Share News

సామాజిక విపత్తులతో సంఘర్షణే నా రచన!

ABN , Publish Date - Jul 27 , 2026 | 03:10 AM

జూపాక సుభద్ర సాహిత్యంలో చండాలిక! మారుమూల గ్రామం నుంచి తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చిన పల్లె చుక్క. సంపద్వంతమైన తెలంగాణ జీవభాషతో తెలుగు సారస్వతానికి సొగసులద్దిన...

సామాజిక విపత్తులతో సంఘర్షణే నా రచన!

జూపాక సుభద్ర సాహిత్యంలో చండాలిక! మారుమూల గ్రామం నుంచి తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చిన పల్లె చుక్క. సంపద్వంతమైన తెలంగాణ జీవభాషతో తెలుగు సారస్వతానికి సొగసులద్దిన విద్వత్తేజం. మెరుపుల ముక్కు పుల్లలు పోగొట్టుకున్న అవ్వల, అక్కల, బిడ్డెల నేలలో నిత్య సాంస్కృతికాన్వేషి. చరిత్ర యాదుల భద్రాక్షరి. తెలుగు సాహిత్యంలో కడ మనుషుల జీవన సౌందర్యాలను గునుగుపూలై పూసిన తెలంగాణి. అట్టడుగు నుంచి అధికారి దాకా ఎదిగిన తన ఆత్మకథనమ్ ‘గునుగుపూలు’ విడుదలైన సందర్భంగా ఆమెతో సంభాషణ.

మీ ఆత్మకథనమ్ 'గునుగుపూలు' నేపథ్యం ఏమిటి?

నాకు అక్షర జ్ఞానం అందిన కాన్నుంచి ఎటు చూసినా, ఏమి చదివినా మాది గాని భాషలో, మావి కాని జీవితాలు కవిత్వంగా, కథలుగా, నవల్లుగా, నాటకాలుగా, నాట్యాలుగా, గాత్రాలుగా, మా చుట్టూతా ఆవరించి వున్నయి. సమాజంలో చూస్తే, శ్రామిక జాతులు బహుళంగా ఉన్నాయి, కొన్ని విశ్రాంతి జాతులున్నాయి. సమాజంలో నానాజాతి సమూహాలున్నా విశ్రాంతి జాతుల చరిత్రలు, సాహిత్యాలు, కళలు, వారి ఆచార సంప్రదాయాలనే తిప్పించి, మల్లిచ్చి వాటినే సాహిత్యాలు, కళలు, చరిత్రలుగా చెబుతున్నాయి, రాస్తున్నాయి, ప్రచారం చేస్తున్నాయి. ఆ విశ్రాంతి జాతులు ఎంతగా మాయ చేస్తున్నారంటే, మా సాహిత్యాలు, కళలు, చరిత్రల నుంచి మేము పరాయీకరణ చెందేట్టుగా. శ్రమజాతుల్లో కూడా అట్టడుగు, అంటరాని జాతులు ఎట్లా బతికినయి? వారి ఆచార సంప్రదాయాలు, పుట్టుకలు, పురుల్లు, మందు మాకులు, పెండ్లి పేరంటాలు, ఆటలు, పని పాటలు.... ఇవేవీ ‘మెయిన్ స్ట్రీమ్ చరిత్ర’ చెంపకానలే. సాహిత్యాల సరసకు చేరలే. ఈ దేశంలో నేనెవరినీ...? నేను నడిచొచ్చిన దారుల్ని, యెదిగొచ్చిన యెన్నెలని, సాహితీ లోకానికి బొమ్మకట్టి పటమేసిన నా ఆత్మకథనమే ‘గునుగుపూలు’.

మీ సాహిత్యంలో అట్టడుగు కుల, జెండర్ జీవితాలకు కనిపించే ప్రాధ్యాన్యతకు నేపథ్యం?

