యుద్ధం ఇస్తున్న అతిచక్కని అవకాశం!
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:16 AM
చరిత్రను గుర్తుంచుకోవటం కష్టం. మరిచిపోవటం సులభం. మంచిపనులు చేసినవాళ్లే దాన్ని గుర్తుచేస్తూ భవిష్యత్తు తరాలకు ప్రేరణగా ఉంటారు. తప్పని కచ్చితంగా తెలిసి దారుణాలకూ దురాగతాలకూ....
చరిత్రను గుర్తుంచుకోవటం కష్టం. మరిచిపోవటం సులభం. మంచిపనులు చేసినవాళ్లే దాన్ని గుర్తుచేస్తూ భవిష్యత్తు తరాలకు ప్రేరణగా ఉంటారు. తప్పని కచ్చితంగా తెలిసి దారుణాలకూ దురాగతాలకూ దౌర్జన్యాలకూ పాల్పడినవారు చరిత్రను తేలికగా మర్చిపోతారు. ప్రజలు దాన్ని మర్చిపోయేలానూ చేస్తారు. వ్యక్తులకైనా దేశాలకైనా ఇదే వర్తిస్తుంది. ఇరాన్‌పై బాంబులు కురిపిస్తూ, రోజుకో విధంగా యుద్ధ కారణాలను వినిపిస్తోన్న అమెరికాకు అసలు ఉన్న చరిత్రే తక్కువ. అందులోనూ మరుపు చాలా ఎక్కువ. ఎలాంటి యుద్ధ ప్రకటన లేకుండా, ఐక్యరాజ్యసమితిలో సమస్యను చర్చించకుండా, వేలాది ప్రాణాల ఉసురుపోసుకుంటూ, ఉన్మత్తతతో ఊగిపోతూన్న అమెరికా అధ్యక్షుడు.. తన చర్యల వల్ల చరిత్రలో ఒక గొప్ప అవకాశం వచ్చిందనీ దాన్ని ఇరాన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. అసలు ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం రావటానికీ, ఆ తర్వాత అది తన పదఘట్టనల కింద ప్రజాస్వామ్యాన్ని నలిపివేయడంలోనూ అమెరికా పాత్రే కీలకం. ఆ చేదు చరిత్ర ట్రంప్‌లాంటి అమెరికా పాలకులకు ఇప్పుడు గుర్తుకు రావటంలేదు. గుర్తుచేసిన వాళ్లను జాతివ్యతిరేకులుగా ముద్రలు వేస్తున్నారు.
పశ్చిమాసియా దేశాలను వాటి మానాన వాటిని వదలివేస్తే అవన్నీ నిజమైన ప్రజాస్వామ్యం దిశగా కొన్ని అడుగులైనా తప్పనిసరిగా వేసేవి. కానీ చమురు సంపదలపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకొనే లక్ష్యంతో ప్రజాబలంతో అక్కడ ప్రభుత్వాలు ఏర్పడకుండా ముందుగా బ్రిటన్, ఆ తర్వాత అమెరికా శక్తివంచన లేకుండా పనిచేశాయి. అందుకే అమెరికా ప్రాపకంలోని పశ్చిమాసియాలో ప్రజాస్వామిక ప్రభుత్వాలూ లేవు. బహుళపార్టీలు కలిగిన రాజకీయ వ్యవస్థలూ లేవు. లౌకికవాదం ఉన్నచోట భిన్నాభిప్రాయాలకు తావు ఉంటుంది. అవి ఉన్నచోట ప్రజాస్వామ్య రాజకీయాలు ఉంటాయి. పశ్చిమాసియాలో అలాంటివి బలపడకుండా ఉండటానికి మతశక్తులకూ రాజరికాలకూ అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజాస్వామ్యశక్తులు ఏదోవిధంగా బలపడిన చోట వాటిని నిర్వీర్యంచేసే దాకా నిద్రపోలేదు. బహుళపక్ష రాజకీయాలు ఉంటే ఆర్థిక విధానాల మంచిచెడులపై విశ్లేషణలు వస్తాయి. విదేశీ కంపెనీలు తరలించే సొమ్ముల లెక్కలు తేలుతాయి. ఈ బెడద లేకుండా ఉండాలంటే అక్కడి దేశాలను నయానో భయానో ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంచాలి. 20వ శతాబ్దంలోనూ రాజరికాలనూ, నియంతృత్వాలనూ చలాయించాలని చూసే స్థానిక పాలకులకూ ఆ ధోరణి నచ్చింది.
చమురు సంపదపై ఆధిపత్యం కోసం ఇరాన్‌లో ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టటానికి అమెరికా ఏమాత్రం వెనుకాడలేదు. రాజరికపు అధికారాలకు కత్తెర వేయాలనే డిమాండుతో ఇరాన్ ప్రజలు 1906లోనే ఉద్యమించారు. టెహరాన్ వీధులను ఆందోళనలతో హోరెత్తించారు. ప్రజల ఒత్తిడితో ఆనాటి రాజు షా మొజాఫర్ అద్–దిన్‌కు నేషనల్ అసెంబ్లీని (పార్లమెంట్) ఏర్పాటుచేయక తప్పలేదు. కొత్త రాజ్యాంగమూ రూపొందింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందూ ఆ తర్వాతా ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితుల్లో 1921లో రెజాఖాన్ పహ్లవీ అధికారాన్ని చేపట్టి రాజుగా (షా) ప్రకటించుకున్నాడు. అప్పటికి 20 ఏళ్ల ముందే బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్తకు ఇరాన్‌లో చమురు అన్వేషణపై గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టారు. భారీగా ఉన్న చమురు నిల్వలను వెలికితీసి అమ్మటానికి ఆంగ్లో–ఇరానియన్ కంపెనీ ఏర్పడింది. పేరులో ఇరానీ ఉన్నా లాభాల్లో ఇరాన్ ప్రభుత్వానికి దక్కేది చాలా తక్కువ. అందుకే చమురు సంపదపై గుత్తాధిపత్యంతో విపరీత లాభాలను ఆర్జిస్తున్న ఆంగ్లో–ఇరానీ కంపెనీని జాతీయం చేయాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ ప్రజాకాంక్షకు ప్రతీకగా నిలిచిన వారిలో నేషనల్ ఫ్రంట్‌కు నాయకుడైన ముహమ్మద్ మొసాద్దేగ్ ప్రముఖుడు. ప్రపంచబ్యాంకు అంటేనే అమెరికాకు అనుకూలం. అట్లాంటి ఆ బ్యాంకు ఇచ్చిన లెక్కలే చమురు దోపిడీని బట్టబయలు చేశాయి. 1914–1951 మధ్య 3.64 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆంగ్లో–ఇరానియన్ కంపెనీ పొందింది. ఇరాన్ ప్రభుత్వానికి వచ్చింది 50 మిలియన్ డాలర్లు మాత్రమే. వనరులున్న దేశానికి కంటే మూడురెట్లు (1.5 బిలియన్ డాలర్లు) బ్రిటన్‌కు పన్నుల రూపంలో దక్కింది. చమురుపై గుత్తాధిపత్యాన్ని తొలగించటం ఆనాటి రాజకీయాలకు కేంద్ర బిందువైంది. మొసాద్దేగ్‌ను ప్రధానిని చేయాలని పార్లమెంట్ రెజాషాపై ఒత్తిడి తెచ్చింది. గత్యంతరంలేక దానికి ఆమోదం తెలిపారు. చమురును జాతీయం చేయాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతో బ్రిటన్, అమెరికాలు ఉలిక్కిపడ్డాయి. ఇరాన్ చమురు బయటకు వెళ్లకుండా బ్రిటన్ ఆంక్షలు విధించింది. జాతీయం చేసినందుకు నష్టపరిహారం ఇస్తామన్నా ఆంగ్లో–ఇరానియన్ కంపెనీ అంగీకరించలేదు. చమురుకు తోడు ఇతర ఆర్థిక ఆంక్షలనూ బ్రిటన్ విధించింది. ఆంక్షలు ఇరాన్‌ను కుంగదీయటం మొదలుపెట్టాయి. వేలాదిమంది ఉద్యోగాలను కోల్పోయారు. విసిగిపోయిన మొసాద్దేగ్ ఒక దశలో రాజీనామా చేసినా ప్రజలు ఆందోళనలు చేసి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. చమురు రంగం జాతీయం చేయటానికే మొసాద్దేగ్ పరిమితం కాలేదు. చాలా సంస్కరణలనూ తీసుకువచ్చారు. వెట్టిచాకిరీని నిర్మూలించారు. భూస్వాములపై 20 శాతం పన్నులువేశారు. నిరుద్యోగ భృతిని ఏర్పాటుచేశారు. గ్రామాల్లో సౌకర్యాలను మెరుగుపరచారు. రాజకీయ స్వేచ్ఛను కల్పించారు. మహిళా హక్కులకు రక్షణ ఇచ్చారు.
