Share News

ప్రజాప్రయోజన వ్యయాలు పెరగాలి!

ABN , Publish Date - May 02 , 2026 | 12:43 AM

ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా చేస్తోన్న యుద్ధం సుదూర యుద్ధం కానేకాదు. భారత ఉపఖండానికి పొరుగున ఉన్న పశ్చిమాసియాలో సాగుతోన్న సమరమది. ఆ ప్రాంతంలో...

ప్రజాప్రయోజన వ్యయాలు పెరగాలి!

ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా చేస్తోన్న యుద్ధం సుదూర యుద్ధం కానేకాదు. భారత ఉపఖండానికి పొరుగున ఉన్న పశ్చిమాసియాలో సాగుతోన్న సమరమది. ఆ ప్రాంతంలో లక్షలాది భారతీయులు నివసిస్తున్నారు, జీవనోపాధి పొందుతున్నారు. మన దేశంలోని కోట్లాది షియా ముస్లింలకు ఇరాన్‌ ప్రజలతో ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయి. ఇరాన్‌తో భారత్‌కు సుదీర్ఘ, చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు సైతం బలోపేతమయ్యాయని భారత్‌ చెబుతోంది. ఇందుకు ఉదాహరణగా చాబహార్ ఓడరేవు అభివృద్ధిని ప్రముఖంగా పేర్కొనడం కద్దు. అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ సంబంధాల ప్రగాఢత తగ్గిపోయింది. కారణాలు అనేకమున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న సన్నిహిత స్నేహబంధం ఆ కారణాలలో ఒకటి.

మొన్నగాక అటు మొన్నటి వరకు ప్రపంచంలో ఎక్కడ ఘర్షణలు ప్రజ్వరిల్లినా శాంతి సాధనకు భారత్‌ సహాయం అర్థించడం, తీసుకోవడం పరిపాటిగా ఉండేది. ఫిబ్రవరి 28, 2026న ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్‌లు మొదటి నుంచీ భారత్‌ను దూరంగా పెడుతున్నాయి. ఇరాన్‌ మాత్రమే యుద్ధ పరిణామాలను, తమ వైఖరిని న్యూఢిల్లీకి వివరించేందుకు కాస్తో కూస్తో శ్రద్ధ చూపుతోంది. ఇజ్రాయెల్‌ పక్షపాతిగా భారత్‌ వ్యవహరిస్తోంది. ఆ యూదు దేశాన్ని విమర్శించిన బ్రిక్స్‌ దేశాల ముసాయిదా తీర్మానాన్ని భారత్‌ వీటో చేయడమే అందుకొక తాజా నిదర్శనం. అయినప్పటికీ అమెరికా– ఇజ్రాయెల్‌లు భారత్‌తో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్‌తో మధ్యవర్తిత్వం నెరిపేందుకు పాకిస్థాన్‌ సహాయాన్నే అవి అపేక్షిస్తున్నాయి, తీసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మన ఆర్థిక జీవనాన్ని పెద్దగా ప్రభావితం చేయడం లేదనే భారత్‌ ఇంకెంతమాత్రం చెప్పలేదు. అలా చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లింది. భారత్‌ సైతం అందుకు మినహాయింపు కాదు.


సరే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హూంకరింపులు, బెదిరింపులకు ప్రపంచ దేశాలు అలవాటు పడిపోయాయి. ఇరాన్‌ నావికా, వైమానిక దళాలను పూర్తిగా తుడిచి పెట్టేశామని ఆ మహాశయుడు ప్రకటించినప్పుడు ఎవరూ ఆయన మాటను విశ్వసించలేదు. ఇరానియన్‌ సైనిక ఆస్తులు అన్నిటినీ భస్మీపటలం చేశామని కూడా ఆయన ప్రకటించారు; అంతేనా? ఇరాన్‌ ‘పాలన’ మారిందని కూడా ఆయన ఘోషించారు. శాంతి సాధనకు అమెరికా ముసాయిదా ప్రతిపాదనలను ఇరాన్‌ అంగీకరించిందని కూడా ట్రంప్‌ గట్టిగా చెప్పారు; వివిధ సందర్భాలలో కాల్పుల విరమణ గురించి కూడా ఆయన గొప్పగా ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధాన్ని ఆపివేశారు, మళ్లీ ప్రారంభించారు, పిదప కాల్పుల విరమణను ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌ నిరవధికంగా ఇరాన్‌, లెబనాన్‌లపై దాడులు నిర్వహిస్తూనే ఉన్నది, ఇరాన్‌ ముమ్మరంగా ప్రతిదాడులూ చేస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం అసలు ఆగిపోనేలేదనే వాస్తవం ప్రపంచానికి బాగా తెలుసు.