నా జీవితం – సాహిత్యం వేరువేరు కావు. నా సాహిత్యానికి నా అనుభవాలే ప్రమాణం. ఎనుకటి ఏడు తరాల్లో, ముందు మూడు తరాల్లో బూములు, చదువులు, ఉద్యోగాలు, బతుకు దెరువు లేని, అంటరాని, ఎట్టి మాదిగ మహిళను. కుండలు, దొంతులు, బోకెలు, సిప్పలు దప్పా, కన్ను బొడుసుకున్నా, కాయితమ్ముక్క కనబడని యిలవరసలున్న ఇల్లు మాది. నా ఎండా కాలం నీటి బుడగ లాంటి చదువుకు, ఏ సన్నగాలి సకిలించినా, మటాష్. నా చదువు ఆగకుండా, ఆఖరి దాకా సాగడం అద్భుతమే. నా పూర్తి జీవితం ఉద్యమాల్లోనే అమరత్వం అనుకుంటే, ప్రభుత్వ పాలనా వ్యవస్థలు నడిపే ఆఫీసరమ్మ నైతానని, వీటన్నింటి కంటే, కవయిత్రిని, రచయిత్రినవుతానని అవ్వ తోడు ఏనాడూ కలగనని కత.

భారత సామాజిక ఉత్పత్తి రంగంలో శ్రమశక్తిగా వున్నదంతా బహుజన కులాల మహిళలే. రోడ్లు ఊడ్చే మునిసిపల్ వర్కర్స్, కక్కోసులు కడిగే సఫాయి కార్మికులు, ఇండ్లల్లో పని మనుషులు, కులం పేరుతో లైంగిక వెట్టికి గురయ్యే జోగినీలు, వ్యవసాయ కూలీలు, అడ్డా కూలీలు, తట్టలు మోసే లేబర్ పనోళ్ళు, మట్టి పనోల్లు, అసంఘటిత రంగాల్లో గౌరవం, ఆర్థిక విలువ లేని హీన రూపాలుగా చూడబడుతున్న శ్రమల్లో, మార్జినలైజ్ చేయబడిన మహిళలు నా రచనా వస్తువులు. నా జీవితం చుట్టూ కుల, జెండర్ వివక్షలు, అణచివేతలను ప్రతిఘటిస్తున్న పరిస్థితులు, మనుషులే నా సాహిత్య వస్తువులయ్యాయి.


రచయిత్రిగా ఎదిగే క్రమంలో ఏమైనా అవాంతరాలు?

జీవితంలో నిరాటంకంగా చదివినాను, ఉన్నతోద్యోగిగా ఎదిగినాను, రచయిత్రిగా నిలబడినానంటే, ఇదంతా నా ఒక్కదాని వల్లే జరగలేదు, చాలామంది నా వెనుక నిలబడ్డారు. వాళ్లంతా నాకు సదా యాదులు. కులం, జెండర్ నిరంతర వివక్షలు, అణచివేతలు నాకు మానని గాయాలు. ఆ గాయాల అనుభవాలను చెప్పుకోవడం, రాతల్లో వ్యక్తం కానివ్వడం, ఈ దేశంలో అంత సులువు కాదు. తెలుగు సాహిత్య చరిత్రలో మాదిగ మహిళ అస్తిత్వ గొంతు బలంగా కనిపించదు. నేను ఉద్యోగినైనపుడు, దళిత ఉద్యోగినని నా సర్టిఫికెట్‌ పత్రాల వల్ల తెలిసినా ఉద్యోగ సమాజం ఆ విషయాన్ని బాహ్యంగా ప్రస్తావించదు కానీ, సాహిత్య సమాజం మాత్రం ‘దళిత రచయిత్రి’నని నా సామాజిక పరిధిని తగ్గిస్తుంది! ప్రపంచ రచనా ప్రస్థానంలో నేనూ, నా అస్తిత్వం లేదనే వేదన చాలా కుంగదీస్తుంది. సామాజిక ధర్మాగ్రహం తెప్పిస్తుంది.

