న్యాయం ఖరీదై నిండుతున్న జైళ్ళు!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:41 AM
‘ఇక్కడ నేను తప్ప అందరూ క్షేమం’– ఒక ఖైదీ తన ఇంటివారికి రాస్తున్న లేఖ ఇలా మొదలవుతుంది, రావిశాస్త్రి ‘నిజం’ నాటకంలో. పోలీసులు నేరం ఆరోపించి, కోర్టు ముందు ప్రవేశపెట్టిన వ్యక్తిని...
‘ఇక్కడ నేను తప్ప అందరూ క్షేమం’– ఒక ఖైదీ తన ఇంటివారికి రాస్తున్న లేఖ ఇలా మొదలవుతుంది, రావిశాస్త్రి ‘నిజం’ నాటకంలో. పోలీసులు నేరం ఆరోపించి, కోర్టు ముందు ప్రవేశపెట్టిన వ్యక్తిని ‘ముద్దాయి’ అంటారు. విచారణ జరిగి శిక్ష పడేవరకు ఆ వ్యక్తి నేరస్థుడు కాదు, నేరారోపణకు గురైన వ్యక్తి మాత్రమే. ఇది క్రిమినల్ లా ప్రాథమిక సూత్రం. నేరం ఋజువు అయ్యేంత వరకు ఆ ముద్దాయి జైలులో ఉంటాడు. ఒకవేళ విచారణ తర్వాత ఆ ముద్దాయి నిర్దోషి అని కోర్టు నిర్ధారిస్తే ఎలా? నేరారోపణకూ నిర్ధారణకూ మధ్య ఆ వ్యక్తి జైలులో కోల్పోయిన జీవితానికి బాధ్యత ఎవరిది? అందుకే ‘బెయిల్’ అనే భావన వచ్చింది.
జైలులో ఉండే ఖైదీలు స్థూలంగా మూడు రకాలు. ఒకటవ రకం, నేరారోపణపై ఖైదు చేయబడిన ముద్దాయిలు. వీరినే రిమాండ్ ప్రిజనర్స్ అంటారు. రెండవ రకం, విచారణ జరిగి శిక్షపడిన కన్విక్టెడ్ ప్రిజనర్స్. మూడవ రకం, డిటెన్యులు, అంటే నేరం చేయబోతారన్న అనుమానంతో ముందస్తుగా ఖైదు చేయబడినవారు. మొదటి కేటగిరీ ఖైదీలకు బెయిల్ అనే ఉపశమనం ఉన్నది. అంటే వారు విచారణ పూర్తయ్యే వరకు జైలులో ఉండాల్సిన పని లేదు. కానీ వాస్తవానికి వస్తే పరిస్థితి వేరు. 2023 సమాచారం ప్రకారం దేశంలో ఉన్న అన్ని జైళ్ళూ కలుపుకొని 4,39,119 మందిని ఉంచగలవు. కానీ వాటిల్లో 5,30,333 మంది ఖైదు చేయబడ్డారు. అంటే సుమారుగా లక్షమంది ఎక్కువ. జనరల్ కంపార్ట్‌మెంట్ రైలు బోగీల్లాగ మన జైళ్ళు కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రిమాండ్ ప్రిజనర్సే. ప్రతి నలుగురిలో ముగ్గురు రిమాండ్ ప్రిజనర్సే. జైలుకు–బెయిలుకు మధ్య తేడా ఉండటంతో జైళ్ళు రిమాండ్ ఖైదీలతో నిండిపోతున్నాయి. అందుచేత జైళ్ళ నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ‘ముద్దాయిలు’ శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు.
రిమాండ్ ఖైదీలుగా జైళ్ళకు వస్తున్నది 20–35 సంవత్సరాల మధ్య వయసుగల యువత. వీరు పేద వర్గాలకు చెందినవారు, నిరక్షరాస్యులు, లేదా అంతంతమాత్రం చదువుకున్నవారు. వీరికి న్యాయప్రక్రియ గురించి అవగాహన శూన్యం. న్యాయస్థానాలలో తమ కేసు విషయమై ఏమి జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. తమ బెయిల్ గురించి ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ రిమాండ్ ప్రిజనర్స్‌గా రోజులు లెక్కిస్తూ ఉంటారు.
