Share News

Is India Losing Its Soft Power: మృదుశక్తి మహిమను కోల్పోతున్నామా

ABN , Publish Date - Jan 15 , 2026 | 01:23 AM

ప్రపంచవ్యాప్తంగా మతాల మంచిచెడుల గురించి మాట్లాడటం ఇప్పుడు తగ్గిపోతోంది. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం! మత భావాలను రెచ్చగొట్టి, వాటికి అనుగుణంగా జనసమీకరణలు చేసే...

Is India Losing Its Soft Power: మృదుశక్తి మహిమను కోల్పోతున్నామా

ప్రపంచవ్యాప్తంగా మతాల మంచిచెడుల గురించి మాట్లాడటం ఇప్పుడు తగ్గిపోతోంది. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం! మత భావాలను రెచ్చగొట్టి, వాటికి అనుగుణంగా జనసమీకరణలు చేసే రాజకీయాలు చాలా దేశాల్లో పెరుగుతున్నాయి. అవి ఎంతగా పెరుగుతుంటే అంతగా మతాల మంచిచెడులపై సద్విమర్శలూ, సద్వివివేచనలూ తగ్గిపోతున్నాయి. మత ఆధారిత రాజకీయాల్లో ఏదో విధంగా ఎదుటి మతాలను దుమ్మెత్తిపోయటం, చిన్నబుచ్చటం, వాటిపై విద్వేషభావాలను పెంచటం, కొందరు చేసిన తప్పులకు ఆ మతాలను అనుసరించే వారందరూ బాధ్యులే అన్నట్లుగా వ్యవహరించటం సాధారణంగా కనపడుతుంది. అందుకే మతాల గొప్పలు, వారసత్వాల ఆసరాతో రాజకీయంగా బలాన్ని పెంచుకునేందుకు పావులను కదపటం వల్ల అన్నిచోట్లా బలి అవుతున్నదీ మూల్యాన్ని చెల్లిస్తున్నదీ సమిధలవుతున్నదీ సాధారణ పౌరులే.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం కనపడే చిత్రం అదే. ప్రతిరోజూ హిందువులపై దాడులు, హత్యల వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజ్యాన్ని ఇస్లామీకరిస్తామనీ, చట్టాలన్నిటినీ షరియా, హాదిత్‌లకు అనుగుణంగా మార్చేస్తామనీ చెప్పే జమాత్‌–ఇ–ఇస్లామీ లాంటి సంస్థలు బంగ్లాదేశ్‌లో అధికారం కోసం తహతహలాడుతున్నాయి. ప్రతి రాజకీయ సంక్షోభాన్ని.. కొన్నిమెట్లు పైకెక్కేలా ఉపయోగించుకోవటంలో మతతత్వ సంస్థలు ఎప్పుడూ ముందుంటూనే ఉన్నాయి. జనాగ్రహ వెల్లువలో షేక్‌హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మతతత్వ సంస్థల, పార్టీల రాజకీయ చురుకుదనం బాగా పెరిగింది. అచ్చమైన, స్వచ్ఛమైన ఇస్లామిక్‌ పాలన తీసుకొస్తామనే నినాదాలు తప్ప జనజీవితాలను గణనీయంగా మార్చే ఆర్థిక విధానాలు మతతత్వ సంస్థలకు సహజంగానే ఉండవు. వాటికి కావాల్సిందల్లా ఒక మతం ప్రజలను నిత్యం శత్రువులా పరిగణించే రాజకీయాలు మాత్రమే. అక్కడి హిందువులందరినీ భారత అనుకూలురుగా, ఏజెంట్లుగా, ఇస్లాం వ్యతిరేకులుగా ఆరోపణలూ చేస్తూ దాడులకు పాల్పడుతూ మతప్రాతిపదికన ప్రజల్లో బలాన్ని పెంచుకోవటం వాటికి అవసరం. అందుకోసం చేసే మూకదాడులూ, దేవాలయాల విధ్వంసాలూ వారి దృష్టిలో నేరచర్యలు కావు. మతంతో సంబంధంలేని పౌరహక్కులకు వాటి దృష్టిలో ఎటువంటి విలువా లేదు. మతాతీతంగా అందరికీ వర్తించే పౌరహక్కుల భావనకు ఆ సంస్థలు వ్యతిరేకం. వచ్చేనెలలో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి మతతత్వ విద్వేషాలు మరింతగా రెచ్చగొడుతున్నారు. బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ), నిన్నమొన్నటి వరకూ అధికారాన్ని చలాయించిన అవామీలీగ్‌ పార్టీ సమయానుకూలంగా మతతత్వ పార్టీలు, సంస్థల అండదండలను అందిపుచ్చుకున్నవే. ఈ రెండు ప్రధానపార్టీలు మతతత్వంతో అంటకాగకపోతే పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని వదులుకునే రీతిలో ఆ పార్టీల్లేవు. ప్రభుత్వానికీ, పాలనకూ ఇస్లాం విధానాలనే ఆలంబన చేసుకుంటామనీ రెండుపార్టీలూ ఎప్పుడో స్పష్టం చేశాయి.


