Share News

కేంద్ర బడ్జెట్‌లో చేనేతకు చోటు లేదా?

ABN , Publish Date - Jan 29 , 2026 | 02:44 AM

భారతదేశంలోని గ్రామీణ కుటీర పరిశ్రమల ప్రాముఖ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగవ ఇండియన్ హ్యాండ్లూమ్ సెన్సెస్–2020 ప్రకారం దేశవ్యాప్తంగా...

కేంద్ర బడ్జెట్‌లో చేనేతకు చోటు లేదా?

భారతదేశంలోని గ్రామీణ కుటీర పరిశ్రమల ప్రాముఖ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగవ ఇండియన్ హ్యాండ్లూమ్ సెన్సెస్–2020 ప్రకారం దేశవ్యాప్తంగా 35.22 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. మొత్తం 68.86 లక్షల చేనేత కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో స్త్రీలు 38.61 లక్షలు, పురుషులు 30.25 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎస్సీలు 13.8శాతం, ఎస్టీలు 17.8శాతం, ఓబీసీలు 36శాతం, ఇతరులు 32.4శాతం ఉన్నారు. ముస్లింలు, క్రైస్తవులు చెప్పుకోదగిన సంఖ్యలో జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. వీరి నెలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఐదువేల రూపాయల కన్నా తక్కువ ఆదాయం పొందుతున్న వారు 67శాతం కాగా, పదివేల లోపు ఆదాయం పొందుతున్న వారు 26శాతం మాత్రమే. 15 వేల లోపు ఆదాయం పొందుతున్న వారు కేవలం 4.5శాతం కాగా, 15000 రూపాయల పైన ఆదాయం పొందుతున్న వారు రెండు శాతం మాత్రమే. టెక్స్‌టైల్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం చేనేత కార్మికులకు సంవత్సరంలో 274 రోజులు పని దినాలు లభిస్తున్నాయని అంచనా. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి పొందుతున్న రంగాలలో చేనేత ఒకటి. నేడు ఉపాధి కల్పన పేరుతో ఒక్కో ఉపాధికి కోట్లాది రూపాయలు సబ్సిడీల రూపంలో వెచ్చిస్తున్న కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి సంక్షేమానికి సరైన రీతిలో ప్రోత్సాహాలు కల్పించడం లేదు.

ఉపాధి రంగంగా నిలుస్తున్న చేనేతకు రాను రాను బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2013–14 జాతీయ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.493కోట్లు కేటాయిస్తే, 2025–26 బడ్జెట్‌లో రూ.200కోట్లు మాత్రమే కేటాయించారు. 2013–14 మొత్తం జాతీయ బడ్జెట్ రూ.14.90 లక్షల కోట్లు కాగా 2025–26 నాటికి అది రూ.50.65 లక్షల కోట్లకు పెరిగింది. మూడింతలు పెరిగిన బడ్జెట్ ప్రకారం మరి చేనేత రంగానికి కనీసం రూ.1479కోట్లు కేటాయించాలి కానీ అలా జరగలేదు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రకారం చేనేత రంగానికి కనీసం ఒక్కో కార్మికునికి సగటున రూ.1519 చొప్పున రూ.1070కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 2025–26 బడ్జెట్‌లో ఒక్కో కార్మికునికి ఏడాదికి కేవలం రూ.290 మాత్రమే కేటాయించారంటే చేనేత రంగం పట్ల భారత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నదో వేరుగా చెప్పాల్సిన పనిలేదు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో చేనేత కార్మికుని పైన ఏటా రూ.715 కేటాయించేది.


మొత్తం టెక్స్‌టైల్‌ బడ్జెట్‌లో సైతం చేనేత రంగాన్ని విస్మరిస్తున్నారు. 2013–14లో మొత్తం టెక్స్‌టైల్‌ బడ్జెట్ రూ.3915కోట్లు కాగా, అందులో 15.7 శాతం రూ.493కోట్లు చేనేత రంగానికి కేటాయించారు. 2025–26లో టెక్స్‌టైల్‌ బడ్జెట్‌ రూ.5272 కోట్లు కాగా, అందులో కేవలం 3.9శాతం అంటే 200 కోట్లు చేనేత రంగానికి కేటాయించారు! ఇది చాలా దారుణమైన తగ్గింపు. ఒకవైపు వికసిత భారత్ అని ప్రచారం చేస్తూ మరోవైపు చిన్న పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడం సమంజసమా?

తడక యాదగిరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ

ఇవి కూడా చదవండి

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’

రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!

Updated Date - Jan 29 , 2026 | 02:44 AM