ప్రజాస్వామ్యం ఇరాన్‌లో అట్లా బలపడుతున్న తరుణంలో ఆపరేషన్ అజాక్స్ పేరుతో మొసాద్దేగ్ ప్రభుత్వాన్ని కూల్చటానికి అమెరికా, బ్రిటన్‌లు పావులు కదిపాయి. పార్లమెంటు అధికారాల్ని కుదించి షాకు అడ్డులేకుండా చేయటానికి అలజడులు లేవదీశాయి. ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చారు. అమెరికా, ఇరాన్ ప్రసార సాధనాల్లో మొసాద్దేగ్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కమ్యూనిస్టు పార్టీతో మొసాద్దేగ్‌కు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలను ఎక్కుపెట్టారు. మతపెద్దలకు సీఐఏ ఏజెంట్లు మారుపేర్లతో ఫోన్లుచేసి భయపెట్టారు. బాంబులు పెట్టి ఒక మతపెద్ద నివాసాన్ని పేల్చివేశారు. డబ్బులిచ్చి వీధి రౌడీలతో విధ్వంసం సృష్టించారు. వందల్లో ప్రజలు చనిపోయారు. దేశంలో చెలరేగిన అల్లకల్లోలం అంతా మొసాద్దేగ్ వల్లేనని నమ్మించేలా భయానక వాతావరణాన్ని సృష్టించారు. చివరిగా మిలటరీలో తమ అనుకూలశక్తుల్ని ఊసిగొల్పి ప్రధానమంత్రిని జైల్లో పెట్టించారు. ఇరాన్‌లో అట్లా ప్రజాస్వామ్యం గొంతునులిమేశారు. అప్పట్లో ఇరాన్‌లో సీఐఏ ఏజంటుగా పనిచేసిన డాన్ విల్బర్ అవన్నీ కళ్లకుకట్టినట్లుగా తన నివేదికల్లో రాశారు. ఆపరేషన్ అజాక్స్ తర్వాత 1979 వరకూ అమెరికా అండతో షా పూర్తి నియంతృత్వాన్ని ఏర్పరచారు. చమురుపై కొత్త ఒప్పందం కుదిరింది. అంగ్లో–ఇరానీ కంపెనీ పేరు బ్రిటిష్ పెట్రోలియంగా మారింది. 40 శాతం షేర్లు బ్రిటిష్ కంపెనీకి దక్కితే మరో 40 శాతం షేర్లను అయిదు అమెరికన్ కంపెనీలు పంచుకున్నాయి. మిగతా 20 శాతం షేర్లు ఫ్రెంచ్, డచ్ కంపెనీలకు వెళ్లాయి. 25 ఏళ్ల షా పాలనలో వైట్ రెవల్యూషన్ పేరుతో చేపట్టిన చర్యలు అసమానతలను విపరీతంగా పెంచాయి. విపక్ష నాయకులను జైళ్లలో కుక్కారు. అమెరికా నుంచి ఆయుధాలను లెక్కలేనట్లుగా కొన్నారు. 1972–76 మధ్య 10 బిలియన్లను ఆయుధాలకోసం ఖర్చుపెట్టారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో రైతులకు ఉపాధి పోవటంతో నగరాలకు వలస వచ్చారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల సరుకుల దిగుబడులతో స్థానిక ఉత్పత్తులూ వ్యాపారాలూ దెబ్బతిన్నాయి. మతసంస్థల భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటంతో అలజడి మొదలైంది. ఇవన్నీ కలిసి ఇస్లామిక్ విప్లవానికి దారితీశాయి. నిజానికి ఇస్లామిక్ విప్లవం గొడుగుకింద ప్రజాస్వామ్య, లౌకికశక్తులన్నీ ఏకమై ఉద్యమాన్ని నడిపాయి. అయతొల్లా ఖొమేనీ చేతిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొద్దికాలం ప్రజాస్వామ్య పార్టీల ప్రతినిధులకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉండేది. ఆ తర్వాత మొదలైన ఇరాక్–ఇరాన్ యుద్ధంతో అంతా మారిపోయింది. అమెరికా అండతో ఎనిమిదేళ్లు సాగిన ఆ యుద్ధంనాటి పరిస్థితులను ఉపయోగించుకుని లౌకిక ప్రజాస్వామ్య పార్టీలనూ, నేతలనూ.. కార్యకర్తలనూ బలహీనపర్చటమూ, హతమార్చటమూ విపరీతంగా జరిగింది. దీంతో అయతొల్లా ఖొమేనీ ఆధిపత్యానికి అడ్డులేకుండా పోయింది.
