నెహ్రూ సెక్యులరిస్టు కాదు
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:43 AM
‘మత జాతీయవాదం భారత్‌కి మేలు చేసేనా?’ శీర్షికన ఫిబ్రవరి 7న రామచంద్ర గుహ రాసిన వ్యాసానికి ఏ మాత్రం ఇంగితజ్ఞానం ఉన్నవాడైనా మేలు చేయదనే చెబుతాడు. తన వ్యాసంలోని...
‘మత జాతీయవాదం భారత్‌కి మేలు చేసేనా?’ శీర్షికన ఫిబ్రవరి 7న రామచంద్ర గుహ రాసిన వ్యాసానికి ఏ మాత్రం ఇంగితజ్ఞానం ఉన్నవాడైనా మేలు చేయదనే చెబుతాడు. తన వ్యాసంలోని అంశాలను సమర్థించుకునేందుకు ఆయన ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూని వెనకేసుకు రావడం అభ్యంతరకరం. నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలోకి హిందూ మహాసభ ప్రతినిధిగా శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీని తీసుకున్నారు. 20వ శతాబ్దిలో హిందూ మహాసభ రాజకీయాలు అంత ప్రమాదమైతే వారికి ప్రభుత్వంలో నెహ్రూ ఎందుకు స్థానం కల్పించినట్టు? 1947 అక్టోబర్ 15న ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసినట్టుగా గుహ ఉటంకించిన ఉత్తరం వేళ మంత్రివర్గంలో శ్యామప్రసాద్ సభ్యుడే. నెహ్రూది పైకి సెక్యులరిజం, లోపల మైనారిటీ సంతుష్టీకరణ విధానం. రాజ్యాంగంలో మత చట్టాలను అనుమతించినపుడే తేలిపోయింది ఆయన సెక్యులరిజం. సెక్యులరిజం అంటూనే మైనారిటీలకు ప్రత్యేక హక్కుల గురించి రాసినపుడే మన రాజ్యాంగం కుహనా లౌకిక రాజ్యాంగం అని అర్థమైంది. సెక్యులర్ దేశంలో అందరూ భారతీయులే. భారతీయులందరికీ సమాన హక్కులు ఉంటాయి. అటువంటి దేశంలో పౌరులకు ఉండే హక్కులన్నీ ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలి అని నెహ్రూ ఉత్తరం రాయడం ఆయన కుహనా లౌకికవాదానికి తార్కాణం.
అయోధ్య వివాదం రాజీవ్‌గాంధీ నెత్తిన రుద్ది నెహ్రూని రక్షించే యత్నం చేశారు గుహ. ప్రధానిగా నెహ్రూ ఉన్న 1959లోనే తొలిసారి అయోధ్య మందిర వివాదం తలెత్తింది. నాడు హఠాత్తుగా రామ్‌లాల విగ్రహం అక్కడ ఎవరో పెట్టారు. ఆ సమయంలో ఆ విగ్రహం తొలగించే ఉత్తర్వులు నెహ్రూ ఇచ్చివుంటే అది బాబ్రీ మసీదుగానే ఉండిపోయేది. అది చేయకుండా మందిర–మసీదు వివాదానికి నెహ్రూ పునాది వేశారు. నెహ్రూని సెక్యులర్‌వాదిగా, ప్రజాస్వామ్యవాదిగా, సమ్మిళిత అభివృద్ధిని కాంక్షించినవాడిగా లేనిపోని ఘనకీర్తులు ఆయనకు తన వ్యాసంలో తొడిగారు గుహ. దేశంలో సామాజిక సమరసతకు, మత విభేదాలు, ఘర్షణల నివారణకు ఏకైక పరిష్కారం ఉమ్మడి పౌరస్మృతి. అటువంటి చట్టానికి డిమాండ్ చేయాల్సిన గుహ వంటి మేధావులు హిందూ–ముస్లింలను ఏకం కానివ్వని మత చట్టాలకు అనుమతినిచ్చిన నెహ్రూని కొనియాడడం దురదృష్టకరం.
డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, విజయవాడ
ఇవి కూడా చదవండి..
'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం