Share News

ఇప్పటికీ అంతే కొత్త పాళీ!

ABN , Publish Date - Aug 24 , 2026 | 03:02 AM

తాపీ ధర్మారావు తన జీవితంలో ఒక మూడేళ్ళపాటు ఒక్క ముక్క రాయలేదు. ఆ కాలం గురించి ఆయన ఇలా రాసారు: ‘‘...పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే...

ఇప్పటికీ అంతే కొత్త పాళీ!

తాపీ ధర్మారావు తన జీవితంలో ఒక మూడేళ్ళపాటు ఒక్క ముక్క రాయలేదు. ఆ కాలం గురించి ఆయన ఇలా రాసారు: ‘‘...పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే, నా హృదయంలో కలిగిన మార్పు దానికి ఒప్పుకునేది కాదు. అందుచేత మౌనం కలిగింది నా కలానికి. దీనివల్ల స్నేహితులయిన పత్రికా సంపాదకులకి నాపై కోపం కూడా కలిగింది ఏమి చేయను? నాపై నాకే కోపం కలిగినపుడు ఇతరులకి కలగదా!...’’

1933 నుంచి 1936 మధ్య ఆ మూడేళ్ళ కాలంలోనూ చేసినదేమిటో కూడా ఆయన రాసుకున్నారు: ‘‘మూడు సంవత్సరాలు–వెయ్యిరోజులు–దాటిపోయాయి. ఒక్క ముక్క అయినా వ్రాయలేదు... ప్రచురించడం అంతకన్నా లేదు. నిజమే, కాని, చదివినది మాత్రం చాలా ఉంది. దగ్గరదగ్గర 40, 50 వేల పేజీల సారస్వతం చదవగలిగాను. సారస్వతం అంటే ఎలాంటి సారస్వతం? ...దేశదేశాలలోనూ, ఖండఖండాలలోనూ ప్రఖ్యాతి పొందిన గ్రంథాలు. వందలకొద్ది ఇతర భాషలలోకి తర్జుమా అయిన గ్రంథాలు, అన్ని జాతులవాళ్ళ పొగడ్తల్నీ, లక్షలకొద్దీ బహుమానాన్నీ పొందిన గ్రంథాలు. ప్రపంచంలోని జనులనీ, వాళ్ళ అభిప్రాయాలనీ ఒక్కసారి మార్చివేసిన గ్రంథాలు. రషియా, జర్మనీ, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, ఇంగ్లండు, అమెరికా... ఈ దేశాలలో మిక్కిలి ఉత్తమమైన గ్రంథాలు. ఈ గ్రంథాలు కరువుదీర చదివాను. నా స్వభావాన్నిబట్టి చదివిన వాటిని గురించి విమర్శించుకున్నాను. ఆలోచించుకున్నాను. తరువాత ఆయా దేశాల్లో ఆ గ్రంథాలను గురించి విమర్శనలు చూశాను. నోబెల్ మొదలైన గొప్ప గొప్ప బహుమానాలు ఈ గ్రంథాలకెందుకిచ్చారో తెలుసుకున్నాను. దీని అంతటివల్ల నా అభిప్రాయాలు చాలా ఎక్కువగా మారిపోయాయి. మారక తప్పదు ఆ గ్రంథాలని చూచిన తర్వాత.’’

ఈ మాటలన్నీ తాపీ ధర్మారావు పుస్తకం ‘కొత్తపాళీ’లోని తొలి పేరాలు. రాయకుండా గడిపిన మూడేళ్ళ తర్వాత గూడవల్లి రామబ్రహ్మం నడిపిన ‘ప్రజామిత్ర’ పత్రికలో 1936 సంక్రాంతి సంచిక నుంచి ధారావాహికంగా ప్రచురింపబడిన ధర్మారావు వ్యాసాలే ‘కొత్తపాళి’ సంపుటి. అప్పటికి ధర్మారావు వయసు నలభైకు మించలేదు. ఆయన్ను వ్యావహారిక భాషా వైతాళికుడిగా మనం కొనియాడుతాం. ఘనమైన పత్రికా సంపాదకుడిగా గౌరవిస్తాం, తెలుగు సినిమాలకు చక్కని భాషను, స్క్రీన్ ప్లే విధానాన్ని ఇచ్చిన దార్శనికుడిగా కీర్తిస్తాం. అయితే తెలుగు సాహిత్య విమర్శకుడిగానూ ఆయన పేరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది.