నోటి సాహిత్యమే గాని, రాత సాహిత్యానికి వందల మైళ్ళ దూరంగా వున్న జాంబవ సమాజం నుంచి వచ్చిన రచయిత్రిని. అందుబాటులో వున్న సాహిత్యాన్ని చదవడమే గాక, నేను అధ్యయనంలో మునగడానికి ఎన్నెన్నో అసాధారణ పరిస్థితులు పురికొల్పినయి. సాహిత్యమంటే, ప్రయోజనాలంటే ఏమిటో తెలియని అవస్థ! నిజానికి అధ్యయనాన్ని మించి– నేనెవరిని? నా సామాజిక జెండర్ స్థితి ఏమిటి? అనే వాస్తవిక అనుభవాలే నాకు ప్రశ్నించేటట్లు నేర్పినయి. సామాజిక విపత్తులతో సంఘర్షణలే నా రచనలు. వీటిని మెచ్చుకొని, మెడల మీద వేసుకుని, ప్రోత్సహించిన పత్రికలు లేకుండె. బాగా లేవనీ, నాసిరకం రచనలనీ, అర్తం కాని భాషనీ అచ్చుకు నిరాకరించిన, నిరుత్సాహపరిచిన నీరసాలే చాలా కాలమ్ వెంబడించినయి. తర్వాత్తర్వాత నా రచనలకు దొరికిన ప్రోత్సాహాలు మర్చిపోలేనివి.


ప్రత్యేకంగా తెలంగాణ తెలుగులో రాసే మీ రచనల్లో భాషా సమస్యలు?

చాలామంది ‘‘మీ భాష మార్చండి, చదువుకున్నారు కదా, చదువుకున్న భాషలో రాయండి. మీ తెలంగాణ అర్థం కావట్లేదు. మీ సాహిత్యం విస్తృతంగా అందరికీ అందాలంటే, తెలంగాణ మాండలికంలో కన్నా, మెయిన్ స్ట్రీమ్ తెలుగులో రాయండి’’ అనేవారు. భాష, బతుకు వేరు వేరు ఉండవు. పాలేరు భూస్వామి భాష మాట్లాడగలడా? అటెండర్‌కు ఆఫీసరు భాష అంటుతుందా? బాంచ భాష, బాసు భాష జమీన్ ఆస్మాన్ ఫరకు! భాషకు కులం, మతం, ప్రాంతం, జెండర్, చిన్న, పెద్ద, ధనిక, పేద ఉంటాయి. బూతులు ఉన్నాయని, అర్థం కావని, మా రచనలను చీకటి చేసింది ఆంధ్ర ఆధిపత్య మెయిన్‌స్ట్రీమ్ సాహిత్యం. ఆశ్చర్యమేంటంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నంక తెలంగాణ శిష్టులు ‘‘మీ పల్లె భాషని మార్చుకోండి ఎవరికర్తమైతది? శిష్ట తెలంగాణ వ్యవహారికం రాయండి’’ శిష్టభాష అనడంలోనే కులం ఉంది. ఇప్పుడు గూగుల్, ఏఐ టెక్నాలజీలు వచ్చాక కూడా భాష మీద కులమే అధిపత్యం చేస్తున్నది. ‘చెప్పు’ అని అడిగితే పాదరక్ష అని జవాబిస్తది ఏఐ. తెలంగాణ మాండలిక పదాలు గూగుల్, ఏఐ లలో ఉండకపోవడం కూడా మా భాష మీద జరుగుతున్న కులవివక్షే! మా తెలంగాణ మట్టి భాషని ఒకవైపు ఆధిపత్య భాషా సంస్కృతులు అడ్డుకుంటుంటే, ఇప్పుడు టెక్నాలజీ అడ్డుకుంటున్నది. భాషా వివక్ష చావలేదు. ఆ వివక్ష డిజిటలైజ్ అయింది.

మొదటి కథ ‘శుద్ది చెయ్యాలె’ నుంచీ, ఇప్పుడు ‘గునుగుపూలు’ ఆత్మకథనమ్ వరకూ సాగిన మీ సాహిత్య ప్రస్థానం గురించి?

ప్రభుత్వ కళాశాలలో పాఠాలు చెబుతున్న కాలంలో, నా కులమేమిటో తెలిసి అద్దింటి యజమాని, నా సామాన్లు బైట పడేయించిన అవమానం నన్ను తీవ్రంగా గాయపరిచిన కథే ‘శుద్ది చెయ్యాలె’. పైటలు తగలేయాలనీ నినదిస్తుంటే, శ్రమ మహిళలకు కొంగు బొచ్చె మీద కావలి వుండదని అది సర్వ శ్రమలు చేస్తుందనీ, డప్పు తయారీలో మాదిగ మహిళ లున్నా దాన్ని వాయించే కాడ నిషేధాలున్న కవిత్వమే ‘అయ్యయ్యో దమ్మక్క’ సంపుటి. మా జీవితాలను బయటివారు రాసే కంటే, ఎవరి గాయాల లోతులను వారు రచనల ద్వారా వ్యక్తం చేయడమే సరైనదని అంబేద్కర్ ఉద్య మాల ద్వారా వచ్చిన చైతన్యంతో, నా స్వీయ అనుభవాలు, నా చుట్టూత అల్లుకున్న అట్టడుగు మనుషుల జీవితానుభవాలతో వచ్చిందే ‘రాయక్క మాన్యెం’ (కథల సంపుటి). ఇంకా ‘చరిత్రల్ని చెరిగిపోస్తూ..’ (సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి), ‘రిజర్వేషన్ బోగి’ (కథల సంపుటి), ‘తెలంగాణి’ (కవిత్వ సంపుటి) లను వెలువరించాను. ‘మాక్క ముక్కుపుల్ల గీన్నె పోయింది’ (120 కాలిక వ్యాసాలు), ‘పంచాయితీరాజ్‌లో దళిత మహిళలు’ (కథలు), ‘ఒక్కొక్క పువ్వేసి...’ (బహుజన మహిళా చరిత్రల కాలిక వ్యాసాలు)... నా యీ రచనలన్నీ అణగారిన జెండర్లు ఆధిపత్యకుల వ్యవస్థలతో జరిపిన సంఘర్షణలు, సంభాషణలు, సవాళ్లు.


ఇక నేను తిరిగి, పెరిగిన నేల నెలవుల్ల చీకట్లు, వానలు, బురద, ముండ్లు, రాళ్ళు రప్పలు, అగడ్తలు దాటి వచ్చిన దారులు; నా సమాజం ఎదుర్కొంటున్న సంకుటాల నుంచి, సెప్పుల్లేని సెమట అడుగుల నుంచి చదువులతో ఎదిగి, సెక్రటేరియట్‌లో కొలువుల అందలాలు; నడిచొచ్చిన నా కాలాన్ని, ప్రాంతాన్ని, సామాజిక, జెండర్ అక్షరీకరించిన బతుకు చిత్రాలు నా ‘గునుగుపూలు’. అమాసలు పున్నాలు కలిసి ఆడుకున్న ఆటల్ని, ఆపదల్ని తవ్విపోసుకున్న తంగేళ్లు నా ఆత్మకథనం ‘గునుగు పూలు’. ఏరులు ఎదురెక్కిన ఎడ్డి కాలాన్ని తొలుసుకున్న తొవ్వలు నా ‘గునుగు పూలు’ ఆత్మకథనాలు. వీటి కొనసాగింపుల కొసలు మిగిలే వున్నయి.

ఇంటర్వ్యూ: కృపాకర్ మాదిగ

జూపాక సుభద్ర

ఇవి కూడా చదవండి:

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 03:10 AM