బంగ్లాదేశ్‌ ఏర్పడిన తొలినాళ్లలో రూపొందిన రాజ్యాంగంలో లౌకికవాదాన్ని పాలనకు మూలస్తంభంగా పేర్కొన్నారు. మతం ఆధారంగా నడిచే పార్టీలనూ నిషేధించారు. సోషలిజాన్ని రాజ్యాంగ మౌలిక సూత్రంగానూ పరిగణించారు. లౌకిక, సామ్యవాద పదాలను భారత రాజ్యాంగం నుంచి తొలగించాలని డిమాండు చేసే వారికి ఈ సంగతి తెలియకపోవచ్చు. తెలిసినా అప్రియసత్యాలను ప్రస్తావించటం ఇష్టమూ ఉండకపోవచ్చు. మనకంటే ముందుగానే (1972లో) వాటిని బంగ్లాదేశ్‌ రాజ్యాంగంలో పొందుపరిచారు. అధికారాన్ని పదిలం చేసుకోటానికి రాజకీయ కారణాలతో లౌకికవాదం నుంచి వైదొలగటమే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు నెలకొన్న విద్వేష వాతావరణానికి ఒక ప్రధానకారణం. భారత్‌కు అనుకూలంగా వ్యవహరించినంత మాత్రాన అవామీలీగ్‌ లౌకికపార్టీ అయిపోదు. అవసరాన్ని బట్టి జమాత్‌–ఇ–ఇస్లామీతో జట్టుకట్టిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. లౌకికవాదాన్ని రాజ్యాంగ మౌలిక సూత్రంగా 1977లో మిలటరీ పాలకులు తొలగించారు. అల్లా పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి ఉందనే పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. ఇక 1988లో ఇస్లాంని రాజ్యమతంగా అధికారికంగా ప్రకటించారు. షేక్‌ హసీనా 1996లో తొలిసారి అధికారంలోకి వచ్చినా వాటిని తీసివేయటానికి ప్రయత్నించలేదు. 2011లో భారీ మెజారిటీతో ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన తర్వాత లౌకికవాద పదాన్ని మళ్లీ రాజ్యాంగంలో చేర్చినా రాజ్యమతంగా ఇస్లాం అనేదాన్నీ, పీఠికలో ప్రవేశపెట్టిన అల్లా పట్ల సంపూర్ణ విశ్వాసం–భక్తి లాంటి వ్యక్తీకరణలను అలాగే ఉంచేశారు. 2014 మార్చి 23న షేక్‌హసీనా చేసిన కీలక ప్రకటనతో బంగ్లాదేశ్‌ లౌకికవాదం వైపు మొగ్గే అవకాశం దాదాపుగా ముగిసిపోయింది. మహమ్మద్‌ ప్రవక్త మదీనాలో చేసిన చివరి ప్రసంగం ఆధారంగానే బంగ్లాదేశ్‌ పాలన ఉంటుందనీ, ఖురాన్‌–సున్నత్‌లకు భిన్నంగా ఎలాంటి చట్టమూ దేశంలో రాదనీ హసీనా స్పష్టంచేశారు. లౌకికవాదాన్ని పాలనకు మౌలికసూత్రంగా పేర్కొంటూ రాజ్యాంగాన్ని రూపొందించి, అమల్లోకి తెచ్చిన (1972 నవంబర్‌ 4) అవామీలీగ్‌ మతానికి రాజకీయంగా పెద్దపీటవేయటం బంగ్లాదేశ్‌కు చెడ్డమలుపుగానే చెప్పుకోవాలి. దాన్నుంచి వెనక్కివెళ్లే కొత్త రాజకీయాలు ఇప్పుడక్కడ కనుచూపు మేరలో కూడా లేవు.