నాణానికి రెండవవైపు న్యాయ వ్యవస్థ ఉంది. ముద్దాయిని జైలుకు పంపుతూ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కేసును బట్టి బెయిల్ పిటిషన్ ఆ కోర్టు ముందుకు లేదా పై కోర్టుకు వస్తుంది. ప్రాథమిక దర్యాప్తు రికార్డు కోర్టు ముందుకు రావాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నోటీసు ఇవ్వాలి. ఆయన /ఆమె సమయం అడిగితే వాయిదాలు ఇవ్వాలి. ముద్దాయి– ప్రాసిక్యూటర్‌ల వాదనలు వినాలి. ఆ తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పే వాదనలు బెయిల్ మంజూరు నిర్ణయాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి. కోర్టులలో గుట్టలుగా పేరుకుపోతున్న కేసుల పని భారం న్యాయ రథం మందగమనానికి మరో కారణం. ఏడేళ్ళ లోపు శిక్షలు ఉండే నేరారోపణ కేసుల్లో బెయిల్ వెంటనే ఇవ్వాలని, త్వరితగతిన విచారణ జరగడం ముద్దాయి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పినా క్షేత్రస్థాయి కోర్టుల వైఖరిలో పెద్దగా మార్పులేదు.
ఒకవేళ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే ముద్దాయి దాటాల్సిన అగడ్త మరొకటి ఉంది: అదే ‘జామీనుదారుల’ ఏర్పాటు. కొన్ని షరతులకు లోబడి బెయిల్ వస్తుంది. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ముద్దాయికి పూచీ పడాలి. వారికి ఇల్లు లేదా పొలం వంటి స్థిరాస్తులు ఉండాలి. అవి ఉన్నట్లుగా అధికారుల నుంచి ధ్రువ పత్రాలు కావాలి. వారు కోర్టు వారి ముందుకు వచ్చి జామీను ఇస్తున్నట్లు చెప్పాలి. ఈ బెయిల్ ప్రక్రియ అంతా పూర్తయి విడుదల ఉత్తర్వులు వచ్చేలోగా ప్రతి చోటా చేతులు తడపాల్సిందే! న్యాయవాదికి ఇచ్చుకోవలసిన ఫీజు దీనికి అదనం. ఒకవేళ అలాంటి జామీనుదారులు లేకపోతే నిర్దేశించిన నగదు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కోర్టు వారికి అందజేయాలి. పేద వర్గాలు, ముఖ్యంగా దళిత ఆదివాసీ యువకులు జామీను ఇచ్చేవారు లేక, డీడీలు కట్టేందుకు డబ్బు లేక, బెయిల్ మంజూరైనప్పటికీ ఏళ్ళ తరబడి రిమాండ్ ఖైదీలుగా జైళ్ళల్లో మగ్గిపోతున్నారు!
బెయిల్ ప్రక్రియను కఠినతరం చేస్తూ శిక్షాస్మృతిలోని కొన్ని సెక్షన్‌లకు వస్తున్న మార్పులు, అలాగే డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల విషయంలో వస్తున్న కొత్త చట్టాలు బెయిల్ మంజూరు గడువును మరింత పెంచివేశాయి. అందుచేత జైలుకు వస్తున్నవారు ఎక్కువయ్యారు, బెయిల్‌పై బయటకు వెళ్తున్నవారు తక్కువయ్యారు. పదిమంది ఉండటానికి కట్టిన ‘బ్యారక్’లో నలభైమందిని నెలల తరబడి రిమాండ్ ఖైదీలుగా ఉంచితే ఏమవుతుందో ఊహించడమే కష్టం!
ఈ పరిస్థితిని కొంతైనా చక్కదిద్దేందుకు– అత్యవసరంగా యాభై ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా ప్రతి జిల్లాకూ ఒక జిల్లా జైలు నిర్మాణాన్ని చేపట్టాలి. జైలు సిబ్బంది నియామకాలు చేపట్టాలి. జైలుకు–బెయిల్ ఇచ్చే కోర్టుకు మధ్య పారా లీగల్ సోషల్ వర్కర్స్‌ను లైజాన్ ఆఫీసర్స్‌గా నియమించాలి. న్యాయ వ్యవస్థకు, జైళ్ళ నిర్వహణకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ఆ కేటాయింపులను నిజంగా ఖర్చు చేయాలి. ఇవి తక్షణ చర్యలు మాత్రమే సుమా!
పి.ఎస్.అజయ్‌కుమార్
ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు