Share News

ప్రజాస్వామ్యమా, రాజకీయ మాయా?

ABN , Publish Date - May 19 , 2026 | 12:34 AM

ప్రపంచ రాజకీయ చరిత్రలో ‘ప్రజాస్వామ్యం’ అనే పదానికి వచ్చినంత పవిత్రత మరే రాజకీయ సిద్ధాంతానికీ రాలేదు. వర్తమాన ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం తనను ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వంగానే...

ప్రజాస్వామ్యమా, రాజకీయ మాయా?

ప్రపంచ రాజకీయ చరిత్రలో ‘ప్రజాస్వామ్యం’ అనే పదానికి వచ్చినంత పవిత్రత మరే రాజకీయ సిద్ధాంతానికీ రాలేదు. వర్తమాన ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం తనను ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వంగానే ప్రకటించుకుంటోంది. ప్రతి యుద్ధం, ప్రతి ఆర్థిక విధానం, ప్రతి చట్టం– ప్రజాస్వామ్యం పేరుతోనే సాగుతున్నాయి. ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన రాజకీయ ఆయుధం ‘పాలనమార్పు’ (Regime change). అంటే, ఇరాన్‌లో నియంతృత్వాన్ని అంతంచేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని నమ్మబలికాడు. ఆ మంత్రం ప్రభావవంతంగా పనిచేసింది. ఆ దెబ్బకు ఇరాన్ మీద అమెరికా–ఇజ్రాయెల్‌ల జంటదాడిని ఖండించడానికి కూడ అనేక దేశాలు జంకాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటే హజార్ ఖూన్ మాఫ్! కానీ, అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే ఎదురవుతుంది. ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల పాలనేనా? లేక ప్రజల పేరుతో నడిచే ఇతరుల అధికార వ్యవస్థనా?

మార్క్సిస్టులకు సాంప్రదాయంగా ప్రజాస్వామ్యం మీద ఎలాగూ నమ్మకం వుండదు. పెట్టుబడీదారీ వ్యవస్థ తనకు అనుకూలమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించుకుందన్నారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ ముక్తకంఠంతో. అంచేత వాళ్ళ మీద ప్రజాస్వామ్య మంత్రం ప్రభావం చూపదు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ముఖ్యంగా ముస్సోలినీ – హిట్లర్ల ఫాసిస్టు, నాజీయిస్టు నియంతృత్వాలను చూసిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం మీద వ్యామోహం ప్రమాదకరంగా పెరిగింది. ఈ ‘పవిత్ర మాయాజాలా’న్ని ఛేధించడానికి ప్రయత్నించినవాళ్లలో ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు జాన్ డన్న్ ఒకడు. ‘ప్రజాస్వామ్యపు మాయజాలం ఛేదింపు’ అనే పుస్తకంలో అనేక దేశాల్లో క్రూరమైన నియంతృత్వమే ప్రజాస్వామ్యం ముసుగులో కొనసాగుతున్న తీరును అతను విశ్లేషించాడు.


అనేక దేశాల్లో క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. చట్టసభలు నడుస్తున్నాయి. అనేక చట్టాలు మెజారిటీ సభ్యుల ఆమోదం పొందుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా సభలు సమావేశాలు నిర్వహించి తమ విధానాలను ప్రకటిస్తున్నాయి, అధికార పార్టీలను ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల్లో కొన్నిచోట్ల అధికార పార్టీ ఓటమిపాలై ప్రతిపక్ష పార్టీ అధికారాన్ని చేపడుతోంది. ఇన్ని జరిగినా, ప్రజాస్వామ్యానికి నిఘంటువుల్లో అర్థం చెప్పినట్టు సమాజంలో జరుగుతోందా? తమ జీవితాలను తాము అనుకున్నట్టు మార్చుకునే అధికారం నిజంగా ప్రజల చేతుల్లో ఉంటోందా?

జాన్ డన్న్ వాదన ప్రకారం ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక రాజకీయ మత్తుమందుగా మారిపోయింది. ఎన్నికలు జరుగుతున్నాయనే కారణంతో ప్రజలు తమకు అధికారం ఉందని భావిస్తున్నారు. కానీ అసలు అధికార నిర్మాణాలు మాత్రం కార్పొరేట్ శక్తులు, మీడియా సామ్రాజ్యాలు, అంతర్జాతీయ పెట్టుబడి, భద్రతా వ్యవస్థల చేతుల్లోకి జారిపోతున్నాయి. ఇదే ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అంతర్గత విషాదం.

భారత రాజకీయ వ్యవస్థను గమనిస్తే ఈ వైరుధ్యాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత్‌ను చాలామంది ప్రశంసిస్తారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 64 కోట్లమంది ఓటింగులో పాల్గొన్నారు. వీరిలో 31 కోట్లమంది మహిళలు. ఈ అంకెల్ని చూస్తే ప్రపంచం నివ్వెరపోవాల్సిందే. అయితే, కులాధిపత్యం, ధన ప్రభావం, ఎన్నికల అవినీతి, మీడియా మానిప్యులేషన్, రాజకీయ నేరీకరణ, రాజకీయ మతీకరణ వగయిరాలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

‘సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు’ అని బీఆర్ అంబేడ్కర్ చాలాసార్లు హెచ్చరించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లోని 824 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ వీటిల్లో ఒక్క సీటు కూడా ముస్లింలకు కేటాయించలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయి నాయకులు ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని సాగించి హిందూ ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు. బీజేపీకి ఓటు వేయనివారినీ, విపక్షాలకు మద్దతు తెలిపేవారినీ ఎన్నికల సంఘం ఏకంగా ఓటర్ల జాబితా నుండి తొలగించిందని విపక్షాలు అనేకసార్లు ఆరోపణలు చేశాయి. ఆ ఆరోపణలకు తగినట్టుగా, నిన్నటివరకు వెస్ట్ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పనిచేసిన మనోజ్‌కుమార్ అగర్వాల్‌ను ఆ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఆ రాష్ట్రానికి స్పెషల్ ఎలక్షన్ ఆబ్జర్వర్‌గా వున్న డాక్టర్ సుబ్రతా గుప్తాను ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమించారు.


యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు, ప్రతి ఓటుకూ సమాన విలువ అని రాజ్యాంగం అంటే చాలామంది చాలాకాలం మైమరచిపోయారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సమాన ఓటు హక్కు ఇవ్వగలదు, కానీ సమాన శక్తి ఇవ్వదు అని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ హెచ్చరిక ఇప్పుడు మరింత సత్యంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. కానీ సామాజిక అసమానతలు మరింత బలపడుతున్నాయి. రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాల కంటే ఎన్నికల యంత్రాలుగా మారుతున్నాయి. పౌరులు క్రమంగా ఓటు బ్యాంకులుగా, డేటా యూనిట్లుగా మారుతున్నారు.

ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందా? అనే ప్రశ్న కీలకమైనది. ప్రజలు ఐదేళ్లకోసారి ఓటు వేస్తారు. కానీ ఆ తర్వాత జరిగే వేలాది నిర్ణయాలన్నీ కార్పొరేట్ల అవసరాలు, లాబీయింగ్, రహస్య ఒప్పందాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిళ్ళు, మీడియా ప్రచార యుద్ధాలు, రాజ్యాంగ వ్యవస్థల కుమ్మక్కు వగయిరాల ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. వీటికి అంతిమంగా ‘ప్రజాస్వామ్య నిర్ణయం’ అనే ముద్ర వేస్తే చాలు అది పవిత్రం అయిపోతుంది. ఇది ప్రజాస్వామ్యమా? లేక ప్రజాస్వామ్యం పేరుతో నడిచే వ్యవస్థీకృత రాజకీయ మాయా?.

ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నిర్ణయమని భావించడం ఎంత ప్రమాదకరమో ప్రపంచం ఇరాక్ యుద్ధంలో చూసింది. ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు తమ దేశంలో కోట్లాది ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా యుద్ధం ప్రారంభించాయి. ఇరాక్‌లో ‘వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్’ (WMD) వున్నాయంటూ ఆ దేశంలోకి ప్రవేశించాయి. సద్దాం హుస్సేన్ చనిపోయినా ఆ జీవరసాయన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ జాడ కనిపించలేదు. ఇప్పుడు ఇరాన్ మీద దాడికీ అలాంటి నెపం ఒకటి వేశారు– ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తున్నదని. యుద్ధం మొదలై 80 రోజులైనా ఎవరికీ వాటి జాడ కనిపించలేదు. ఈ యుద్ధానికి అమెరికా పౌరుల మద్దతువుందా? అదీ అనుమానమే. అయినప్పటికీ అమెరికాను గొప్ప ప్రజాస్వామిక దేశం అంటున్నారు. ఇక్కడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అసలు సంక్షోభం బయటపడుతుంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ ప్రభుత్వాలపై ప్రభావం చూపేది ఎవరు– సాధారణ పౌరులా? లేక కార్పొరేట్ పెట్టుబడిదారులా?

ప్రజాస్వామ్యం ఒకప్పుడు ప్రజలకు విముక్తి ఆశను ఇచ్చింది. రాజరికాలను, వలస పాలనలను, నియంతృత్వాలను సవాలు చేసే శక్తిగా ఎదిగింది. కానీ అదే ప్రజాస్వామ్యం ఇప్పుడు మార్కెట్ శక్తులతో కలిసిపోయి ప్రజలనే నిస్సహాయులుగా ఉంచేస్తోంది. 2011 మార్చి నెలలో జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం దీనికి ఉదాహరణ. జపాన్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వమే వుంది. అయినప్పటికీ, అది కార్పొరేట్ల ప్రయోజనాలను నేరవేర్చే క్రమంలో ప్రజల భద్రతను కూడా పక్కన పెట్టింది. ప్రజాస్వామ్యం ఉన్నంత మాత్రాన ప్రజల భద్రతకు హామీ వుంటుందని చెప్పడానికి వీల్లేదని ఫుకుషిమా సంఘటన నిరూపించింది. ఇదే నేటి ప్రపంచ సంక్షోభం.


అయితే దీనికి పరిష్కారం నియంతృత్వమా? మతద్వేషానికి విరుగుడు మతద్వేషం కానట్టే, విఫలమైన ప్రజాస్వామ్యానికి విరుగుడు నియంతృత్వం కాదు. అయితే, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఎన్నికల ప్రక్రియ మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రజల జీవితాలపై నిజమైన నియంత్రణ, సమాచారం మీద ప్రజల హక్కు, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం– ఇవన్నీ లేకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్రమంగా ఒక క్రతువుగా మారిపోతుంది.

ప్రజాస్వామ్యం పవిత్రగ్రంథం కాదు. అది ఒక రాజకీయ సాధనం మాత్రమే. ఆ సాధనం విముక్తి ఇవ్వగలదు, మత్తెక్కించగలదు, ప్రజలను శక్తివంతం చేయగలదు, మత ద్వేషాల్ని రెచ్చగొట్టగలదు, మోసం కూడా చేయగలదు. అందుకే మనం చెయ్యాల్సిన పని ప్రజాస్వామ్యాన్ని పూజించడం కాదు; దానిని అర్థం చేసుకోవడం. దాని మాయాజాలాన్ని ఛేదించడం. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికల పండుగ నుంచి ప్రజల నిజమైన భాగస్వామ్య వ్యవస్థగా మార్చడం. లేకపోతే ‘ప్రజాస్వామ్యం’ అనే పవిత్ర పదం చివరికి ప్రజల స్వరాన్నే మింగేసే రాజకీయ మత్తుమందుగా మారిపోవచ్చు. ముస్సోలిని, హిట్లర్ కూడ ముందు ప్రజాస్వామికంగానే ఎన్నికయ్యారనేది మరచిపోకూడదు.

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

ఇవి కూడా చదవండి..

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 19 , 2026 | 12:34 AM