కేంద్ర సాహిత్య అకాడమీ అవసరమా?
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:48 AM
ఏటా కేంద్ర సాహిత్య అకాడమి సాహిత్య పురస్కారాలు ప్రకటిస్తుంది. ఈ ఏడాది తెలంగాణ రచయిత నందిని సిధారెడ్డి ‘అనిమేష’కు తెలుగు సాహిత్య పురస్కారం ప్రకటించింది. త్వరలోనే బాలసాహిత్య పురస్కారం,...
ఏటా కేంద్ర సాహిత్య అకాడమి సాహిత్య పురస్కారాలు ప్రకటిస్తుంది. ఈ ఏడాది తెలంగాణ రచయిత నందిని సిధారెడ్డి ‘అనిమేష’కు తెలుగు సాహిత్య పురస్కారం ప్రకటించింది. త్వరలోనే బాలసాహిత్య పురస్కారం, యువపురస్కారం ప్రకటించాల్సి ఉంది. వీటికి దరఖాస్తులు కోరుతూ గత ఏడాదిలోనే ఆహ్వానం ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాలలో 2014 తరువాత నెలకొన్న సామాజిక, సాహిత్య పరిస్థితులలో అసలు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ఎంతవరకూ సాహితీవేత్తలను, ప్రజలను సంతృప్తిపరుస్తున్నాయన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మొదటగా ఈ అవార్డులకు కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తున్న నగదు బహుమతిని పరిశీలిద్దాం. కేంద్ర సాహిత్య అకాడమి ప్రధాన పురస్కారానికి కేవలం లక్ష రూపాయలు, ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక ఇస్తుంది. బాలసాహిత్య పురస్కారానికి, యవ పురస్కారానికి యాభైవేల రూపాయలు, ఒక రాగి పలకపై ప్రశంసా పత్రం, జ్ఞాపిక ఇస్తారు. కాబట్టి ధన/విలువ ప్రకారం పరిశీలిస్తే, ప్రధాన సాహిత్యానికిచ్చే విలువలో మిగతా రెండింటికీ సగమే ఇస్తున్నారు. ఈ వివక్ష దేని వల్లో ఎవ్వరికీ తెలియదు. ఈ పురస్కారాలకు అభ్యర్థులు పది కోట్ల జనాభా ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి వందల్లో ఉన్నారు. నిజానికి ఏ జాతీయ పురస్కారంగానీ లక్ష రూపాయల నగదుకు తక్కువ కాకుండా ఉండాలని ఒక అలిఖిత నియమం ఎప్పటినుంచో అమలులో ఉంది. కేంద్రానికి మూడు పురస్కారాలకు మూడు లక్షలు ఇచ్చే స్తోమత లేదా?
ఇక ఈ పురస్కారాల ఎంపికకు అనుసరించే విధానం తల్చుకొంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ పురస్కారాలకు అభ్యర్థులు తమ పుస్తకాలను ప్రాంతాల వారీగా ఆయా కేంద్రాలకు స్వయంగా పంపాలి. పంపిన తరువాత అవి వారికి అందాయో లేదో కూడా తెలియపరిచే యంత్రాంగం అక్కడ లేదు. ‘దేవుడికి ఉత్తరం’ అన్న చందాన పంపిన నాటి నుంచి పురస్కార ప్రకటన వచ్చేవరకూ ఎదురుచూపులే దిక్కు. లాంగ్వేజ్ అడ్వైసరీ కమిటీ ఈ పుస్తకాల జాబితాను తయారు చేసి, వాటి పరిశీలనకు పదిమంది ప్రాథమిక పరిశీలకుల/ పాఠకుల పేర్లను రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి నియమించిన ఆ పరిశీలకులు/ పాఠకులు, వచ్చిన పుస్తకాలను చదివి ఒక్కొక్కరు రెండు పుస్తకాల చొప్పున తుది పరిశీలనకు సిఫార్సు చేస్తారట. ప్రతిసారీ ఆ పదిమంది ఎవరో ఎవరికీ తెలియదు. ఆ పదిమంది ప్రతిపాదించిన మొత్తం ఇరవై పుస్తకాలను రచయితల నుంచి గాని, ముద్రణదారుల నుంచి గాని అకాడమీ కొనుగోలు చేస్తుంది. ఈ ఇరవై పుస్తకాలను ముగ్గురు సభ్యుల న్యాయమూర్తులు పరిశీలిస్తారు.
