Share News

ఇరవై ఏళ్ళలో పది భాషల్లోకి!

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:36 AM

అనువాదకుడు మూల భాషా సాహిత్యంలో మనుగుతాడు. లక్ష్య భాషా సముద్రపు గట్టున తేలుతాడు. అక్కడి ఆణిముత్యాలు ఇక్కడి వాళ్ళకూ, ఇక్కడి చక్కని సాహిత్యకృతుల్ని...

ఇరవై ఏళ్ళలో పది భాషల్లోకి!

అనువాదకుడు మూల భాషా సాహిత్యంలో మనుగుతాడు. లక్ష్య భాషా సముద్రపు గట్టున తేలుతాడు. అక్కడి ఆణిముత్యాలు ఇక్కడి వాళ్ళకూ, ఇక్కడి చక్కని సాహిత్యకృతుల్ని అక్కడివాళ్ళకూ అందిస్తాడు. అనువాదకుడు ఒక వంతెన లాంటివాడు. రిమోటు కంట్రోలు మాత్రం మూల రచయిత చేతిలోనే ఉంటుంది.

పెద్దింటి అశోక్‌ కుమార్‌ ‘జిగిరి’ నవలను 2005లో రాశాడు. 2006లో ఈ నవలలోని ఎలుగుబంటి ఆటకు ముగ్ధులై ‘ఆటా’ వారు ప్రథమ బహుమతి ఇచ్చారు. ఈ నవలా ప్రస్థానంలో ఇదే మలుపైతే– అసలు గెలుపంతా జేఎల్‌ రెడ్డి గారు హిందీలోకి తర్జుమా చేయడంతో మొదలైంది. ఆయన 2008లో అనువదించగా అది కేంద్ర సాహిత్య అకాడమీ వారి ‘సమకాలీన్‌ భారతీయ్‌ సాహిత్య్‌’ పత్రికలో అచ్చయింది. అదే ప్రారంభం. ఆ తర్వాతే అసలుసిసలు సంరంభం. 2010లో నవదీప్‌ సిద్ధుగారు ‘జిగిరి’ పేరుతోనే అనువదించారు. అది ‘పంజాబీ కహానీ’లో కహానీ సృష్టించింది. ఆ పత్రిక సంపాదకులు గుండెపోటుతో చనిపోయినపుడు కూడా ఆ నవల అతని గుండెల మీదే ఉంది. 2011లో సాయినాథ్‌ పచారే ‘జిగిరి’ నవలను ‘దర్వేశీ’ పేరుతో మరాఠీకరించారు. అది నీలిమా పబ్లికేషన్స్‌ నుండి పుస్తకంగా వచ్చింది.

నందితా మహంతి 2012లో ‘సంపర్క్‌’ పేరిట ఒరియా భాషలోనికి తీసికెళ్ళారు. ఆ సంవత్సరమే ప్రొఫెసర్‌ జయలక్ష్మి ‘ఫ్రెండ్స్‌ ఫర్‌ ఎవర్‌’ అని ఆంగ్లీకరించారు. 2013లో ప్రేమ్‌చంద్‌ పంకజ్‌ ‘జిగిరి’ని మైథిలీ లోనికి అనువాదం చేశారు. ఇక... నానీ సుర్‌ అదే ఏట ‘జిగిరి’ పేరుతోనే బెంగాలీకరించారు. ఇప్పటిదాకా జరిగిన అనువాదాల్లో ఒక్క ఆంగ్లానువాదం తప్ప మిగిలిన వాళ్ళందరూ జేఎల్‌ రెడ్డి హిందీ అనువాదం చదివి తమ తమ భాషల్లోకి దిగుమతి చేసుకున్నారు. తెలుగు నుండి హిందీలోనికి మన సాహిత్యం వెళ్ళవలసిన అవసరాన్ని జేఎల్‌ రెడ్డి బాగా గుర్తించారు. కనుకే అది దాదాపు ఔత్తరాహులకు అందివచ్చింది. ఇక, తెలుగు – తమిళం బాగా తెలిసిన తెప్పాల శ్రీనివాస్‌ ఈ నవలను ‘కరడి’ (ఎలుగుబంటి) పేరుతో తమిళంలోకి తీసుకువెళ్ళారు. కె.కృష్ణమూర్తి ‘జిగిరి’ పేరుతోనే కన్నడీకరించారు.


‘జిగిరి’ నవలను తెలుగు నుండి నేరుగా అనువదించిన హిందీ, ఆంగ్ల, తమిళ, కన్నాడానువాదాలు మూలానికి బాగా విశ్వసనీయంగా ఉన్నాయి. అది సహజం కూడా. హిందీ ఆధారంగా ఇతర భాషల్లోకి వెళ్ళిన అనువాదాలు నాసిరకం అనువాదాలు కావు గానీ మూలంలోని ఆత్మ హిందీ లోనికి ప్రయాణించి అక్కడ్నించి తమ తమ భాషల్లోకి తెచ్చుకునేటప్పుడు ఇసుమంత తేడా ఉంటుంది. కానీ, మూల భాష లోని స్వారస్యం మాత్రం పోదు కదా! అసలు అనువాదమే కాకుండాపోతే– కరచాలనాలుండవు– పరస్పర పరిష్వంగాలుండవు. భాషల మధ్య వారధి ఉండనే ఉండదు. కనుక అనువాదాలు నేరుగానో అనేరుగానో జరగాల్సిందే!

ఇప్పుడు ‘జిగిరి’ మలయాళంలోనికి వెళ్తున్నది. పంజాబీలోనికి రెండోసారి వెళ్ళింది. ఒరియా భాషలోనూ రెండో పర్యాయం ప్రయాణించింది. ఆయా భాషల పత్రికల్లో ప్రచురించబడటమే కాకుండా దాదాపు ఆ భాషల్లో పుస్తక రూపంలో వచ్చింది. దీనికి బలమైన హేతువు మూల నవలలోని బలం. మనుషుల మధ్య పెరిగిన ఎలుగుబంటికి మానవుల అలవాట్లు రావటం, మనుషులు రెండెకరాల కోసం జంతువులు కావటం– ఈ నవల ఇరుసు. ఈ దినుసును అనువాదకులు గొప్పగా చేర వేశారు అవతలి గట్టుకి. మొత్తమ్మీద 2005 నుండి 2025 వరకు ఈ ఇరవై ఏళ్ళ కాలవ్యవధిలో పెద్దింటి అశోక్‌ కుమార్‌ ‘జిగిరి’ నంత పది భాషల్లోకి వెళ్ళటం మనమంతా ప్రస్తావించుకోదగిన ప్రశస్త విషం.

n నలిమెల భాస్కర్‌

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్..

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్.

Updated Date - Apr 06 , 2026 | 03:36 AM