బంగ్లాదేశ్‌లో మూకదాడులు, మతప్రేరిత హత్యలు ఘోరమైనవి, హేయమైనవి, మానవతా దృక్పథానికి వ్యతిరేకమైనవి. అయినా వాటిని ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, లౌకికవాదానికి నిబద్ధమైన దేశంగా బలంగా ఖండించలేని నైతిక సందిగ్ధతలో భారత్‌ ఉండిపోతున్న పరిస్థితే కనపడుతుంది. హిందూ మతాభిమాన ఉద్వేగాలతో సామాజిక మాధ్యమాల్లో ఖండనలు తీవ్రంగానే వెలువడుతున్నాయి. కానీ విశ్వమానవ పౌరహక్కుల దృష్టితో చూస్తే అవి పరిమితమైనవి, పాక్షికమైనవి. మత ఆలోచనలకు అతీతంగా ఆధునిక నాగరికత అందించిన పౌరహక్కుల పరిధి చాలా విశాలమైంది. ఆ పౌరహక్కుల స్పృహ లోతుగా మన హృదయాల్లో, మనసుల్లో పాదుకుంటే అన్నిరకాల మతవిద్వేష దాడులపై ఆగ్రహం కలుగుతుంది. ఆవేశం పెల్లుబికుతుంది. వివేచనతో కూడిన ఆచరణను పురిగొల్పుతుంది. బయటే కాదు దేశంలోపలా పెట్రేగుతున్న విద్వేషాలకు ఎదురొడ్డి నిలబడగలిగితేనే ఆ పౌరహక్కులకు సార్థకత ఉంటుంది. అలా చేయలేనప్పుడు మనకు నైతికశక్తి కొరత ఏర్పడుతుంది. బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై బలహీన గొంతులకు కారణం ఆ కొరతే!

బంగ్లాదేశ్‌ హిందువులు ఇప్పుడు అన్నివైపుల నుంచీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇస్లాం రాజ్యమతం అయిన తర్వాత, చట్టాలన్నిటికి ఆ మత సిద్ధాంతాలు, పద్ధతులు ప్రాతిపదికలవుతాయని ప్రకటించిన తర్వాత తమ అస్తిత్వాలు శాశ్వత ప్రమాదంలో ఉన్నాయనే భయమే వారిని ఆవహిస్తోంది. అధిక సంఖ్యాకుల మతం, సంస్కృతి, విశ్వాసాలు, ఆధిపత్యాలకు తలవొగ్గి ఉండాల్సిన పరిస్థితులు మైనారిటీ మతాల వారిని మామూలు మనుషులుగా ఉండనీయవు. సహేతుకత, ఉన్నత న్యాయదృష్టి లేకుండా మతం, సంస్కృతి, సంప్రదాయాలను చిన్నబుచ్చే ప్రయత్నాలను ప్రజలు తేలికగా జీర్ణించుకోలేరు. మెజారిటీ మతాన్ని అన్నివిధాలుగా ఆకాశానికెత్తుతూ, మైనారిటీల మతాన్ని తక్కువచేసి చూపటం సామాజిక వైషమ్యాలను సృష్టిస్తుంది.


బంగ్లాదేశ్‌లో ఈ విపరిణామాలన్నీ విస్తృతంగా జరుగుతున్నాయి. వీటిని కాదనలేం. అదే సమయంలో భారత్‌ మైనారిటీలూ అలాంటి అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవటం లేదా? అంటే.. కాదని చెప్పలేం! తరతరాల తమ అస్తిత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదనే భావన ఎక్కడైనా ప్రమాదకరమే. పాలకుల మతం ఆధారంగా దేశచరిత్రలో స్వర్ణయుగాలు, చీకటియుగాలు ఉంటాయని పదేపదే ప్రచారం చేయటం విద్వేష భావాలనే కలగచేస్తుంది. ఇస్లాం మతం అనుసరించిన పాలకులందరూ పీడకులేననీ, వారి పాలనలో దేశం అన్నిరంగాల్లో అధోగతి పాలైందనే ఆరోపణలు అత్యున్నత స్థాయినుంచి రావటం తీవ్రమైన ఆత్మన్యూనతా భావాన్ని సృష్టిస్తుంది. నిరంతరం ఆ పరిస్థితిలో ఉన్నవారు విపరీత ధోరణులకు తేలికగా ప్రభావితం అవుతారు. బహుళమత భారతావనికి అసలుసిసలైన ప్రమాదం ఇదే.

