాణంగా తీసుకోవాలనే వాదనలు చేస్తున్నారు. నీటి పంపిణీ విషయంలో విభజన చట్టమూ అన్యాయం చేసింది. ఇప్పుడు విభజన చట్టం సెక్షన్–3తో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. అటువైపు ఆంధ్రలో ఈ పదకొండు సంవత్సరాల్లో పలు విధాలుగా నీటి తరలింపు చర్యలు, నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వాలు చేసింది తక్కువ, మాట్లాడింది ఎక్కువ. ఈ పరిస్థితిలో నల్లమల సాగర్‌ను సమర్థిస్తూ దుర్గాప్రసాద్ సామరస్యపూర్వక చర్చల ప్రతిపాదన చేశారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు తెలంగాణ హక్కును నొక్కి– తెలంగాణ 299 టీఎంసీలు అంగీకరించిందని, ఇది శాశ్వత అంగీకారం అని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అందరికీ శిరోధార్యం కావాలని మాట్లాడుతున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాలు బేసిన్‌లు లేవు, భేషజాలు లేవు అని మాట్లాడాయి. రేవంత్ ప్రభుత్వం– ఆంధ్రా ఒక అడుగు ముందుకు వస్తే, మేం పదడుగులు ముందుకు వస్తాం అంటున్నది. బనకచర్ల, నల్లమలసాగర్, రాయలసీమ లిఫ్టు.. ఇలా అనేక పథకాలతో ఆంధ్రా ముందుకు రావడాన్ని తెలంగాణ నిలువరించలేకపోతున్నది. ఆంధ్ర తక్కువ ఖర్చుతో కృష్ణ, గోదావరి నీటిని తరలించుకోగలదు. తెలంగాణకు లిఫ్టులే ఆధారం, వ్యయ ప్రయాసలు ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వాలు, పాలక పార్టీలు రైతాంగాన్ని, సాగునీటి సమస్యను వదిలేసి ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజాప్రతినిధుల వ్యాపార నేపథ్యం కూడా ఇందుకు కారణం.
సామరస్యపూర్వక నీటి సమస్య పరిష్కారం కోసం మూడు చర్యలు అవసరం. మొదటిది– నీటి పంపిణీ. ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన నీటి పంపిణీ మారాలి. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం ప్రాతిపదికన నీరు పంచాలి. రెండవది– ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన నిర్మాణాల వల్ల ఆంధ్రకు ప్రయోజనం కలిగింది. తెలంగాణ నీటి వినియోగానికి ఆ స్థాయి నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం గుర్తించాలి. అందుకు అన్ని విధాలుగా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ సహకరించాలి. మూడవది– మెలికలు పెట్టకుండా, బల ప్రదర్శనతో కాకుండా కేంద్రం– రాష్ట్రాల మధ్య, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పారదర్శకతతో విస్తృతమైన చర్చ జరగాలి. దీనికంతటికీ న్యాయమే ప్రాతిపదిక కావాలి. కాలువ కింది రైతులతో ఏ విధంగానూ కాలువ లేని, నీటి లభ్యత లేని రైతులు జీవన ప్రమాణాలలో, వాదనలో పోటీపడలేరు. సామరస్యపూర్వక చర్చల్లో బలవంతుల న్యాయమే చలామణి అవుతుంది. ఈ మాట వింటుంటే ‘ఉద్ధతుల మధ్య పేదలకుండ తరమే?!’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యం యాదికొస్తున్నది.
టి.రాఘవాచారి
పాలమూరు అధ్యయన వేదిక
ఇవీ చదవండి:
సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు