Share News

నియోజకవర్గాల పెంపు అవసరమా?

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:42 AM

ప్రస్తుతం దేశం, రాష్ట్రాలలో నెలకొని ఉన్న ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితులలో అసలు ఈ నియోజకవర్గాల పెంపు అవసరమా? లోక్‌సభ, శాసనసభ సభ్యుల ప్రధాన విధి ప్రజాహిత చట్టాలు చేయడమేనని...

నియోజకవర్గాల పెంపు అవసరమా?

ప్రస్తుతం దేశం, రాష్ట్రాలలో నెలకొని ఉన్న ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితులలో అసలు ఈ నియోజకవర్గాల పెంపు అవసరమా? లోక్‌సభ, శాసనసభ సభ్యుల ప్రధాన విధి ప్రజాహిత చట్టాలు చేయడమేనని మన రాజ్యాంగం పేర్కొంది. కానీ మన దేశంలో, రాష్ట్రాలలో జరుగుతున్నది ఏమిటి? ఎన్నికలలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర స్థాయి వరకు ప్రతి చిన్న విషయంతో కలిపి అన్ని విషయాలలో ఎమ్మెల్యేల, ఎంపీల అనైతిక ప్రాబల్యం ఏ మేరకు పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యే, ఎంపీల బంధువులు ఆ నియోజకవర్గంలో తామే సర్వం అనే భ్రమలను ప్రజలకు కల్పించారు. అంతేకాక అధికార పార్టీల అనుచరగణం కర్ర పెత్తనం అంతా ఇంతా కాదు. దీనివల్ల అధికార–ప్రతిపక్షాల మధ్య, ప్రజల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. సమాజం, ప్రజలు పార్టీలపరంగా విడిపోక తప్పని పరిస్థితులు దాపురించాయి.

చట్టసభలలో ప్రవేశించే వారి రాజకీయ, పాలనానుభవం, రాజ్యాంగం, చట్టసభలు, చట్టాలు, సమాజ పరిస్థితులు తదితర విషయాలలో కనీస పరిజ్ఞానం ఏమిటో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీలను, కులాలను, మతాలను చూసి... డబ్బు, మద్యం ఇచ్చి మభ్యపెట్టే అభ్యర్థులను గెలిపిస్తున్నారు తప్ప, చట్టసభలో ఒక అంశంపై మాట్లాడే, చర్చించే శక్తి సామర్థ్యాలు చూసి గెలిపించడం లేదు. నియోజకవర్గాలు పెరిగితే సభ్యుల సంఖ్య పెరగడం తప్ప, రాజ్యాంగం కల్పించిన లక్ష్యాలు ఏ మాత్రం నెరవేరవు. అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశంపై, రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. వారికి ఇచ్చే గౌరవ వేతనాలు, నివాస వసతి, అలవెన్స్‌లు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర మందీమార్బలం, తర్వాత జీవితకాలం ఇచ్చే పింఛన్లు... వెరసి ప్రజాధనం ఎంతో వెచ్చించ్చాల్సి ఉంటుంది.


ఇక ఎన్నికల సమయంలో నియోజవర్గ స్థాయిలో ఓటర్ విలువ పెరిగిపోతుంది. తక్కువ ఓటర్లు, ఎక్కువ మంది అభ్యర్థుల కారణంగా ఓట్లు వినియోగించుకునే వారి సంఖ్య పెరగటం శుభ పరిణామమే అయినా, ప్రలోభాలు తీవ్రస్థాయికి చేరతాయి. స్వల్ప ఓట్ల ఆధిక్యత తప్పదు గనుక ఓటుకు నోట్లను పెంచాల్సి వస్తుంది. గెలుపు కోసం మరింతగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓటరులో స్వార్థపూరిత స్వంత డిమాండ్లు పెరిగిపోతాయి. విద్వేషాలు మితిమీరతాయి. గెలిచినవారు చట్టసభల్లో మాట్లాడటం మర్చిపోయి, ఆ బాధ్యతను గాలికి వదిలేసి ఖర్చుపెట్టినదాన్ని సంపాదించుకోవడమే లక్ష్యంగా మారుతుంది. ముందు ముందు ఇది బాగా పెరిగిపోతుంది.

ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు పెరగడం వల్ల యువతకు, మహిళలకు చట్టసభల్లో ప్రవేశించే అవకాశాలు పెరుగుతాయి. అంతే తప్ప దేశానికీ రాష్ట్రానికీ ప్రయోజనం ఏమీ ఉండదు. నియోజకవర్గ పరిధిలలో మార్పులు తప్పనిసరిగాని వాటి సంఖ్య పెంపు అవసరం లేదు. దేశంలో జాతీయ పార్టీలలో అయినా, రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో అయినా గెలిచిన అభ్యర్థులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చట్టసభల్లో వ్యక్తపరిచే పరిస్థితులు లేవు. పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలే తప్ప, సొంత అభిప్రాయాలను, సూచనలను వెల్లడించే అవకాశం లేదు. ఏదేమైనా దేశంలో, రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు రాజకీయ పునరావాసం కోరేవారికే ఉపయోగం. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదు.

టి. సేవకుమార్

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 12:42 AM