వరుసగా జరిగిన ఈ పరిణామాలన్నిటినీ గుర్తుచేసుకుంటే ఈనాటి ఇరాన్ పరిస్థితికి అమెరికా నిర్వహించిన పాత్ర ఏమిటో స్పష్టంగానే తెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాసివేయటానికీ మతవాద రాజకీయవ్యవస్థ ఉక్కుచట్రంలో ఇరాన్ నలిగిపోవటానికీ అమెరికానే రంగాన్ని సిద్ధంచేసింది. స్వలాభం, పశ్చిమాసియా ఆధిపత్యం కోసం ఒకనాడు ఒక ఘోరచరిత్రను సృష్టించి ఇప్పుడో కొత్త చరిత్రకు ఇరానీయులకు అవకాశం ఇస్తున్నామంటూ ప్రకటించటం అమెరికాకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎన్నో దేశాలు ప్రజాస్వామ్య సమాజాల కోసం, స్వతంత్ర నిర్ణయాల కోసం, వనరులపై సొంత అజమాయిషీ కోసం కొత్త చరిత్రను సృష్టించటానికి ప్రయత్నాలు చేసినచోటల్లా అమెరికానే వాటిని తుంచివేసింది. 1893లో హవాయి దీవులను స్వాధీనం చేసుకోవటంతో మొదలై 2003లో ఇరాక్‌పై దండయాత్రవరకూ అమెరికా పాల్పడిన చర్యలూ దారుణాల వివరాలన్నీ స్టీఫెన్ కింజర్ రాసిన ‘ఒవర్‌త్రో’ పుస్తకంలో విపులంగా ఉన్నాయి. 110 ఏళ్ల కాలంలో 14 చోట్ల తను అనుకున్నట్లుగా బలవంతంగా ప్రభుత్వాలను మార్చింది. అందులో 1953 నాటి ఇరానూ ఉంది. ఎక్కడా ప్రజాస్వామ్యం పాదుకోలేదు. అస్థిరత్వం, నియంతృత్వాలు, సంక్షోభాలే ఏర్పడ్డాయి. తేడా అల్లా ఒక్కటే. అప్పుడు అవి చాలావరకూ ఆ దేశాలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఇరాన్‌పై బాంబుల దాడితో అవి పశ్చిమాసియానంతా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ప్రజల సంగతేమో కానీ అమెరికా నిర్హేతుక యుద్ధం అన్ని దేశాలకూ కొత్త చరిత్రకు అవకాశం ఇస్తోంది. అమెరికా ఆధిపత్యాన్నీ అపసవ్య ధోరణులనూ సామ్రాజ్యవాద తత్వాన్నీ ఎదుర్కోవటం అనివార్యమయ్యేలా రంగాన్ని సిద్ధంచేస్తోంది. ఇంతకుమించి చరిత్ర ఇస్తున్న గొప్ప అవకాశం మరొకటి ఉంటుందా?
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News