ప్రజాస్వామ్యానికి భారత్‌ను పుట్టినిల్లుగా చెప్పుకోవటం తేలికే. చరిత్రలో మనం ప్రజాస్వామ్యాలుగా, గణతంత్రాలుగా పిలిచేవేవీ నిజమైన ప్రజాస్వామ్యాలు కావు. కొద్దిమంది పాలక కులాల పెద్దలు పదవుల్లో కూర్చోటానికి గతంలో పరిమితంగా ఎన్నికలు జరుపుకున్నంత మాత్రాన మనల్ని మనం ప్రజాస్వామ్య సృష్టికర్తలుగా చెప్పుకోలేం. నల్లజాతివారిని ఎంతో అమానవీయంగా బానిసలుగా మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోలు చేస్తున్న కాలంలోనే అమెరికా తనను తాను ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రకటించుకుంది. అంతమాత్రానే అది సంపూర్ణ ప్రజాస్వామ్యం అవ్వదు. అసలు సవాలు.. ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆచరణలో చూపటమే. దానికి బలమైన లౌకికవాదంతో కూడిన పౌరహక్కులే పునాది. అందుకే మతప్రసక్తి, వివక్షాలేని పౌరహక్కులను నిజస్ఫూర్తితో బంగ్లాదేశ్‌లో అమలుపరిస్తేనే అక్కడి మైనారిటీ హిందువులు భయం బతుకుల నుంచి బయటపడతారు. భారత్‌లో మైనారిటీలకూ ఆ పరిస్థితిని కల్పించాలి.


రాజ్యపిపాసతో రక్తపాతాలు చిందించటం అంతర్గతంగా మనచరిత్రకు కొత్తకాదు. కానీ బలప్రయోగంతో బాహ్యదేశాల్లో భారత్‌ తన సంస్కృతిని విస్తరించలేదు. మన సంస్కృతీ పరిచయంతో మధ్య, ఆగ్నేయ, తూర్పు ఆసియాలు ప్రభావితమై ఆనాటి పరిస్థితుల్లో మరికొంత ఉన్నతస్థాయిని చేరుకోగలిగాయి. బలప్రయోగం లేకుండా, కుటిలనీతికి పాల్పడకుండా సాటి సమాజాలు కాస్త ఉన్నతస్థాయికి ఎదగటానికి తోడ్పడటాన్ని మృదుశక్తికి (సాఫ్ట్‌పవర్‌) నిదర్శనంగా భావిస్తారు. చరిత్రలో భారత్‌కు కొంతకాలం ఆ మృదుశక్తి పుష్కలంగా ఉండేది. వలసపాలనలో మగ్గి, ఆర్థికంగా వెనుకబడి, అన్ని విధాలుగా చితికిపోయినా.. స్వాతంత్ర్యానంతరం సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించి, లౌకికవాదం, మత సమభావనలతో వ్యవహరించటంద్వారా భారత్‌ సరికొత్త మృదుశక్తిని సంపాదించుకుంది. ఆ మృదుశక్తితోనే ఎన్నో దేశాలకు ప్రేరణగా నిలిచింది. దేశంలో ప్రజాస్వామ్యాన్నీ నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ శక్తికి గండిపడుతున్న ఛాయలు స్పష్టంగా కనపడుతున్నాయి. దాన్ని పూడ్చుకుని మృదుశక్తిని బలంగా కాపాడుకుంటేనే ఉపఖండానికి భారత్‌ దిక్సూచిగా ఉంటుంది. అది జరక్కపోతే ఇంటాబయటా సమస్యలే ఎదురవుతాయి!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవీ చదవండి

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

Updated Date - Jan 15 , 2026 | 01:23 AM