ఈ ముగ్గురు సభ్యులను తిరిగి లాంగ్వేజ్ అడ్వైసరీ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతే నియమిస్తారుట. సాహిత్య అకాడమీకి నియమితులైన తెలుగు భాషా కన్వీనర్ ఈ న్యాయమూర్తుల మీటింగ్ నిర్వహించి వారి ద్వారా ఆ వచ్చిన ఇరవై పుస్తకాలలో ఏదైనా ఒక దానిని పురస్కారానికి ప్రతిపాదించాలి. ఈ మీటింగ్ నిష్పక్షపాతంగా జరిగినట్టు ఆ కన్వీనర్ సంతృప్తి చెందితే చాలు. ఒకవేళ ఏ పుస్తకానికీ పురస్కార అర్హత లేకపోతే ఆ ఏడు దేనికీ అర్హత లేదని ఆ ముగ్గురు న్యాయమూర్తులు నిర్ణయించి, కన్వీనర్‌కు చెబితే ఆ ప్రకారమే తుది నిర్ణయం జరుగుతుంది. నిజానికి ఇదంతా అంత శాస్త్రీయంగా జరగటం లేదన్నది అనేక విధాల స్పష్టం.
2025 పురస్కారానికి ముగ్గురు సభ్యుల జ్యూరీ ముందుకు తుది పరిశీలనకు కేవలం ఏడుగురు రచయితల పుస్తకాలే వచ్చినాయి. 2026లో కూడా కేవలం పది పుస్తకాలే పరిశీలనకు వచ్చాయి. మరి ఇరవై పుస్తకాల మాటేమిటి? తెలుగు రాష్ట్రాలలో సుమారు రెండు వందల మంది బాలసాహిత్య రచయితలున్నారు. కొంతమంది చందమామ, బాలమిత్రతో రచనలు ఆరంభించి దాదాపు అన్ని బాల, దిన పత్రికలకు కథలు శరపరంపరగా రాశారు. ఇప్పటికీ రాస్తున్నారు. వీరిలో ఇద్దరి పేర్లు మాత్రమే ఆ ఏడుగురు రచనల లిస్టులో కనిపించాయి. అసలు మొత్తం ఎన్ని పుస్తకాలు వచ్చాయి? వాటిలోంచి ఎంపిక చేసేందుకు జ్యూరీకి ఇరవై పుస్తకాలు సరైనవని పించలేదా? అన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే. రాజకీయాలకు, సిఫార్సులకు భయపడి గోప్యత పాటిస్తున్నారని పదిమంది నమ్మబలికే ప్రయత్నం చేసినా, గోప్యత మాటునే సిఫార్సులు నడుస్తున్నాయి.
ఒకప్పుడు యూనివర్సిటీల్లో పనిచేసే కమ్యూనిస్టు మేధావులు, అభ్యుదయ రచయితల సంఘాల నాయకులు, బలమైన కులవర్గాల పలుకుబడి కేంద్ర సాహిత్య అకాడమీపై బాగా చెలామణీ అయ్యేది. ఆశ్చర్యం ఏమిటంటే కొడవటిగంటి కుటుంబరావు సుమారు ఐదువందల కథల దాకా రాశారు. కానీ ఆయనకు అవార్డు రాలేదు. ఆయన కథలకు సంపాదకుడిగా వ్యవహరించిన కేతు విశ్వనాథరెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. చాసో, రావి శాస్త్రిలకూ రిక్తహస్తమే మిగిలింది. ప్రస్తుతంలో ఎనభయ్యో పడిలో పి.ఎస్. నారాయణ, విహారి, రాజా రామ్మోహన రావు, శ్రీకంఠస్ఫూర్తి లాంటి వాళ్ళున్నారు. మరి వీళ్ళెందుకు కనబడరు?
పురస్కారాల సంఖ్య కూడా ఎటువంటి దామాషా, శాస్త్రీయత లేకుండా ఉన్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలన్న ప్రాతిపదిక ఏర్పడ్డాక జనాభా ప్రాతిపదికనో, రాష్ట్రానికొకటి అన్న ప్రతిపాదికనో ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కటే పురస్కారం ఏవిధమైన న్యాయం? ఇంతమంది జనాభా ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఏటా ఒక్క అవార్డు ఇవ్వటం అంటే అవార్డు రాని ఆ స్థాయి హేమాహేమీలను కించపరచడమే. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పథకాల, ప్రోత్సాహకాల ప్రదానం కూడా జనాభా నిష్పత్తిలోనో, ఆయా వర్గాల నిష్పత్తిలోనో ఉండాలి. 2011 జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాలన్నీ నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్ర జనాభా కన్నా తక్కువ. ఇప్పుడు రెండు రాష్ట్రాలూ కలిపి సుమారు 10 కోట్ల జనాభా ఉన్నారు. అయినా మనకొచ్చేది ఒకటే అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమి 1954లో సాకారం అయినప్పటి నుంచి నేటికి 71 సంవత్సరాలు నిండినా దీని పనితీరుపై సమగ్ర పరిశీలన జరగలేదు.
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర సాహిత్య అకాడమీలను మళ్ళీ ఏర్పరిస్తే, ఈ అరకొర పురస్కారాలకు తుది వాక్కు పలికినట్టవుతుంది. మరింతమందికి దామాషాలో పురస్కారాలు వచ్చే అవకాశం మెరుగవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర సాహిత్య అకాడమి అసలు అవసరమేనా?
కొప్పరపు నారాయణమూర్తి
76719 09759
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..
నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి