దకనీ సంస్కృతికి నిలువెత్తు రూపం
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:59 AM
చేతనగల రచయిత్రికి నిబద్ధత తోడైతే ఆ కలం పేరే జీలానీ బానూ! తెలుగువారితో మమేకమైన అరుదైన ఉర్దూ రచయిత్రి. అస్వస్థత కారణంగా ఇటీవల కన్ను మూశారు. హైదరాబాద్ దకన్ నుంచి ఇక్బాల్ మతీన్, ఎవజ్ సయీద్...
చేతనగల రచయిత్రికి నిబద్ధత తోడైతే ఆ కలం పేరే జీలానీ బానూ! తెలుగువారితో మమేకమైన అరుదైన ఉర్దూ రచయిత్రి. అస్వస్థత కారణంగా ఇటీవల కన్ను మూశారు. హైదరాబాద్ దకన్ నుంచి ఇక్బాల్ మతీన్, ఎవజ్ సయీద్, బేగ్ ఎహ్‌సాస్, జీనత్ సాజిదా, కమర్ జమాలీ, నజ్మా నిక్‌హత్ వంటి అగ్రశ్రేణి కథకులు ఉన్నప్పటికీ... వీరెవరూ తమ రచనలలో హైదరాబాద్ మిశ్రమ సంస్కృతికీ, దకనీ తెహ్‌జీబ్‌కూ చెప్పుకోదగ్గ ప్రాధాన్యమిచ్చినట్లుగా కనిపించదు. అయితే, హైదరాబాద్‌లో జన్మించకపోయినా, జీలానీ బానూ తన రచనలలో తెలంగాణ గ్రామీణ జీవనాన్ని, ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలను చిత్రించారు. దకనీ నుడికారానికి గుడి కట్టారు. పీడితుల బాధలూ, గాథలే ఆమె కథావస్తువులయ్యాయి. అందుకే తెలుగు సమాజంపై ఆమె తనదైన చెరగని ముద్ర వేశారు.
90 ఏళ్ళ క్రితం యూపీలోని బదాయూఁలో సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన జీలానీ బానూ ఐదారేళ్ళ ప్రాయంలోనే తండ్రి హైరత్ బదాయూనీతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు. ప్రసిద్ధ ఉర్దూ, అరబిక్, ఫార్సీ కవిపండితుడైన హైరత్, నిజాం సర్కారులో కొలువులో చేరి మల్లేపల్లిలో స్థిరపడ్డారు. వారింటికి ఫానీ బదాయూనీ, జోష్ మలిహాబాదీ, జిగర్ మురాదాబాదీ, హస్రత్ మొహానీ, మఖ్దూం మొహియుద్దీన్, మజ్రూహ్ సుల్తాన్‌పురీ, కైఫీ ఆజ్మీ, షకీల్ బదాయూనీ, అలీ సర్దార్ జాఫ్రీ వంటి దిగ్గజ షాయర్లు తరచుగా వారి ఇంటికి వచ్చేవారు. సాహిత్య గోష్ఠులతో నిత్యం వారి ఇల్లు సందడిగా ఉండేది. అట్లాంటి సారస్వత వాతావరణంలో పెరిగిన బానూకు రచనా వ్యాసంగం పట్ల మక్కువ ఏర్పడడంలో ఆశ్చర్యం ఏముంది?
బానూ రచనలు ఇండియాలో కన్నా ముందు పాకిస్తాన్‌లో ప్రచురితమయ్యేవి. ఆమెకు అక్కడ విశేష పాఠకాదరణ ఉంది. మోసపోయిన ఒక అమ్మాయి విషాదాంతంపై బానూ రాసిన తొలి కథ ‘మోమ్ కీ మరియం’ను లాహోర్‌లోని ప్రసిద్ధ సాహిత్య మ్యాగజీన్ ‘అదబే లతీఫ్’ ప్రచురించింది. 1955–1992 మధ్య రాసిన 67 కథలను ‘తిర్యాక్’ పేరుతో పాక్ లోని మక్తబ దానియాల్ ప్రచురణ సంస్థ సంకలనంగా తెచ్చింది. అనేక కథా సంపుటాలు పాకిస్తాన్ నుంచి వెలువడ్డాయి.
జీలానీ బానూ మొత్తం 22 పుస్తకాలు రాయగా, వాటిలో రెండు నవలలు, ఏడు కథా సంపుటాలు, రెండు నవలికలు (‘జుగ్నూ ఔర్ సితారే’, ‘నగ్మే కా సఫర్’), కిషన్ చందర్‌పై మోనోగ్రాఫ్, రేడియో నాటికలు, నాటకాలు, బాలల కథలు ముఖ్యమైనవి. ‘ఐవానే గజల్’, ‘బారిషే సంగ్’ నవలలు ఆమెకు ఎంతో కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చాయి. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత నిజాం హయాంలో పరిణామాలు, అనంతరం ప్రజాప్రభుత్వం ఏర్పడేలోగా సంధి దశలో జరిగిన జాగీర్దార్ల అరాచకాలు, మార్పుల నేపథ్యంలో రాసిన నవలే ‘ఐవానే గజల్’. ఇది అనేక భారతీయ, విదేశీ భాషలతోపాటు మొత్తం 14 భాషలలో అనువాదమయ్యింది. 1950–70 మధ్య కాలంలో తెలంగాణ పల్లెల్లో పేదలు, కూలీలపై జమీందార్లు, పెత్తందార్లు సాగించిన దాష్టీకాలకు అద్దంపడుతూ, నాటి వెట్టి వ్యవస్థను ఎండగట్టిన నవలే ‘బారిషే సంగ్’! ఆమె రాసిన ‘నర్సయ్య కీ బావ్డీ’ కథను ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ‘వెల్‌డన్ అబ్బా’ పేరుతో తెరకెక్కించారు.