సమర జ్వాలలు మనలను తాకడం లేదా? లేదు, అంతా ‘సాధారణంగా’ ఉందని ప్రభుత్వం చెబుతోంది. యుద్ధ నష్టాలు, పర్యవసానాల గురించి ఆర్బీఐకు సరైన అవగాహన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇరాన్‌ యుద్ధం కారణంగా ప్రపంచ సరఫరాల గొలుసులపై ఒత్తిడి, ఇంధనం, ఆహార ధరల ఎదుగుదలతో ‘ముమ్మరమైన ద్రవ్యోల్బణం’, ‘దిగుమతుల తగ్గుదల’, ‘విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం’ మొదలైన సమస్యల గురించి ఆర్బీఐ బులెటిన్‌ (ఏప్రిల్‌, 2026) స్పష్టంగా పేర్కొంది. యుద్ధం కొనసాగి, సరఫరా గొలుసుల పునరుద్ధరణలో జాప్యం జరిగితే మన ఆర్థిక వ్యవస్థకు విషమ సమస్యలు వాటిల్లుతాయని’ ఆర్బీఐ హెచ్చరించింది. ఈ సమస్యల నివారణకు దేశ పాలకులు ఏమైనా చేస్తున్నారా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగకుండా చర్యలు చేపట్టారు. నిజమే. అయితే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కారణంగానే ఆ ధరలను అదుపు చేశారు. అంతకు మించి వారు చేసిందేమీ లేదనడం సత్యదూరం కాదు.


ప్రధానమంత్రి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయావకాశాలను మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించారు. సెప్టెంబర్‌ 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మే 5న ఆయన మళ్లీ దేశ పాలనా వ్యవహారాలపై తన దృష్టిని కేంద్రీకరిస్తారు.

ఇరాన్‌ యుద్ధంతో ఆర్థిక ఉపద్రవాలకు లోనవుతున్న దేశ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఇంకా ఎంతో చేయవలసి ఉన్నది. ఆదాయాలను పెంపొందించినప్పుడే ప్రజలకు జీవన సౌలభ్యం సమకూరుతుందనే వాస్తవాన్ని విస్మరించకూడదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసినవారికి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఆ పథకాన్ని రద్దు చేసి, సరికొత్త పథకాన్ని ప్రారంభించిన నాటినుంచీ అనిశ్చితిలో ఉన్న ఉపాధి పనుల కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలి; గ్రామీణ రోడ్ల నిర్మాణ కార్యక్రమం అమలును వేగవంతం చేయాలి. 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆ కార్యక్రమానికి కేటాయించిన రూ.19,000 కోట్లను ఆరు నుంచి ఎనిమిది నెలల్లోగా వ్యయపరచాలి. మరిన్ని నిధులను గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేటాయించాలి; 2025–26 ఆర్థిక సంవత్సరంలో తాగునీటి పథకం జల్‌ జీవన్‌ మిషన్‌కు బడ్జెట్‌ అంచనా రూ.67,000 కోట్లు మాత్రమే కాగా, సవరించిన అంచనా కేవలం రూ.17,000 కోట్లు మాత్రమే! 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆ పథకానికి రూ.67,670 కోట్లు కేటాయించారు. తాగునీటి సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ పెరుగుదల సూచిస్తుంది. కేటాయించిన నిధులను వెన్వెంటనే రాష్ట్రాలకు విడుదల చేసి, ఆ పథకం సత్వర అమలుకు కేంద్రం శ్రద్ధ చూపాలి; కోవిడ్‌ విలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రభుత్వం వాగ్దానమిచ్చినప్పటికీ దానిని నెరవేర్చనేలేదు. ఉపాధి అవకాశాలను ఇతోధికంగా కల్పించగల ఆ పరిశ్రమ రంగానికి ఇప్పుడు రుణాలు తక్షణమే మంజూరు చేయాలని బ్యాంకులను ఆదేశించాలి. అవి పురోగమన బాట పట్టాలంటే ఇది తప్పనిసరి. ప్రజా శ్రేయస్సుకు దోహదం చేసే రోడ్ల నిర్మాణం మొదలైన పనులకు, విద్య, ఆరోగ్య భద్రత మొదలైన అత్యవసర సేవలకు చేసే వ్యయాలను భారీగా పెంచాలి. ట్రంప్‌– నెతన్యాహు ద్వయం ప్రారంభించిన యుద్ధం నష్టాలు, బాధాకర పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజాప్రయోజన వ్యయాలే సరైన ప్రభావదాయక ప్రతిచర్యలు అవుతాయన్న వాస్తవాన్ని పాలకులు విస్మరించకూడదు.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 12:43 AM