జంకు
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:37 AM
తెలుసుకోలేదు నేను పుట్టి అంబాడినప్పుడు గోడలు మంచాల కోళ్ళు పట్టుకొని బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు నిటారుగా నిలబడి నడుస్తున్నప్పుడు...
తెలుసుకోలేదు
నేను పుట్టి అంబాడినప్పుడు
గోడలు మంచాల కోళ్ళు పట్టుకొని
బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు
నిటారుగా నిలబడి నడుస్తున్నప్పుడు
అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నది
నువ్వేనని నేను తెలుసుకోనే లేదు
నేను గమనించనే లేదు
మూడేళ్ల పిల్లగానప్పుడు
నెత్తిలో పుండ్లు అయితే
మొక్కిన అంతగిరి పోచమ్మ దగ్గర
పుట్టు వెంట్రుకలు తీసి కల్లు సాక పోసి
కోడిపిల్లను కోసి వండుకు తిన్నప్పుడు
నీడలా వెంట వస్తున్నది
నువ్వేనని గమనించనేలేదు
గ్రహించలేదు
ఐదో తరగతి విద్యార్థిగా
మా అమ్మమ్మ ఊర్లో చదువుకుంటున్నప్పుడు
మదన జెరం వచ్చి ఎంతకూ తగ్గక
ఇక బతకడని కింద వేసి మతులబు చేస్తే
శోకిస్తూ అమ్మ వచ్చి చెవిలో పిలిచినప్పుడు
ఎండుగడ్డి తల్పం మీంచి లేచి
కళ్ళు తెరిచి చూసినప్పుడు
నువ్వు నాతో జీవిస్తున్నావని
నేను గ్రహించనేలేదు
అనుకోలేదు
వ్యక్తి కుటుంబం సమాజం
ఒక తోడుకోసం ఎర్రటిఎండ నుంచి నీడకోసం
సుఖాలు దుఃఖాలు క్షణికానందాలు
తపిస్తూ మోస్తున్నాం అనుకుంటాం
కానీ ఒక మరణాన్ని
నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నానని
నేను స్వగతంలో కూడా అనుకోనేలేదు
లెక్కపెట్టుకోలేదు
గమ్యాలు లక్ష్యాలు
భావాలు అభావాలు
సంయోగాలు వియోగాలు
పడుతూ లేస్తూ నడుస్తూనే వున్నాను
కానీ ఇంతకాలం చావు దిక్కు
అడుగులు వేస్తున్నానని
మాట వరసకు సైతం
నేను గణించుకోనే లేదు
నువ్వు నాతోనే నాలోనే ఉన్నావని
తెలుసుకునేసరికి ఒక
భయాభయం
ఆశ చావని
మొస మర్రని ముసలితనం
నా అడుగులో అడుగు
పిల్లిలా వేసుకుంటూ
ఏ క్షణమైనా ఉరుమురిమి
పిడుగై పడుతావని
పీనుగై పోతానని
ఒక తటపటాయింపు
అయినా ఒక బలమైన జీవకాంక్ష
ఒకానొక ధైర్యవచనం ఊపిరిగా
నడిపిస్తున్నది
జూకంటి జగన్నాథం
94410 78095
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..