ముస్లిం సంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ, బానూ పర్దా చాటునే ఉండిపోలేదు. చిన్ననాటే కిషన్‌చందర్, రాజీందర్ సింగ్ బేదీ, మంటో, ఇస్మత్ చుగ్తాయీ, ఫైజ్ రచనల ప్రభావానికి లోనైనప్పటికీ ఆమె సొంత గొంతు వెతుక్కున్నారు. అంజుమన్ తరక్కీ పసంద్ ముసన్నఫీన్ (అ.ర.సం)లో చేరకపోయినా, దాని లోని సాహితీవేత్తలతో ఆమెకు సత్సంబంధాలు ఉండేవి. సైద్ధాంతిక పితలాటకం ఆమె రచనా వ్యాసంగానికి ఆటంకం కాలేదు. దౌర్జన్యాలూ, అన్యాయాలూ జరిగితే ఆమె కలం ఎప్పుడూ బాధితుల పక్షమే రాసేది. గృహహింస అయినా, ఆఫీసులో ఉద్యోగినికి వేధింపులైనా, రాజ్యహింస జరిగినా, కార్మికులు, రైతుల కడగండ్లయినా బానూ పీడితుల పక్షానే వున్నారు. ఉరిశిక్షను నిరసిస్తూ, భ్రూణహత్యలను ఖండిస్తూ కథలు రాశారు. ఏది రాసినా నిబద్ధతతో, నిర్భయంగా రాశారు.
బానూ రచనలలో కథ ఎత్తుగడ, కథనం, సంభాషణలకు దకనీ భాష, శిల్పం ప్రధానంగా కనిపిస్తాయి. తొలి వాక్యంతో పాఠకుడి మెదడులోకి బోలెడన్ని ప్రశ్నలు సంధిస్తారు. ఆ వాక్యమే కడదాకా చదివిస్తుంది. ‘‘చత్వారం కళ్ళజోడు నెంబరు మారిందా? లేక ప్రపంచమే మారిపోయిందా?’’ అంటూ ఒక వాక్యంతో ‘అపరాధి’ కథ మొదలవుతుంది. బానూ సృజించినన్ని తెలుగు పాత్రలు బహుశా, హైదరాబాద్‌లోని ఏ ఉర్దూ కథకుడూ సృష్టించి ఉండరు. మిశ్రమ సంస్కృతి భావనకు ఇతర రచయితలు అంతగా ప్రాధాన్యమివ్వలేదు. ఆమె నవలలు, కథలలో మల్లేశం, రవి, పోచమ్మ, నర్సయ్య, బాలయ్య, సత్యనారాయణ... ఇలా ఎందరో ఉంటారు. ఆమె రచనలలో హిందూ దేవుళ్ళ శ్లోకాలు, బోనాల సంబరాలు, దీపావళి వెలుగులు తళుక్కుమంటాయి. పఠనీయతను పెంచే ఆమె రచనా శౖలిని తెలుగువారు ఇష్టపడతారు.
దాశరథి రంగాచార్య బానూ ఉర్దూ కథలను తొలిసారిగా తెలుగువారికి అందించారు. 1977లో నాటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు చొరవ మేరకు ‘కేదారం’ పేరుతో రంగాచార్య 25 కథలు అనువదించారు. 40ఏళ్ళ విరామం తర్వాత, నేను 42 కథలను అనువదించి రెండు సంకలనాలుగా తెచ్చాను. జీలానీ బానూ బాల్య జ్ఞాపకాలను కూడా అనువదించాను. దకనీ భాషపై ప్రత్యేక ఆసక్తి ఉన్న జీలానీ బానూ దకనీ నుడికారం, పలుకుబడులను రాబోయే తరాలకు అందించేందుకు 13 ఆడియో కేసెట్లు రూపొందించారు. హైదరాబాదీ తెహ్‌జీబ్ పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. తనింట్లో ఉన్న అసంఖ్యాకమైన గ్రంథాలన్నీ డిజిటలైజ్ చేయించారు. ‘పద్మశ్రీ’ గ్రహీత అయిన జీలానీ బానూ... ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, ఎన్టీఆర్ జాతీయ సాహిత్య అవార్డు సహా పలు పురస్కారాలు అందుకున్నారు. అద్వితీయమైన సాహిత్య సృజన చేసినప్పటికీ, ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మాత్రం దక్కలేదు.
వివిధ దేశాల ప్రజలు, కళాకారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉంటేనే ఉద్రిక్తతలు సమసి మైత్రీబంధం బలపడుతుందని ఆమె గట్టిగా నమ్మేవారు. జాతి విద్వేషం, మతమౌఢ్యం, శత్రుదేశాలపై దురాక్రమణ ధోరణులు తీవ్రతరమవుతున్న ప్రస్తుత భయానక వాతావరణంలో... జీలానీ బానూ లాంటి అభ్యుదయ, శిఖరసమాన రచయిత్రి అస్తమయం పెనువిషాదం!
మెహక్ హైదరాబాదీ
70361 75175
ఇవి కూడా చదవండి..
ప్రొటోకాల్ ఉల్లంఘన ఉత్తమాట... బీజేపీపై మమత ఫైర్
మమతా ప్రభుత్వాన్ని దేశం క్షమించదు: ప్రధాని మోదీ