ఇటీవల మళ్ళీ వారి రచనలు ‘ఇనుప కచ్చడాలు’, ‘దేవాల యాలపై బూతు బొమ్మలు’, ‘సాహిత్య మొర్మరాలు’, ‘పాత పాళీ’, ‘కొత్తపాళీ’ పుస్తకాలను జాగ్రత్తగా చదివాను. సాహిత్య విమర్శను కూడా బొరుగులు తిన్నంత సులువుగా అందివ్వగలిగిన ప్రతిభాశాలి తాపీ. ‘కొత్తపాళీ’ గురించి చాలామంది రాశారు, శ్లాఘించారు, తాపీవారికి పర్యాయపదంగా వాడారు. అయినా ఇప్పటికీ తెలుగు పాఠకులు ‘కొత్తపాళీ’ని కొత్తగా, సమగ్రంగా, సవ్యంగా చూడాల్సి ఉందనే అనిపిస్తోంది.

నిజానికి తాపీధర్మారావు ‘కొత్తపాళీ’ ద్వారా సాహిత్యరచనకు ఒక సిలబస్ రూపొందించారు. ఏది సాహిత్యం? ఎవరి కోసం ఆ సాహిత్యం? దాని ఉద్దేశ్యం ఏమిటి? ఎలా రాయాలి? అలానే ఎందుకు రాయాలి? – అనే విషయాలపట్ల సమగ్రమైన అవగాహన కలిగిస్తారు. అలాగే కవి లేదా రచయిత నిల్చున్న కాలానికీ, సమయానికీ – గతాన్నీ, గత సాహిత్యాన్ని ఎలా చూడాలి? ఏమి స్వీకరించాలి? అలాగే భవిష్యత్తులో బాధ్యత ఏమిటి? అని కూడా చాలా సులువుగా బోధపడేట్టు విశ్లేషిస్తారు.

సాహిత్య విమర్శకుడిగా ధర్మారావులో పాండిత్యం, విశ్లేషణ, ఓపిక విశేషంగా ఉన్నాయి. అంతకుమించి వారి విమర్శలో మనం చూడాల్సినవి మరిన్ని ఉన్నాయి:

అ) సాహిత్య విమర్శను రీడబుల్‌గా రాయడమూ, ఆ) హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, వెటకారాన్ని పుష్కలంగా వాడటమూ, ఇ) ఎటువంటి ద్వేషం లేకుండా సహనం, సమన్వయంతో కూడిన దృష్టితో సాహిత్య పరిశీలన చేయడమూ, ఈ) హేతుబద్ధంగా ఏది ప్రయోజనకరమో, కాదో అని విశ్లేషించి చూపడమూ, ఉ) తెలుగునూ, తెలుగు సాహిత్యాన్ని నెత్తిన పెట్టుకు అవి మరింత ఉజ్జ్వలంగా ఉండాలనడమూ – వెరసి నవనవోన్మేషంగా తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు ఇవ్వడమూ.

ఈ వ్యాసాలను 1955లో పుస్తకంగా వెలువరిస్తూ ఇలా అన్నారు: ‘‘...నాకు సంస్కృతం మీద ద్వేషమని కొందరయ్యలంటూంటారు. కాదు: నాకు కావాలి సంస్కృతం, కొద్దో గొప్పో ఇప్పటికీ చదువుకుంటుంటాను. అది గొప్ప రత్నాల గని. నిజమే. ఇష్టమున్నవాళ్ళు సంస్కృతం చదవవలసిందే, దానిలో ఉన్న విజ్ఞానం తెలుసుకోవలసిందే, ఆ విజ్ఞానాన్ని తెలుగులోనికి తీసుకురావలసిందే. అది కూడదనను. అనవసరంగా ఆ భాషను దిగుమతి చేయకండంటాను. తెలుగుతనం నిలుపమంటాను. అంతే...’’

అలాగే కొత్తపాళీ చివరి వ్యాసం చివరలో ఇలా అంటారు: ‘‘...సాహిత్యాన్ని పట్టి ఆ జాతి వారి విజ్ఞానము, జీవన విధానము, ఆచారాలు, సంస్కృతి తెలుసుకోవడానికి వీలుండాలి. సాహిత్యంలో జాతి కనబడాలి. జాతికి సాహిత్యం అద్దంలాగుండాలి.’’

‘‘తెలుగు కవి, తెలుగు రచయిత, తెలుగు ప్రజల జీవితంలో ఉండి వ్రాయాలి... తెలుగు సంస్కృతీ, తెలుగు గడ్డా, యుగయుగాల నుంచి వచ్చిన తెలుగు విజ్ఞానమూ తనకిచ్చిన శక్తీ, అతను తెలుగు ప్రజకి రుణపడి ఉన్నాడు. ఆ రుణం తీర్చాలి; తన ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోకూడదు. మళ్ళీ తెలుగువాళ్ళకు తాను కొంత చెల్లించాలి,’’ అని కూడా చెప్తారు తాతాజీ.


ఈ క్లారిటి చూడండి: ‘‘...అందులో సంస్కృతమే ఉండనీయండి, తెలుగే ఉండనియ్యండి, ఇంగ్లీషు, హిందూస్తానీ మరేదయినా ఉండనీయండి. ఏమైనాసరే తెలియడం ప్రధానం...’’ అంటారు. 1936లో రాసిన మాటలు నేటికీ చాలామందికి ఎంతో అవసరమనిపిస్తుంటుంది – కొన్ని సమయాలలో వినిపించే వాదనల రొద వింటూంటే!

వారి ‘కొత్తపాళీ’ వ్యాసాల నుంచి కొన్ని పదునైన వాక్యాలు, పరిశీలనలు:

1) తెనుగు చేస్తానని చెప్పి, మరింత సంస్కృతం గుప్పి తెలియకుండా చేయడం అక్రమం, తన పాండిత్యం ప్రదర్శించడానికే వ్రాసుకొనడమే అంటుంది మొల్ల– నన్నయ గురించి.

2) జాను తెలుగు కోసమూ, ద్విపదల కోసమూ, తెలుగు ప్రజల గాథల కోసమూ చూచేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు – నన్నెచోడుడు, పాలకురికి సోమనాథుడు మొదలైన వాళ్ళు. వీళ్ళ పేర్లే మొన్న మొన్నటిదాకా మనకు తెలియకుండా పోయాయి.

3) కవిసమయాలన్నారు, సాహిత్యసూత్రాలన్నారు, కావ్యమర్యాదలన్నారు, నాటకలక్షణాలన్నారు, వెయ్యిపేర్లు చెప్పారు. పదివేల నియమాలు దింపారు... ఇవన్నీ సంస్కృతం రేవులో నుంచే దిగుమతి.

4) పగలు కలువపువ్వులు వికసించి ఉండటం ఎంతమంది చూచారు కాదు? అవి కలువలు కావంటారా?

5) తెలుగులో తెలుగు సాహిత్యాన్ని చూపాలి. సంస్కృతం పరిచయం వల్ల మరింత అభివృద్ధి పొందడానికి బుద్ధిపుట్టాలి. గాని బానిస బుద్ధి పుట్టిపోకూడదు.

6) కృష్ణరాయ చక్రవర్తినీ, ఆతని ఆముక్తమాల్యదా చూడండి. ఆ ఊహాచాతురీ ఆ ప్రపంచ పర్యావలోకనమూ, ఆ కవిత్వదృష్టీ చూచినవాళ్ళకి అతడు గ్రుడ్డి వ్రాతగాడు కాక, ఒక నూరు కళ్ళున్న వ్రాతగాడిలా కనిపిస్తాడే!

7) పేరుగాంచిన ప్రబంధాలని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. వాటిని కేవలం పారవేయకూడదు. అలా పారవేసినట్టయితే ఆంధ్రసారస్వత జీవనంలో మూడు, నాలుగు వందల సంవత్సరాలు వ్యర్థమయిపోయినట్టే అవుతుంది. అంత నష్టానికి ఎవరు ఒప్పుకోగలరు?

8) గ్రంథాలలో స్త్రీ పురుష సాంగత్య విషయంలోని సంగతులన్నీ మడికట్టుకుని విడిచిపెడితే బాగుండదు.

9) వేడివేడినెత్తురుతో జీవయాత్ర సాగిస్తూ ఉన్న తెలుగు ప్రజలకి మనసాహిత్యంలో జాగా లేకపోయింది. జావా, సుమత్రా ద్వీపాలకి వెళ్ళి వలసలు ఏర్పాటు చేసే చేవగలిగిన తెలుగు తనానికి జాగా లేకపోయింది. పడవలు కడుతూ, సముద్రాలు దాటిన తెలుగు సాహసానికి జాగా లేకపోయింది. ఇంతెందుకు, బ్రతికి ఉన్న తెలుగుకు జాగా లేకపోయింది.

ఎనభైయ్యేళ్ళ క్రితం రాసిన ‘కొత్తపాళీ’ సాహిత్య విమర్శలో సహనం, సమన్వయం, హేతుబద్ధత, తార్కికత, తెలుగు మీద మనకుండాల్సిన గురి – మరీ ముఖ్యంగా హాయిగా, అలవోకగా చదివేలా రాయగలగడం – వంటి కోణాలలో నేటికీ మనకు అవసరం.

నాగసూరి వేణుగోపాల్

94407 32392

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 03:03 AM